A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బ్యాంకులను ఎంత ఎక్కువ మోసం చేస్తే అంత గొప్పా!
Share |
March 7 2021, 11:20 am

మన దేశంలో వ్యవస్థల తీరు భలే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎవరైనా ఉద్యోగి ఐదువేల రూపాయల లంచం తీసుకుంటే ,అవినీతి నిరోధక శాఖ వలపన్నుతుంది. వారిని పట్టుకుంటుంది.జైలులో పెడుతుంది. కాని వేల కోట్ల రూపాయలు ఎగవేసినవారిని మాత్రం ఏ సంస్థ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటుంది.అన్నిటికి, అందరికి ఇది వర్తిస్తుందని కాదు.చిన్న చేపలు వలకు చిక్కినప్పుడు, పెద్ద చేపలు ఎందుకు పడవన్న ప్రశ్న సామాన్యుడిలో తలెత్తుతుంది. వారిని దర్యాప్తు సంస్తలు ఏమీ చేయలేవు. ప్రభుత్వాలు వారిని నిలదీయలేవు. న్యాయ స్థానాలు కూడా ఏమీ చేయవు.పైగా ఈ మధ్యకాలంలో అవినీతి కేసుల విచారణపైనే స్టే ఇస్తున్న సందర్భాలు చూస్తున్నాం. అంటే ఈ దేశంలో చిన్నవాడికి ఒక న్యాయం,పెద్దవాడికి మరో న్యాయం అన్న చందంగా వ్యవస్థలు పనిచేస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రదాని మన్మోహన్ సింగ్ ,యుపిఎ చైర్ పర్సన్ సోనియాగాందీ చుట్టూరా వందలు,వేల కోట్లు ఎగవేసినవారు దర్జాగా తిరుగుతుండేవారు.భారతీయ జనతా పార్టీ అదికారంలోకి వచ్చాక, నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక ఈ పరిస్థితి మారుతుందని అనుకున్నవారికి ఆశాభంగమే ఎదురవుతోంది.వేల కోట్లు ఎగవేసినవారు వేరే పార్టీ నుంచి బిజెపిలో చేరగానే వారు పునీతులు అయినట్లు ఆయన చాంబర్ లో ఆయన కు ఎదురుగా కూర్చుని కబుర్లు చెప్పే పరిస్థితి చూశాం. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే బ్యాంకులను మోసం చేసో, లేక కావాలని బ్యాంకులను రుణాలు పెద్ద ఎత్తున వేసిన వారి సంఖ్య దేశ వ్యాప్తంగా చూసుకుంటే గుజరాత్, ఆంద్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలు అగ్రభాగానే నిలిచేలా ఉన్నాయి. తాజాగా కోస్టల్ ప్రాజెక్ట్స్ అనే సంస్థ 4736కోట్ల మేర బ్యాంకులను మోసం చేసిందన్న సంచలన కధనం కొన్ని ఆంగ్ల పత్రికలలో ప్రముఖంగా వచ్చింది. తెలుగుపత్రికలలో కాని, మరికొన్ని ఆంగ్ల పత్రికలలో కాని సంబంధిత వార్త పెద్దగా కనిపించలేదు. అవినీతికి వ్యతిరేకంగా సంపాదకీయాలు రాసే పెద్ద పత్రిక కూడా ఇందుకు అతీతంగా లేకపోవడం విశేషంగానే కనిపిస్తుంది.రుణాలు ఎగవేసేవారు ప్రదానంగా ప్రభుత్వరంగ బ్యాంకులనే ఎక్కువగా మోసం చేస్తున్నారట.ప్రైవేటు రంగ బ్యాంకులకు రుణబకాయిలు తక్కువగానే పెడుతున్నారట. కోస్టల్ ప్రాజెక్టు వారిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబిఐ కి పిర్యాదు చేసింది. తప్పుడు రికార్డులు తయారు చేయడం, అక్కౌంట్స్ లో మోసానికి పాల్పడడం, ఇతర రూపాలలో వీరు బ్యాంక్ ను మోసం చేశారన్నది అభియోగం. సత్యం కంపెనీ అదినేత రామలింగరాజు బ్యాంకులలో తమకు పిక్స్ డ్ డిపాజిట్ లు ఉన్నట్లుగా నకీలీ సర్టిఫికెట్లు సృష్టించిన వైనం ఒక దశాబ్దం క్రితం పెను సంచలనం అయింది. ఇప్పుడు ఆయనను మించిన ఘనాపాటీలు చాలామంది వెలుగులోకి వస్తున్నారు.