A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మజ్లిస్ తో టిఆర్ఎస్ స్నేహం ఇబ్బందా
Share |
April 19 2021, 5:08 pm

తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి , మజ్లిస్ పార్టీల స్నేహబంధం బహిర్గతం అయింది. ఇందులో పెద్ద తప్పేమీ లేదు.కాకపోతే హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పలుమార్లు టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు కె.తారక రామారావు తమకు, మజ్లిస్ తో ఎలాంటి పొత్తు లేదని ప్రకటించారు. ఆ ఎన్నికల ప్రచారం బారతీయ జనతా పార్టీ నేతలు టిఆర్ఎస్ ,మతతత్వ పార్టీ అయిన మజ్లిస్ లు చీకటి పొత్తులో ఉన్నాయని ఆరోపించేవారు.ఆ నేపద్యంలో తాజాగా హైదరాబాద్ మేయర్,ఉప మేయర్ ఎన్నికలలో టిఆర్ఎస్ కు మజ్లిస్ అదికారికంగానే మద్దతు ప్రకటించడం చర్చనీయాంశం అయింది. నిజానికి మజ్లిస్ కూడా తమ అభ్యర్దిని నిలబెడుతుందని ప్రచారం జరిగింది.ఎందుకైనా మంచిదని టిఆర్ఎస్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్.పిలను కార్పొరేషన్ ఎక్స్ అఫిషియో సభ్యులుగా కూడా నియమించింది. కాని చివరి నిమిషంలో ఏమి జరిగిందో,లేక ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగిందో కాని మజ్లిస్ పోటీలో లేకుండా టిఆర్ఎస్ కు మద్దతు పలికింది.దాంతో టిఆర్ఎస్ పని ఈజీ అయిపోయింది.డిప్యూటి మేయర్ పదవి ఆఫర్ చేసినా తాము వద్దన్నామని అసదుద్దీన్ ఒవైసి వెల్లడించారు. కాగా బిజెపి కార్పొరేటర్లు అధికారిక సమావేశం జరుగుతున్న హాలులో జై శ్రీరామ్ నినాదం ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది.అందుకు పోటీగా టిఆర్ఎస్ సభ్యులు జై తెలంగాణ నినాదం చేశారు. నిజానికి అధికారిక సమావేశాలలో ఇలాంటివి జరగకుండా ఉంటే మంచిది. అయితే శ్రీరాముడు అందరికి ఆదర్శప్రాయుడు కనుక జై శ్రీరామ్ అన్న నినాదాన్ని మతపరంగా చూడరాదని ,ఆ పార్టీ ఎమ్మెల్సీ రామచంద్రరావు వివరణ ఇచ్చినప్పటికీ అది అంత సమర్దనీయం కాదు.ఎందుకంటే వేరే మతానికి చెందిన వారు ఇలాగే వారి దేవుళ్ల ప్రస్తావన తెచ్చి నినాదాలు చేస్తే ,అదంతా పెద్ద వివాదంగా మారే అవకాశం ఉంటుంది.సున్నీతమైన విషయాలలో రాజకీయ పార్టీలు బాద్యతాయుతంగా ఉండాలి. ఎమ్.ఐ.ఎమ్.ను మతతత్వ పార్టీ అని విమర్శించే ముందు బిజెపి వారు కూడా తాము చేస్తున్నది ఏమిటో ఆత్మపరిశీలన చేయాలి. నిజానికి మజ్లిస్ పార్టీ హైదరాబాద్ లో టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నా, ఇతర రాష్ట్రాలలో పోటీ ద్వారా బిజెపి నాయకత్వం వహించే ఎన్.డి.ఎ.కూటమికే ఉపయోగపడుతోందన్న అభిప్రాయం ఉంది.ఉదాహరణకు బీహారులో ముస్లిం ఓట్లను ఎమ్.ఐ.ఎమ్.కొంతమేర చీల్చడంలో అక్కడ ఆర్జెడి,కాంగ్రెస్ కూటమి స్వల్ప తేడాతో అదికారం కోల్పోయింది.అలాగే త్వరలో జరగనున్న పశ్చిమబెంగాల్ లో కూడా మజ్లిస్ పోటీ చేయడానికి సిద్దం అవుతోంది.దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అదినేత్రి మమత బెనర్జీ, ఎమ్.ఐఎమ్ అదినేత అసదుద్దీన్ ఒవైసీల మధ్య మాటల యుద్దం కూడా జరిగింది. పోనీ అలాగని బిజెపి ఎక్కడా మతతత్వ పార్టీలతో,లేదా వేర్పాటు వాద పార్టీలతో పొత్తు పెట్టుకోలేదా అంటే అలాఏమీ లేదు. జమ్ము-కశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు అక్కడ పిడిపితో కలిసి అదికారం పంచుకున్న సంగతి తెలిసిందే.వీటన్నిటిని గమనంలోకి తీసుకుని బిజెపి బాద్యతాయుతంగా ఉంటే తెలంగాణలో వారికి అవకాశాలు మెరుగుపడతాయి. లేకుంటే వారు నష్టపోతారు. ఒక ఉప ఎన్నిక గెలిచినంతమాత్రాన, హైదరాబాద్ లో కార్పొరేటర్ సీట్లు గణనీయంగా వచ్చినంతమాత్రాన తెలంగాణలో అదికారంలోకి వచ్చేస్తామని అనుకుంటే అది భ్రమగానే మిగిలిపోవచ్చు. మజ్లిస్ పార్టీ హైదరాబాద్ బేస్ డ్ పార్టీగా 1962 నుంచి కొనసాగుతోంది. అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీల తండ్రి సలావుద్దీన్ ఒవైసీ ఆద్వర్యంలో ఈ పార్టీ పాతబస్తీలో నిలదొక్కుకుంది. అంతకుముందు పాతబస్తీలో సైతం కాంగ్రెస్ అబ్యర్దులే గెలిచేవారు. కాని ఆ తర్వాత మజ్లిస్ పూర్తి ఆదిక్యత సాదించింది.