A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్- వీర్రాజు- చెవిలో పూలు
Share |
May 15 2021, 3:25 am

భారతీయ జనతా పార్టీ ఆంద్రప్రదేశ్ శాఖ అద్యక్షుడు సోము వీర్రాజు చేసిన ఒక ప్రకటన ఆ పార్టీ నిస్సహాయతను తెలియచేస్తోందా? ఆ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్ధి కి తగిన అర్హత ఉన్నవారు ఎవరూ లేరని పరోక్షంగా చెబుతున్నారా? వేరే పార్టీ నేతనే తమ సి.ఎమ్. అభ్యర్ది అని ,రాష్ట్రానికి అదిపతిని చేస్తామని చెప్పడం ద్వారా బిజెపి శ్రేణులను నిరాశకు గురి చేసినట్లు అవుతుందా?లేక ఉత్సాహం కలిగించినట్లు అవుతుందా? ఇదంతా ఎందుకో వేరే చెప్పనవసరం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి-జనసేన కూటమి తరపున సి.ఎమ్. అభ్యర్ధి అని బిజెపి ప్రకటించింది. దీనికి బిజెపి అధిష్టానం ఆమోదం ఉందని కూడా తెలిపారు. విశేషం ఏమిటంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే సొంత పార్టీ పక్షాన సి.ఎమ్. అభ్యర్ధిగా ప్రచారం అయ్యారు. అయినా ఫలితం ఏమైందో అందరికి తెలుసు. గత ఎన్నికలలో వామపక్షాలు, బహుజన సమాజ్ పార్టీ తో కలిసి కూటమిని ఏర్పాటు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పుడు కూడా సి.ఎమ్. అభ్యర్దే అనుకున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ కే నమ్మకం లేకపోయింది. ఆయన తన పార్టీ గెలుపుకన్నా తెలుగుదేశం పార్టీతో రహస్య పొత్తు పెట్టుకుని ఆ పార్టీ విజయం కోరుకున్నారన్నది ఎక్కువ మంది అభిప్రాయం.అంటే పొత్తు తో రాజకీయాలలో కాని,ఇతరత్రా కాని ఆయన ఒక విశ్వసనీయత తో వ్యవహరించలేదన్నమాట. 2014లో ఆనాటి ప్రధాని అభ్యర్దిగా నరేంద్ర మోడీ తమకు ఒక మాట చెప్పారని, పవన్ కళ్యాణ్ ను పువ్వు మాదిరిగా చూసుకోమన్నారని , పవన్ అంటే మోడీకి అభిమానమని కూడా వీర్రాజు సెలవు ఇచ్చారు. అది నిజమే అయితే పవన్ కళ్యాణ్ కు అప్పుడే ఏదో ఒక ఎమ్.పి పదవో ఇచ్చి కేంద్రంలో మంత్రిని ఎందుకు చేయలేదో కూడా వీర్రాజు చెప్పగలిగితే బాగుంటుంది.అంతేకాదు ఎపిలో ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నిస్తానని 2014 ఎన్నికలలో ప్రచారం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కాలంలో ఏదో మొక్కుబడిగా తప్ప ఆ పని ఎందుకు చేయలేదన్నదానిపై పలు అభిప్రాయాలు ఉన్నాయి.కేంద్రం ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీని ప్రకటించడం, దానిని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించడం, ఆ ప్యాకేజీని పాచిపోయిన లడ్లు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించి సభలలో ప్రచారం చేయడం జరిగింది. మోడీ ఏమైనా తనకు బంధువా?అంటూ ఆయనను కూడా పవన్ ఎందుకు విమర్శించారు. అమిత్ షా జనసేనను బిజెపిలో విలీనం చేయాలని అన్నారని, తాను చావనైనా చస్తాము కాని అలా చేస్తామా? బిజెపితో కలుస్తామా అంటూ పవన్ కళ్యాణ్ బీరాలు పోయినప్పుడు వీర్రాజు ఆయనను పువ్వులానే చూశారా?అప్పట్లో బిజెపి నేతలు పవన్ కళ్యాణ్ ను ఎలా విమర్శించింది ఒకసారి గుర్తు చేసుకునే పరిస్థితి ఉందా? వారి సంగతేమో కాని, ప్రస్తుతం బిజెపిలో ఉన్న మహిళా నేత యామిని టిడిపిలో ఉండగా ఏమన్నారు? పవన్ కళ్యాణ్ కు పువ్వులు నలపడం తప్ప ఇంకేమీ చాతకాదని అన్నారు. మరి ఇప్పుడు వీర్రాజు రైటా? యామిని రైటా?గతంలో చెగువీరా ఆదర్శం అంటూ విప్లవ వీరుడి గురించి చెప్పిన పవన్ కళ్యాణ్ ,కమ్యూనిస్టులను వదలి మళ్లీ బిజెపితో కలవడానికి డిల్లీ లో ఎందుకు పడిగాపులు పడవలసి వచ్చింది?ఆ తర్వాత ఆయన చేపట్టిన వివిధ కార్యక్రమాలకు బిజెపి ఎందుకు నో చెప్పింది? తెలంగాణలో కీలకమైన టైమ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన బిజెపికి కాకుండా టిఆర్ఎస్ కు ఓట్లు వేయండని ఎందుకు పిలుపు ఇచ్చారు.