A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు పెడితే జనం చెవుల్లో పూలు...
Share |
July 31 2021, 5:01 am

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏదైనా మాట్లాడగలరు. ఆయన మాట్లాడింది తనకే తగులుతుందన్న బాధ కూడా ఆయనకు ఉండదు. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాం్ ప్రైవేటీకరణ అంశం ఆధారంగా రాజీకీయం నడపాలని చంద్రబాబు విశ్వయత్నం చేస్తున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో దాని ప్రభావం పడేలా చేసుకోవడం ద్వారా ఎంతో కొంత రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. విశేషం ఏమిటంటే ఆయన ముఖ్యమంత్రి జగన్ పై ఎలాంటి పిచ్చి ఆరోపణల చేసినా తెలుగుదేశం కు మద్దతు ఇచ్చే ప్రధాన పత్రిక ఒకటి ప్రముఖంగా ప్రచురించి తన స్వామి భక్తిని ప్రదర్శిస్తుంటుంది. జగన్ పై ఉన్న కేసుల మాఫీకే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై మౌనంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. ఏమైనా అర్దం ఉందా? గతంలో కాంగ్రెస్ తో కలిసి కేసులు పెట్టించి, పదహారు నెలలపాటు నిర్భంధంలో ఉంచినా, జగన్ బయటకు వచ్చాక ఒకసారి అధికారం చేపట్టకపోయినా, తిరిగి 2019లో అదికారంలోకి రావడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు.అందువల్లే జగన్ పైన, ఆయన ప్రభుత్వం పైనా చంద్రబాబు ఎలాంటి పిచ్చి ప్రకటనలకైనా సిద్దపడుతున్నారు. జగన్ పై ఉన్న కేసులు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉన్నాయి. కేంద్రంతో రాజీపడితే కోర్టులు ఆ కేసులు కొట్టివేస్తాయని చంద్రబాబు చెబుతున్నారా?ఏ రకంగా కేంద్రం ఆ కేసులను మాఫీ చేస్తాయో చెప్పకుండానే, ఏదో ఒక ఆరోపణ చేసి ప్రజలను మభ్య పెట్టాలని ఆయన ప్రయత్నిస్తుంటారు. నిజంగానే చంద్రబాబుకు ఈ విషయంలో చిత్తశుద్ది ఉంటే ముఖ్యమంత్రికి విశాఖ స్టీల్ విషయంలో తగు సలహాలు ఇవ్వవచ్చు. లేదా నిర్దిష్ట ప్రతిపాదనలు చేయవచ్చు. అవేమీ చేయకుండా జగన్ ఏదో ద్రోహం చేసినట్లు ప్రచారం చేయడంలోనే కుట్ర ఉంది.నిజానికి ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన వెంటనే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు.అందులో ప్రైవేటీకరణను వ్యతిరేకించారు.అలాగే నాలుగు రకాలైన ప్రత్యామ్నాయాలను సూచించారు. అందులో అవసరమైతే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పెట్టుబడి పెడుతుందని ప్రతిపాదించారు.ఇంత చేసిన వ్యక్తి ద్రోహం చేసినట్లు అట.ఇంతవరకు ప్రధాని మోడీకి స్టీల్ ప్లాంట్ విషయమై చాలా ఆలస్యంగా ఉత్తరం రాస్తే చంద్రబాబు ప్రజలకు మేలు చేసినట్లు అట. నిజానికి గతంలో బిజెపితో కలిసి ఉన్నప్పుడు ప్రస్తుత ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో చంద్రబాబుకు సన్నిహిత సంబందాలు ఉన్నాయని ప్రచారం ఉంది. అయినా చంద్రబాబు కనీసం ధర్మేంద్ర ప్రధాన్ కు అయినా ఎందుకు ఉత్తరం రాయడం లేదో తెలియదు.నిజానికి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కేంద్రం అన్నా, ప్రధాని మోడీ అన్నా తీవ్రంగా భయపడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడే. బిజెపి వారు ఆయనను ఎంత తీవ్రంగా విమర్శించినా,నోరు విప్పి తాను సమాధానం ఇవ్వడం లేదు. తన పార్టీవారితోను ఎదురు విమర్శలు చేయించలేకపోతున్నారు. దానికి కారణం ఆయన పిఎపై గత ఏడాది జరిగిన ఐటి దాడులేనన్న సంగతి అందరికి తెలిసిందే. రెండువేల కోట్ల రూపాయల విలువైన అక్రమాలు జరిగాయని అప్పట్లో సిబిటిడి నేరుగానే ప్రకటించింది. ఆ కేసు ఏమైందో కాని, ఆ తర్వాత చంద్రబాబు గప్ చిప్ అయిపోయారు. 