A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
30 శాతం ఓట్లు వచ్చిన టిడిపి బహిష్కరణేమిటో
Share |
July 31 2021, 4:34 am

సాధారణంగా ఒక రాజకీయ పార్టీ ఒక పెద్ద నిర్ణయం తీసుకుందంటే దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. దాని సారాంశం అందరికి అర్దం కావాలి? అంతేకాక సొంత పార్టీ కార్యకర్తలలో మెజార్టీ వారికి ఆమోదయోగ్యంగా ఉండాలి. అలా కాని పక్షంలో ఆ రాజకీయ పార్టీ క్షీణించిపోవడానికి కాలం దగ్గరపడిందన్న భావన ఏర్పడుతుంది. కొన్ని రాజకీయ పార్టీలు చారిత్రక తప్పిదాలు చేసి దారుణంగా దెబ్బతినిపోయి, ప్రతిపక్ష హోదా నుంచి ఐదు శాతం ఓట్లు కూడా రాని పరిస్థితిలో పడ్డాయి. ఇది మన దేశంలో కళ్లముందు కనిపిస్తున్న సత్యం. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు జాతీయ పార్టీగా చెబుతారు. ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా చాలా సిన్సియర్ గా చంద్రబాబు,లోకేష్ లు జాతీయ పార్టీ అధ్యక్ష , ప్రదాన కార్యదర్శులుగా అబివర్ణిస్తూ ప్రచారం చేస్తుంటాయి. తప్పు లేదు. కాని చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయం చారిత్రక తప్పిదమా?కాదా అన్నదానిపై ఆ మీడియా స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వంపై చేసిన విమర్శలకు ప్రాముఖ్యత ఇస్తూ కదనాలు ఇచ్చాయి. వాటి సంగతి వదలిపెడితే చంద్రబాబు ఎపిలో జడ్పిటిసి, ఎమ్.పిటిసి ఎన్నికలను బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయం చారిత్రక తప్పిదంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క మున్సిపల్ ఎన్నికలలో మూడు శాతం ఓట్లు రాని బిజెపి, ఐదు శాతం ఓట్లురాని జనసేన జడ్పిటిసి, ఎమ్.పి.టి.సి. ఎన్నికలలో పోటీ చేస్తున్నాయి.అలాగే ఒక శాతానికే పరిమితం అయిన కాంగ్రెస్, వామపక్షాలు కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించలేదు. కాని 30 శాతం ఓట్లను తెచ్చుకున్న టిడిపి ఎందుకు ఎన్నికలను బహిష్కరించిందన్నది ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు అర్దం కావడం లేదు. ఇది రాజకీయంగా ఆత్మహత్య అని కొందరు విశ్లేషిస్తున్నారు. టిడిపి ఆవిర్భావం తర్వాత ఈ నలభై ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని చంద్రబాబుకాని, ఆయన కు మద్దతు ఇచ్చే మీడియాకాని ప్రచారం చేస్తున్నాయి. అదేదో గొప్ప విషయం అన్న చందంగా వారు భావిస్తూ, ప్రజలంతా అలా అనుకోవాలని భ్రమపడుతున్నారు.చంద్రబాబు నిర్ణయంతో అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఇరుకున పడుతుందని వారు అనుకుని ఉండాలి.కాని మొత్తం క్షేత్రం అంతటిని వైసిపికి వదలివేసినట్లయిందని కొందరు టిడిపి నేతలే నెత్తి,నోరు మెత్తుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు టిడిపి ఎన్నికలను బహిష్కరిస్తోందని చెప్పారే తప్ప, తమ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎవరికి ఓటు వేయాలో చెప్పలేదు. లేదా తాము ఎన్నికలను బహిష్కరించినా స్థానిక పరిస్థితులను బట్టి జిల్లాలలో నిర్ణయాలు తీసుకుంటారని చెప్పలేదు. ఇక్కడ కూడా ఆయన తన శైలి ప్రకారం డబుల్ గేమ్ ఆడుతున్నారన్న అనుమానం వస్తోంది. ఎవరినో సంతృప్తి పరచడానికి ఎన్నికల గోదా నుంచి తప్పుకుంటున్నట్లు ఒకవైపు, స్థానిక నేతలు పోటీలో కొనసాగేలా మరో వైపు వ్యవహరిస్తున్నారా పలువురు శంకిస్తున్నారు.