A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ ప్రభుత్వం నిరంతరం వివాదాల్లో...కుట్ర
Share |
September 19 2021, 12:51 pm

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వర్గం మీడియాలో వస్తున్నన్ని కధనాలు బహుశా మరే ముఖ్యమంత్రిపైన వచ్చి ఉండకపోవచ్చు. నిజంగానే జగన్ ప్రభుత్వంలో తప్పులు జరుగుతుంటే వార్తలు ఇవ్వడం ఆక్షేపణీయం కాదు.కాని నిత్యం ద్వేషం, కసి,తాము కోరుకున్న నేతకు సి.ఎమ్. పదవి దక్కకపోవడమే కాకుండా, తెలుగుదేశం పార్టీ ఆయా ఎన్నికలలో దారుణంగా పరాజయం చెందడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా కనిపిస్తుంది.అందుకే ప్రతిదానిని వివాదం చేయడమో,లేక వాస్తవాలకు మసిపూసి మారేడు కాయ చేయడమో చేస్తున్నారు.నిజంగానే జర్నలిజం విలువలకు అనుగుణంగా వార్తలు ఇస్తే ,దానిని బట్టి ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరుగుతుంటే వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.కాని అందుకు విరుద్దంగా తెలుగుదేశం నేతలు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే,వాటిపై అధికారులు కేసు నమోదు చేస్తే వాటిని కక్షపూరితం అని ప్రచారం చేస్తున్నాయి.అదే సమయంలో వైసిపి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుని జి.ఓ. ఇచ్చిన వెంటనే అమ్మో..అలా జరిగిపోతోంది..ఇలా జరిగిపోతోందంటూ గగ్గోలు పెడుతూ కధనాలు వండి వార్చుతున్నాయి.కొద్దికాలం క్రితం మాజీ ఎమ్.పి జెసి దివాకరరెడ్డికి సంబంధించిన మైనింగ్ లీజులో అక్రమాలు జరిగాయని అధికారులు వంద కోట్ల జరిమానా విధించారు.కాని దానిని టిడిపి మీడియా కక్ష అని ప్రచారం చేశాయి.అదే సమయంలో విశాఖలో లాటరైట్ ఖనిజానికి సంబంధించిన లీజు ఇవ్వగానే ఇంకేముంది..చెట్టుకొట్టేస్తున్నారు..బాక్సైట్ తవ్వేస్తున్నారు అంటూ ప్రచారం చేశారు.తెలుగుదేశం నేతల బృందం ఒకటి పర్యటించి చాలా అక్రమాలు జరిగినట్లు ఆరోపించింది. దీనిపై గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది వివరణ ఇచ్చారు.అది హైకోర్టు ఆదేశాల ప్రకారమే ఇచ్చారని, గత ప్రభుత్వ హయాంలో ఆరు లీజులు ఇచ్చారని వివిధ కారణాలతో ఐదు నాన్ ఆపరేషనల్ అయ్యాయని ఆయన వివరించారు. దీనిపై నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టారు. అయ్యన్నపాత్రుడు టైమ్ లో జరిగిన కోట్ల రూపాయల అక్రమాలు బయటకు వస్తాయని, అందుకే తప్పుడు ఆరోపణలతో వారు ముందస్తు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. టిడిపి మీడియాకు మాత్రం గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన వివరణ సంతృప్తి కలిగించలేదట.ఇలా ఉంటుంది వారి శైలి.మరో ఉదాహరణ చూద్దాం.ఎపి ప్రభుత్వం 41 వేల కోట్ల రూపాయల వ్యయానికి సంబందించిన వివరాలను సరిగా నమోదు చేయలేదనో, సాంకేతికంగా వేరే పద్దతి అనుసరించారనో కాగ్ వివరణ కోరింది. అందులో వాస్తవం ఎంత ఉందో తెలుసుకోవలసిన బాద్యత మీడియాకు ఉంటుంది కదా.పిఎసి చైర్మన్ గా ఉన్న పి.