ఎపి ప్రభుత్వం అనుసరిస్తున్న రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఎంతో కొంత మొత్తం ఆదా అవుతున్నట్లుగానే ఉంది.తాజాగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం రెండో దశలో రెండు ప్యాకేజీల పనులకు నిర్వహించిన టెండర్లలో రూ.17.50 కోట్లు ఆదా అయ్యాయి. మొదటి ప్యాకేజీ పనుల అంతర్గత అంచనా విలువ (ఐబీఎం) కంటే 0.24 శాతం తక్కువకు వీపీఆర్–పయనీర్–హెచ్‌ఈఎస్ (జేవీ), రెండో ప్యాకేజీ పనులను 0.67 శాతం తక్కువకు గాజా–ఎన్సీసీ(జేవీ) సంస్థలు దక్కించుకున్నాయి.
పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ. వద్ద నుంచి రోజుకు 8 వేల క్యూసెక్కుల చొప్పున 90 రోజుల్లో 63.50 టీఎంసీల నీటిని తరలించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. తొలి దశలో రూ.2,022 కోట్లతో పనులను ఇప్పటికే ప్రారంభించింది. ఇదే పథకంలో రెండో దశ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి దశలో చేపట్టిన గ్రావిటీ కెనాల్లో 3.150 కి.మీ. నుంచి 23.200 కి.మీ. వరకూ కాలువ తవ్వకం, పాపయ్యపాలెం ఎత్తిపోతలతోపాటు 0 కి.మీ. నుంచి 40 కి.మీ. వరకూ లిఫ్ట్ కెనాల్ పనులకు మొదటి ప్యాకేజీ కింద రూ.2,512.96 కోట్ల ఐబీఎంతో టెండర్లు పిలిచింది. ఈ టెండర్లో ఆర్థిక బిడ్‌ను శనివారం అధికారులు తెరిచారు. రూ.2558.20 కోట్లకు కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచింది. ఇదే ధరను కాంట్రాక్టు విలువగా పరిగణించి ఈ–ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహించారు. tags : reverse tenders