2019 ఎన్నికల ముందు మోడీని ఎంత దారుణంగా చంద్రబాబు దూషించారో తెలుసు. మరి అలాంటి శూరుడు చంద్రబాబు ఇప్పుడు ప్రైవేటీకరణ విషయంలో మోడీని ఒక్క మాట అనకుండా ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించడంలోని ఆంతర్యం అర్ధం చేసుకోవడం కష్టం కాదు. ఈయన తరహానే అలా ఉంటుంది. గతంలో రాష్ట్ర విభజన సమయంలో ఒకటికి రెండుసార్లు విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు.అలాంటి లేఖలు ఇవ్వవద్దని ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికాని, కొందరు టిడిపి నేతలు కాని పలుమార్లు సూచించినా పట్టించుకోకుండా లేఖలు ఇచ్చారు. విభజన జరిగిన తర్వాత విభజన కు కారణం జగన్ అని చిత్రమైన అబద్దపు ప్రచారాన్ని చంద్రబాబు తీసుకు వచ్చారు. కెసిఆర్, జగన్ ల కోసమే విభజన జరిగిందని, సోనియాగాందీని కూడా దెయ్యం అంటూ ఇంకా ఏవేవో అంటూ విమర్శలు చేశారు. 2019 ఎన్నికల ముందు మోడీ అంటే జగన్ భయపడుతున్నారని, తాను మాత్రమే పోరాడుతున్నానని ప్రచారం చేసుకునేవారు.మోడీని నానారకాలుగా దూషించేవారు.అలాంటి చంద్రబాబు ఎన్నికలలో ఓటమి తర్వాత నోరు విప్పి మోడీ గురించి విమర్శించడం సంగతి అటుంచి,అవకాశం వస్తే మోడీని ఆకాశానికి ఎత్తుతూ పొగుడుతున్నారు. ప్రజలు పిచ్చివాళ్లని చంద్రబాబు నమ్మకం. ఆయన ఏమి చేసినా చెల్లుతుందని ఆయన భావన. దారుణమైన అపజయం తర్వాత కూడా ఆయన లో మార్పు రావడం లేదు. నిజాయితీగా మాట్లాడడం కాని, వాస్తవాలు చెప్పడం కాని,హేతుబద్దంగా మాట్లాడడం కాని ఆయన చేయలేకపోతున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా ఇదే ఆయనకు అలవాటైపోయింది. ఆయనలో మార్పు వస్తుందని ఆశించడం అనవసరమే.తాజాగా స్టీల్ ప్లాంట్ విషయంలో పోస్కో కంపెనీ వారిని జగన్ కలిశారంటూ ప్రచారం మొదలు పెట్టారు. విశేషం ఏమిటంటే దక్షిణ కొరియాకు పలుమార్లు టూర్ చేసింది, అప్పట్లో పోస్కో కంపెనీతో సహా పలు కంపెనీలవారితో మాట్లాడి పెట్టుబడులు వచ్చేస్తున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది చంద్రబాబే. అంతేకాదు. అప్పట్లో దక్షిణ కొరియాకు చెందిన సామ్ ఉల్ డంగ్ రాసిన ఒక పుస్తకం ఆధారంగా జన్మభూమి కార్యక్రమాలను తెచ్చానని చెప్పింది ఆయనే .నిజానికి పారిశ్రామికవేత్తలను కలవడం తప్పు కాదు.కాని తాను కలిస్తే రైటు,ఎదుటివారు కలిస్తే రాంగ్ అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడడమే శోచనీయం.ఎపి నుంచి పారిశ్రామికవేత్తలను తరిమేశారని మొన్నటి వరకు ఒక అసత్య ప్రచారం సాగించారు. ఇప్పుడేమో పారిశ్రామికవేత్తలను జగన్ కలిశారంటూ దానికి విరుద్దమైన ప్రచారం ఆరంభించారు. ఈ రకంగా పరస్పర విరుద్దంగా మాట్లాడడం, వ్యవహరించడం వల్లే తెలుగుదేశం పార్టీ ప్రజలలో బాగా పలచన అయింది. ఆ విషయాన్ని ఆయన విస్మరిస్తున్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికలలో ఎంతో కొంత ప్రభావం చూపి,తన అబద్దపు ప్రచారాన్ని జనం నమ్మి కొన్ని ఓట్లు అయినా పడకపోతాయా అన్నది ఆయన ఆశకావచ్చు. కాని మున్సిపల్ ఎన్నికలు వేరు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశం వేరు. కచ్చితంగా ఇది ప్రజల సెంటిమెంట్ గా ఉన్న మాట నిజమే అయినా, మున్సిపల్ ఎన్నికలలో దీని ప్రభావం ఉండకపోవచ్చు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో,రాష్ట్రంలో అదికారంలో ఉన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి. అందువల్ల ఏ పార్టీ ఓట్లు వారికే పడతాయని అర్దం చేసుకోవాలి. చంద్రబాబు ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుని ఇంత ఆలస్యంగా ఎందుకు ఉత్తరం రాశారో చెప్పాలి.లేకుంటే ఆయన చెప్పే మాటలను నమ్మడానికి జనం చెవుల్లో పూలు పెట్టుకుని లేరన్న సంగతి గుర్తించాలి.

tags : chandrabavbu, public

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info