పోలవరం ప్రాజెక్టు డిజైన్ ల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిందన్న వార్త కీలకమైనదని చెప్పాలి.
పెండింగ్‌లో ఉన్న డిజైన్లు అన్నింటినీ డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) కొలిక్కి తెచ్చింది. పూణేలో సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్)లో 3–డీ పద్ధతిలో ఎకరం విస్తీర్ణంలో నిర్మించిన పోలవరం నమూనా ప్రాజెక్టు ద్వారా అధిక ఒత్తిడితో నీటిని పంపుతూ ప్రయోగాలు నిర్వహించినప్పుడు ఆ వరద చూపిన ప్రభావాలను పరిశీలించిన డీడీఆర్పీ సభ్యులు.. వాటిని క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులతో అన్వయించారు.
గోదావరి నదీ ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించడానికి 600 మీటర్ల వెడల్పుతో అప్రోచ్ ఛానల్‌ను తవ్వేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీడబ్ల్యూపీఆర్ఎస్లో మరోసారి ప్రయోగాలు నిర్వహించాక అప్రోచ్ ఛానల్ గైడ్ బండ్ డిజైన్‌కు తుదిరూపు ఇస్తామన్నారు. ఈ సీజన్లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల ఖాళీ ప్రదేశాలను భర్తీచేసి.. వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించాలని పాండ్యా సూచించారు. స్పిల్ వే మీదుగా విడుదల చేసిన వరద నీటి ఉధృతి గోదావరి ఎడమ గట్టు (పురుషోత్తపట్నం గట్టు), కుడి గట్టు (పోలవరం గట్టు)పై చూపే ప్రభావం ఆధారంగా.. వాటిని పటిష్టం చేయడానికి చేపట్టాల్సిన పనులకు సంబంధించిన డిజైన్‌ను ఖరారు చేశారు.
ఈ సీజన్లో పూర్తిచేయాల్సిన పనులకు ఏమాత్రం ఆటంకం కలగకుండా డిజైన్లను ఖరారు చేస్తేనే.. గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి అవకాశం ఉంటుందన్న జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ సి. నారాయణరెడ్డిల అభిప్రాయంతో డీడీఆర్పీ ఏకీభవించింది. పెండింగ్‌లో ఉన్న 29 డిజైన్లను మార్చి 15 నాటికి సీడబ్ల్యూసీతో ఆమోదింపజేసేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తామని.. ఆ మేరకు డిజైన్లను ఖరారుచేయడం ద్వారా పనులకు ఆటంకం కలగకుండా చూస్తామని డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య హామీ ఇచ్చారు. tags : polavaram