A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల సత్తా తేలుతుంది
Share |
April 19 2021, 5:56 pm

ఎపిలో మున్సిపల్ ఎన్నికల నగారా కూడా ఎన్నికల కమిషన్ మోగించింది. ఊహించినట్లు జరుగుతు్నాయనిపిస్తుంది. గతంలో ఆగిపోయిన ,జిల్లా పరిషత్, మండల ఎన్నికలు నిర్వహించకుండా ముందుగా మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో కమిషన్ ప్రకటించిన ఎన్నికల కోడ్ మార్చి 14 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఇదే ప్రకారం ఎమ్.పిటిసి ,జడ్పిటిసి ఎన్నికల షెడ్యూల్ ను కూడా ప్రకటిస్తే బహుశా మార్చి నెలాఖరు వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఈలోగా తిరుపతి లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నిక వస్తే మళ్లీ ఆ ప్రాంతంలో కోడ్ వర్తిస్తుంది. ఈ రకంగా సుమారు మూడు నెలలపాటు ఎన్నికల కోడ్ కిందే రాష్ట్రం ఉందని అనుకోవాలి. గతంలో షెడ్యూల్ ప్రకటించినప్పుడు పంచాయతీ ఎన్నికలు కాకుండా,మిగిలిన ఎన్నికలన్నీ దాదాపు ఒక నెల రోజుల్లో ముగిసిపోయేవి. ఎన్నికల కమిషన్ ఆ షెడ్యూల్ ను పక్కనపెట్టి ,ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లింది. అయినప్పటికీ ప్రభుత్వం ఓకే చేసింది. అయితే ఈసారి మాత్రం మున్సిపల్ ఎన్నికలకు మాత్రం ప్రభుత్వాన్ని కూడా సంప్రదించి చేయడం ఒక మంచి పరిణామం అని చెప్పాలి.మండల,జడ్పి ఎన్నికలను ఏమి చేస్తారన్నది ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. ఇప్పటికే ఏకగ్రీవం అయిన మండల పరిషత్ సభ్యులు, జడ్పిటిసి సభ్యులను గతంలో ఆమోదించినదానికి కట్టుబడి ఉండాలా?లేక తెలుగుదేశం ,ఇతర పక్షాలు డిమాండ్ చేసిన విధంగా రద్దు చేయాలా అన్నది ఎన్నికల కమిషన్ తేల్చుకోలేకపోతోంది.దీనిపై న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటోందని సమాచారం వచ్చింది. మున్సిపల్ ఎన్నికలు ఎక్కడ నిలిచిపోయాయో, అక్కడ నుంచి మళ్లీ కొనసాగిస్తాని ప్రకటించిన ఎన్నికల కమిషనర్ ,మండల,జడ్పిటిసి ఎన్నికలలో భిన్నంగా వ్యవహరిస్తే విమర్శలు రావచ్చు. పైగా అది న్యాయపరంగా చెల్లుతుందా అన్నది కూడా వివాదాస్పదం అవుతుంది. తెలుగుదేశం పార్టీ డిమాండ్ కు కమిషన్ తలొగ్గిందన్న విమర్శలు వస్తాయి. దానిపై ఏమి చేస్తారో తెలియదు కాని, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దం అవడంతో ఇవి అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు , టిడిపికి అత్యంత ప్రతిష్టాత్మకం అవుతాయి. ఎందుకంటే ఇవి పార్టీల ఆధారంగా జరిగే ఎన్నికలు అన్న సంగతి తెలిసిందే.గత శాసనసభ ఎన్నికలలో టిడిపి కేవలం 23 నియోజకవర్గాలు మాత్రమే గెలుచుకోగా నలుగురు ఆ పార్టీకి గుడ్ బై చెప్పడంతో 19 మంది మిగిలారు. మరో ఎమ్మెల్యే గంటా స్టీల్ ప్లాంట్ సమస్యపై పదవికి రాజీనామా చేశారు.అది ఆమోదం పొందితే టిడిపి ఎమ్మెల్యేల సంఖ్య 18కి పడిపోతుంది. అయితే ఎలాగైనా టిడిపి ఉనికిని నిలబెట్టుకోవడానికి విశ్వయత్నం చేస్తు్న తెలుగుదేశం పార్టీ ముందుగా తాను ప్రాతినిద్యం వహిస్తున్న మున్సిపాల్టీలలో విజయం సాధించవలసి ఉంటుంది. ఆ తర్వాత వైసిపి ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో కొన్నిటిని కైవసం చేసుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం డజనుపైగా మున్సిపాల్టీలు ఉన్న నియోజకవర్గాలలో టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నారు.