దీనివల్ల పార్టీ కార్యకర్తలలో గందరగోళం ఏర్పడింది. ఉదాహరణకు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఒక వర్గం కార్యకర్తలు ఎన్నికల ప్రచారానికి దిగగా, మరో వర్గం కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. విజయనగరం జిల్లాలో కొన్ని చోట్ల పచ్చ కండువాలు వేసుకుని యధా ప్రకారం ప్రచారం చేసుకుంటున్నారు. అదేమని అడిగితే ఆ వెసులుబాటు తమకు ఉందని వారు అంటున్నారు. అంతేకాక,తాము ఇప్పటికే నామినేషన్లు వేశామని, కార్యకర్తలు, ప్రజలు తమను పోటీలో ఉండాలని కోరుతున్నారని వారు చెబుతున్నారు. పోటీలో లేకపోతే అది తమకు అవమానం అని కూడా వారు అంటున్నారు.జ్యోతుల నెహ్రూ వంటివారు నియోజకవర్గ స్థాయిలో తమ సొంత కాడర్ ను కాపాడుకోవడానికి యత్నాలు చేస్తున్నారు. చంద్రబాబుకు ఎవరు ఈ దిక్కుమాలిన సలహా ఇచ్చారో కాని, ఆయన తీసుకున్న నిర్ణయంతో టిడిపి కుదేలైందని చెప్పాలి. నిజానికి పంచాయతీ ,మున్సిపల్ ఎన్నికలలో పెద్దగా వివాదాలు రాలేదు. అరాచకాలు జరగలేదు.కాని చంద్రబాబు తన సహజసిద్దమైన సరళిలో ఏదేదో జరిగిపోయిందని ఇప్పుడు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఆ విషయం తెలుగుదేశం కార్యకర్తలందరికి తెలుసు. అందుకే కొన్ని చోట్ల చంద్రబాబు నిర్ణయాన్ని టిడిపి కాడర్ సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇది ఇలా ఉండగా, చంద్రబాబు నిర్ణయం వెనుక భారతీయ జనతా పార్టీ హెచ్చరికలు ఏమైనా పనిచేశాయా అని కొందరు అనుమానిస్తున్నారు.తమిళనాడులో జయలలిత సన్నిహితురాలు శశికళ ఎన్నికలలో తన అభ్యర్ధులను రంగంలో దించడానికి సన్నద్దం అవుతున్న తరుణంలో సడన్ గా ఎన్నికలలో అస్త్ర సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ ఘటన వెనుక బిజెపి పాత్ర ఉందని ప్రచారం జరిగింది. అలాగే చంద్రబాబుపై ఇటీవల వచ్చిన కేసులు కాని,ఇతరత్రా ఆరోపణలు కాని గమనిస్తే, వాటి నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఆయన ఇలా చేశారా?అన్న అభిప్రాయాన్ని కొందరు రాజకీయ నేతలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మరో ఆంద్రా శశికళ అని ఎపిసిసి ఉపాధ్యక్షుడు గంగాధర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన అవసరార్ధం ఎవరినైనా బలి చేయగలరు. ఇప్పుడు ఏకంగా పార్టీని, పార్టీ క్యాడర్ ను బలిచేయడం ద్వారా బిజెపిని ప్రసన్నం చేసుకునే యత్నంలో ఉన్నారా అన్నది ఆయన అనుమానం.అదే సమయంలో బిజెపి వారి సవాళ్లు ఆసక్తికరంగా ఉన్నాయి. ఎపిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమని వారు ప్రచారం చేస్తున్నారు. రెండు శాతం ఓట్లు వచ్చినవారు ,నాలుగు శాతం ఓట్లు వచ్చిన జనసేనతో కలిస్తే ప్రత్యామ్నాయం ఎలా అవుతారబ్బా అని అనుకుంటున్న తరుణంలో చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం తో నిజంగానే ఆ కూటమికి ఓట్లు కాస్త పెరిగే అవకాశం ఉంటుంది.టిడిపి ఎన్నికల క్షేత్రం నుంచి తప్పుకుంది కనుక ఆ పార్టీకి ఓట్లు వేసే వారు అయితే వైసిపివైపు అట్రాక్ట్ కావాలి. లేదంటే బిజెపి-జనసేన కూటమికి అనుకూలంగా ఓట్లు వేయాలి.తద్వారా గతంలో కన్నా ఈ కూటమి బలం కొంత పెరిగే అవకాశం ఉంటుంది.అంటే క్రమేపి తెలుగుదేశం పార్టీ తనను తాను బలహీనపరచుకుంటూ పోతే ,అందులోని వారు బిజెపి వైపు వస్తే అప్పుడు ఈ పార్టీ బెటర్ అవుతుందన్నమాట. ఇది ఎంతవరకు వాస్తవం అన్నది చెప్పలేం కాని, చంద్రబాబు చర్య మాత్రం అనేక అనుమానాలకు దారి తీసింది. ఒక ఆంగ్ల పత్రికలో తెలుగుదేశం పార్టీని భారతీ జనతా పార్టీలో విలీనం చేయడానికి ప్రదాని మోడీ, హోం మంత్రి అమిత్ షా లతో డీల్ కుదిరిందని ఏప్రిల్ ఫూల్ వార్త ఒకటి వేశారు. ఆ తర్వాత రోజు అది ఏప్రిల్ ఫూల్ వార్త కాదేమోనన్న చందంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇంతకాలం తాము వైసిపిపై పోరాడుతున్నామని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు చేతులు ఎత్తివేయడం వెనుక ఏదో ఇలాంటి బలమైన కారణం ఉండవచ్చని కూడా నమ్ముతున్నవారి సంఖ్య గణనీయంగానే ఉంది. రాజకీయ పార్టీలు ఎన్నికలలో ఎందుకు పోటీచేస్తాయి? తద్వారా తమ పార్టీని ప్రజలలో విస్తరింప చేసుకోవడానికి ఒక అవాశం గా భావిస్తాయి కనుక. అలాగే తమ క్యాడర్ ను యాక్టివేట్ చేయడానికి ఇది ఆస్కారం కలిగిస్తుంది. ఉదాహరణకు నంద్యాలలో ఓడిపోతామని తెలిసినా,అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేక అరాచకాలకు పాల్పడుతుందని తెలిసినా వైఎస్ ఆర్ కాంగ్రెస్ వెనక్కి తగ్గలేదు. ఆ పార్టీ అదినేత ,ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారం రోజులపాటు అక్కడే తిష్టవేసి తన క్యాడరులో ఒక ధైర్యం పెంచేయత్నం చేశారు.కడప జిల్లాలో ఎమ్.పి.టి.సిలు ,జడ్పిటిసిల బలం వైసిపికి ఉన్నా, చంద్రబాబు వారిలో చాలామందిని డబ్బుతో కొనుగోలు చేసి క్యాంపులకు తరలించారు. అయినా వైఎస్ వివేకానందరెడ్డి వెనక్కి తగ్గకుండా పోటీలో నిలబడి ఓడిపోయారు. అది ప్రజాస్వామ్య ప్రక్రియ. ప్రభుత్వ పక్షం ఎలా వ్యవహరించినా ప్రతిపక్షం తన పాత్రను పోషించాలి.అలాకాకుండా చేతులు ఎత్తివేశారంటే వారిలో పోరాట పటిమ చచ్చి అయినా ఉండాలి..లేదా ఏదో బాహ్య శక్తి నుంచి వచ్చిన ఒత్తిడి అయినా అయి ఉండాలి.చంద్రబాబు చెప్పిన ధీరీ కరెక్టు అనుకుంటే లోక్ సభ లో కేవలం రెండు సీట్లే ఉన్న బిజెపి ఈ రోజు 303 సీట్లతో అధికారంలోకి వచ్చేది కాదు. తెలంగాణలో గెలవలేమని తెలిసి కూడా అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయడం ద్వారా బిజెపి తన క్యాడర్ ను కొంత పెంచుకుంది. అది ఆ తర్వాత లోక్ సభ ఎన్నికలలో ఉపయోగపడింది. పశ్చిమబెంగాల్ లో ఎన్నో పోరాటాల తర్వాత వామపక్ష కూటమిని దించి మమత బెనర్జీ గెలుపొందారు. కేవలం ఇద్దరితో సొంత రాజకీయం పార్టీని స్థాపించి డక్కామక్కీలు తిన్న జగన్ తొమ్మిదేళ్ల పోరాటం తర్వాత అధికారం కైవసం చేసుకున్నారు. 2004లో టిఆర్ఎస్ చాలా చిన్న పార్టీ కింద లెక్క. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కుని పోరాడి నిలబడి ఇప్పుడు వరసగా రెండోసారి గెలిచింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయాన్ని గమనించాలి. ఓటుకు నోటు కేసు దెబ్బతో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను వదలివేసిన చంద్రబాబు నాయుడు ,పార్టీని కూడా త్యాగం చేశారు. తెలంగాణలో గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ తో కలిసి పోటీచేశారు.అయినా ఓడిపోయారు అది వేరే విషయం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ఓడిపోతామని తెలిసినా 106చోట్ల పోటీచేశారు. ఒక్క చోట కూడా డిపాజిట్ రాలేదు. తెలంగాణ టిడిపి అద్యక్షుడు ఎల్.రమణ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పోటీచేసిన టిడిపి నాగార్జున సాగర్ లో కూడా పోటీకి సిద్దం అయింది. అసలు బలం మొత్తాన్ని కోల్పోయిన చోట పదే,పదే పోటీచేసి డిపాజిట్లు కోల్పోవడానికి ఇష్టపడుతున్న టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 30 నుంచి 40 శాతం ఓట్లు ఉన్న ఆంద్రలో జడ్పి, మండల ఎన్నికలను బహిష్కరించారంటే దాని అర్దం ఏమి తిరుమలేషా? కాంగ్రెస్ నేత ఒకరు అన్నట్లు చంద్రబాబు మరో ఆంద్రా శశికళ పాత్రలో ఉన్నారా?లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా?ఏమో ..ఏమైనా కావచ్చు.

tags : tdp, boycott

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info