కేశవ్ దానిపై అధికారుల వివరణ తీసుకుని, పిఎసి మీటింగ్ లో చర్చించిన తర్వాత గవర్నర్ కు పిర్యాదు చేసినా,లేదా మీడియాకు చెప్పినా తప్పుకాదు.అదేమీ చేయకుండానే ఆయన ప్రెస్ కు ఇచ్చారు.మరి ఇదే తెలుగుదేశం హయాంలో ఏభైవేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖాతా నుంచి పిడి ఖాతాలకు మరల్చి దుర్వినియోగం చేశారని అప్పట్లో బిజెపి ఎమ్.పి జవిఎల్ నరసింహారావు ఆరోపణలు చేస్తే ఇంతవరకు దానిపై టిడిపి వివరణ ఇచ్చినట్లు కనిపించలేదు.అలాగే టిడిపి మీడియా కూడా దానిని కప్పిపుచ్చేయత్నం చేసింది.మరి ఇప్పుడు జగన్ ప్రభుత్వం అలా దుర్వినియోగం చేసిందా అన్నది చూడాలి.ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రావత్ దీనిపై ఖండనతో కూడిన వివరణ ఇచ్చారు.రాష్ట్రం అప్పులు చేస్తే అప్పు చేసిందని, కేంద్రం ఏదైనా వివరణ అడిగితే షాక్ ఇచ్చిందని రాయడం పెద్ద ఫాషన్ అయింది. కరోనా సమయంలో కొంత అప్పు ఎక్కువ చేసి ఉండవచ్చు.అలా చేసి,పేదలను ఆదుకునే చర్యలకు జగన్ ప్రభుత్వం పూనుకోకపోతే ,ఇదే మీడియా కాని, ప్రతిపక్ష తెలుగుదేశం కాని నానా గగ్గోలు పెట్టేవి.ఇతర రాష్ట్రాలలో అసలు అలా పేదలకు ప్రత్యేకంగా ఏదో పధకం ద్వారా ఆర్ధిక సాయం అందించకపోయినా, అక్కడ కిక్కురుమనని మీడియా,ఎపిలో మాత్రం ప్రతి విషయంలోను వ్యతిరేక కధనాలు అల్లుతోంది.సుమారు లక్షన్నర మంది గ్రామ,వార్డు సచివాలయాలలో ఉద్యోగాలు ఇస్తే,వాటిని పట్టించుకోని తెలుగుదేశం కాని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియాకాని, ఉద్యోగాల కాలండర్ పై ఎంత హడావుడి చేశాయో గమనించాం. ఎక్కడైనా పది మంది టిడిపినో, మరోపార్టీ కార్యకర్తలో నిరసన తెలిపితే, మొత్తం రాష్ట్రం అంతా అట్టుడికి పోయినట్లుగా మొదటి పేజీలలో సచిత్ర కధనాలు ఇచ్చాయి.అవి చూస్తే జగన్ ప్రభుత్వం అసలు నిరుద్యోగులకు ఏమీ చేయలేదేమో అన్న అనుమానం కలుగుతుంది. నిరుద్యోగులకు భృతి ఇస్తామని గతంలో చంద్రబాబు ప్రభుత్వం చెప్పి నాలుగేళ్లపాటు ఇవ్వకపోయినా,ఎన్నడైనా ఈ మీడియా ఆ విషయాన్ని గుర్తు చేసిందా?ఒక చెత్త పలుకు అయితే జగన్ జైలుకు వెళితే సి.ఎమ్.ఎవరు అంటూ రాశారట.మరి అదే పత్రిక ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకు వెళితే సి.ఎమ్. ఎవరు అని రాసిందా?పైగా చంద్రబాబు అసలు ఏమీ తప్పు చేయలేదన్నట్లు పిక్చర్ ఇవ్వడానికి పిచ్చ ప్రయత్నం చేసింది.రాయలసీమ ఎత్తిపోత పధకంపై నిత్యం ఏదో ఒక వివాదం ఉండాలని కోరుకునే ఈ మీడియా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తెలంగాణ నేతలతో సమావేశం అయినా, తప్పుపట్టదు.పైగా దానిపై ఆయన అభిప్రాయం చెప్పకపోయినా, అదేమిటని అడగదు.అది వారి జర్నలిజం. వైసిపి అసమ్మతి ఎమ్.పి కి, టిడిపి అధినేత చద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ల మధ్య జరిగిన చాటింగ్ వివరాలు చూస్తే కుట్రల స్వభావం అర్దం అవుతుంది. దీనిలో ఒక వర్గం మీడియా కూడా భాగస్వామి అవుతోందన్న భావన ఏర్పడుతోంది. ఎందుకంటే ఈ విషయాలు బయటకు వచ్చాక టిడిపితో పాటు వారికి మద్దతు ఇచ్చే మీడియా గప్ చిప్ అయిపోయిన తీరు అందుకు ఆస్కారం ఇస్తుంది. సిఐడి పోరెన్సిక్ నివేదిక ద్వారా వెలుగులోకి తీసుకు వచ్చిన అంశాలు ఆశ్చర్యం కలిగించేవే. వేరే పార్టీ ఎమ్.