A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ ది చాణక్య వ్యూహమా
Share |
November 30 2021, 7:35 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక స్పష్టత ఇచ్చారు. మీడియాలో కెసిఆర్ మరోసారి అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చని ప్రచారం జరిగింది.గత సారి సుమారు ఆరు నెలల ముందుగానే 2018 లోనే శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి విజయం సాదించారు. అదే పద్దతిలో మళ్లీ ఈసారి కూడా 2023లో కాకుండా, కాస్త ముందుగా ఎన్నికలకు వెళతారేమోనన్న అనుమానాలు వ్యాప్తిలోకి వచ్చాయి. దానిపై టిఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన క్లారిటీ ఇవ్వడం ద్వారా ఎమ్మెల్యేలకు ఒక భరోసా ఇచ్చారని అనుకోవాలి.కాని అదే సమయంలో పిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం కచ్చితంగా ముందస్తు ఎన్నికలు వస్తాయని అంటున్నారు.కెసిఆర్ చేసిన ఒక వాదన ఆసక్తికరంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు కలిసి జరగకపోవడం వల్ల లోక్ సభ ఎన్నికలలో కొంత నష్టపోయామని ఆయన చెప్పారు.నిజానికి అప్పట్లో వచ్చిన అబిప్రాయం ఏమిటంటే ఈ రెండు ఎన్నికలు ఒకేసారి వస్తే టిఆర్ఎస్ కు నష్టం జరుగుతుందేమోనని సంశయం ఏర్పడిందని అంటారు. బిజెపి, ప్రదాని నరేంద్ర మోడీ ప్రభావం పనిచేస్తే ఇబ్బంది వస్తుందని భావించారని అంటారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికలలో నాలుగు స్తానాలు బిజెపి గెలవడం, స్వయంగా తన కుమార్తె కవిత ఓటమి చెందడం ఆయనకు తీరని ఆవేదన మిగిల్చింది. అయితే ఇప్పుడు భిన్నమైన వాదన చేస్తున్నారు.రెండు ఎన్నికలు ఒకేసారి వచ్చి ఉంటే లోక్ సభ ఎన్నికలలో కూడా బాగా గెలిచేవారమని ఆయన అంటున్నారు. ఏమైనా కావచ్చు. ఎప్పటి పరిస్థితిని బట్టి అప్పటి రాజకీయం సాగుతుంటుంది.వచ్చేసారి కూడా రెండు ఎన్నికలు వేర్వేరుగానే సాగుతాయి. మరి అప్పుడు కెసిఆర్ ఎలాంటి వ్యూహం అవలంభిస్తారన్నది చూడాల్సి ఉంటుంది. బిజెపి ప్రభ తగ్గుతోందని కెసిఆర్ నమ్ముతున్నట్లుగా ఉంది. దానితో కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వస్తుందని ఆయన పార్టీ నేతలకు చెప్పడం ద్వారా వారిలో ఒక విశ్వాసం పంచే యత్నం చేస్తున్నారు. ఇక్కడ కొన్ని సంగతులు మాట్లాడుకోవాలి. బిజెపి పట్ల కెసిఆర్ వైఖరి ఏమిటన్నది చర్చనీయాంశంగానే ఉంది. నిజంగానే ఆయన బిజెపికి శత్రువా ?కాదా అన్నదానిపై పలు అబిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే హుజూరాబాద్ ఎన్నికలో బిజెపి ప్రత్యర్ధిగా ఉన్నా, అది ఈటెల రాజేందర్ వల్ల అన్న విషయం అందరికి తెలిసిందే.బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేసినా, కెసిఆర్ పైన తీవ్ర విమర్శలు చేసినా, ప్రజలలో అది ఎంత ప్రభావం చూపుతుందన్నది ప్రశ్నార్ధకమే. ఆయా చోట్ల క్యాడర్ ను పెంచుకోవడమే ప్రధాన సమస్యగా ఆ పార్టీకి ఉంటుంది. అంతేకాక ఇటీవలికాలంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివిధ విధానాలు ప్రజలలో కొంత వ్యతిరేకత పెంచుతున్నాయి. ప్రత్యేకించి ప్రభుత్వ రంగ పరిశ్రమల విక్రయం, పెట్రోల్ ,డీజిల్ ధరలు రోజూ పెరగడం వంటివి బిజెపిని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. అందువల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే ఇప్పటికీ ప్రధాన ప్రత్యర్ధిగా ఉందన్నది వాస్తవం.దానిని దెబ్బకొట్టే వ్యూహాలతోనే కెసిఆర్ ముందుకు సాగుతుండవచ్చు.ఇటీవలి డిల్లీ పర్యటనలో కెసిఆర్ ప్రధాని మోడీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ,తదితరులను కలిసి ఆయా అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో బిజెపి నేతలతో పోరు చేస్తున్నట్లు కనిపిస్తున్న కెసిఆర్ కేంద్ర స్థాయిలో బిజెపి పెద్దలతో సంబందాలను సజావుగానే కొనసాగిస్తున్నారన్న భావన ఏర్పడింది.దీంతో రాష్ట్ బిజెపి నేతలకు ఏమి చేయాలో పాలుపోవడంలేదు.బిజెపి శ్రేణులను కెసిఆర్ గందరగోళ పర్చుతున్నారని వారు ఒప్పుకుంటున్నారు.అసెంబ్లీలో మాత్రం బిజెపిపై కొన్ని విమర్శలు చేశారు. కేంద్రంతో గొడవపడతామని ఆయన చెప్పారు. అయితే పద్మశ్రీ బిరుదల వ్యవహారంలో ఆయన కేంద్రంతో తగాదా పడతారంటే నమ్మలేం.ఏది ఏమైనా బిజెపి, టిఆర్ఎస్ ల మద్య సంబందాలు దాగుడుమూతల మాదిరే ఉండవచ్చు. హుజూరాబాద్ లో ఈ రెండు పార్టీల మద్యే పోటీ ఉన్నా, అది ఇంతవరకే పరిమితం కావచ్చు. కేంద్రంలో వచ్చే ఎన్నికల తర్వాత చక్రం తిప్పాలన్న కోరికను మరోసారి కెసిఆర్ బయటపెట్టినా, అది అప్పటి రాజకీయాలను బట్టి ఉంటుంది. అయితే హుజూరాబాద్ లో ఎట్టి పరిస్థితిలోను టిఆర్ఎస్ గెలవాలని ఆయన తలపోస్తున్నారు.ఒక వేళ అక్కడ ఈటెల రాజేందర్ తన వ్యక్తిగత ప్రభావంతో గెలిస్తే, అది బిజెపికి ఉపయోగపడడం కన్నా, టిఆర్ఎస్ కు ఎక్కువ నష్టం చేసే అవకాశం ఉంటుంది. ప్రజలలో వ్యతిరేకత పెరిగిందన్న సంకేతాలు వెళతాయి. ఈ నేపధ్యంలోనే దళిత బందును ముందుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో కొంతమేర అమలు చేశారు. బిజెపి నేతల అంచనా ప్రకారం వివిద స్కీముల కింద, దళిత బంధు కోసం మొత్తం మీద నాలుగువేల కోట్లకు పైగానే ఖర్చు చేశారని చెబుతున్నారు. మంత్రి హరీష్ రావు అన్నీ తానై అక్కడ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. హుజూరాబాద్ లో టిఆర్ఎస్ ,బిజెపిలు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఇంటింటికి మటన్, మద్యం సరఫరా చేస్తున్నాయట.