A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలుగుదేశం ను ఆయనే ముంచేసుకున్నారా
Share |
April 19 2021, 5:31 pm

ఆడలేక మద్దెల ఓడు అన్నది సామెత. ప్రతిపక్ష నేత ,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎపిలో జడ్పిటిసి ,ఎమ్.పి.టి.సి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన సందర్భంలో చేసిన విమర్శలు, వ్యాఖ్యలు చూస్తే ఆ సామెత కరెక్టు అనిపిస్తుంది.రాజకీయాలలో కుటిలత్వం, కుట్ర ఆలోచనలు ఎలా ఉంటాయో మరోసారి రుజువు చేశారు. గత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జడ్పిటిసి ఎన్నికలను ,ఎమ్.పిటిసి ఎన్నికలను పెట్టకుండా పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నిలు నిర్వహించడంలోని ఆంతర్యం ఏమిటో అర్ధం అవుతోంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై అదికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసినప్పుడు తీవ్ర అభ్యంతరం చెప్పి, రాజ్యాంగ సంస్థలను అవమానిస్తారా?వాటిపట్ల గౌరవం ఉంచరా అంటూ ప్రశ్నలు వేసిన చంద్రబాబునాయుడు,ఇప్పుడు స్వయంగా ఎన్నికల కమిషనర్ నీలం సహానిపై తీవ్ర విమర్శలు చేశారు.ఆమె పదవికోసం కర్కుర్తి పడ్డారని, ముఖ్యమంత్రి రబ్బర్ స్టాంప్ అని ,నేరస్తులు ,పోలీసు రాజీపడుతున్నారని ఇలా రకరకాల ఆరోపణలు చేశారు.చంద్రబాబు ఎప్పుడు ఏమైనా మాట్లాడగలరని నిరూపించుకున్నారు.పంచాయతీ ఎన్నికలలో, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలలో దారుణమైన పరాజయం చవిచూసిన తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఎన్నికల కమిషనర్ ను అడ్డు పెట్టుకుని జడ్పిటిసి, ఎమ్.పి.టి.సి ఎన్నికలు నిర్వహించకుండా చూశారు. అప్పట్లో కరోనా అదికంగా ఉందని, ఎన్నికలు వద్దంటే వైఎస్ ఆర్ కాంగ్రెస్ భయపడుతోందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు చివరికి ఎన్నికలను బహిష్కరించాలని దయనీయమైన నిర్ణయం తీసుకున్నారు. నిజానికి గత ఏడాది మార్చి పదిహేనున నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేసినప్పుడు ,ఎక్కడ ఆగాయో, అక్కడ నుంచే ఆరంభిస్తామని చెప్పారు. కాని దానిని ఆయన పాటించలేదు.పోని అన్ని ఎన్నికలను పూర్తి చేశారా అంటే కావాలని జడ్పిటిసి, ఎమ్.పిటిసి ఎన్నికలు పెట్టకుండా చేతులెత్తేశారు.అప్పట్లో నోరు విప్పని చంద్రబాబు నాయుడు ,కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సహాని బాద్యతలు స్వీకరించిన రెండో రోజే విమర్శల వర్షం కురిపించడం ద్వారా చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు మరోసారి ప్రజలకు తెలియచెప్పారు. అసలు చంద్రబాబు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? పార్టీ గుర్తుతో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ఘోర పరాజయం తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. ముఖ్యంగా విజయవాడ,గుంటూరు కార్పొరేషన్ లపై ఆయన పెద్ద ఆశలు పెట్టుకున్నారు. అక్కడి ప్రజలు దూషణల ద్వారా రెచ్చగొట్టే యత్నం చేశారు.అయినా ప్రజలు ఆయన పార్టీకి మద్దతు ఇవ్వలేదు.ఇప్పుడు మండల, జడ్పి ఎన్నికలలో అంతకన్నా భిన్నమైన ఫలితం రాదని ఆయనకు అర్ధం అయింది. ప్రభుత్వంపై వీలైనంత బురదచల్లడం ద్వారా రాజకీయంగా ఎన్నికలలో లేకుండా తప్పించుకునే వ్యూహాన్ని ఆయన ఎంపిక చేసుకున్నారు. లేస్తే మీ అంతు చూస్తానంటూ బెదిరించిన రీతిలో మేం పోటీలో ఉంటే మీ సంగతి చూసేవారం అని చెప్పుకోవడానికి ఆయన ఇలా చేశారని అనుకోవాలి. అంతేకాక అనేక చట్ల సొంత పార్టీ అభ్యర్ధులు గత ఏడాది కాలంలో టిడిపికి గుడ్ బై చెప్పారట. ముఖ్యమంత్రి జగన్ స్కీములతో జనంలో వైసిపికి పెరిగిన అభిమానం గమనించి వారు టిడిపి పక్షాన పోటీలో కొనసాగినా ఉపయోగం లేదని భావిస్తున్నారట. ఈ విషయాలను చంద్రబాబు చెప్పలేరు. అందుకే ఏదో రకంగా జగన్ ప్రభుత్వాన్ని విమర్శించి తప్పుకుంటే బెటర్ అని అనుకున్నారు. ఎన్నికలలో పాల్గొంటే ప్రచారానికి వెళ్లవలసి వస్తుంది. అది శ్రమతో పాటు వ్యయ ప్రయాసలతో కూడినది. అభ్యర్ధులు ఆయనను ఎన్నికల ప్రచారానికి డబ్బు పంపాలని అడుగుతారు.