A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు కు ఏమైంది..ఇలా మాట్లాడడమేమిటో !
Share |
January 26 2022, 5:12 pm

ఆంద్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఏమైంది? ఆయన అలా మాట్లాడుతున్నారేమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం కష్టమే. వయసు పైబడడంతో అలా అంటున్నారా? లేక ముఖ్యమంత్రి పదవి పోయిందన్న ఆక్రోశంతో ఇలా వ్యవహరిస్తున్నారా? ఆయన వరద బాదితులను పరామర్శించడానికి వెళ్లారా? లేక తన బాధ వారికి చెప్పుకోవడానికి వెళ్లారా? అన్నిటిని మించి ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ముఖ్య మంత్రి గాల్లోనే వస్తాడు.. గాల్లోనే పోతాడు.. గిరగిరా తిరుగుతున్నాడు. ఎక్కడో ఓ చోట శాశ్వతంగా ఫినిష్‌ అవుతాడు. మనతో పెట్టుకు న్నోడు కాలగర్భంలో కలిసిపోయాడు. కడుపు కాలుతోంది.. మండుతోంది"అని అన్నారని మీడియాలో కధనం వచ్చింది. డెబ్బై ఏళ్ల వయసు దాటిన నేత, నలభై మూడేళ్లు రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది.ఆయన మాటలలో తడబాటు కనిపిస్తుంది. అది తత్తరపాటో లేక అసత్యాలు చెప్పడానికి అలవాటు పడో తాను 22 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పిన విషయం కాని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక తన భార్యను అవమానించారంటూ చేస్తున్న ప్రచారం దారుణంగా ఉంది. అందుకే చంద్రబాబుకు ఏమైంది? అన్న సందేహం వస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ఫినిష్ అయిపోతాడు అని అనడం అంటే ఘోరమైన విషయం మరొకటి ఉంటుందా? రోజూ తనను ఏదో అన్నారని అంటూ ప్రచారం చేసుకునే చంద్రబాబు తాను తరచుగా ఏమి మాట్లాడుతున్నది మర్చిపోయినట్లు నటిస్తుంటారు. అదే ఆయన గొప్పదనం. ఒక వ్యక్తిని ఫినిష్ చేయడం అంటే ఆయనను లేకుండా చేయడం అన్నమాట. రాజకీయంగా లేకుండా చేస్తానని అంటే కొంతవరకు అది వేరే విషయం.అలాకాకుండా ఫినిష్ చేస్తానని అంటే కేసు పెట్టాల్సిన సందర్భం అవుతుందా?లేదా? గతంలో నంద్యాల సభలో తనను ఉద్దేశించి జగన్ చేసిన ఒక వ్యాఖ్యపై చంద్రబాబు ఎంత గలభా చేశారు. పోలీస్ లు కేసు ఎట్టారు. ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేశారు. నానా రచ్చ చేశారు. అయినా తప్పు లేదు. మరి ఇంత ఘోరమైన వ్యాఖ్య చేసిన చంద్రబాబు పై కేసు వచ్చినా,రాకపోయినా ఆయన క్షమాపణ చెప్పడమో లేక పొరపాటు అన్నానని ఉపసంహరించుకోవడమో చేస్తే విజ్ఞతగా ఉంటుంది. కాని దురదృష్టవశాత్తు ఆయనలో అది కొరవడుతోంది.దీనికి కారణం ఏమిటి?కేవలం తనకన్నా సుమారు పాతికేళ్ల చిన్నవాడైన జగన్ తనను ఓడించి ముఖ్యమంత్రి అవుతారా? అన్న ద్వేషం. చివరికి తన నియోజకవర్గం అయిన కుప్పంతో సహా రాష్ట్రం అంతటా స్థానిక ఎన్నికలలో విజయ దుంధుబి మోగిస్తారా అన్న ఈర్ష్యం తప్ప మరొకటి కాదనిపిస్తుంది. అందుకే తాను సి.ఎమ్. అయ్యేవరకు శాసనసభలోకి రానని బయటకు వెళ్లిపోయినట్లనిపిస్తుంది. ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే చేసి, పనులకు అడ్డంగా ఉండరాదని కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలను ఆయా నియోజకవర్గాలకు పంపించి వరద సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అది తప్పు అని చంద్రబాబు చెప్పదలిస్తే చెప్పవచ్చు.అలా కాకుండా ముఖ్యమంత్రిని ఉద్దేశించి గాలిలోనే పోతాడు అని అనడం ఏమిటి? ఆయనలో ఉన్న కుట్రపూరిత ఆలోచనలకు గాని, ఆయన మానసిక పరిస్థితికి గాని ఇది దర్పణం పట్టదా? చంద్రబాబు గండి పడిన రాయలచెరువు వద్దకు వద్దన్నా వినకుండా వెళ్లడం వల్ల దాదాపు ఆరుగంటల పనికి ఆటంకం వాటిల్లిందని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి చెప్పారు.ఆయన ఐదురోజులుగా చెరువుగట్టుపైనే ఉండి సహాయ చర్యలు నిర్వహిస్తున్నారు.తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్వయంగా కాలనీలలో పేరుకుపోయిన వరద బురదను తొలగిస్తున్న దృశ్యాలు చూశాం. రాజంపేట ఎమ్మెల్యే మల్లిఖార్జునరెడ్డి, లోక్ సభ సభ్యుడు మిధున్ రెడ్డి ప్రభృతులు వరద ప్రాంతాలలో పర్యటిస్తూ సహాయం చేస్తున్నారు. అయినా కొన్ని చోట్ల లోటుపాట్లు ఉండవచ్చు. వరద రావడానికి, ఇంత నష్టం జరగడానికి కారణాలపై భిన్న అభిప్రాయాలు చెప్పవచ్చు. వరద సహాయ చర్యలు ఇంకా చేయాలని ప్రతిపక్ష నేతగా కోరవచ్చు. అలాకాకుండా సంబందం లేని విషయాలను తెచ్చి వరద బాదితుల పరామర్శ యాత్రగా కాకుండా, రాజకీయ ప్రచార యాత్రగా చంద్రబాబు మార్చారంటే ఏమని అనుకోవాలి? గతంలో చంద్రబాబు హుద్ హుద్ తుపాను సమయంలో విశాఖలో ఉండి పనులు చేయించారట. నిజానికి అక్కడ అన్ని సదుపాయాలు ఉన్న అతిధి గృహం, హోటళ్లు ఉన్నా, ప్రచారం కోసం ఆయన ఒక బస్ లో గడిపారు.ఆయన అక్కడే ఉన్నందువల్ల పనులకు ఎలా ఆటంకం కలిగిందో ఆనాటి అదికారులను అడిగితే చెబుతారు. పైగా ఆ తుపానులో ఏకంగా అరవైవేల కోట్ల నష్టం జరిగిందని, ఇంత పెద్ద తుపాను ఎప్పుడూ రాలేదని ఆయన తొలుత చెప్పారు. ఆ తర్వాత అధికారులు అంచనా వేసి 14 వేల కోట్లుగా లెక్కవేశారు. కాని చంద్రబాబు దానిని ఇరవై వేల కోట్లు చేశారట. తదుపరి ప్రధాని మోడీ విశాఖ వచ్చి వెయ్యి కోట్ల సాయం ప్రకటించారు. పిమ్మట కేంద్ర అధికార బృందం వచ్చి అంతా కలిపి 600 కోట్ల సాయం చేసింది. అరవైవేల కోట్లు ఎక్కడ? 600 కోట్లు ఎక్కడ? చంద్రబాబు అసత్యాలు చెప్పారని మోడీ భావించారని ఆ రోజులలో ప్రచారం జరిగింది. అలా ఉంటుంది చంద్రబాబు ప్రచార యావ అనండి.. హైప్ ఇచ్చే తీరు కాని. జగన్ అలా చేయలేదు. ఈ మూడు జిల్లాలలో జరిగిన నష్టంపై వెయ్యి కోట్లు సాయం పంపాలని ముందుగా కోరారు. ప్రాధమికంగా ఆరేడువేల కోట్ల నష్టం జరిగిందని అంచనావేసినట్లు వార్తలు వచ్చాయి.అది మరికొంత పెరగవచ్చేమో తెలియదు. అలాగే తక్షణమే అధికార యంత్రాంగాన్ని రంగంలో దింపి విద్యుత్ ,నీరు తదితర సదుపాయాల పునరుద్దరణకు ప్రాధాన్యం ఇచ్చారు. రోడ్లు ,వంతెనల వంటివాటికి కొంత సమయం పడుతుంది. కొన్ని గ్రామాలలో ఇళ్లు మొత్తం దెబ్బతిన్నాయి. వాటికి లక్షా ఎనభై వేల సాయం చేయాలని , కొంత దెబ్బతింటే తొంభై ఐదువేలు ఇవ్వాలని నిర్ణయించారు.గతంలో ఇలా చేసినట్లు లేదు. రాజంపేటలో మంచి నీటి కోసం 36 బోర్లు వేశారట. ఎంత వేగంగా స్పందించకపోతే అది సాధ్యం అవుతుంది. అన్నమయ్య, పించా ప్రాజెక్టుల కట్టలు తెగిపోవడానికి మానవ తప్పిదం కారణమని చంద్రబాబు ఆరోపణ.