A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ అసలు మనిషి బయటకు వస్తున్నాడా
Share |
July 31 2021, 5:42 am

రాజకీయాలలో విలువల వదలివేయడం మొదలు పెడితే ఎంతవరకు అయినా పతనం కావచ్చు. అబద్దాలు చెప్పడానికి అలవాటు పడితే వాటికి అంతు,పొంతు ఉండదు. ఏమి మాట్లాడుతున్నామో మనకే తెలియదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా చేసిన ప్రసంగంలోని కొన్ని అంశాలు చూస్తే అచ్చం అలాగే అనిపించింది. ఒకప్పుడు చెగువీరా, భగత్ సింగ్ వంటి ఫోటోలు పెట్టుకుంటే ఆయన ఎంతో ఆదర్శంగా ఉంటారని అంతా అనుకు్న్నారు. వారిని వదలివేసి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు వంటివారి వెంట తిరిగితే అనుభవానికి ప్రాధాన్యం ఇస్తున్నారేమోలే అనుకున్నాం.ఆ తర్వాత వామపక్షాలతోను బిఎస్పి అదినేత్రి మాయావతితోను రాజకీయ జట్టు కడితే తను చేసిన తప్పు తెలుసుకుని మళ్లీ తన బాటలోకి వచ్చారేమోలే అనుకు్న్నాం. కాని 2019 ఎన్నికలలో ఓటమి చెందాక , ఎక్కువ రోజులు వేచి చూడకుండా పవన్ కళ్యాణ్ వామపక్షాలకు జెల్లకొట్టి మళ్లీ బిజెపితో కలవడానికి ఎంతగా పాకులాడారో, ప్రాదేయపడ్డారో అంతా గమనించారు. అప్పుడు అసలు విషయం మరింత స్పష్టంగా అర్ధం అయింది. పవన్ కళ్యాణ్ తన స్వార్ద రాజకీయ ప్రయోజనం కోసమో, లేక మరెందుకో ఎవరినైనా ముంచడానికి వెనుకాడరని అంతా భావించే పరిస్థితి ఏర్పడింది.కృత్రిమ మేధావితనంతో ప్రజలను మాయ చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. ఆయనలోని అసలు మనిషి బహిర్గతం అవుతున్నాడు. ఇవన్ని గమనిస్తుంటే గతంలో టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఎలా చేశారో అచ్చం అలాగే పవన్ కళ్యాణ్ చేస్తున్నట్లుగా ఉంది. చంద్రబాబు నాయుడు కూడా ముందు వామపక్షాలతో జట్టుకట్టారు. ఆ తర్వాత వారికి చెప్పాపెట్టకుండా బిజెపి కూటమిలో చేరిపోయారు. మళ్లీ ఓటమి తర్వాత తన జీవితంలో ఇంత పెద్ద తప్పు మరోసారి చేయనని, బిజెపితో స్నేహం చారిత్రక తప్పిదమని ఆయన ప్రకటించారు. ఆ తదుపరి మళ్లీ వాపక్షాలు, టిఆర్ఎస్ తో కలిసి పోటీచేసి ఓటమి చెందారు.అంతలో రాష్ట్ర విభజన జరిగింది. వెంటనే ఎలాగొలా పాకులాడి చంద్రబాబు బిజెపి అగ్ర నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకుని వారితో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు.కాని 2018 వచ్చేసరికి మళ్లీ బిజెపి నేతలను నోటికి వచ్చినట్లు దూషించి కాంగ్రెస్ తో కలిశారు. అయినా ఫలితం దక్కలేదు.2019ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత మళ్లీ బిజెపి ఎప్పుడు పిలుస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇలా కూటములు మార్చడంలో చంద్రబాబు స్టైల్ లోనే వెళ్లిన పవన్ కళ్యాణ్ తన ఉపన్యాసాలలలో కూడా ఆయననే ఆదర్శంగా తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు నేర్పరి అన్న పేరు ఉంది. పవన్ కళ్యాణ్ కు అంత నేర్పరితనం లేకపోయినా ఆయనను తిరుపతిలో అనుకరించి అభాసుపాలయ్యారనిపిస్తుంది. వైసిపికి ఓటు వేస్తే ఏడుకొండలవాడికి ద్రోహం చేసినట్లు అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఆయన అమాయకంగా ఈ మాట అన్నారా?లేక ఎవరైనా రాసిచ్చిన స్క్రిప్టు చదివారా అన్నది తెలియదు.