కోస్టల్ ప్రాజెక్ట్స్ మాదిరే బ్యాంకులను మించినవారి జాబితా చాలా పెద్దదే ఉంది.అందులో మన తెలుగువారిని చూస్తే మాజీ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ కు చెందిన సంస్థలు 46వేల కోట్లకుపైగా బకాయిపడ్డాయి. మరి వాటి గురించి బ్యాంకులు ఏమి చేస్తున్నాయో తెలియదు .రాజగోపాల్ మాత్రం ఎన్నికలలో జోస్యాలు చెప్పుకుంటూ దర్జాగా తిరిగేస్తున్నారు.ఈ మధ్యనే జివికె కంపెనీ అధినేత జివికె రెడ్డి కుటుంబం పై కూడా కేసు నమోదు అయింది. ముంబై విమానాశ్రయానికి సంబంధించిన కేసు అది. మాజీ ఎమ్.పి రాయపాటి సాంబశివరావు ఏడువేల కోట్లకు పైగా బ్యాంకులకు ఎగనామం పెట్టినట్లు సిబిఐ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం బిజెపి ఎమ్.పిగా ఉన్న సుజనా చౌదరి కూడా ఆరువేల కోట్లకు పైగా వివిధ రూపాయాలలో బ్యాంకులకు టోపీ పెట్టారన్న అభియోగాలు వచ్చాయి.తాజాగా ఒక టిడిపి మాజీ ఎమ్.పికి వియ్యంకుడు, అలాగే ఒక టివీ సంస్థకు యజమాని అయిన వారికి వియ్యంకుడు అయిన కోస్టల్ ప్రాజెక్టు అదినేత సురేంద్ర 4736 కోట్లు ఎగవేసిన తీరు చూస్తున్నాం. ఇలా లెక్కవేసుకుంటూ వెళితే ఒక్ ఎపి,తెలంగాణలలోనే ఇలాంటి పెద్దమనుషులు లక్షకోట్లకు పైగా నే బ్యాంకులను మోసం చేశారన్న లెక్కలు వస్తున్నాయి.వీరిలో ఎక్కువ మంది రాజకీయవేత్తలో ,వారికి సంబందించిన వారో ,లేక వ్యాపారవేత్తలో ఉంటున్నారు.ఐవిఆర్ సిఎల్,భరణి, భారత్ పవర్,పల్లవి,బృందావన్ మొదలైన సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయని సమాచారం. ఎమ్.పి పదవి కోల్పోయిన కర్నాటకకు చెందిన విజయ్ మాల్యా సుమారు పది వేల కోట్లు, గుజరాత్ కు చెందిన
నీరవ్ మోడీ, చోక్సి వంటివారు వేల కోట్లకు ఎగవేతకు పాల్పడ్డారు.వీరిలో కొందరు విదేశాలకు పారిపోయి క్షేమంగా ,హాపీగా జీవితాన్ని కొనసాగించగలుగుతున్నారు. విజయ్ మాల్యా దర్జాగా విమానం ఎక్కి వెళ్లిపోతుంటే కేంద్ర ప్రభుత్వం,సిబిఐ చోద్యం చూస్తూ కూర్చున్నాయన్న విమర్శలు వచ్చాయి.వీరిలో అనేక మంది బోగస్ కంపెనీలు పెట్టి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను విదేశాలకు మళ్లించారని ఆరోపణలు వచ్చాయి.వాటిలో చాలావరకు వాస్తవాలు ఉన్నాయి. విజయ్ మాల్యా కు బ్రిటన్ ,ప్రాన్స్ వంటి దేశాలలో ఆస్తులు ఉన్నాయి. కాగా మాల్యా తాను డబ్బు చెల్లిస్తానని చెబుతున్నా, ఎందుకు వసూళ్లకు చొరవ తీసుకోవడం లేదో అర్ధం కాదు.గత ఎన్నికల ముందు టిడిపి ఎమ్.పిలు సుజనా చౌదరి,సి.ఎమ్.రమేష్ ల నివాసాలపైన, ఆఫీస్ లపైన సిబిఐ దాడులు చేసింది. ఆ తర్వాత వారు బిజెపిలో చేరారు. మరో ఇద్దరు టిడిపి ఎమ్.