A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
యనమలకు బు్గన కౌంటర్
Share |
October 26 2021, 6:15 pm

ఎపి ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి శాసనమండలిలో విపక్ష నేత, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాలు ,వృద్దిరేటు తదితర అంశాలపై టిడిపి తప్పుడు లెక్కలు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.
మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయాన్ని హేళన చేసిన టీడీపీ అగ్ర నాయకత్వం ప్రతిపక్షంలోనూ అదే ధోరణితో వ్యవహరిస్తూ రాష్ట్రానికి జీవనాధారమైన రంగం వృద్ధి రేటును కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు.బుగ్గన చేసిన ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి.


సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే యనమల కరోనా సంవత్సరాన్ని కూడా కలిపి లెక్కలు కట్టి ఆర్థిక వృద్ధి లేదంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. కోవిడ్‌ వల్ల 2020–21లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న విషయం తెలియదా? గత సర్కారు వైదొలగే నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వృద్ధి రేటు క్షీణిస్తూ వచ్చింది. రాష్ట్ర జీఎస్‌డీపీ 2017–18లో 10.09 శాతం వృద్ధి రేటు ఉంటే 2018–19లో 4.88 శాతానికి పడిపోయింది. ఇది దేశంలోని ప్రధాన రాష్ట్రాలలో అతి తక్కువ. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో 2019–20లో రాష్ట్రం 7.23 శాతం వృద్ధి నమోదు చేసి దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. 2019–20లో రాష్ట్రం వ్యవసాయ రంగంలో 7.91 శాతం, పారిశ్రామిక రంగంలో 10.24 శాతం, సేవారంగంలో 6.20 శాతం వృద్ధితో అంచనాలకు మించి పనితీరు కనబరిచింది.

రాష్ట్రంలో 6.5 శాతం నిరుద్యోగ రేటు ఉందని చెప్పడం కూడా అవాస్తవమే. కేంద్ర సర్వే సంస్థ లెక్కల ప్రకారం రాష్ట్ర నిరుద్యోగ రేటు (15 – 59 ఏళ్ల వయసు) 2018–19లో 5.7 శాతం ఉంటే 2019 –20లో 5.1 శాతానికి తగ్గింది. యనమల తప్పుడు లెక్కలతో రాజకీయ లబ్ధి కోసం పాకులాడటం దురదృష్టకరం.


సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీ, పేదరికం, ఆర్థిక అసమానతల నిర్మూలనలో రాష్ట్రం మెరుగుపడలేదంటూ ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శల్లో ఏమాత్రం వాస్తవం లేదు. 2018–19 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో కేరళ, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు మొదటి మూడు స్థానాల్లో నిలవగా ఏపీ నాలుగో స్థానంలో ఉంది. 2019 –20, 2020–21 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీల్లో ఏపీ మెరుగ్గా 3వ స్థానంలో ఉంది. టీడీపీ హయాంలో 2018–19లో రాష్ట్రం పెర్ఫార్మర్‌ కేటగిరీలో ఉంటే ఇవాళ ఫ్రంట్‌రన్నర్‌ కేటగిరీకి ఎదిగాం.

నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం గత రెండేళ్లలో పేదరిక నిర్మూలనలో 5వ స్థానంలో నిలిచి ఎస్‌డీజీ మార్కులను 67 నుంచి 81కి (మొత్తం 100 మార్కులకు) పెంచుకుని పేదలను కరోనా కష్టకాలంలో కాపాడుకున్నాం. రాష్ట్రంలో ఆర్థిక అసమానత 32 నుంచి 43 శాతానికి పెరిగిందని ఆరోపణలు చేస్తున్న యనమల ఏ లెక్కల ప్రకారం ఇలాంటి అసత్యాలు ప్రచారం చేస్తున్నారో చెప్పాలి. చెప్పే సంఖ్యలు, లెక్కలకు ఎలాంటి ఆధారాలు లేకుండా అనుకూల మీడియాలో పత్రికా ప్రకటనలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలనుకోవడం తగదు. ఎస్‌డీజీ సూచీల్లో అసమానతల తగ్గింపు ఆశయంలో రాష్ట్రం 2018–19లో 15వ స్థానంలో ఉండగా 2020 – 21లో 6వ స్థానానికి మెరుగుపడింది అని బుగ్గన ఒక ప్రకటనలో వివరించారు.

tags : buggana

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info