గత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యూహాత్మకంగానే ఎన్నికల కోడ్ ను ఉపసంహరించి , కొత్త ఎస్.ఈ.సి. జిల్లా, మండల ఎన్నికలు వెంటనే జరగకుండా చేయడంలో సఫలం అయ్యారనుకోవాలి. గత నెలలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిన వెంటనే జడ్పిటిసి, మండల పరిషత్ ఎన్నికలు జరపవలసి ఉంది. కాని నిమ్మగడ్డ మండల, జడ్పి ఎన్నికలను పెట్టకపోవడమే కాకుండా ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ ప్రకటన చేశారు. ఆ తర్వాత ఈ నెల ఒకటిన బాద్యతలు తీసుకున్న కొత్త కమిషనర్ నీలం సహాని వెంటనే కోడ్ అమలులోకి వస్తుందని ప్రకటించి ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. అయితే తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీలు ఎన్నికల కోడ్ కు నాలుగువారాల గడువు ఉండాలని సుప్రింకోర్టు చెప్పిందని,అందువల్ల ఎన్నికలు నిలుపుదల చేయాలని హైకోర్టులో పిటిషన్ లు వేశాయి.ఆ కేసు విచారించిన జడ్జి జడ్పిటిసి, ఎమ్.పిటిసి ఎన్నికల నిర్వహణపై స్టే విధించారు. జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలపై నాలుగు వారాల కోడ్ అమలు చేయలేదన్న హైకోర్టు పేర్కొంది. దీనిపై ఈనెల 15వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దాంతో ఎల్లుండి జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి.నిమ్మగడ్డ ఎన్నికల కోడ్ ఎత్తివేయకుండా ఉన్నట్లయితే సాంకేతికంగా ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. tags : ap, highcourt