A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టి.ఉద్యమ నేతల తీరు వేరు- జనం బాట వేరు
Share |

తెలంగాణలో గత వారం రోజులలో ఇద్దరు ప్రముఖులు చేసిన పర్యటనలకు అత్యంత ప్రాముఖ్యత లభించింది. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, అలాగే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు , కడప ఎమ్.పి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి లు చేసిన యాత్రలు సఫలం అవడం ఆశ్చర్యకరం కాకపోవచ్చు కాని, ఆసక్తికరమైనవని చెప్పకతప్పదు. వీరిద్దరు రైతుల సమస్యలపై తెలంగాణ లో యాత్రలు చేశారు. దానిని కొందరు తెలంగాణ అతివాదులు వ్యతిరేకించారు. ఇదంతా తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ను నీరు కార్చడానికేనని వాదించారు. అసలు వీటిని అడ్డుకుంటామని తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరామ్ హెచ్చరించారు. కోదండరామ్ ఒక ఫ్రొఫెసర్ మాదిరి కాకుండా, ఒక ముల్లా మాదిరి ఫత్వాలు జారీ చేస్తున్న తీరు మాత్రం విమర్శలకు గురి అవుతోంది. ఇక కాంగ్రెస్ ఎమ్.పిలు వి.హనుమంతరావు, మధుయాష్కి వంటివారు ముఖ్యంగా జగన్ యాత్ర సఫలం కారాదని కోరుకున్నారు. పైగా వి.హెచ్ అయితే జగన్ కు రక్షణ ఎలా కల్పిస్తారని, టిఆర్ఎస్ ఎందుకు జగన్ ను అడ్డుకోవడం లేదని ప్రశ్నించడం ద్వారా కాంగ్రెస్ డొల్లతనాన్ని బయటపెట్టారు.చంద్రబాబు విషయంలో ఒక రీతిగా, జగన్ విషయంలో టిఆర్ఎస్ మరో తరహాగా వ్యవహరించిందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసులు వీరికి భద్రత కల్పించిన వైనంపై కాంగ్రెస్ హై కమాండ్ కు ఫిర్యాదు చేస్తానని కూడా అన్నారు. అంటే దీనిని బట్టి కాంగ్రెస్ పార్టీ వైఖరికాని, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించే ఒక ఎమ్.పి వైఖరిగాని ఎంత ఘోరంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.నిజమే . రాజకీయాలలో ఎవరికి వారు తమది పైచేయి అనిపించుకోవడానికి విశేష కృషి చేస్తారు. రాజకీయాలలో ఈర్ష్య, అసూయ ,ద్వేషాలు కూడా ఉంటాయి. కడుపులో ఎంతో కసి ఉన్నా పైకి ప్రేమ నటించడంలో రాజకీయ రంగంలో ఉన్నంతగా మరే రంగంలో ఉండదు.అయితే వి.హనుమంతరావు దానిని కూడా దాచుకోలేకపోవడం విశేషం. జగన్ పట్ల వీరికి పూర్తి వ్యతిరేకత ఉండవచ్చు. ఆక్షేపణ లేదు. జగన్ అవినీతి కుంభకోణాలలో కూరుకుపోయాడని వారు అనుకోవచ్చు. కాంగ్రెస్ కు జగన్ నష్టం చేస్తారా అన్న ఆగ్రహం ఉండవచ్చు. ఇవి ఎన్ని ఉన్నా కొన్ని ప్రమాణాలను రాజకీయ నాయకులు పాటించకపోతే ప్రజలలో పలచన అవుతారు. ఇప్పుడు పలువురు కాంగ్రెస్ నేతలు ఆ దశను ఎదుర్కుంటున్నారు. జగన్ ను తాము ఎటూ నిలవరించలేము కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, నాయకులు అడ్డుకోవాలని వి.హెచ్ వంటి వారు కోరుకుంటున్నారనుకోవాలి.