A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపికి బూస్ట్ గా పంచాయతీ ఎన్నికలు
Share |
April 19 2021, 5:16 pm

ఆంద్రప్రదేశ్ లో ఏ కారణంతో అయితేనేమీ గత మార్చిలో ఆగిపోయిన మండల, జడ్పిటిసి ఎన్నికలు కాకుండా పంచాయతీ ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్వహించడం ఆరంభించింది.ఇప్పటికే మూడు విడతల ఎన్నికలు కూడా జరిగిపోయాయి. పేరుకు ఇవి పార్టీ రహిత పంచాయతీ ఎన్నికలు అయినా, దాదాపు రాష్ట్రం అంతా ఆయా పార్టీల మద్దతుదారులైన అభ్యర్దులు రంగంలో దిగి తమ సత్తా చాటుకుంటున్నారు. ఈ క్రమంలో అధికారంలో ఉన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ సహజంగానే అత్యధిక సర్పంచ్ పదవులను కైవసం చేసుకుంటోంది.తొలివిడత ఎన్నికలలో 2640 పంచాయతీలు వైసిపి కైవసం అయితే టిడిపికి 518 వరకు వచ్చాయని ఒక లెక్క. అయితే దీనిపై టిడిపి కాస్త గందరగోళంగా లెక్కలు చెప్పింది.తొలుత 1050 పంచాయతీలు గెలుచుకున్నామని ఒకసారి, అసలు పంచాయతీ ఎన్నికలు సరిగా జరపడంలో ఎన్నికల కమిషన్ విఫలం అయిందని, చాలా చోట్ల దౌర్జన్యాలు జరిగాయని మరోసారి ఆరోపించింది. ఎన్నికల కమిషన్ మాత్రం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ప్రకటించడంతో అంతవరకు తాము మద్దతు ప్రకటిస్తూ వచ్చిన ఎన్నికల కమిషనర్ పై విమర్శలు చేయడం, కోర్టుకు వెళ్లడం వంటివి టిడిపివారు చేశారు. రెండో విడత పోలింగ్ లో కూడా వైసిపికి 2504 పంచాయతీలు, టిడిపికి 479 పంచాయతీలు వచ్చినట్లు వైఎస్ ఆర్ కాంగ్రెస్ తెలిపింది. ఈ మేరకు వారు సర్పంచ్ ల పేర్లుతో సహా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ మాత్రం తమకు 666 వచ్చాయని సంబరాలు చేసుకున్నట్లు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా తెలిపింది.ఆ తర్వాత ఈ దశలోను వెయ్యికి పైగా వచ్చినట్లు టిడిపి ప్రచారం చేసింది.అంతేకాక 38 శాతం సర్పంచ్ పదవులను గెలుచుకున్నామని చంద్రబాబు ప్రకటించుకున్నారు. అయితే తెలుగుదేశం ఆ వివరాలను పూర్తిగా ఎక్కడా ఇవ్వకపోవడం గమనించదగిన విషయం. ఇక్కడ అసలు విషయం ఒకటి తెలుసుకోవాలి. ఆంద్ర ప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు , ఆత్మ తామేనని చె్ప్పుకునే ఒక పెద్ద పత్రికకు తెలుగు రాష్ట్రాలలో మారుమూల ప్రాంతాలలో కూడా నెట్ వర్క్ ఉంది. వారి ప్రతినిధులు ఉంటారు. నిజంగానే టిడిపికి పెద్ద సంఖ్యలో పంచాయతీలు వచ్చి ఉంటే,ఆ విషయాన్ని వారు స్వయంగా సేకరించి వార్తలుగా ప్రచురించేవారు.వారు అలా చేయకుండా వైసిపి పక్షాన బొత్స చేసిన ప్రకటనను, అలాగే టిడిపి వారు ఇచ్చిన ప్రకటనను ప్రచురించి ఊరుకున్నారు. అంటే దాని అర్దం ఆ పత్రిక నెట్ వర్క్ పనిచేయడం లేదని అనుకోవాలా?లేక వాస్తవ పరిస్థితి వైసిపికి అనుకూలంగా ఉంది కనుక తామెందుకు ఆ విషయాలన్నిటిని వెల్లడించాలని అనుకున్నారా?అన్నది తెలియదు.కాని వారు మాత్రం వాస్తవ పరిస్థితిని తెలియచేయడానికి ఇష్టపడలేదని అనుకోవాలి. ఇక మా అక్షరం మీ ఆయుధం అని ప్రచారం చేసుకున్న మరో పత్రిక వారి అక్షరాలను తెలుగుదేశం పార్టీకి అంకితం చేశారు కాబట్టి దాని గురించి ఎక్కుగా మాట్లాడుకోవడం అనవసరం.