A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖ స్టీల్ ఆందోళన-చంద్రబాబు వైఖరి
Share |
March 7 2021, 10:34 am

ఎపి ప్రతిపక్ష నేత,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు సంబందించిన ఒక వీడియో వైరల్ అయింది. విశాఖపట్నంలో జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతుండగా ఒక కార్యకర్త ప్రధాని మోడీని ఉద్దేశించి మోడీ డౌన్,డౌన్ అని నినదించారు. వెంటనే చంద్రబాబు నాయుడు అతనిని వారించిన సన్నివేశం అది. అంతేకాక తాను వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడడం లేదని ఆయన ఏదో వివరణ ఇస్తున్నట్లు కనబడుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్యాక్టరీ ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకంగా జరిగిన సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. విశాఖ స్టీల్ ఆధారంగా ఉత్తరాంద్రలో కోలుకోవాలని, విశాఖ కార్పొరేషన్ ఎన్నికలలో రాజకీయ లబ్ది పొందాలని ఆయన చేస్తున్న ప్రయత్నం ఇది అని అర్దం అవుతుంది. అదే సభలో ముఖ్యమంత్రి జగన్, వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిలను చంద్రబాబు నాయుడు నోటికి వచ్చినట్లు దూషించారు. వీరిపై కాలు దువ్విన చంద్రబాబు నాయుడు అదే మోడీ విషయానికి వచ్చేసరికి కిక్కురుమనకుండా ఉండడం గమనించవలసిన అంశమే. గత శాసనసభ ఎన్నికల ముందు మోడీపై తానే యుద్దం చేస్తున్నానని, మోడీ ఒక టెర్రరిస్టు అని, ఆయనకు కుటుంబం లేదని ..ఇలా ఎన్నో వ్యక్తిగత విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆయన పేరు ఎత్తడానికే భయపడుతున్నారని ఇట్టే తెలిసిపోతుంది.స్లీట్ ప్లాంట్ విషయమై అధికార పక్షం ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తాము కూడా సిద్దమని ఆయన తెలివిగా చెబుతున్నారు. ఎలాగొలా మళ్లీ ఎన్నికలు వస్తే ఏమైనా కోలుకుంటామా అన్న ఉద్దేశంతో చంద్రబాబు ఈ మాటలు చెబుతున్నారు కాని,నిజంగానే ఆయనకు చిత్తశుద్ది ఉందా అన్నది సంశయమే.ఎందుకంటే గత టరమ్ లో ప్రత్యేక హోదా విషయమై వైసిపి ఎమ్.పిలు తమ పదవులకు రాజీనామా చేస్తే, టిడిపి ఎమ్.పిలతో రాజీనామా చేయించలేదు. అంతేకాక రాజీనామా చేసిన ఎమ్.పిలను తప్పుపట్టేవారు. నిజానికి గతంలో 1967 ఎన్నికలకు రెండు,మూడు నెలలకు ముందు వామపక్షాల ఎమ్మెల్యేలు, మరికొందరు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాజీనామా చేశారు.వారిలో ప్రముఖులైన తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రభుత్వపరంగా కృషి జరుగుతోందని, రాజీనామాలు వద్దని వారించినా వారు ఒప్పుకోలేదు. కాని ఇప్పుడు చంద్రబాబు మాత్రం అదికార పక్షం రాజీనామా చేయాలని అంటున్నారు. ఇప్పటికే టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. మరి ఆయన రాజీనామా ఆమోదం పొందుతుందా?లేదా అన్నది ఇంకా తెలియదు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ దానిపై తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఒకవైపు ఒక టిడిపి ఎమ్మెల్యే రాజీనామా చేసి స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు పలికితే, మరి ఉత్తరాంద్రలో ఉన్న మరో నలుగురు ఎమ్మెల్యేలు రామకృష్ణబాబు, గణబాబు, అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్ లు ఎందుకు రాజీనామా చేయలేదో తెలియదు. పోని పార్టీపరంగా రాజీనామా చేయాలని అనుకుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఇతర ఎమ్మెల్యేలు మొత్తం అందరు కలిసి రాజీనామా చేయడం ద్వారా తమ నిరసనను తెలియచేయవచ్చు కదా!ఆ పని చేయకపోగా ఎదురు అధికారపక్షం రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం తమాషాగానే ఉంది. ఆ మధ్య ప్రతిసారి ఏ వివాదం వచ్చినా, మూడు రాజధానుల అంశం అయినా,చంద్రబాబు డిమాండ్ చేసేది వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా చేసి ఎన్నికలకు సిద్దం కావాలని.