A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిటిడి అగరబత్తీల మీద కూడా పిల్ పడిందా!
Share |
October 26 2021, 6:25 pm

ఎపిలో ప్రతి చిన్న విషయానికి హైకోర్టులో పిల్స్ వేస్తున్నారు. చివరికి టిటిడి తయారు చేస్తున్న అగరబత్తీలపై కూడా పిల్ వేశారు.దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు బాగుంది. పిల్ ను తోసిపుచ్చడమే కాకుండా ఇందులో ఎలాంటి ప్రజాప్రయోజనాలు లేవని స్పష్టం చేసింది. వినియోగించిన పూలతో అగరబత్తీలు తయారుచేయడంపై అభ్యంతరం ఉంటే.. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లొచ్చంది. వినతిపత్రం ఇవ్వాలా.. లేదా.. అనేది పిటిషనర్‌ ఇష్టమంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పు స్వాగతించదగిందని చెప్పాలి.
పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. దేవతామూర్తులకు వినియోగించిన పూలను మరో రకంగా వినియోగించడానికి వీల్లేదన్నారు. ఇలా చేయడం భక్తుల మతవిశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీయడమేనని చెప్పారు. పిటిషనర్‌ వాదనలను టీటీడీ తరఫు సీనియర్‌ న్యాయవాది సర్వా సత్యనారాయణ ప్రసాద్‌ తోసిపుచ్చారు. శ్రీవారికి వినియోగించిన పూలను పూల బావిలోనే వేస్తున్నారన్నారు. ఆ పూలను అగరబత్తీల తయారీలో వాడటం లేదని చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలోని పలు దేవస్థానాల్లో వినియోగించిన పూలను అగరబత్తీల తయారీకి వాడుతున్నామన్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారం చేసుకుని ఈ వ్యాజ్యం వేశారే తప్ప, ఆగమ శాస్త్ర పండితులతో చర్చించలేదన్నారు. సింహాచలంలో స్వామికి పూసిన చందనాన్ని భక్తులకు ప్రసాదంగా అందచేస్తారని తెలిపారు. అలాగే పూలతో చేసిన అగరబత్తీలను ఇంట్లో పూజలకు వాడుకోవాలన్న ఉద్దేశంతో టీటీడీ అగరబత్తీల తయారీకి నిర్ణయం తీసుకుందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. అసలు ఈ వ్యాజ్యానికున్న విచారణార్హత ఏమిటని ప్రశ్నించింది. పిటిషనర్‌ హక్కులకు భంగం కలిగి ఉంటే రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవాలే తప్ప, పిల్‌ ఎలా వేస్తారని నిలదీసింది. అగరబత్తీల తయారీ వ్యవహారంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమంటూ ఉత్తర్వులిచ్చింది.

tags : ttd

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info