పంచాయతీ ఎన్నికలు ముందుగా పెడితే తమకు కొంతైనా కలిసి వస్తుందని ఆశించిన తెలుగుదేశం పార్టీకి ఇవి ఆశాభంగం కలిగించాయని చెప్పాలి. కాని వారు రెండు విడతలలో కలిసి సుమారు వెయ్యిపైగా పంచాయతీలు వచ్చినందుకు సంతృఫ్తి చెందారని అనుకోవచ్చు. మరో వైపు వైసిపి ఐదువేలకు పైగా పంచాయతీలు వచ్చాయి. అంటే గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవడం కాకుండా, అప్పటికన్నా వైసిపికి ఓట్ల శాతం పెరిగినట్లు కనబడుతోంది. పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపాల్టీలు, మండల,జడ్పి ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతాయి.మున్సిపాల్టీలకు నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. అప్పుడు ఎలాగూ ఏ పార్టీకి ఎలాంటి ఆదరణ ఉందన్నది స్పష్టమైన లెక్కలు వచ్చే అవకాశం ఉంటుంది.ప్రస్తుతానికి మాత్రం గ్రామ సీమలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన అనేక కార్యక్రమాలు బాగా పనిచేశాయని అర్దం అవుతుంది.ఈ ఫలితాలకు భిన్నంగా వచ్చే మున్సిపల్, మండల,జడ్పి ఎన్నికలలో మార్పు ఉండకపోవచ్చు. కాగా ఎన్నికల కమిషన్ వైఖరిలో కొద్దిపాటి మార్పు కనబడడం కూడా ఆహ్వానించదగిందే.ప్రత్యేకించి పోలీసు ,ఇతర పోలింగ్ సిబ్బంది,జిల్లా కలెక్టర్లు, ఎస్పిలు ఎన్నికలను విజయవంతం చేశారని ,చెదురుమదురు ఘటనలు మినహా,అంతటా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పడం కూడా గమనించదగినదే.అంతేకాక తొలి విడతలో ఏకగ్రీవాలపై ఆయన కొంత వివాదాస్పదంగా వ్యవహరించారన్న అభిప్రాయం ఉంది. ప్రత్యేకించి చిత్తూరు,గుంటూరు జిల్లాలలో ఎక్కువ ఏకగ్రీవాలు అయ్యాయని ఆయన కొద్ది రోజులు నిలుపుదల చేశారు. కాని ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ల నివేదికల ఆధారంగా వాటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, ఆ తర్వాత దశల్లో జరిగిన ఏకగ్రీవాలను కూడా ఓకే చేశారు.ఎన్నికల కమిషనర్,అలాగే తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా ఎంత ప్రచారం చేసినా పెద్ద తేడా కనిపించలేదని అర్దం అవుతుంది. ఈ విషయాలలో తమకు పూర్తి అనుకూలంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుందని టిడిపి నేతలు ఆశించి భంగపడ్డారేమో తెలియదు కాని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ కూడా విఫలం చెందిందని ఆరోపించారు.అంతవరకు రాజ్యాంగ వ్యవస్థలపై విమర్శలు చేస్తారా అని సుద్దులు చెప్పిన చంద్రబాబు స్వయంగా ఆయనే విమర్శలు చేశారు. మరో వైపు తన పార్టీ వారితో హైకోర్టులో పలు పిటిషన్ లు వేయించి అనేక ఆరోపణలు చేశారు.ఆ పిటిషన్లు చదివితే ఎపి గ్రామాలలో హింస, నిర్భందంగా నామినేషన్లు ఉపసంహరించడం, పోలీసులు అసలు పనిచేయడం లేదని, ఎన్నికల వ్యవస్థ గందరగోళంగా ఉందేమోనన్న అనుమానం కలుగుతుంది. ఆ కేసు విచారించిన జడ్జిగారు ఆ పిటిషన్ లలోని ఆరోపణలు చూస్తే చాలా సీరియస్ గా ఉన్నాయని, అవి నిజమే అయితే గట్టి చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ కు ఇందుకు సంబందించిన అదికారాలు ఉంటాయని,వాటిని వాడుకోవాలని సూచించారు.ఇందులో ఎవరికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు.నిజంగానే ఎన్నికలలో అక్రమాలు జరిగితే అడ్డుకోవలసిందే.చర్యలు తీసుకోవల్సిందే.కాని ఉన్నవి ,లేనివి కలిపి హైకోర్టులో పిటిషన్ వేసి న్యాయ వ్యవస్థను కూడా తప్పుదారి పట్టించే యత్నం జరిగిందా అనిపిస్తుంది. ప్రత్యేకించి పుంగనూరు, మాచర్ల,తంబళ్లపల్లె నియోజకవర్గాలలోని పంచాయతీలపై ఈ ఫిర్యాదు చేశారు. కాని వాటికి సంబందించిన ఏకగ్రీవాలను ఎన్నికల కమిషన్ ఆమోదించిన తర్వాత ఇంక సమస్య ఎక్కడ ఉంటుంది.పైగా ఎవరైనా సంబంధిత గ్రామాలకు చెందినవారు పిటిషన్ వేస్తే దానికి అర్ధం ఉంటుంది కాని,లేదా నిర్దిష్ట ఆధారాలతో ఎవరైనా పిటిషన్ వేయవచ్చు కాని, ఏదో రకంగా వైసిపిని ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతో పిటిషన్ లు వేస్తే ఏమి చేయాలి. ప్రభుత్వ న్యాయవాది ఈ పిటిషన్ లు విచారణార్హం కాదని వాదించారు. న్యాయమూర్తి ఈ పిటిషన్ లలోని అంశాల లోతుల్లోకి వెళ్లడం లేదని కూడా స్పష్టం చేశారు.అయినా తెలుగుదేశం మీడియా జడ్జిగారు చేసిన ఒక వ్యాఖ్యను పతాక శీర్షికలలో పెట్టి వైసిపిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని హైకోర్టు అన్నదేమోనన్న భ్రమ కల్పించడానికి ప్రయత్నించింది.ఇవన్ని చూస్తుంటే అసలు పోటీ వైసిపికి ,తెలుగుదేశం మీడియాకు జరుగుతుందేమోనన్న అనుమానం వస్తుంది. ఇది ఇలాఉంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల కమిషనర్ ఏకంగా గృహ నిర్భంధం ఆదేశాలు ఇవ్వడం మీడియాతో మాట్లాడకూడదని ఆంక్షలు పెట్టడం కొంత సీరియస్ విషయమే. హైకోర్టు వీటిని తోసిపుచ్చుతూ ఎన్నికల కమిషనర్ పై వ్యాఖ్యలు చేయవద్దని చెప్పడం పద్దతిగానే ఉంది. మరో మంత్రి కొడాలి నానిపై కేసులు పెట్టాలని ఎన్నికల కమిషనర్ కృష్ణా జిల్లా ఎస్పికి ఆదేశాలు ఇవ్వడం అంత సముచితంగా లేదు.నాని వివరణ పూర్తి సంతృప్తి కలిగించకపోతే మరోసారి హెచ్చరిక చేసి వదలివేసి ఉండాల్సింది.నిజానికి గతంతో పోల్చితే మంత్రి మరీ అంత తీవ్రమైన విమర్శ చేయలేదు. కాని ఎన్నికల కమిషనర్ మాత్రం తన విధులకు ఆటంకం కలిగించారని, కోడ్ ఉల్లంఘించారని కేసులు పెట్టిన తీరు ప్రతీకార చర్యలాగా అనిపించడానికి ఆస్కారం కలిగిస్తోంది. మంత్రి అయినా, ఎవరైనా ఎన్నికల కమిషనర్ ను వ్యక్తిగతంగా దూషించకూడదు. కాని గత 11 నెలలుగా ఎన్నికల కమిషన్ కు, వైసిపికి మధ్య సాగుతున్న పోరాటం నేపద్యంలో రెండువైపులా తప్పులు జరుగుతున్నాయి. ఈ విషయాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. మొత్తం మీద గ్రామ పంచాయతీ ఎన్నికలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు పెద్ద బూస్ట్ మాదిరిగా ఉంటే, తెలుగుదేశం పార్టీ తనకు వచ్చిన తక్కువ స్థానాలకే ఆత్మ సంతృప్తి చెందినట్లు కనిపించడం ఒక ప్రత్యేకతగా భావించాలి. బహుశా వచ్చే రెండు దశల ఎన్నికలు,మున్సిపల్, మడల,జడ్పిటిసి ఎన్నికల నేపద్యంలో టిడిపికి ఇది ఒక వ్యూహం కావచ్చు. పంచాయతీ ఎన్నికలు ముగిశాక పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్ ,మండల,జడ్పి ఎన్నికలు మరింత రాజకీయ వేడి పుట్టిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

tags : ysrcongress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info