పిలతో కలిసి వారు ప్రదాని మోడీ చాంబర్ లో ఆయనతో కబుర్లు చెబుతూ కనిపించడం చూసి అంతా విస్తుపోయారు.అంతకుముందు నాలుగేళ్లపాటు సుజనా చౌదరి స్వయంగా మోడీ క్యాబినెట్ లో మంత్రిగా కూడా పనిచేయగలిగారు.మరో వైపు టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు పిఎ ఇంటిపై ఆదాయపన్ను శాఖ, సిబిఐ,ఈడి వంటి సంస్థలు దాడి రెండువేల కోట్ల మేర అక్రమాలు జరిగాయని ప్రకటించాయి. అది జరిగి నెలలు గడిచిపోతున్నా, ఆ వ్యవహారం ఏమైందో తెలియదు.అంతేకాదు. స్వయంగా ప్రధాని మోడీ ఎపి పర్యటనకు వచ్చి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఎటిఎమ్ అయిందని ఆరోపించారు. అలాగే బిజెపి ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు అమరావతిలో ఖర్చు చేసిన 7200 కోట్ల రూపాయలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఆనాటి టిడిపి ప్రభుత్వం హయాంలో చెట్టు-నీరు స్కీములో పదమూడువేల కోట్ల అవినీతి జరిగిందని తరచూ ఆరోపించేవారు.కేంద్రంలో బిజెపినే అదికారంలో ఉన్నప్పటికీ వీటిపై సిబిఐ విచారణ మాత్రం జరగడం లేదు. అమరావతి భూమి స్కామ్ పై సిబిఐ దర్యాప్తు కావాలని ఎపి ప్రభుత్వం కోరినా ఇంతవరకు కేంద్రం స్పందించలేదు.దీనిని బిజెపి ద్వంద్వ వైఖరి కాదని ఎలా అనగలం.అవినీతిని అంతమొందించడానికి బిజెపి చిత్తశుద్దితో ఉందని చెప్పగలమా?నిజంగానే ఇలా బ్యాంకులకు ఆయా వ్యక్తులు ఎగవేసిన రుణాలను కనుక వసూలు చేయగలిగితే ఈ దేశంలోని ప్రతి పేదవాడికి లక్ష రూపాయల చొప్పున ఇవ్వవచ్చనిపిస్తుంది. ప్రధాని మోడీ స్విస్ నుంచి భారత బ్లాక్ మనీని తెచ్చ15లక్షల చొప్పున పంచుతానని ఎన్నికలలో చెప్పేవారు.అంత కాకపోయినా, ఈ రకమైన మోసాలను అరికట్టి ఆ డబ్బును పేదలకు పంచినా మేలు జరుగుతుంది.కాని అలా జరుగుతుందన్న ఆశ కనిపించడం లేదు. పైగా లక్షల కోట్ల రుణ బకాయిలను ప్రస్తుత ప్రభుత్వంతో సహా ఆయా ప్రభుత్వాలు మాఫీ చేస్తున్నాయి.కాకపోతే కాంగ్రెస్ పార్టీ బిజెపిపైన, బిజెపి కాంగ్రెస్ పైన మాత్రం ఆరోపణలు చేసుకుంటూ కాలం గడుపుతుంటాయి. ఇండస్ట్రీస్ సిక్ బట్ నాట్ ఇండస్ట్రియలిస్ట్స్సస్ అని ఒక నానుడి. అంటే పరిశ్రమలు ఖాయిలా పడతాయి కాని, పారిశ్రామికవేత్తలు కాదని అన్నమాట. అంటే దాని అర్ధం పారిశ్రామికవేత్తలు తాము స్థాపించిన సంస్థల ద్వారా డబ్బు తినేసి ,బ్యాంకులకో, మరే ఇతర ఆర్దిక సంస్థలకు శఠగోపం పెడుతున్నాయన్నమాట. వీరిలో ఎవరైనా నిజంగానే చిత్తశుద్దితో పనిచేసి, పరిశ్రమల ద్వారా వందలు,వేల మందికి ఉపాధి కల్పించి, పరిస్థితులు అనుకూలించక దెబ్బతిని రుణాలు చెల్లించలేకపోతే దానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించవచ్చు. ఒకప్పుడు కృషి బ్యాంక్, ప్రూడెన్షియల్ బ్యాంక్ వంటి చిన్న సంస్థలు మూత పడి వేలాది మంది డిపాజిటర్లకు డబ్బు ఎగవేస్తే పెద్ద సంచలనం అయింది.