కాంగ్రెస్ పార్టీ నేతగా అసలు ఇలాంటి ఆలోచన చేయడమే తప్పు. దానిని బహిర్గతం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజలలో ఆదరణ కోల్పోయిందన్న విషయాన్ని వారు చెప్పకనే చెప్పినట్లయింది. మధు యాష్కి కాని, కోదండరామ్ వంటి వారు చేసే వాదన ప్రకారం తెలంగాణ వాదాన్ని బలహీనపరచడానికే జగన్ లేదా చంద్రబాబు పర్యటిస్తున్నారు. అదే నిజం అనుకుంటే తెలంగాణ వాదం అంత బలహీనంగా ఉందని వారు ఒప్పుకుంటున్నట్లు కాదా? నిజానికి తెలంగాణ వాదం అంత బలహీనంగా ఏమీ లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణ వాదానికి చిహ్నంగా ఉన్న టిఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని అంతా నమ్ముతున్నారు.అయినా ఎందుకు వీరు ప్రజల మధ్య ద్వేషాగ్నులు రగల్చాలని చూస్తున్నారు?తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సై అనకపోతే తెలంగాణలో తిరగనివ్వబోమని ఫత్వాలు ఇవ్వడం అంటే వారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లు కాదా? అయితే అదే సమయంలో చంద్రబాబు నాయుడు లేదా జగన్ వంటివారు తెలంగాణపై తమ వైఖరి స్పష్టం చేయాలని అడగడం లో తప్పు లేదు. తెలుగుదేశం పార్టీ ముందుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా మాట్లాడి, ఇప్పుడు ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్న మాట నిజమే. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకంగాదా? అని అడగవచ్చు. కరెక్టే. వారు మాట తప్పారు. అలాగే జగన్ కూడా పార్లమెంటులో సమైక్యవాద ప్లకార్డు చేబూనారు. ఆ తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నాక కొంత జాగ్రత్తపడ్డారు. వీటన్నిటికి ఒకటే పరిష్కారం. అది ఎన్నికలు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉంది.అంతవరకు ఎవరి సిద్దాంతాలను వారు ప్రచారం చేసుకోవచ్చు. ఎవరి వాదనలు వారు వినిపించి ప్రజలను తమవైపు తిప్పుకోవచ్చు. అలా కాకుండా వేరే పార్టీలవారెవ్వరిని తిరగనివ్వం అంటూ శాసించడానికి చేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్య ప్రియులు ఎవరూ హర్షించరు.అలాంటివి ఎక్కువకాలం మనజాలవు అనడానికి ఇప్పుడు చంద్రబాబు, జగన్ లు చేసిన పర్యటనలే ఉదాహరణ. గత ఏడాది జగన్ మహబూబాబాద్ పర్యటనకు బయల్దేరితే తెలంగాణ రాష్ట్ర సమితి నేతలతో పాటు అధికార కాంగ్రెస్ కు చెందిన కొందరు ఎమ్.పిలు, నేతలు కూడా ఎలాగైనా జగన్ ను అడ్డుకోవాలని భావించారు. వారికి అప్పటి రోశయ్య ప్రభుత్వం సహకరించింది.తత్ఫలితంగా రాళ్లు వేస్తున్న వారిని బదులు రైలులో ప్రయాణిస్తున్న జగన్ ను అరెస్టు చేసి వెనక్కి తీసుకువచ్చారు. దీనివల్ల జగన్ కు జరిగిన నష్టం కన్నా రోశయ్యకు, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం జరిగింది.ఇప్పుడు కిరణ్ ప్రభుత్వం అంతవరకు పద్దతిగానే వ్యవహరించిందని ఒప్పుకోవాలి. ఎవరికి అనుకూలంగా లేదా, వ్యతిరేకంగా కాకుండా శాంతిభద్రల పరిరక్షణ అంశంగానే తీసుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడింది. పోలీసు శాఖ కూడా అతిగా వ్యవహరించకుండా జాగ్రత్తలు తీసుకుంది. కొందరు నాయకులకు ఇది నచ్చకపోయినా పోలీసు శాఖ వారి బాధ్యతను సక్రమంగా నిర్వహించిందని అంగీకరించకతప్పదు. విచిత్రం ఏమిటంటే ఒకప్పుడు పోలీసు బాస్ గా పనిచేసిన పేర్వారం రాములుకు ఈ పరిస్థితి నచ్చినట్లు లేదు. ఆయన డిజిపిగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం సాగింది.