A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించినా..మీటర్లు..
Share |
April 19 2021, 5:49 pm

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన విద్యుత్ చట్ట సవరణలను ఆమోదించకపోతే ఎలాంటి ఇబ్బందలు రానున్నాయో ఇప్పుడు తెలంగాణలో అర్దం అవుతోందని అనుకోవాలి.రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు భిగించి ఎంత విద్యుత్ వాడుతున్నది లెక్క తెలుసుకోవాలన్నది కేంద్రం నిబందన. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు అంగీకరించి శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా మోటార్లకు మీటర్లు అమర్చే ప్రక్రియ చేపట్టింది.దీనిని ఎపిలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది. రైతుల మోటార్లకు మీటర్లు పెడతారా అని విమర్శించడమే కాకుండా, తమ పార్టీ మద్దతుతో గెలిచే పంచాయతీలలో దీనిపై తీర్మానాలు చేయిస్తామని హెచ్చరించింది.ఒకప్పుడు చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్కరణలకు తానే ఆద్యుడినని చెప్పుకునేవారు. ఆయన అదికారం కోల్పోవడం తో యుటర్న్ తీసుకున్నారు.అదేమీ ఆయనకు కొత్తకాదు.అది వేరే విషయం. కాని తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లను అంగీకరించలేదు.నిజానికి ఈ మీటర్లు పెట్టినందువల్ల వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఎటు తిరిగి రైతులకు ప్రభుత్వాలు ఉచితంగానే విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. కాకపోతే వాటి లెక్కలు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందన్నది అర్దం అవుతుంది.తదనుగుణంగా ప్రణాళికలు తయారు చేసుకోవచ్చు. లేకుంటే ఎక్కడ విద్యుత్ వృధా అయినా అదంతా రైతుల మోటార్లకు సరఫరా చేసినట్లుగా భావించే పరిస్థితి నెలకొంటోంది. ఈ నేపధ్యంలో కేంద్రం కొన్ని నిర్దిష్టమైన చర్యలు చేపట్టడంతో తెలంగాణ ప్రభుత్వానికి సమస్యలు వస్తున్నట్లు మీడియా కధనాలు సూచిస్తున్నాయి. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్సీ), రూరల్‌ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ)ల నుంచి రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు రుణాల చెల్లింపులను గత నెల నుంచి కేంద్ర విద్యుత్‌ శాఖ అర్ధంతరంగా నిలుపుదల చేసింది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన విద్యుత్‌ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపకపోవడం, బిల్లులోని నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు బిగిం చకపోవడం, గత నాలుగేళ్లుగా తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్‌) సమర్పించకపోవడం మొదలైనవి కారణాలుగా చెబుతున్నారు. దీని ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల కు ప్రతినెల విడుదల కావల్సిన రుణాలు ఆగిపోయాయి.అలాగే కేంద్రం డిస్కం ల ఆధునీకరణకు కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్ ప్యాకేజీ రుణాలు కూడా నిలిచిపోయాయి. విద్యుత్ కొనుగోళ్లతో సహా మొత్తం సుమారు 12600 కోట్ల రూపాయల రుణాల విడుదల ఆగిపోవడంతో ఇప్పుడు జెన్ కో, ట్రాన్స్ కో వంటి సంస్థలు ఆర్దిక సంక్షోభంలోకి వెళుతున్నాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.ఈ రుణాల విడుదల కోసం డిల్లీకి సీనియర్ అదికారులు వెళ్లి ప్రయత్నాలు సాగించినా ఫలితం దక్కలేదట.యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ లకు నెలకు సుమారు 500 కోట్ల రూపాయల మేర రుణం రావల్సి ఉండగా, అవి నిలిచిపోవడంతో జెన్ కో బిల్లులు చెల్లించలేకపోతోంది.ఫలితంగా ఈ ప్లాంట్ ల నిర్మాణానికి అవాంతరం ఏర్పడుతుందని భయపడుతున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కం లు రూ. 12 వేల కోట్లకుపైగా విద్యుత్‌ కొనుగోళ్ల బిల్లులను విద్యుత్పత్తి సంస్థలకు బకాయి ఉన్నాయి. కేంద్రం గతేడాది రాష్ట్ర డిస్కంలకు ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ కింద రూ. 12,600 కోట్ల రుణాలను మంజూరు చేసింది. వాటిని డిస్కంలు విద్యుదుత్పత్తి సంస్థలకు చెల్లించి బకాయిలు తీర్చుకోవాల్సి ఉంది. ఈ రుణాలు మంజూరైనా తొలి రెండు విడతల కింద ఇప్పటివరకు చెలించాల్సిన రూ. 6 వేల కోట్ల రుణాలను కేంద్రం నిలిపివేసిందని అధికారులు చెబుతున్నారు.ఫలితంగా మరింత సంక్షోభం ఏర్పడుతోంది. ఇదంతా ఒక సైకిల్ వంటిదని చెప్పాలి.జెన్ కో విద్యుత్ ను ఉత్పత్తి చేసి ట్రాన్స్ కో ద్వారా డిస్కం లకు విద్యుత్ ను సరఫరా చేస్తుంది. డిస్కంలు వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేసి జెన్ కో కి చెల్లించవలసి ఉంటుంది.అలాగే జెన్ కో విద్యుత్ ఉత్పత్తికిగాను అయ్యే వ్యయాన్ని భరించి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వవలసి ఉంటుంది. వీ సైకిల్ లో ఎక్కడ తేడా వచ్చినా మొత్తం సంక్షోభంగా మారుతుంది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ పరిస్థితిపై దృష్టి పెట్టవలసిన సమయం ఆసన్నమైంది. కొద్దికాలం క్రితం కేంద్రం తెచ్చిన సాగుచట్టాలను కూడా కెసిఆర్ మొదట వ్యతిరేకించినా, ఆ తర్వాత పరిస్థితి అర్ధం చేసుకుని అనుకూలంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు కూడా రైతుల మోటార్లకు మీటర్లు అమర్చక తప్పకపోవచ్చు. అలాగే కేంద్రం విధించిన ఆయా షరతులను అంగీకరించవలసి రావచ్చు. ఎపిలో ఈ సమస్య రాకుండా ముందుగానే జాగ్రత్తపడ్డారని అనుకోవాలి. అక్కడ గత ప్రభుత్వం సుమారు 18వేల కోట్ల మేర డిస్కంలకు బకాయిపెట్టి దిగిపోయింది.వాటిలో కొంత భాగం చెల్లించి, కేంద్రం ప్రకటించిన ప్యాకేజీల ద్వారాను,ఇతరత్రాను రుణాలు పొంది బండి నడుపుతున్నారు. ఏది ఏమైనా సంస్కరణలన్నిటిని వ్యతిరేకించడం సరికాదు.వాటిలో ప్రభుత్వం జవాబుదారిగా ఉండవలసిన వాటిని అసలు కాదనకూడదు. దానివల్ల ఒక క్రమశిక్షణ కూడా వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తమకు తోచిన విదంగా రాయితీలు ప్రకటించి, విద్యుత్ సరఫరా సంస్థలకు సరిగా బిల్లులు చెల్లించకపోతే చివరికి అదంతా ప్రజలపైనే భారంగా పడుతుంది.వీటన్నిటిని గమనంలోకి తీసుకుని తెలంగాణ ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టక తప్పదని చెప్పాలి.

tags : telangana, meters

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info