ఇప్పుడు ఆ గొడవ ఏమీ ఉండదు. డబ్బు ఖర్చు చేస్తే గెలుస్తామని అనుకుంటే చంద్రబాబు ఏ మాత్రం వెనుకాడరు.అది లేదు కాబట్టే ఆయన ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంపై రౌడీయిజం అని, పోలీసుల దౌర్జన్యం అని ఆరోపణలు గతంలో కూడా చేశారు.అయినా మున్సిపల్ ఎన్నికలను ఎందుకు బహిష్కరించలేదు. చివరిలో నిమ్మగడ్డ ఎన్నికలు సజావుగా జరిగాయని, ఒక రీపోలింగ్ కూడా లేకుండా పూర్తి అవడం ఒక రికార్డు అని చెప్పారు. ఎన్నికలు పద్దతిగా జరిగాయని, టిడిపి పక్షాన గెలిచిన ఏకైక మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకరరెడ్డి స్వయంగా చెబుతూ ముఖ్యమంత్రి జగన్ ను హాట్సాఫ్ అని మెచ్చుకున్నారే. దానికి చంద్రబాబు సమాదానం చెప్పగలరా?నిజంగానే దౌర్జన్యాలు,రౌడీయిజం జరిగితే జెసి ప్రభాకరరెడ్డి గెలవగలుగుతారా? మున్సిపల్ ఎన్నికలు ముగియగానే నిమ్మగడ్డ ఎన్నికల కోడ్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించగానే విషయం తెలిసిపోయింది. ఏదో కుట్ర జరుగుతోందని.సరిగ్గా అదే జరిగింది. ఆయన జడ్పి,మండల ఎన్నికలు పెట్టకుండా ఆపేయడం, కొత్త కమిషనర్ రాగానే నోటిఫికేషన్ ఇవ్వడంతోనే చంద్రబాబు నాలుగు వారాల ఎన్నికల కోడ్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించడం , నీలం సహానిపై కూడా చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం చేశారు.ఒకవైపు ఈ ఎన్నికలు మొదటి నుంచి పెట్టాలంటూ హైకోర్టుకు వెళ్లడం, అక్కడ తీర్పు రాకుండానే బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటించడం గమనించదగిన అంశమే. గత ఏడాది మార్చిలో నిమ్మగడ్డ ద్వారా ఎన్నికలను వాయిదా వేయించినప్పుడు చంద్రబాబు,ఇతర ప్రతిపక్ష రాజకీయ నేతలు కొందరు చాలా సంబర పడ్డారు.కాని అదే వాళ్లను నిండా ముంచింది. ఆ తర్వాత ఏడాదికాలం పాటు వైసిపి ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజల ఖాతాలలోకి వెళ్లాయి.అలాగే ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, వైసిపి నేతలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అవన్ని అదికార పక్షానికి ప్లస్ అయ్యాయి. దాంతో తెలుగుదేశం కు దిక్కుతోచని పరిస్తితి ఏర్పడింది. అయినా నిమ్మగడ్డ ద్వారా తమ వ్యూహాన్ని అమలు చేయవచ్చని భావించి పంచాయతీ ,మున్సిపల్ ఎన్నికలు పెట్టించినా ప్రయోజనం దక్కలేదు. దాంతో ఇప్పుడు చంద్రబాబు రకరకాల ఆరోపణలు చేసి ఎన్నికల రంగం నుంచి వైదొలిగారు.దీనివల్ల తెలుగుదేశం పార్టీ క్యాడర్ కు ఆయన చాలా తప్పుడు సంకేతం ఇచ్చారు.గతంలో అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సమితులు ఉండేవి. అప్పుడు ఎన్నికలు జరిగాయి. వాటిని ఆయన పార్టీరహితంగా నిర్వహించి గెలిచినవాళ్లందరూ తమ వారే అని అన్నారు.ఆ సమయంలో అతి తక్కువ మంది ప్రతిపక్ష పార్టీల తరపున గెలిచారు. అయినా ప్రతిపక్షాలు పోటీలో నుంచి తప్పు కోలేదు.కాని చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల క్షేత్రం నుంచి పలాయనం చిత్తగించడం ద్వారా తెలుగుదేశం పార్టీని ఆయనే ముంచేసినట్లయిందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆరోపణలు చేస్తూ రాజకీయం చేయడం వేరు.అసలు ఎన్నికల గోదా నుంచి పారిపోవడం వేరు. సాధారణంగా ఎన్నికల సమయంలో డీ అంటే ఢీ అనే పరిస్థితి లేకపోతే ఘర్షణలు,గొడవలు ఉండవు. అంటే ప్రజలలో ఉన్న వాతావరణాన్ని బట్టి రెండో పక్షం వెనక్కి తగ్గుతుంది. ఏ మాత్రం గెలిచే అవకాశం ఉందన్నా పార్టీ కార్యకర్తలు సహజంగానే తెగించి పోరాడతారు.తెలుగుదేశం అలా పోరాడే పరిస్థితి లేదు.అందుకే చంద్రబాబు బహిష్కరణ వ్యూహంలోకి వచ్చారు.గెలిచినా ,ఓడినా ఎన్నికల బరిలో ఉంటే ఎక్కడ బలం, ఎక్కడ బలహీనత ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది.అలాకాకపోతే మొత్తం గ్రౌండ్ అంతా ఎదుటి పక్షానికి వదలివేసినట్లవుతుంది. చంద్రబాబు ఇప్పుడు అదే పనిచేశారు.తెలుగుదేశం పార్టీని ఈ నిర్ణయం ద్వారా చంద్రబాబు సుడిగుండంలోకి తోశారా?లేక తెలివైన పనిచేశారా అన్నది కాలమే తేల్చుతుంది.

tags : tdp, boycott

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info