A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టి.బిజెపికి ఇది కష్టకాలమా!
Share |
September 19 2021, 1:42 pm

తెలంగాణలో ఎలాగైనా సత్తా చాటాలని తహతహలాడుతున్న భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి కొందరు ప్రముఖులు గుడ్ బై చెబుతున్న తీరు గమనంలోకి తీసుకుంటే ఆ పార్టీ ఇబ్బందులలోకి వెళుతోందా అన్న అభిప్రాయం కలుగుతోంది. ఏ కారణం వల్ల కాని కాంగ్రెస్, టిడిపి ల నుంచి వెళ్లి ఆ పార్టీలో చేరినవారు అక్కడ హాపీగా కనిపించడం లేదు. తాజాగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పార్టీకి రాజీనామా చేయడంతో పార్టీలో ఉన్న సమస్యలు బహిర్గతం అవుతున్నాయి. బిజెపి నేతలకు పార్టీని నడపడమే చేతకాదని మోత్కుపల్లి అన్నారు. మోత్కుపల్లి ఇప్పటికే అనేక పార్టీలు మారారన్న విమర్శ ఉన్నప్పటికీ, బిజెపి తెలంగాణ పై పెట్టుకున్న ఆశలు సఫలం అవుతాయా అన్నది చర్చనీయాంశంగా ఉంది. టిఆర్ఎస్ లో మంత్రి పదవి చేపట్టి , అనూహ్యంగా భూ కబ్జా కేసులో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన సీనియర్ నేత ఈటెల రాజేందర్ ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కొంత ఊపు తేవచ్చని పార్టీ భావించింది. ఆ ప్రకారం పావులు కదిపి ఈటెలను బిజెపి గూటిలో చేర్చారు. ఈటెల కూడా భవిష్యత్తు ఎలా ఉన్నా, ముందుగా ముఖ్యమంత్రి కెసిఆర్ దాడిని తట్టుకోవాలంటే ఇదొక్కటే గత్యంతరం అని అనుకున్నారు. అంతేకాక హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేసి ఉప ఎన్నిక గోదాలో నిలబడడానికి సన్నద్దం అవుతున్నారు. గత పదిహేడేళ్లుగా ఈటెల అక్కడ ప్రాతినిద్యం వహిస్తున్న నేపద్యంలో ఆయన పలుకుబడి తగ్గించడానికి స్వయంగా కెసిఆర్ రంగంలో దిగారు. దళిత బంధు పేరుతో ఏకంగా ఒక స్కీమ్ నే తెచ్చి హుజూరాబాద్ లోనే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయ సంకల్పించారు.అర్హులైన ఒక్కో దళిత కుటుంబానికి పది లక్షలు ఇచ్చే ఆ స్కీముపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నా, దళితవర్గాలను బాగా ఆకట్టుకునే స్కీమ్ గానే పరిగణిస్తున్నారు.ఈటెల పాదయాత్ర కొనసాగుతుండగా, ఆయన కు సన్నిహితంగా ఉన్నవారికి కెసిఆర్ పదవులు ఇవ్వడం, ఎమ్.పి.టిసి స్థాయి వారిని కూడా కెసిఆరే స్వయంగా పోన్ చేసి దళిత సదస్సుకు రావాలని ఆహ్వానించడం వంటివి టిఆ్ఎస్ బలహీనతకు నిదర్శనమని బిజెపి చెబుతోంది. ఈటెలను చిన్నవాడని కెసిఆర్ అంటూనే, చిన్న,చితక నేతలను కూడా కెసిఆర్ పోన్ లో పలకరించడం సహజంగానే పోటీ అంత తీవ్రంగా ఉందా అన్న అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది.తాను చిన్నవాడినైనా కెసిఆర్ షాక్ ఇస్తానని, తనవల్లే హుజూరాబాద్ కు ఆయన వరాలు ప్రకటిస్తున్నారని ఈటెల ప్రచారం చేసుకుంటున్నారు. వీటి ప్రభావం ఎలా ఉంటుందో కాని,మోత్కుపల్లి దళిత అంశంపైనే పార్టీతో విభేదించి బయటకు రావడం ఆ పార్టీ నాయకత్వానికి కొంత ఇబ్బందికరమే. పార్టీ అద్యక్షుడు బండి సంజయ్ ఎంత పెద్ద మాటలు మాట్లాడినా, కెసిఆర్ ను ఎంత తీవ్రంగా విమర్శించినా, వారు కలవరపడుతున్నారన్న సంకేతాలు వస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మధ్య మాజీ ఎమ్.