A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నిమ్మగడ్డకు ఆ గౌరవం దక్కిందా!
Share |
April 19 2021, 5:38 pm

ఏ ప్రభుత్వ అధికారి అయినా, లేక ఏ ఎన్నికల కమిషనర్ అయినా తాను రిటైర్ అవుతున్న రోజున అందరి అభినందనలతో ,ప్రశంసలతో బాద్యతల నుంచి వైదొలగాలి. కాని ఎపికి ఐదేళ్ల పాటు ఎన్నికల కమిషనర్ గా వ్యవహరించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఆ గౌరవం దక్కినట్లు కనిపించడం లేదు. చివరికి రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆయనకు అప్పాయింట్ మెంట్ ఇవ్వడానికి నిరాకరించారంటేనే పరిస్తితి అర్ధం చేసుకోవచ్చు. ఇదే సమయంలో ఆయన మీడియాతో కొంత పద్దతిగానే మాట్లాడినట్లు కనిపించినా, ఆయన లోపల మరో మనిషి ఉన్నాడని అర్దం చేసుకోవడం కష్టం కాదు.అందుకే సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఈయన నివేదికను తిరుగుబోతు బ్రహ్మచర్యం గురించి రాసినట్లుగా ఉందని ఎద్దేవ చేశారు. నిమ్మగడ్డ గవర్నర్ కు పంపిన ఒక నివేదికలో చేసిన సిఫారస్ లలో మెజార్టీ ఆయన పాటించనవే. ఎన్నికల కమిషనర్ నియామకానికి ఒక కొలిజియం ఉండాలని అన్నారు. అంటే ఒక కమిటీ వంటిదన్నమాట. నిజంగానే అది ఉన్నట్లయితే ఈయనకు అవకాశం వచ్చేది అనుమానమే. అప్పటి గవర్నర్ నరసింహన్ ద్వారా ఈయన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తెచ్చి ఈ పదవి సంపాదించారు.ఇది కాదనలేని సత్యం. తన అవసరం తీరిపోయింది కాబట్టి ఇప్పుడు కొలిజియం కావాలని అంటున్నారనుకోవాలి.స్తానిక ఎన్నికలు 15రోజులలో పూర్తి అయ్యేలా ఇక్కడ చట్టం మార్చారని, అందులో పారదర్శకత ఉండడం లేదని, అందువల్ల దానిని పాత పద్దతిలో 21 రోజులు చేయాలని ఆయన సూచించారు. ఆ మేరకు అభ్యర్దుల ఖర్చు, ప్రలోభాలు పెరుగుతాయన్న సంగతి కమిషనర్ గా పనిచేసిన రమేష్ కుమార్ కు తెలియదా?మున్సిపల్ ఎన్నికలలో ,చివరికి పంచాయతీ ఎన్నికలలో కూడా ఈవిఎమ్ లు ప్రవేశ పెట్టాలని ఆయన మరో సూచన చేశారు. ఈ మాట తాను అధికారంలో ఉన్నప్పుడు చెప్పి ఉండాల్సింది. టిడిపి అదినేత చంద్రబాబు వంటివారు ఈవిఎమ్ లు మార్చేశారని గతంలో ఆరోపించారు. ఆచరణలో పంచాయతీ ఎన్నికలలో అన్ని వేల ఈవిఎమ్ లు సాద్యమేనా అన్నది పరిశీలించాలి.చట్టసభలకు జరుగుతున్న విధంగా నిర్దిష్ట గడువులోగానే స్థానిక ఎన్నికలు జరపాలని ఆయన సూచించారు. ఇది మంచిదే. కాని మరి తానే 2018లో పెట్టవలసిన ఎన్నికలను ఎందుకు పెట్టలేకపోయారో వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది కదా!అప్పట్లో చంద్రబాబు పెట్టవద్దంటే ఆగిపోయిన నిమ్మగడ్డ ఇప్పుడు ఈ సిఫారస్ చేస్తే ఏమి ఉపయోగం.గడువులోగా ఎన్నికలు జరపలేపోతే పర్సన్ ఇన్ చార్జీలను ఎన్నికల కమిషనర్ అనుమతితోనే నియమించాలని ఆయన అంటున్నారు. గత ప్రభుత్వం టైమ్ లో ఆయన ఆ ప్రతిపాదన పంపితే దానికి అర్దం ఉండేది.రాష్ట్ర ఎన్నికల సంఘానికి పూర్తిగా ఆర్దికంగా, సంస్థాగతంగా స్వయం ప్రతిపత్తి ఉండాలని అంటున్నారు. కాని ప్రతిదానికి ప్రభుత్వంపై హైకోర్టు, ఆ మీదట సుప్రింకోర్టుకు వెళ్లే పరిస్తితి వస్తే ప్రభుత్వ డబ్బుతోనే ప్రభుత్వాన్ని కోర్టుల ద్వారా బదనాం చేసే పరిస్థితి కావాలని ఆయన కోరుకుంటున్నారా?పైగా ఒక నెల రోజుల ఎన్నికల నిర్వహణ ,ఎప్పుడైనా అవసరమైన ఉప ఎన్నికలు మినహాయిస్తే ఈ పదవిలో ఉన్నవారికి పెద్దగా పని కూడా ఉండదు. అలాంటి సంస్థలు తమకు కావాల్సిన ఆర్దిక వనరులను ప్రభుత్వంతో సంప్రదించి తెచ్చుకోవచ్చు.