అయినా ఆయన డిజిపి పదవి నిర్వహించారు. ఆ తర్వాత ఎపిపిఎస్సి పదవి చేపట్టారు. తదనంతరం టిడిపిలో కొంతకాలం క్రియాశీలంగా ఉన్నారు. ఇప్పుడు సడన్ గా తెలంగాణ రాష్ట్ర అవసరం గుర్తుకు వచ్చింది. చంద్రబాబు వరంగల్ టూర్ చేసి ఏమి సాధించారని ప్రశ్నించారు. ఈయనకాని, మరికొందరు మేధావులు కాని చంద్రబాబు, జగన్ లు టూర్ చేస్తే అది ప్రజలపై దాడి అని అభివర్ణిస్తున్నారు. అదెలాగో ఎవరికి అర్ధం కాదు. ఈ నాయకులు వారి మానాన వారు పోతుంటే రాళ్లు, కోడిగుడ్లు వేసి కొందరు దాడులు చేస్తే అది రైటు అన్నట్లు, దానిని ఎదుర్కుంటే అది తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు. ఏ ఉద్యమం అయినా కొన్ని పడికట్టు పదాలతో నడుస్తుంది. అలాగే ఇక్కడ కూడా కొందరు ప్రముఖులు దోపిడి, దాడి వంటి పడికట్టు పదాలు వాడి ప్రజలను భ్రమలలో పెట్టాలని చూస్తున్నారు. ఎల్లకాలం అది సాధ్యం కాదని చంద్రబాబు, జగన్ ల పర్యటనలు రుజువు చేస్తున్నాయి. జగన్ పర్యటన మార్గ మధ్యంలో అక్కడక్కడ కొద్ది మంది నిరసనలు వ్యక్తం చేశారు. వారి సంఖ్య ఎక్కడా పట్టుమని పది , ఇరవై మంది లేకపోవడం కూడా గమనించదగిన అంశమే.అయినా ఎవరికైనా నిరసన చెప్పే హక్కు ఉంది. అంతవరకు తప్పు లేదు. అయితే ఇక్కడ చూడవలసిన విషయం ఏమిటంటే జగన్ కు వందల,వేల సంఖ్యలో జనం ఎందుకు వచ్చి స్వాగతం చెప్పారు? వారు కూడా తెలంగాణ ప్రజలే కదా. కొందరు నాయకులు కూడా జగన్ పార్టీలో ఎందుకు చేరారు?కేశుపల్లి గంగారెడ్డి, సంతోష్ రెడ్డి వంటి ప్రత్యేకవాద నాయకులు జగన్ వైపు ఎందుకు వెళుతున్నారు?చంద్రబాబుకు పాలకుర్తిలోను, జగన్ కు ఆర్మూరులో జనం ఎందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు? అంటే ఇప్పటివరకు తెలంగాణ డిమాండ్ పేరుతో ప్రజలకు తము కోరుకున్న రాజకీయ పార్టీని ఎంపిక చేసుకునే స్వేచ్చ లేకుండా చేయాలన్నదే కొందరు నేతల లక్ష్యంగా కనబడుతుంది.టిఆర్ఎస్ నేతలు తప్ప మరెవరైనా ప్రజల ఆదరణ పొందితే అది తమకు నష్టం కలుగుతుందన్న అభిప్రాయంతో వీరు ఇలా వ్యవహరిస్తున్నారన్నమాట. దీనినే రాజకీయ స్వార్దం అంటారు. సీట్ల రాజకీయం అంటారు. అలాకాకుండా తెలంగాణ ప్రజలు ఎవరు, ఎవరితోనైనా ఉండవచ్చు. ఓట్లు మాత్రం తెలంగాణవాదాన్ని బలపరిచే అభ్యర్ధులకే వేయాలని ప్రచారం చేసి వారిని ప్రభావితం చేసే పరిస్థితి ఉండాలి తప్ప, ఇతర పార్టీలపై దాడులు చేయడం ద్వారా భయానక వాతావరణాన్ని సృష్టించాలన్న ఆలోచన మంచిదికాదు. ఇక చంద్రబాబు అయినా జగన్ అయినా ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణపై పూర్తి స్పష్టత ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇతర ప్రాంతాలలో వారు దెబ్బ తింటారు కనుక. అయినప్పట్టికీ జగన్ అన్నట్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను వదలి వీరి వెంటబడినందువల్ల ప్రయోజనం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో కొత్త కోణం కూడా లేకపోలేదు. జగన్ పట్ల టిఆర్ఎస్ వైఖరి మారిందన్న అభిప్రాయాన్ని టిడిపి