వాటిపై పుంఖానుపుంఖాలు గా వార్తలు వచ్చేవి. ఈ రెండు బ్యాంకులకు సంబందించినవారిని పోలీసులు అరెస్టు కూడా చేశారు.కాని ఇప్పుడు ఎవరు ఎన్నివేల కోట్లు ఎగవేస్తే అంత గొప్పవారన్న భావన ప్రబలుతున్నట్లుగా ఉంది. అలాంటివారి వార్తలను,సిబిఐ అదికారికంగా ప్రకటించినా ప్రచారం చేయని మీడియాను ఇప్పుడు మనం చూస్తున్నాం. వారు తాము మద్దతు ఇచ్చే పార్టీ కనుక, లేదా తమ సామాజికవర్గం కనుక వారు ఎన్నివేల కోట్లు బ్యాంకులకు ఎగవేసినా, మోసాలు చేసినా వాటిని కప్పిపుచ్చుతాం అన్న చందంగా వ్యవహరించడం వికృత పరిణామంగా కనిపిస్తుంది. మరో విశేషం చెప్పుకోవాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడు ఆయా పెట్టుబడి దారులతో కలిసి పరిశ్రమలు నెలకొల్పి వాటిని విజయవంతంగా నడుపుతున్న సమయంలో రాజకీయంగా కాంగ్రెస్ తో విభేదించడంతో ఆయనపై కేసులు వచ్చాయి. మూడు రోజులలో బెయిల్ రావల్సిన కేసుల్లో న్యాయ స్థానాలు పదహారు నెలలు జైలులో ఉంచాయి. అదంతా కాంగ్రెస్ ,టిడిపితో కలిసి చేసిన కుట్ర అని ప్రజలు భావించారు.అందుకే ఆ తర్వాత కాలంలో ఆయనకు ప్రజలు పట్టం కట్టారు. ఇది ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే మన దేశంలో రాజకీయాల ఆధారంగా మోసం కేసులు, అవినీతి కేసులు దర్యాప్తు జరగడం, కోర్టులు కూడా అదే మాదిరి వ్యవహరించడం జరుగుతోందన్న విమర్శలు ఎదుర్కుంటున్నాయి. ఎక్కడైనా పరిశ్రమలు పెట్టినవారికి ప్రోత్సాహకాలు ఇస్తారు.కాని మన దేశంలో మాత్రం అలా పరిశ్రమలు పెట్టినవారు కేంద్రంలో అదికారంలో ఉన్నవారికి వ్యతిరేకంగా మారితే ఇంతే సంగతి అన్నమాట.అదే కేంద్రంలోని నేతలతో సత్సంబందాలు, న్యాయ వ్యవస్థలో పలుకుబడి ఉంటే వీడియో సాక్ష్యంగా అవినీతి బయటపడినా వారి జోలికి వెళ్లరు. ఈ నేపధ్యంలోనే ప్రజల దాచుకున్న సొమ్ముకు భద్రత లేకుండా పోతోంది. బ్యాంకులకు డబ్బు ఎగవేసినవారిని గొప్పగా కీర్పించే పరిస్థితి కూడా వస్తున్నదంటే మన సమాజం ఎటు వైపు పోతోందో ఆలోచించుకోవచ్చు. ఏది ఏమైనా పరిశ్రమలు పెట్టేవారిని కాకుండా పరిశ్రమల పేరుతో ,కాంట్రాక్టుల పేరుతో మోసం చేస్తున్నవారిని పట్టుకోవాలి. వేల కోట్ల రూపాయలు బ్యాంకులు ఎలా రుణాలుగా ఇస్తున్నాయో? వాటిని ఎగవేస్తున్నా బ్యాంకులు నిస్సహాయంగా ఎందుకు ఉంటున్నాయో సామాన్యుడికి అర్ధం కావడం లేదు.ఈ పరిస్థితి మారకపోతే ఇలాంటి మోసగాళ్లదే ఎప్పటికి పైచేయి అవుతుంది.రాజకీయాలకు,ప్రభుత్వాలకు సంబందం లేకుండా రుణ వ్యవస్థ, పరిశ్రమల వ్యవస్థ నడిస్తేనే దేశం ముందుకు వెళుతుంది.లేకుంటే వేల కోట్లు ఎగవేయడమే ఆదర్శం అనుకునే పరిస్థితి సమాజంలో ఏర్పడుతుంది. ఆ పరిస్థితి మార్చడానికి కేంద్రంలో ఏ పార్టీ అదికారంలో ఉన్నా చిత్తశుద్దితో కృషి చేయాలి.లేకుంటే దేశానికే అరిష్టం అని చెప్పక తప్పదు.

tags : sbi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info