A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపికి ఆ కిక్కే వేరబ్బా
Share |
March 1 2021, 6:16 am

ఊహించని విజయం సేదైనా వస్తే ఆ కి్క్కే వేరబ్బా! అని సినిమాలలో తరచు వినిపించే డైలాగు.ఇప్పుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు వచ్చిన కిక్కు అలాగే ఉందని అనుకోవాలి. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మిగిలిన నియోజకవర్గాలలో గెలవడం వేరు. ప్రధాన ప్రత్యర్ది, తనకు కంచుకోట వంటిదని చెప్పుకునే వ్యక్తి నియోజకవర్గంలో గెలవడం వేరు. టిడిపి అదినేత , ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో మొదటిసారిగా తెలుగుదేశంయేతర పార్టీ గెలుపొందింది.అంటే ఇంతకాలం అక్కడ టిడిపికి తిరుగులేని విజయాలు వచ్చాయి. కాని ఈసారి అనూహ్యంగా 80 శాతం పైగా పంచాయతీలను వైఎస్ ఆర్ కాంగ్రెస్ గెలుచుకోవడం సంచలనంగా ఉంది. టిడిపికి మద్దతు ఇచ్చే కొన్ని పత్రికలు దీనిని ప్రాముఖ్యం ఇవ్వలేదు కాని, దాదాపు అన్ని ఆంగ్ల పత్రికలు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రచురించాయి. ఇది చంద్రబాబు కు ఒక రకంగా అప్రతిష్టే కాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇది సంకేతం అయితే ఆయన రాజకీయానికి డేంజర్ బెల్ మోగినట్లు అనుకోవాలి. మిగిలిన టిడిపి ఎమ్మెల్యేలు ప్రాతినిద్యం వహిస్తున్న నియోజకవర్గాలలో ఓడిపోవడం వేరు. స్వయంగా పార్టీ అధినేతగా తన నియోజకవర్గంలో ఓటమి ఎదురు అవడం వేరు.దీంతో పార్టీలో ఎవరినైనా ప్రశ్నించే నైతిక హక్కును ఆయన కోల్పోతారు. ఒకవేళ ఏదైనా ప్రశ్నించినా, నేరుగా కాకపోయినా, ఆ తర్వాత అయినా, ఈయన నియోజకవర్గంలో పొడిచింది ఏముంది?అని ప్రశ్నించుకుంటారు.పార్టీ బాగా దెబ్బతిందన్న భావన క్యాడర్ లో ఏర్పడితే మళ్లీ నిలబెట్టుకోవడం కష్టం అవుతుంది. చంద్రబాబు స్వతహా చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గానికి చెందినవారు. ఆయన మొదటిసారి 1978లో కాంగ్రెస్ ఐ పక్షాన అసెంబ్లీకి ఇక్కడ నుంచే గెలిచారు. తదుపరి టిడిపి ఆవిర్బావం జరిగినా ఆయన పార్టీలోకి రాలేదు. చంద్రగిరి నుంచే పోటీచేసి ఓటమి చెందారు. ఆ వెంటనే టిడిపిలోకి వచ్చేశారు. 1985లో ఆయన ఎక్కడా పోటీచేయలేదు.1983,85లలో రంగస్వామి నాయుడు అనే నేత కుప్పంలో టిడిపి పక్షాన గెలిచారు. అక్కడ బిసివర్గాలకు చెందినవారు అత్యధికంగా ఉంటారు. ఎన్.టి.ఆర్ పై అభిమానంతో వారు టిడిపికి భారీగా మద్దతు ఇచ్చారు. చంద్రగిరిలో పోటీచేయడం రిస్కు అని భావించిన చంద్రబాబు వ్యూహాత్మకంగా రంగస్వామి నాయుడును తప్పించి 1989 నుంచి కుప్పంలో పోటీచేయడం ఆరంభించారు.1994లో టిడిపి మళ్లీ అదికారంలోకి రావడం, 1995లో మామ ఎన్.టి.ఆర్.ను పదవీ చ్యుతుడిని చేసి తానే ముఖ్యమంత్రి అవడం ,దాంతో ఆయనకు కుప్పంలో తిరుగులేని పరిస్థితి ఏర్పడింది.2014లో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చంద్రమౌళి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన ఈయనపై తలపడినా గెలవలేకపోయారు.కాని ఆ తర్వాత ఆయన ఓటర్ల జాబితాను పరిశీలించి ,పెద్ద ఎత్తున బోగస్ ఓటర్లు ఉన్నారని గుర్తించారు. వాటిని ఏరివేయడానికి ఆయన బాగా కృషి చేశారు. దాదాపు 17వేల బోగస్ ఓట్లను తొలగించగలిగామని ఆయన చెబుతుండేవారు.2019లో చంద్రమౌళి కాస్త గట్టిపోటీనే ఆయన ఇవ్వగలిగారు కాని తిరిగి ఓటమి చెందారు.