ఇప్పుడు కూడా చంద్రబాబు అదే తరహాలో మాట్లాడుతున్నారు.ఇంతకీ గంటా శ్రీనివాసరావు రాజీనామా తమ ఆమోదంతో జరిగిందో, లేదో చంద్రబాబు నాయుడు చెప్పడం లేదు.నిజానికి ఇలాంటి ఉద్యమాలలో లేదా నిరసనలలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తుంటారు. ఇక్కడ టిడిపి వారు రాజీనామా చేయాలని నేను అనడం లేదు .కాని చంద్రబాబు, అచ్చెన్నాయుడు వంటివారు అతి తెలివిగా అందరం కలిసి రాజీనామా చేయాలని అనడంలోని ఆంతర్యం అర్ధం చేసుకోవడం కష్టం కాదు.ఎమ్మెల్యేలు రాజీనామా చేసినందువల్ల ఈ సమస్య పరిష్కారం అయిపోతుందని అనుకోవడానికి లేదు. ఆ మాటకు వస్తే పార్లమెంటు సభ్యులు ముఖ్యంగా లోక్ సభ సభ్యులు రాజీనామా చేస్తే కేంద్రంపై కొంత ప్రభావం పడవచ్చు. ఆ విషయం చంద్రబాబుకు తెలియనిది కాదు. కాని ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చంద్రబాబు ఆ సాహసం చేయలేరు.ఎందుకంటే నిజంగానే ఎన్నికలు జరిగితే టిడిపి మళ్లీ తన స్థానాలను నిలబెట్టుకుంటుందో ,లేదో అన్న భయం ఉంటుంది.పైకి మాత్రం మేకపోతు గాంభీర్యంగా ప్రకటనలు చేస్తుంటారు. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తుంటారు. అలాకాకపోతే అధికారపక్షం రాజీనామా చేసి ఎన్నికలలో మళ్లీ గెలవాలని ఆయన సవాల్ చేస్తుంటారు.అదెందుకు టిడిపి ఎమ్మెల్యేలు రేపల్లె, విజయవాడ తూర్పు, అద్దంకి, పర్చూరు, కొండపి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించో, లేక తాను ప్రతిపక్ష నేత కనుక తన నియోజకవర్గం అయిన కుప్పం అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయడం ద్వారా సవాలు విసరవచ్చు కదా అంటే దాని గురించి నోరెత్తరు. తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మూడుసార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలలో పోటీచేశారు. ఒకసారి అయితే టిఆర్ఎస్ బాగా దెబ్బతిని రాజీనామా చేసిన సీట్లన్నిటిని గెలుచుకోలేకపోయిన సందర్భం కూడా ఉంది.అయినా టిఆర్ఎస్ రాజీనామాలకు వెనుకాడలేదు.అలాగే టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూడా ఒకే టరమ్ లో రెండుసార్లు ఎమ్.పి పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీచేసి గెలిచి రికార్డు సృష్టించారు. ఇలా ఎన్నో ఉదాహరణలు మన కళ్లముందు కనిపిస్తాయి. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఇలాంటి రాజీనామాలు చేసి అధికార పక్షానికి సవాళ్లు విసురుతుంటారు. కాని చంద్రబాబు తీరు మాత్రం అందుకు భిన్నంగా రివర్స్ లో ఉంటుంది. ఆయన ప్రతిదానికి ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి , విజయసాయిరెడ్డిని ఉద్దేశించి దూషిస్తారు.మరో వైపు జగన్ ఇప్పటికే ప్రదానికి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లేఖ రాశారు. ఆయన పలు ప్రత్యామ్నాయాలు సూచించారు. కాని చంద్రబాబు వాటిని విస్మరించి ఇష్టం వచ్చిన విమర్శలు చేశారు. విశాఖ స్టీల్ అన్నది కేంద్ర ప్రభుత్వ సంస్థ, దానిని ప్రైవేటైజ్ చేసేది కేంద్ర ప్రభుత్వం అని తెలిసి కూడా ఎపి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం చంద్రబాబుకే చెల్లింది. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసి ఉండేవారు. అలాగే ప్రదాని మోడీపై విమర్శలు చేయడానికి వెనుకాడేవారు కాదు.పోని విమర్శలు ఎందుకులే అనుకుంటే ఆయన కనీసం ఒక ఉత్తరం వెంటనే రాసేవారు. అనేక మంది విమర్శల తర్వాత ఆయన లేఖ రాశారు. మరో వైపు జగన్ ఈ ప్లాంట్ ను అమ్మేస్తున్నారంటూ చంద్రబాబు ప్రచారం చేయడం అంటే ఆయన సంకుచితత్వానికి నిదర్శనమని అర్ధం చేసుకోవడం కష్టం కాదు.చంద్రబాబు స్టైలే అలాగే ఉంటుంది. ఆయన లో మార్పు ఆశించడం అత్యాశే అవుతుంది.

tags : vizag

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info