పి దేవేందర్ గౌడ్ కుటుంబాన్ని కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించగా, సంజయ్ జాగ్రత్తపడి దేవేందర్ కుమారుడు వీరేందర్ గౌడ్ బిజెపి నుంచి బయటకు వెళ్లకుండా ఆపుకున్నారన్న సమాచారం వచ్చింది. అలాగే మరికొందరు నేతలు ముఖ్యంగా పూర్వపు టిడిపి నాయకులు కొందరు అసౌకర్యంగా ఉన్నారని చెబుతున్నారు. హుజూరాబాద్ కే చెందిన మాజీ మంత్రి ఇ.పెద్దిరెడ్డి తన అసంతృప్తిని దాచుకోలేదు. మరో మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్.పి చాడా సురేష్ వంటివారు బిజెపిలో ఇమడలేమని, తమను పార్టీ వినియోగించుకోలేకపోతోందని భావిస్తున్నారట. వీరు కూడా పార్టీని వీడితే పార్టీపై ప్రభావం పడుతుందని బిజెపి నేతలు సంశయిస్తున్నారని సమాచారం.అలాగే కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన వారి పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదని మీడియాలో కదనాలు వచ్చాయి.అయితే మాజీ మంత్రి,బిజెపి జాతీయ ఉపాద్యక్షురాలు డి.కె. అరుణ ఏమైనా తమకు సాయం చేయగలుగుతుందా అని కొందరు వెయిట్ చేస్తున్నారట. ఇవన్ని కూడా బిజెపిలో అంతా సజావుగా లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. దుబ్బాక విజయం, హైదరాబాద్ లో గణనీయ ఫలితాలు సాధించిన ఉత్సాహం కొనసాగాలంటే హుజూరాబాద్ లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి బిజెపికి ఏర్పడింది. కాని ఒకవైపు టిఆరెఎస్ అధినేత స్వయంగా తానే రాజకీయాన్ని హాండిల్ చేస్తూ, ఇతర పార్టీలకు చెందిన చిన్న,చితక నేతలను కూడా ఆకర్షించేస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా తన తంటాలు తాను పడుతోంది.దీంతో బిజెపి హుజూరాబాద్ లో ఎంతవరకు గెలుస్తుందన్నది ఇప్పటికైతే చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు. ఒకవేళ బిజెపి కనుక అక్కడ ఓడిపోతే పార్టీ ఇక పుంజుకోలేదన్న భావన ఏర్పడుతుంది. తెలంగాణ బిజెపిపై మొదటి నుంచి ఒక అభిప్రాయం ఉంది. ఆ పార్టీలో కొందరు ఒక కూటమిగా ఉంటారని, వారు ఇతర పార్టీలవారిని పెద్దగా ఎదగనివ్వరని చెబుతుంటారు. దానికి తోడు అసలు పార్టీ నిర్వహణే కాస్త గందరగోళంగా ఉంటుందని , బండి సంజయ్ కూడా ఏకపక్ష నిర్ణయాలు చేస్తున్నారని కొందరు ప్రచారం చేస్తున్నారు.వీటన్నిటిని అధిగమించి బిజెపి తెలంగాణలో పెద్ద శక్తిగా ఆవిర్భవిస్తే గొప్ప విషయమే అవుతుంది. కాకపోతే బిజెపి డిల్లీ పెద్దలు తెలంగాణపై దృష్టి సారించారని, అందువల్ల వారు వ్యూహాలు పన్ని,బిజెపిని పైకి తీసుకు వస్తారన్నది పార్టీలో ఒక ఆశగా ఉంది. కాని ఏ రాజకీయ క్షేత్రంలో అయినా బేస్ సరిగా లేకపోతే, ఎంత పెద్ద నేతలు రంగంలో దిగినా ఫలితాలు సాధించడం కష్టం అవుతుంది. అయితే ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్ల సమయం ఉందని, ఈలోగా బిజెపి తన వ్యూహాలకు పదును పెడుతుందని ఆశావాదులు అంటున్నారు. రాజకీయాలలో ఏమైనా కావచ్చు. కాని ఇప్పటికైతే బిజెపి హుజూరాబాద్ నే నమ్ముకుంది. అక్కడ తేడా వస్తే తెలంగాణలో బిజెపి ఎదుగుదల కష్టం కావచ్చు.

tags : bjp, telangana

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info