పిని టిడిపి అధినేత తన పావుగా మార్చుకోవడం, చివరికి ముఖ్యమంత్రి జగన్ బెయిల్ ను ఎలా రద్దు చేయించాలన్నదానిపై కలిసి పనిచేయడం ఇవన్ని కుట్రకోణాన్ని స్పష్టపరుస్తున్నాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. వైసిపి ఎమ్.పి రామిరెడ్డికి చెందిన సంస్థపై ఆదాయపన్ను శాఖ దాడి చేసి కొన్ని అంశాలలో తప్పుపడితే ప్రముఖంగా మొదటి పేజీలో వార్తలు ఇచ్చాయి. దీనికి అభ్యంతరం చెప్పనక్లర్లేదు.కాని అవే పత్రికలు టిడిపి నుంచి బిజెపిలో చేరిన ఎమ్.పి సుజనా చౌదరి సంస్థలు బ్యాంకులను ఐదువేల కోట్ల మేర మోసం చేశాయని తెలంగాణ హైకోర్టుకు సిబిఐ తెలిపినా ,ఆ విషయాన్ని పెద్దగా ప్రస్తావించవు. మామూలుగా అయితే న్యాయ వ్యవస్థలో చీమ చిటుక్కుమన్నా ,అది కూడా వైసిపికి వ్యతిరేకంగా ఏమన్నా ఉంటే పెద్ద ఎత్తున కధనాలు రాసే ఈ మీడియాకు ఇవి కనిపించకపోవడం వారి దృష్టిలోపమా?లేక తమవారిపట్ల వల్లమాలిన అభిమానమా?ఇలా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి విశాఖలో కొన్ని ప్రభుత్వ భూములు అమ్మాలనో , తనఖా పెట్టి రుణం తీసుకోవాలనో ఎపి ప్రభుత్వం భావించింది. దాంతో టిడిపి మీడియా రెచ్చిపోయి విశాఖ ఫర్ సేల్ అంటూ పిచ్చిగా కోతికి కొబ్బరికాయ దొరికిన చందంగా హడావుడి చేశాయి.కొందరు కోర్టుకు వెళ్లే ఆపే యత్నం చేస్తున్నారు. అదే మీడియా హైదరాబాద్ లో భూములు అమ్ముతుంటే,కాసుల పంట అని రాశాయే కాని, హైదరాబాద్ ఫర్ సేల్ అని ఎందుకు రాయలేదు. తెలంగాణ హైకోర్టు ప్రభుత్వం భూముల అమ్మకాన్ని ఆపజాలమని స్పష్టం చేసింది. మరి దీనికి ఏమి చెబుతారు? ఎపిలో రోడ్లు పాడైపోయాయని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఒక మీడియా వరస కధనాలు ఇచ్చింది. రోడ్లు రిపేరు చేయాలని వార్తలు ఇవ్వడం మంచిదే. కాని ఒక పక్క వర్షాలు కురుస్తుంటే రోడ్ల మరమ్మతులు ఎలా జరుగుతాయో ఆ మీడియా వివరించాలి కదా! దీనిపై సోషల్ మీడియాలో ఒక వ్యంగ్య వ్యాఖ్య వచ్చింది. రెండేళ్ల క్రితం వరకు చంద్రబాబు ప్రభుత్వమే ఉంది కదా.అప్పుడు నిజంగానే రోడ్లు వేసి ఉంటే ఇంత త్వరగా పాడైపోయాయంటే అంత నాసిరకంగా వేశారా అని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులకు సంబందించి ఒకటికి రెండుసార్లు వార్తలు ఇచ్చారు.బాగానే ఉంది. కాని దానికి కేంద్రాన్ని ప్రశ్నిస్తారా? లేక ఎపి ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తారా? ఒక పత్రిక ఒక గాలి వార్త రాస్తుంది.చానళ్లు కొన్ని చర్చలు పెడతాయి. ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ దానిని అందుకుంటుంది.దానిని మరో మీడియా కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రచారం చేస్తుంది.ఇలా గత రెండేళ్లుగా సాగుతున్న ఈ తంతు అనండి, కుట్రల పర్వం అనండి.. ఇంకెంతకాలం సాగుతాయోల చూడాలి.

tags : jagan, conspiracy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info