A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెటిఆర్, టిఆర్ఎస్ భవిష్యత్తుపై కెసిఆర్ ప్రణాళిక
Share |
October 26 2021, 5:03 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని వ్యూహాత్మకంగా ముందుకు నడిపించడానికి సిద్దం అవుతున్నారు. తన కుమారుడు , మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు కెటిఆర్ కు అనువైన వాతావరణాన్ని కూడా ఆయన సృష్టిస్తున్న అభిప్రాయం కలుగుతుంది. కొత్త తరానికి ప్రాధాన్యత ఇవ్వడం, జిల్లా, మండల స్థాయిలలో నాయకులను తయారు చేసి,వారు వర్కింగ్ అద్యక్షుడితో నేరుగా సంబంధాలు నెరపడానికి ఏర్పాట్లు చేయడం వంటివి చూస్తుంటే కెసిఆర్ మదిలో ఏదో పెద్ద ఆలోచనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఉద్యమ పార్టీగా పేరొందిన తెలంగాణ రాష్ట్ర సమితి ఒకప్పుడు ఆర్గనైజ్డ్ గా ఉండేది కాదు. కేవలం ఉద్యమ పార్టీగా, దాని పట్ల ఆకర్షితులైనవారితో నడిచేది. దానివల్ల కొన్నిసార్లు పార్టీకి నష్టం కూడా జరిగింది. ఉదాహరణకు 2004లో కాంగ్రెస్ తో కలిసి పోటీచేసి 26 సీట్లు గెలుచుకున్నా, ఆ తర్వాత విడిపోయి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు పది మంది సిద్దపడలేదు. పోటీచేసిన పదహారు మందిలో తొమ్మిది మంది ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత టిడిపితో కలిసి కూటమి కట్టినా 2009లో పది సీట్లే వచ్చాయి. ఇందుకు పలు కారణాలు ఉండవచ్చు. కాని పార్టీ క్యాడర్ పటిష్టంగా లేకపోవడం కూడా వాటిలో ఒకటి అని చెప్పాలి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాలలో పార్టీ బలంగా ఉండేది కాదు. ఆ లోపాలను సవరించుకోవడానికి 2014లో అదికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి, అలాగే పార్టీని పటిష్టం చేసుకోవడానికి కాంగ్రెస్,టిడిపి ,తదితర పక్షాల ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లోకి తీసుకు వచ్చారు. 2018లో పార్టీ గెలవడానికి ఇది కొంతవరకు ఉపయోగపడిందని చెప్పవచ్చు. టిఆర్ఎస్ వీక్ గా ఉందనుకున్నచోట ఇలా పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యేలు పలువురు కెసిఆర్ గ్లామర్ తో పాటు తమకు ఉన్న క్యాడరుతో విజయం సాధించగలిగారు. కాని ఇటీవలి కాలంలో పార్టీ ఎమ్మెల్యేలపై కూడా కొంత అసంతృప్తి పెరుగుతోందన్న బావన లేకపోలేదు. దుబ్బాక ఓటమి, హైదరాబాద్ లో బిజెపి పుంజుకున్న తీరు టిఆర్ఎస్ ను కొంత ఆత్మరక్షణలో పడేసింది.తదుపరి సాగర్ ఉప ఎన్నికలో గెలిచినా, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా చేసిన హుజూరాబాద్ కు జరగబోయే ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది.దాంతో దళిత బందు కింద ఒక్క ఆ నియోజకవర్గానికే రెండువేల కోట్లు వ్యయం చేయవలసి వస్తోంది. ఇతర వర్గాలను ఆకట్టుకోవడానికి పదవులతోపాటు , నియోజకవర్గ అబివృద్దికి నిదులు కేటాయిస్తున్నారు.ఈ అనుభవం పార్టీలో ఉన్న లోపాలను తెలియచేసిందని అనుకోవాలి. పార్టీ సభ్యత్వం ఏభై లక్షలకు పైగానే ఉన్నా, పార్టీ ఎందుకు ఆయా చోట్ల బలహీనంగా ఉందన్నదానిపై పార్టీ నాయకత్వం ఆలోచించినట్లుగా ఉంది.అదే సమయంలో కాబోయే ప్రదాన నేతగా ఉన్న తన కుమారుడు కెటిఆర్ కు రాజకీయంగా ఎలాంటి సమస్య రాకుండా మార్గం సుగమమం చేయడానికి కెసిఆర్ ప్రణాళిక రచిస్తున్నట్లుగా ఉంది. అందుకే ఒకవైపు టిఆర్ఎస్ కు ఇరవై ఏళ్లు ఎదురులేదని చెబుతూనే, మరో వైపు తమిళనాడులో ప్రస్తుతం అదికారంలో ఉన్న డి.ఎమ్.