అలా కాకుండా ఆర్దికంగా స్వతంత్రంగా ఉంటే ఏమి ఉపయోగమో తెలియదు.నిజానికి మీడియా సమావేశంలో కనుక రమేష్ కుమార్ నిజాయితీగా తాను తిరిగి పదవి పొందడానికి గాని, ఆ తర్వాత వివిధ సందర్భాలలో కాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులలో కేసులు వేయడానికి ఎంత ఖర్చు చేసింది, వాటిని ఆయన ఎలా భరించింది చెప్పగలిగి ఉంటే ఆయన చిత్తశుద్ది బయటపడేది. ఉదాహరణకు హరీష్ సాల్వే వంటిపెద్ద లాయర్లకు కోట్లలో పీజులు ఉంటాయట. వాటిని ఈయనే భరించారా?లేక ఇంకెవరైనా చెల్లించారా?అన్నది రహస్యంగానే ఉండిపోయింది. హైదరాబాద్ లో ఆయన టిడిపి నుంచి బిజెపి లో చేరిన సుజనా చౌదరి, మరో బిజెపి నేత కామినేని శ్రీనివాస్ లను ఎందుకు సీక్రెట్ గా కలిశారో వివరణ ఇవ్వగలిగితే ఆయనకు క్రెడిట్ వచ్చేది. అంతేకాదు.ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన, ప్రభుత్వంపైన అనేక చెత్త ఆరోపణలు చేస్తూ కేంద్రానికి పంపిన లేఖ గురించి ముందు తాను రాయలేదని ఎందుకు చెప్పారు? ఆ తర్వాత తానే రాశేనని ఎందుకు ప్రకటించారు. ఇందులో ఉన్న మతలబు ఏమిటో ఆయన వెల్లడి చేసి ఉంటే ప్రజలకు ఆయన నిజాయితీ అర్దం అయ్యేది.ప్రభుత్వంతో కావాలని సున్నం పెట్టుకోవడం ఎన్నికల కమిషనర్ కు మంచిదేనా?జగన్ కేసులను ప్రస్తావించి తాను సాక్షినని ఒకసారి, వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప ముఖ్యమంత్రి అని మరోసారి వ్యాఖ్యానించడం రాజకీయం అవుతుందా?కాదా? కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పుడు కనీసం ప్రభుత్వాన్ని సంప్రదించకుండా వాయిదా వేయడం ఎలా కరెక్టు అవుతుంది? తదుపరి వేలాది కేసులు ఉన్నప్పుడు ఎలా ఎన్నికలు నిర్వహించడానికి సిద్దపడ్డారు.తెలుగుదేశం మీడియా ఆయనను శేషన్ అని, అదని, ఇదని ఆకాశానికి ఎత్తి డాం న కింద పడేశారు.తెలుగుదేశం పార్టీకి ఎంత సహకరించినా చివరికి చంద్రబాబు నాయుడు సైతం ఈయనను విమర్శించారే.రమేష్ కుమార్ సమర్దంగా ఎన్నికలు నిర్వహించారని ఒక్క టిడిపి నేత అయినా, టిడిపి మీడియా అయినా ఒప్పుకుందా?పైగా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి గాను మద్యలో నిమ్మగడ్డపై కూడా విమర్శలు చేశారే. అంటే నిమ్మగడ్డను వాడుకుని వదలివేశారనే కదా అర్దం. తెలుగుదేశం లేదా మరే శక్తి చెప్పందేనే జడ్పిటిసి, ఎమ్.పిటిసి ఎన్నికలు కాకుండా పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలను ఆయన నిర్వహించారు. తదుపరి జడ్పిటిసి, ఎమ్.పిటిసి ఎన్నికలు పెట్టలేనని ఎందుకు చేతులెత్తేశారు?అయితే ఈయన ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు ఒక మేలు జరిగింది. ఈయన టైమ్ లో పంచాయతీ ,మున్సిపల్ ఎన్నికలు జరగడం , వాటిలో వైసిపి ఘన విజయం సాధించడంతో ఆ పార్టీకి క్రెడిట్ వచ్చినట్లయింది.దాంతో ప్రతిపక్షాలకు తల తిరిగినంత పనైంది. ఏది ఏమైనా నిమ్మగడ్డ వ్యవహారం అటు ప్రభుత్వంలోని వారికి, ఇటు రాజకీయ పక్షాలకు కొన్ని పాఠాలు నేర్పిందని చెప్పాలి. కొత్త కమిషనర్ గా మాజీ సి.ఎస్.నీలం సహాని చేపట్టారు. ఆమె ఎలాంటి వివాదాలు లేకుండా మిగిలిన ఎన్నికలు నిర్వహిస్తారని ఆశిద్దాం.

tags : nimmagadda

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info