కాని 1994లో మాత్రం మజ్లిస్ నుంచి చీలిన అమానుల్లాఖాన్ ఎమ్.బి.టి.అనే పార్టీ పెట్టి రెండు సీట్లు తెచ్చుకుంటే మజ్లిస్ కు కేవలం ఒక్క సీటే వచ్చింది.అది కూడా ఒక్క అసద్ పోటీచేసిన చార్మినార్ నియోజకవర్గం మాత్రమే.కాని ఆ తర్వాత ఎమ్.బి.టి బలహీనపడి ఎమ్.ఐ.ఎమ్. పూర్తి ఆదిపత్యంలోకి వచ్చి ప్రతి ఎన్నికలో ఏడు సీట్లు గెలుచుకునే దశకు చేరింది.అంతేకాక హైదరాబాద్ నగరంలో ఆయా చోట్ల ఉండే ముస్లింలు ఆ పార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా ఓట్లు వేయడం కూడా జరుగుతుంటుంది.నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో బిజెపి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలవగా, అక్కడ మజ్లిస్ ,టిఆర్ఎస్ కలిసి కార్పొరేషన్ ను కైవసం చేసుకున్నాయి. మజ్లిస్ పార్టీ ఉమ్మడి ఎపిలోకాని, ఆ తర్వాత కాని అదికారంలో ఉన్న పార్టీలతో సఖ్యతతో ఉంటుందన్న భావన ఉంది. అది కాంగ్రెస్ కావచ్చు.లేదా టిడిపి కావచ్చు. లేదా ప్రస్తుతం టిఆర్ఎస తో కావచ్చు.అయితే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం ఒవైసీ సోదరులు ఇబ్బంది పడ్డారు.వారి ప్రసంగాలలో చేసిన అనుచిత వ్యాఖ్యల ఆదారంగా జైలుకు కూడా వెళ్లవలసిన పరిస్తితి వచ్చింది. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీతో సఖ్యంగా ఉంటున్నారు. అది ఎంతవరకు వెళ్లిందంటే కాంగ్రెస్ 2018 ఎన్నికలలో 19 సీట్లు గెలుచుకున్న, పదమూడు మందిని టిఆర్ఎస్ లో విలీనం చేసుకుని, కాంగ్రెస్ నుంచి ప్రతిపక్ష నేత హోదాను తొలగించి దానిని మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీకి అప్పగించేవరకు వెళ్లింది.నిజానికి అసెంబ్లీలో మజ్లిస్ తమ మిత్రపక్షమని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన సందర్భం కూడా ఉంది.అయినా హైదరాబాద్ ఎన్నికలలో వ్యూహాత్మకంగా తమకు మజ్లిస్ తో పొత్తులేదని టిఆర్ఎస్ ప్రచారం చేసింది. ఇక్కడ కెసిఆర్ స్టైల్ ను పరిశీలిస్తే ఆసక్తికరంగా ఉంటుంది. యజ్ఞ,యాగాలు చేయించడంలో ఆయన తర్వాతే ఎవరైనా.గతంలో ఏ ముఖ్యమంత్రి బహుశా ఇలా యాగాలు చేయలేదు.తద్వారా హిందూ సంప్రదాయ ఓటు బ్యాంక్ ను ఆయన పదిలం చేసుకున్నారు.అలాగే మరో వైపు మజ్లిస్ తో సఖ్యత ద్వారా ముస్లిం ఓట్లను కూడా గణనీయంగా పొందగలుగుతు్న్నారు. అలాగనీ బిజెపితో మరీ పూర్తి స్థాయిలో తగాదాకు వెళ్లకుండా కేంద్ర పెద్దలతో జాగ్రత్తగానే మసలు కుంటున్నారు.రైతు చట్టాలకు సంబందించి జరుగుతు్న్నరైతుల ఆందోళనపై హైదరాబాద్ లో ఆయన సీరియస్ గా మాట్లాడి,తదుపరి ప్రదాని మోడీని కలిసిన తర్వాత మొత్తం యుటర్న్ తీసుకున్నారు.అందులో ఉన్న చిదంబర రహస్యం ఏమిటో తెలియదు. తెలంగాణలో బిజెపి,కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఘాటైన వ్యాఖ్యలు చేస్తుంటారు.అయినా వాటిని పెద్దగా సీరియస్ గా తీసుకోరు.కాకపోతే సాగర్ బహిరంగ సభలో మాత్రం ఆ రెండు పార్టీలను తొక్కి పారేస్తానని హెచ్చరించారు. అది కొంత సీరియస్ కామెంటే అయినా,రాజకీయాలలో ఆయన వ్యూహాత్మంగా నడుచుకుంటారు కనుక పెద్ద ఇబ్బంది ఉండదు. ఏది ఏమైనా కెసిఆర్ రాజకీయ చతురత తో అటు హిందూ ఓటు బ్యాంక్ లో వ్యతిరేకత రాకుండా, ఇటు ముస్లిం ఓట్లు వచ్చే విదంగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందువల్లే మజ్లిస్ పార్టీ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినట్లు అర్దం చేసుకోవచ్చు. ఎందుకంటే దూకుడుమీద ఉన్న బిజెపికి తెలంగాణలో కళ్లెం వేయడానికి ఆయన అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని అర్దం చేసుకోవచ్చు.

tags : majlis

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info