వంటి రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. తమపై దాడి చేసిన రీతిలో జగన్ పై ఎందుకు దాడి చేయలేదని ప్రశ్నిస్తూ జగన్, టిఆర్ఎస్ ల మాచ్ ఫిక్సింగ్ కు ఇదే నిదర్శనమని టిడిపి వాదిస్తోంది. అయితే ఇప్పుడు ఒక చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. గతంలో టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ ,టిడిపిలు వెనుకాడలేదు. కాని ఇప్పుడు నేరుగా పొత్తు పెట్టుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు సిద్దపడవు. ఎందుకంటే టిఆర్ ఎస్ తో స్నేహం చేస్తే, కోస్తా,రాయలసీమలలో ఆ పార్టీలకు నష్టం జరుగుతుందన్న భయం ఉంది. అందుకని టిఆర్ఎస్ తో పరోక్ష స్నేహానికే ఇష్టపడతాయి. అదే సమయంలో టిఆర్ఎస్ బూచీని చూపి సీమాంధ్రలో ఓట్లు పొందడానికి యత్నిస్తాయి. అందువల్ల జగన్ కు టిఆర్ఎస్ తో పొత్తు అన్న అంశం ప్రచారం చేయడం ద్వారా తాను లబ్ది పొందాలని టిడిపికాని, కాంగ్రెస్ కాని యత్నిస్తాయి.కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి వంటివారు జగన్ ను ఈ విషయంలో ఎంత తీవ్రంగా విమర్శించారో చూస్తే విషయం అర్ధం చేసుకోవచ్చు. నిజంగానే జగన్ టిఆర్ఎస్ నాయకులతో ఏమైనా పరోక్ష అవగాహనకు వచ్చారో లేదో కాని , కాంగ్రెస్ ,టిడిపిలు మాత్రం దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.దానికి తగినట్లుగానే వరంగల్ జిల్లాలో చంద్రబాబు టూర్ ను అడ్డుకోవడానికి టిఆర్ఎస్ లేదా తెలంగాణ జెఎసి నేతలు హడావుడి చేసిన తీరుకు, జగన్ టూర్ విషయంలో వ్యవహరించినదానికి హస్తిమశకాంతం తేడా ఉంది. భవిష్యత్తులో కోస్తా,సీమలలో జగన్ పార్టీ కనుక మెజార్టీ స్థానాలు గెలుచుకుంటే, తెలంగాణలో టిఆర్ఎస్ ఎక్కువ సీట్లు సాధిస్తే , మిశ్రమ ప్రభుత్వం ఏర్పడవలసి వస్తే అందుకు సిద్దమయ్యే విధంగా ఈ రెండుపార్టీలు ఇప్పటి నుంచే తయారవుతున్నాయా అన్నది కొందరి అనుమానం. రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. ఆమాటకు వస్తే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కూడా పూర్తి మెజర్టీ తెచ్చుకోలేకపోయిన పరిస్థితిలో ఎవరితోనైనా ప్రభుత్వాన్ని పంచుకోవడానికి సిద్దపడవా అంటే కాదని చెప్పలేం. అయితే ఇవన్ని ఇప్పటికైతే ఊహాజనితం అవుతాయి. ఇంకా చాలా వ్యవధి ఉంది కాబట్టి రాజకీయ పరిణామాలు వచ్చే రెండేళ్లలో ఎలా ఉంటాయి?కొత్త సమస్యలు ఏమి వస్తాయి?అన్నవాటిపై రాజకీయాలు ఆధారపడి ఉంటాయి.వాటన్నిటిని తమకు అనుకూలంగా మలచుకునేందుకే పార్టీలన్నీ ఇప్పటినుంచే తంటాలు పడుతున్నాయి.ఏది ఏమైనా తెలంగాణలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని, ఎవరు ఎక్కడైనా తిరిగే పరిస్థితులు వస్తున్నాయని, ప్రజాస్వామ్య పద్దతులలో రాజకీయ పార్టీలు , ఉద్యమ నేతలు వ్యవహరిస్తారన్న ఆశ మాత్రం మళ్లీ చిగురిస్తోంది. అది నిజంగా తెలంగాణ వాదానికి వ్యతిరేకంకాదు. తెలంగాణవాదాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఒక మార్గం అని గుర్తించితే అందరికి మంచిది.

 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info