తనను బిజెపి అవమానించిందని పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పారు. దానికి తగినట్లే బిజెపి తెలంగాణ ముఖ్య అధికార ప్రతినిది కృష్ణసాగరరావు ఆయనను తీవ్రంగా విమర్శిస్తూ ప్యాకేజీ స్టార్ గా అబివర్ణించినా బిజెపి ఎపి శాఖ ఎందుకు ఖండించలేకపోయింది?అలాగే పవన్ టిఆర్ఎస్ అభ్యర్ది వాణిదేవీకి మద్దతు ఇవ్వడాన్ని సోము వీర్రాజు సమర్దిస్తారా?బిజెపిలో ముఖ్యమంత్రి అభ్యర్ధులు ఎవరూ లేరా అన్నదానికి కూడా సమాధానం చెప్పాలి కదా?కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అప్పటి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సి.ఎమ్. రేసులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. విభజన తర్వాత జరిగిన పరిణామాలలో కాంగ్రెస్ పక్షాన పోటీచేసి ఓడిపోయి బిజెపిలోకి వచ్చారే.అలాంటివారు కూడా సి.ఎమ్. పదవికి అర్హులు కారా?ఆమాటకు వస్తే ఎమ్మెల్సీగా కూడా ఉన్న అద్యక్షుడు సోము వీర్రాజుకు ఆ అర్హత లేదా?మూడేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియదు.ఇప్పుడు లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా పవన్ తమ సి.ఎమ్. అభ్యర్ధి అని చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి? తిరుపతిలో కాని,ఆయా చోట్ల కాని ఉన్న బలిజ ఓట్లను ఆకర్షించే ఉద్దేశంతోనే బిజెపి ఈ గేమ్ ఆడుతోందా?గత లోక్ సభ ఎన్నికలలో తిరుపతి నియోజకవర్గంలో బిజెపితో పాటు కాంగ్రెస్,జనసేన మద్దతు ఇచ్చిన బిఎస్పి వంటి పార్టీలకు నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. ఈసారి కూడా బిజెపి కాని కాంగ్రెస్ కాని డిపాజిట్ దక్కించుకుంటే గొప్ప అన్న పరిస్థితి ఉంది.అందుకోసమే ఈ తంటాలు పడుతున్నారా?ఎపి అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి ఒక సీటు కూడా రాలేదు. కాని జనసేనకు ఒక్క సీటు వచ్చింది. సు్నా కన్నా ఒకటి బెటర్ కదా అని బిజెపి భావిస్తోందా? పవన్ కళ్యాణ్ పోటీచేసిన రెండు చోట్ల ఓడిపోయారే.అయినా ఆయనపై వీర్రాజుకు అంత విశ్వాసం ఎలా ఏర్పడింది?తనకు ,పవన్ కు ఉన్న వ్యక్తిగత సంబందాల రీత్యా బిజెపిని పణంగా పెట్టి వీర్రాజు ఈ ప్రకటన చేశారా అన్నది కూడా ఆలోచించవలసిన అంశమే అవుతుంది.ప్రస్తుత బిజెపి నేతలు తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ప్రచారంలో పాల్గుంటుంటే జనం పెద్దగా రావడం లేదా?కనీసం సినీ నటుడు కూడా అయిన పవన్ కళ్యాణ్ ను వెంటబెట్టుకు తిరిగితే జనం ఆయనను చూడ్డానికి వచ్చినా చాలని వీరు భావిస్తున్నారా?తిరుపతి లో ప్రత్యేక హోదా తదితర హామీల అంశాలను ప్రజలు మర్చిపోవాలని కోరుకుంటున్న బిజెపి అందుకోసం పవన్ కళ్యాణ్ ను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నట్లుగా ఉంది.గత శాసనసభ ఎన్నికలలో బిజెపికి ఒక్క శాతం లోపు ఓట్లు వస్తే ,మున్సిపల్ ఎన్నికలలో రెండున్నర శాతం ఓట్లు వచ్చాయి. జనసేనకు శాసనసభ ఎన్నికలలో ఆరుశాతం ఓట్లు వస్తే ,మున్సిపల్ ఎన్నికలలో నాలుగున్నర శాతం ఓట్లే వచ్చాయి. రెండు పార్టీలు కలిస్తే ఈ ఓట్ల శాతం ఏమైనా పెరుగుతుందని వారు ఆశిస్తున్నారని అనుకోవాలి?ప్రదాన ప్రతిపక్షమైన తెలుగుదేశం ముప్పై శాతం ఓట్లు తెచ్చుకుని తన ఉనికిని కాపాడుకోవడానికి తంటాలు పడుతున్న తరుణంలో ఆ పార్టీ వారిని ఆకర్షించడానికి ఈ పాచిక ఏమైనా ఉపయోగపడుతుందా అన్న ఆశ కూడా కమలనాధులలో ఉండవచ్చు.కాని గత అసెంబ్లీ ఎన్నికలలో కన్నా రెండుశాతం ఎక్కువగా అంటే ఏభై రెండు శాతం ఓట్లు పొందిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ ను ఈ పార్టీలు ఎదుర్కునే అవకాశం తక్కువే. రాజకీయాలలో ఏమైనా జరగవచ్చన్నది ఒక నమ్మకం. అలాగని అన్నిసార్లు అనుకున్నవి జరగవు. జోగి,జోగి రాసుకుంటే బూడిద రాలుతుందన్నది ఒక సామెత. మరి బిజెపి,జనసేన పార్టీలు కలిస్తే ఏమి అవుతుందో చూడాల్సిందే.

tags : bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info