ఆ తర్వాత ఆయన అనారోగ్యానికి గురై మరణించారు. 2019లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. చిత్తూరు జిల్లాలో ఒక్క చంద్రబాబు తప్ప మరే టిడిపి నేత గెలవలేకపోయారు.ఈ నేపధ్యంలో కుప్పం పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టిందని అనుకోవాలి.అక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు పార్టీని చూడకుండా, ప్రాంతం చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా అమలు కావడం, కుప్పం ప్రాంత గ్రామాలలో కూడా అవి అమలు కావడం కలిసి వచ్చింది. దానికి తోడు కరోనా కారణంగా ఇతరత్రా గాని చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ఏడాదికాలానికి పైగా వెళ్లలేదు.ఈ నేపద్యంలో ఆ నియోజకవర్గంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 89 పంచాయతీలకు గాను 74చోట్ల జయకేతనం ఎగురవేశారు.ఇది సహజంగానే చంద్రబాబుకు షాక్ అవుతుంది.దానికి తోడు టిడిపికి బాగా బలమైన పంచాయతీలుగా భావించే గుడిపల్లె తదితర చోట్ల కూడా ఓటమి ఎదురైంది. ఇదే సమయంలో ఇతర టిడిపి ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా అధిక సంఖ్యలో వైసిపివారే గెలిచారు.ఉదాహరణకు ఎపి టిడిపి అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ప్రాతినిద్యం వహిస్తున్న టెక్కలిలో ఇరవై తప్ప మిగిలిన 90కిపైగా పంచాయతీలు వైసిపి గెలిచింది.అయితే అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడలో టిడిపి గెలవడం ఊరట.అలాగే మరో నేత బుచ్చయ్య చౌదరి ప్రాతినిద్యం వహిస్తున్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోను మెజార్టీ పంచాయతీలు వైసిపి మద్దతుదారులు కైవసం చేసుకున్నారు.శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్వగ్రామం ఎవి నగరంలో ఆయన సమీప బంధువే ఓడిపోయారు. ఈ విషయాలను టిడిపి మీడియా కవర్ చేయడానికి ఇబ్బంది పడుతోంది. అదే సమయంలో మంత్రి కొడాలి నాని స్వగ్రామం యలమర్రు అంటూ,అక్కడ వైసిపి ఓడిపోయిందని టిడిపి మీడియా ప్రముఖంగా వార్తలు ఇచ్చింది. అయితే దీనిపై మంత్రి వివరణ ఇచ్చారు.తన తండ్రి, తాను అంతా గుడివాడలోనే జన్మించామని, తనకు యలమర్రుతో సంబందం లేదని,తానేమీ అక్కడ ప్రచారం చేయలేదని, అది తన నియోజకవర్గం కాదని ఆయన చెప్పారు.చంద్రబాబు సైతం కొడాలి నాని స్వగ్రామమే మరికొంతమంది వైసిపి నేతల ఊళ్లలో టిడిపి గెలిచిందని మీడియా సమావేశం పెట్టి మరీ వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు కుప్పం విషయంలో ఏమి మాట్లాడుతారో చూడాల్సి ఉంది.అయితే ఇవి పార్టీ రహిత ఎన్నికలు కనుక ఏదో రకంగా సర్ది చెప్పుకోవచ్చు.కాని ఈ ఎన్నికల ప్రభావం వచ్చే జడ్పిటిసి, మండల ఎన్నికలలో కూడా పడి కుప్పంతో సహా టిడిపి ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో అత్యధికం ఆ పార్టీ ఓడిపోతే అది వారికి మరింత ప్రమాదకరం అవుతుంది.టిడిపి ఉనికిని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. ఈ పంచాయతీ ఎన్నికలలో కొంత ప్రభావం చూపితే ప్రయోజనం ఉంటుందని వారు ఆశించారు.కాని వైసిపి ముందు టిడిపి నిలబడలేకపోయింది.

tags : ysr congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info