మొత్తం ఈ ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నికగా రికార్డు సృష్టించవచ్చు. ఇది ఒక భాగం అయితే భవిష్యత్తులో మాజీ ఐపిఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ బిఎస్పి కాని, వైఎస్ షర్మిల వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ కాని ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది అప్పుడే చెప్పలేని పరిస్తితి ఉంది.షర్మిల పాదయాత్రకు కూడా జనం బాగానే వస్తున్నారు. ఆమె కూడా ప్రశాంత కిషోర్ టీమ్ ద్వారా వ్యూహాలు రచిస్తోందని అంటున్నారు.ఆ ప్రభావం ఏ మేరకు పనిచేస్తుందన్నదానిపై ఇంకా అంచనాలు లేవు.ఇక రేవంత్ రెడ్డి దూకుడు కొనసాగుతున్నా,కాంగ్రెస్ ఎంతమేర ప్రభావం చూపుతుందన్నదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇవన్ని పుంజుకుంటే వచ్చే ఎన్నికలలో ఎవరికి మజార్టీ రాదేమోనన్న అనుమానాలు లేకపోలేదు. ఈ పరిణామాలన్నిటిని పరిగణనలోకి తీసుకునే కెసిఆర్ ముందస్తు ఎన్నికలు లేవని స్పష్టం చేసినట్లుగా కనిపిస్తుంది. ఈ మాట చెప్పడం ద్వారా ఎమ్మెల్యేలలో ఆందోళన తగ్గించగలిగారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులన్నిటిని ప్రజలకు చెప్పుకోలేకపోతున్నామని, అందువల్ల ప్రజలలో విస్తారంగా పర్యటించాలని ఎమ్మెల్యేలను కోరారు. విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఏ అధికార పార్టీ అయినా ఇలాగే ఫీల్ అవుతుంటుంది. నిజానికి కెసిఆర్ కు, టిఆర్ఎస్ కు ఇప్పటికి్ప్పుడు ప్రమాద పరిస్థితి ఏర్పడిందని చెప్పజాలం. కెసిఆర్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత పెరిగినా, అది ఆయన ప్రభుత్వానికి ప్రమాదం తెస్తుందన్నంతగా ఉందని ఇప్పటికైతే చెప్పలేం. అయినా కెసిఆర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే, హైదరాబాద్ లో ప్లీనరీతో పాటు వరంగల్ లో తెలంగాణ విజయగర్జన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు.ఈ సభ బాధ్యతలను పార్టీ వర్కింగ్ అద్యక్షుడు కెటిఆర్ కు అప్పగించినట్లు ప్రకటించడం కూడా గమనించదగిన విషయమే. హుజూరాబాద్ ఉప ఎన్నిక బాద్యతను హరీష్ పై పెట్టి, సభ సక్సెస్ చేసే కర్తవ్యాన్ని కెటిఆర్ పై పెట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఓట్ల రాజకీయాలే పరమావధిగా పనిచేస్తున్న కొన్ని రాజకీయ పక్షాలు మనమీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాయి. అలాంటి కుక్కలు, నక్కల నోర్లు మూయించేలా సభ జరగాలని ఆయన పిలుపు ఇచ్చారు.ఇక రెండేళ్లలో జరగనున్న ఎన్నికలకు ఒక రకంగా ఇది ప్రచార భేరీ వంటిదని అనుకోవచ్చు. ఇప్పటి నుంచే టిఆర్ఎస్ శ్రేణులను ఎన్నికల మూడ్ లోకి తీసుకు వెళ్లడం ద్వారా ప్రత్యర్ధులను దెబ్బతీసే వ్యూహం కూడా ఉండవచ్చు. కెసిఆర్ ఏది చేసినా ఒక ఆలోచనతోనే చేస్తారన్న సంగతి పలుమార్లు రుజువు అయింది. ఇప్పుడు దళిత బందు అమలు చేస్తున్నా,బిజెపిని విమర్శిస్తున్నా అదంతా చాణక్య రాజకీయమే అనుకోవచ్చా!

tags : kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info