కె. పార్టీని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అంటున్నారు. అక్కడ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిది కుమారుడు స్టాలిన్ డిఎమ్.కె.ని అదికారం వైపు నడిపించారు. అక్కడ గ్రామాలలో కూడా డి.ఎమ్.కె. పటిష్టంగా ఉంటుందని కెసిఆర్ చెబుతున్నారు. అది కొంతవరకు నిజమే కావచ్చు. పదేళ్లు అదికారం కోల్పోయినా డిఎమ్.కె. ప్రజలలో నిలబడగలిగింది. అయితే అన్నా డి.ఎమ్.కె. అదినేత్రి జయలలిత కన్ను మూయడం, ఆ తర్వాత ఆ పార్టీలో పలు విభేధాలు రావడం వంటి పరిణామాలు కూడా స్టాలిన్ కు కలిసి వచ్చాయని అంగీకరించాలి. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలో వారసత్వ రాజకీయం ఎలా సాగుతుందో కూడా డి.ఎమ్.కె. ని చూస్తే అర్ధం అవుతుంది.కరుణానిది వారసుడుగా స్టాలిన్ ఫోకస్ అయితే, ఇప్పుడు స్టాలిన్ వారసుడుగా ఆయన కుమారుడు ఉదయ్ సిద్దం అవుతున్నారు. ఈయన కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.ఇప్పుడు తెలంగాణలో కూడా కెటిఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయడం ద్వారా టిఆర్ఎస్ ను చెక్కు చెదరనివ్వకుండా చూడాలన్నది కెసిఆర్ లక్ష్యం కావచ్చు. ఈ నేపద్యంలో మంత్రుల, ఎమ్మెల్యేల ప్రాధాన్యతను కొంత తగ్గించి పార్టీ పరంగా నేతల ప్రాముఖ్యతను పెంచాలని ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లుగా వార్తలు సూచిస్తున్నాయి. కెటిఆర్ కు పాత నాయకత్వం కంటే కొత్త నాయకత్వం తో డీల్ చేయడం సులువుగా ఉంటుంది. పైగా సహజంగానే తరం మారినప్పుడు జరిగే మార్పులకు అనుగుణంగా పార్టీని సిద్దం చేసుకోవాలి.యువతరానికి అవకాశం ఇవ్వడం ద్వారా కెటిఆర్ నాయకత్వంలో వారంతా పనిచేయడానికి ఇష్టపడతారు. సాగర్ లో కాని, ఇప్పుడు హుజూరాబాద్ లో కాని యువకులనే ఎమ్మెల్యే అభ్యర్దులుగా ప్రకటించడాన్ని ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. అన్ని జిల్లాలలో పార్టీ ఆఫీస్ లు ఏర్పాటు చేయడం,గ్రామ స్థాయి నుంచి జిల్లా కమిటీలను పునరుద్దరించడం, క్యాడరు ద్వారా పార్టీని పటిష్టం చేయడం వంటివి చేయడానికి కెసిఆర్ పూనుకుంటున్నారు. ప్రభుత్వం బాగా పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారు. అదే సమయంలో పార్టీ కూడా బలంగా ఉండవలసిన అవసరం ఉందని కెసిఆర్ రాష్ట్ర కమిటీ సమావేశంలో చెప్పడం కూడా గమనించదగిన విషయమే.భావి ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న కెటిఆర్ కు అటు ప్రభుత్వపరంగా ఇప్పటికే కొంత పట్టు రాగా, పార్టీలో కూడా పూర్తి స్థాయి పట్టు వచ్చేందుకు ఈ వ్యూహంలోకి వెళుతున్నారనిపిస్తుంది.ఇంతకుముందు హరీష్ రావు వంటి నేతలు కొద్ది మంది పోటీదారులుగా ఉంటారేమో అన్న ప్రచారం జరిగేది. కాని వారు కెసిఆర్ ,కెటిఆర్ ల నాయకత్వానికి పూర్తి మద్దతు ప్రకటించిన తర్వాత ఆ ఇబ్బంది తొలగిపోయింది. అయినా రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. పార్టీ మొత్తం ఒక కమాండ్ కంట్రోల్ లో ఉంటే ప్రయోజనకరమని కెసిఆర్ భావిస్తుండవచ్చు. భవిష్యత్తులో కెటిఆర్ కు రాజకీయంగా ఇబ్బంది లేకుండా పోవడానికి ఇవన్ని ఉపకరిస్తాయి.ఏది ఏమైనా సుదీర్ఘ కాలం పార్టీ నిలబడడానికి, అదికారంలో కొనసాగడంతో పాటు, కెటిఆర్ కు రాజకీయ పగ్గాలు అప్పగించడంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడడానికి కెసిఆర్ కసరత్తు సాగిస్తున్నారని అనుకోవచ్చు. రాజకీయ పార్టీ అన్న తర్వాత భవిష్యత్తుపై కూడా ఆలోచన చేయాలి. కెసిఆర్ అదే పని చేస్తున్నారు. ఇందులో పెద్దగా తప్పు పట్టాల్సినదేమీ లేదు.

tags : kcr, ktr, trs

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info