కరోనా మహమ్మారి తీవ్రతను, కరోనా వ్యాక్సినేషన్ బృహత్కార్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిందని ఎపి ప్రభుత్వ ఏజీ శ్రీరామ్ చెప్పారు.హైకోర్టులో ఆయన స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలను వ్యతిరేకిస్తూ తన వాదన వినిపించారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై కూడా ఉందని, అయితే ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేవు కాబట్టి, అలాగే ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది కాబట్టి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
‘సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు ప్రారంభించిన సంప్రదింపుల ప్రక్రియను ఎన్నికల కమిషన్ లాంఛనప్రాయంగా మార్చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితులను పలు మార్లు వివరించాం. అయినా మా వినతులను, అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. ఎన్నికల కమిషనర్‌కు దురుద్దేశాలు ఉన్నాయి కాబట్టే, ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. హైకోర్టు జోక్యంతో 2020 మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్ ప్రారంభించింది. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. కోవిడ్ ప్రారంభం దశలో ఉన్నప్పటికీ, దానిని సాకుగా చూపిన ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేశారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీస స్థాయిలో కూడా సంప్రదించలేదు. ఏ దశలో ఎన్నికలు వాయిదా వేశామో, తిరిగి ఆ దశ నుంచే ఎన్నికల ప్రక్రియను మొదలుపెడతామని చెప్పారు. కానీ అందుకు విరుద్ధంగా మళ్లీ ఏకపక్షంగా కేవలం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీల సంగతిని గాలికొదిలేశారు..’ అని శ్రీరామ్ తెలిపారు. tags : sriram