కులపరమైన ,మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి అచ్చం చంద్రబాబు మాదిరే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. నిజానికి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన సభలో నరేంద్ర మోడీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడులతో పాటు పవన్ కళ్యాణ్ ఉన్నారు. కాని దానిని ఎగవేశారు. బిజెపి పాచిపోయిన లడ్లు ఇచ్చిందని ప్యాకేజీ ప్రకటన సమయంలో పవన్ అన్నారు. మరి తిరుపతి సాక్షిగా పాచిన లడ్డు పవన్ ఎవరికి ఇచ్చారో తెలియదు. పవన్ ధీరీ కరెక్టు అనుకుంటే ఎపి ప్రజలకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పిన బిజెపి, జనసేన, టిడిపిలకు ఓటు వేయరాదు కదా?వారికి ఓటు వేస్తే తిరుపతి వెంకన్నకు ద్రోహం చేసినట్లు కాదా?పవన్ కళ్యాణ్ దీని గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదంటే ఆయన ఎంత పిరికివాడో అర్ధం అవుతుంది.ధైర్యం ఉంటే ప్రత్యేక హోదాపై బిజెపిని నిలదీస్తారో ,లేదో ఆయన చెప్పాలి కదా? ఆ తర్వాత వైసిపి ఎమ్.పిలను అడగవచ్చు. 150 గుడులను వైసిపి పాలనలో కూల్చారని మరో అబద్దం చెప్పారు.ఆయా ఘటననలో ఎవరిని అరెస్టు చేయలేదని ఇంకో అసత్యం చెప్పారు. ఇవన్ని చంద్రబాబు చెప్పేసిన అబద్దాలే. కాస్త ఆలస్యంగా పవన్ భుజాన వేసుకున్నారన్నమాట.చంద్రబాబు ఈ మధ్య విజయవాడలో దుర్గమ్మ గుడి గురించి మాట్లాడితే ,తిరుపతిలో పవన్ కళ్యాణ్ వెంకన్నస్వామి గురించి మాట్లాడారు. విజయవాడ,గుంటూరులలో చంద్రబాబు తనకు ఓట్లు వేయని ప్రజలను ప్రత్యక్షంగా దూషిస్తే, తిరుపతిలో పవన్ కళ్యాణ్ పరోక్షంగా ప్రజలను తప్పు పడుతున్నారు. ఒక వైపు ముఖ్యమంత్రి పదవిపై మోజుపడుతూనే , మరో వైపు తనకు ఆ పదవితో పనిలేదని, ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నానని అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు బ్రిటిస్ వారితో పోరాడారని పవన్ కళ్యాణ్ అన్నారని వార్తలు వచ్చాయి.దానిని బట్టి ఆయన చరిత్ర జ్ఞానం ఏపాటిదో అర్దం చేసుకోవచ్చు. ఆ మద్య సిపిఐ మాజీ ఎమ్మెల్సీ పిజె చంద్రశేఖర్ ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ పుస్తకాలు చదవడం అన్నది ఒక నటన అని, ఆయన పుస్తకాల టైటిల్స్ మాత్రమే చూస్తారని ,అంతకు మించి చదువరి కాదని పేర్కొన్నారు.అప్పడప్పుడు పవన్ కళ్యాణ్ చెబుతున్న చరిత్ర చూస్తే అది నిజమేనని పిస్తుంది. పులివెందుల ప్రజలను అవమానించేలా పవన్ మాట్లాడారు. ఇది కూడా చంద్రబాబు పద్దతే. పులివెందులలో బి.నాగిరెడ్డి, చక్రఫాణి గొప్ప సినిమా నిర్మాత,దర్శకులు వచ్చిన సంగతి సినీ నటుడు కూడా అయిన పవన్ కళ్యాణ్ కు తెలిసి ఉంటే ఆయన ఆ ప్రాంతాన్ని అవమానించేవారు కాదని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వచ్చాయి. ఇలా పవన్ చేసిన ప్రతి మాటను విశ్లేషించుకుంటూ పోతే చాట బారతం అవుతుంది. ఆయనకు ఇప్పుడు అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేనట్లే.ఎందుకంటే ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఎప్పుడో పార్టీకి దూరం అయ్యారు. అయినా పవన్ కళ్యాణ్ జనంలో తిరగగలగడమే అదృష్టం.ఎందుకంటే సినిమా నటుడిగా , ఒక సామాజికవర్గం అధికంగా అభిమానించే వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ఆ మాత్రం ప్రాధాన్యత వస్తోంది. ఒకప్పుడు తనకు కులం లేదు.మతం లేదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అచ్చంగా కులం, మత రాజకీయాలపై ఆధారపడి బిజెపికి మద్దతు ఇచ్చే దీన స్థితిలో పడ్డారు. మనిషి ఏ రకంగా అయినా పతనం అవడం ఆరంభం అయితే ఎలా దిగజారుతారో చెప్పడానికి పవన్ కళ్యాణ్ పెద్ద ఉదాహరణ అవుతారనిపిస్తుంది. కొంతకాలం పాటు ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాన్ని జనం భరించక తప్పదు.

tags : pawankalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info