పార్టీ రహితంగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కారాదని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించే అంశమేఓ పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం కావడమంటేనే అక్రమాలు చోటు చేసుకున్నట్లని ఆయన అభివర్ణించారు. ఏకగ్రీవం అయ్యే వాటిపై తాను ప్రత్యేక దృష్టి సారిస్తానని, ఒక ఐజీ స్థాయిలో ఉండే అధికారి సహకారంతో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని ధృడ సంకల్పంతో ఉన్నట్టు ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం అనేక దశాబ్దాలుగా గ్రామాలలో ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించడం ఆనవాయితీగా వస్తోంది ప్రభుత్వాలు కూడా ఏకగ్రీవం అయినవాటికి రివార్డు ప్రకటిస్తుంటాయి.అలాంటిది నిమ్మగడ్డ పోకడ వింతగానే ఉందన్న వ్యాఖ్యలు వస్తున్నాయి.
ఏకగ్రీవమైన పంచాయతీకి రూ.20 లక్షల దాకా ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2020 మార్చి 12న ఉత్తర్వులు జారీ చేసింది. 2 వేల జనాభా లోపు ఉండే గ్రామాల్లో ఎన్నిక ఏకగ్రీవం అయితే రూ.5 లక్షలు.. రెండు వేల నుంచి ఐదు వేల మధ్య జనాభా ఉండే గ్రామాల్లో ఎన్నిక ఏకగ్రీవమైతే రూ.10 లక్షలు.. ఐదు వేల నుంచి పది వేల మధ్య జనాభా ఉండే గ్రామాల్లో ఏకగ్రీవమైతే రూ.15 లక్షలు.. పది వేల జనాభా పైన ఉండే గ్రామాల్లో ఏకగ్రీవాలైతే రూ.20 లక్షలు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని 2020 మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే సమయంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అభినందించారు. ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడటం చూస్తుంటే రాజకీయ దురుద్దేశం కనిపిస్తోందన్న అనుమానాలు వస్తున్నాయి. tags : nimmagadda