వాటిలో టిడిపి అధినేత ప్రాతినిద్యం వహిస్తున్న కుపం, బాలకృష్ణ నియోజకవర్గమైన హిందుపూర్, విశాఖ నగర కార్పొరేషన్, పెద్దాపురం,మండపేట తదితర మున్సిపాల్టీలు ఉన్నాయి.వీటిని నిలబెట్టుకోగలిగితే టిడిపికి కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు అవుతుంది. లేనిపక్షంలో ఆ పార్టీ మరింత బలహీనం అవుతుంది.అలాగే వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రాతినిద్యం వహిస్తున్న పట్టణాలను కొన్నిటిని కైవసం చేసుకున్నా, ఆ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గట్టి పోటీ ఇవ్వగలుగుతుందన్న నమ్మకం ఏర్పడుతుంది. మరో వైపు అదికారంలో ఉన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు కూడా ఇది ఒక రకంగా పరీక్షగానే భావించాలి. పార్టీ అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో ఇది మొదటి పరీక్ష అవుతుంది. గ్రామ పంచాయతీలలో భారీ ఎత్తున విజయం సాదించడంతో వైసిపికి గ్రామీణ ప్రాంతాలలో బాగా వేళ్లూనుకుందని తేలింది. ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన పలు సంక్షేమ కార్యక్రమాలు, గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, విలేజీ క్లినిక్స్ కు ప్లాన్ చేయడం తదితర కారణాల వల్ల ఈ పట్టు సాధించగలిగారు. మరి ఇదే విధంగా పట్టణాలు, నగరాలలో కూడా వైసిపి పట్టు బిగించడానికి ఇది ఒక అవకాశం. గ్రామ ప్రాంతాలలో అమలు అవుతున్న సంక్షేమ కార్యక్రమాలు పట్టణ ప్రాంతాలలో కూడా అమలు అవుతున్నాయి.అయినా గ్రామ ప్రాంతాలలో ఉండే రాజకీయ వ్యవస్థకు, పట్టణ ప్రాంతాలలో ఉండే పార్టీ వ్యవస్థకు కొంత తేడా ఉంటుంది.దానికి తగ్గట్లుగా ఏ రాజకీయ పార్టీ అయినా సిద్దం కావల్సి ఉంటుంది.వైసిపి ఎమ్మెల్యేలు తాము ప్రాతినిద్యం వహిస్తున్న మున్సిపాల్టీలు, కార్పొరేషన్ లను తిరిగి దక్కించుకోవడమే కాకుండా ,టిడిపి ఎమ్మెల్యేలు ఉన్న మున్సిపాల్టీలను కూడా గెలుచుకోవలసిన పరిస్థితి ఉంటుంది. అప్పుడే వైసిపి పట్టణాలలో కూడా బాగా బలంగా ఉందన్న విషయం రుజువు అవుతుంది.ప్రస్తుతం వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున అది ఒక సానుకూల అంశం అవుతుంది. అయితే టిడిపి ఎమ్.పిలు గెలిచిన విజయవాడ,గుంటూరు, శ్రీకాకుళం, అలాగే గత ఎన్నికలలో నాలుగు ఎమ్మెల్యే సీట్లను పొందిన విశాఖపట్నం కార్పొరేషన్ కూడా తెలుగుదేశం కు ప్రతిష్టాత్మకం అవుతాయి. టిడిపితో పాటు వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు కూడా ఇవి కీలకం అవుతాయి. పేదలకు అత్యదికంగా సంక్షేమ కార్యక్రమాలు అందించిన వైసిపి వాటిపైన నమ్మకంతో ముందుకు సాగితే, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పై ఎప్పటి మాదిరే విమర్శలు చేస్తూ టిడిపి ఓటర్లను ఆకర్షించే యత్నం చేస్తుంది.మున్సిపల్ ఎన్నికలతో పాటు మండల,జడ్పి ఎన్నికలు కూడా పూర్తి అయిపోతే ఎపిలో మరో మూడేళ్లవరకు ఎన్నికలు ఉండవు. అందువల్ల ప్రభుత్వానికి కొంత వెసులుబాటు కలుగుతుంది. ఏది ఏమైనా వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు మున్సిపల్ ఎన్నికలు అత్యంత కీలకం అయితే, టిడిపి పలుకుబడి ,ఉనికి తగ్గిందా,పెరిగిందా అన్న అంశాన్ని ఇవి తేల్చుతాయని చెప్పవచ్చు.

tags : muncipal elections

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info