దానిపై దర్యాప్తు చేయవచ్చు. వాస్తవాలు వెలికి తీయవచ్చు. కాని చంద్రబాబు వరద బాదితులను రెచ్చగొట్టే యత్నం చేశారు. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన అలా చేయడాన్ని అర్ధం చేసుకోవచ్చు. కాని ఒక జైత్రయాత్ర మాదిరి ఆయన ర్యాలీలు తీయడం, ముఖ్యమంత్రిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం,పదే,పదే తన భార్యకు అవమానం జరిగిందని, తనకు అవమానం జరిగిందని, అందుకే అసెంబ్లీని వదలి వచ్చేశానని చెప్పడం ఇవన్ని చూస్తే కచ్చితంగా చంద్రబాబు తప్పు చేస్తున్నారనిపిస్తుంది.వరద బాదితులు వారి సమస్యలలో వారు ఉంటే, చంద్రబాబు మాత్రం తన గోడు చెప్పడానికి వెళ్లినట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పకతప్పదు. ఆయనకు పదవి పోతే జనం అంతా రోధించాలా? ఆయన భార్యకు అవమానం జరిగితే జనం అంతా విలపించాలా? వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీవారు తాము ఎక్కడా ఆయన భార్య గురించి మాట్లాడలేదని చెబుతున్నా , పోని తన వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే వాటిని చూపకుండా పదే,పదే తన భార్యను తానే ఎందుకు అప్రతిష్టపాలు చేస్తున్నారో తెలియదు. తన భార్య గురించి ప్రచారం చేసి రాజకీయాలలో మళ్లీ గెలవాలన్న ఆయన ప్రయత్నం ఫలిస్తుందా?నిజానికి ఇలా చంద్రబాబు రోదించడం వల్ల, ఆ తర్వాత ఆయన పదే,పదే చెప్పడం వల్ల టిడిపి క్యాడర్ లోనే నిరుత్సాహం ఏర్పడవచ్చు. అసెంబ్లీలో ఎదుర్కోవడం చాతకాక బయట ఏడవడం ఏమిటని తెలుగుదేశం కార్యకర్తలు ఆలోచించరా? అక్కడితో ఆగం లేదు. విశాఖలో గంజాయిని ఆన్ లైన్ లో ప్రభుత్వమే అమ్మిస్తోందని నీచమైన ఆరోపణలు చేస్తున్నారు. వరద సమస్యకు ,గంజాయికి ఏమైనా లింక్ ఉందా? అదేదో ఇప్పుడే వచ్చినట్లు ,గతంలో తన హయాంలో ఏమి జరగనట్లు చెబితే జనం నమ్ముతారా? స్వయంగా ఆయన క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఒక అధికారిక సమావేశంలోనే విశాఖ గంజాయి సమస్య వల్ల పరువు పోతోందని ఆ రోజుల్లోనే అన్న విషయం ప్రజలకు తెలియదని చంద్రబాబు నమ్మకం కావచ్చు. చంద్రబాబు ఒకదానికి మరొకదానికి సంబందం లేకుండా మాట్లాడుతుంటారు. ఆయన ఎలా మాట్లాడినా, ఎంత అభ్యంతరకరంగా మాట్లాడినా ఎడిట్ చేసి వండి వార్చే మీడియా ఉంది. టిడిపికి మద్దతు ఇచ్చే మీడియా ప్రభుత్వంపై చంద్రబాబు చేసిన విమర్శలకు ప్రాదాన్యం ఇచ్చిందే కాని, జగన్ గాలిలోనే పోతాడు అన్న వ్యాఖ్యలను కాని, తాను 22 ఏళ్లు సి.ఎమ్.గా పనిచేశానని చెప్పిన విషయాన్ని కాని హైలైట్ చేయలేదు. అదే వైసిపికి సంబందించినవారు ఎవరైనా మాట్లాడితే ఎంత యాగీ చేసేవో చెప్పలేం.టిడిపి మీడియా సంగతి పక్కనపడితే చంద్రబాబు అర్ధం,పర్దం లేకుండా మాట్లాడుతున్న తీరు పలు సందేహాలకు తావిస్తుంది. ఆయన వృద్దుడు అవుతున్న లక్షణమా?లేక మానసికంగా ఎదుర్కుంటున్న సమస్యలా అన్నవి ఆయనే ఆలోచించుకుని సరిచేసుకోగలిగితే మంచిది.

tags : chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info