A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైద్య రంగం -జగన్ విజయం సాదిస్తారా
Share |
January 20 2021, 12:13 pm

దేశంలో అయినా, లేదా ఏ రాష్ట్రంలో అయినా ప్రజలకు విద్య,వైద్యం అందుబాటులో ఉంటాయో ఆ దేశం లేదా, రాష్ట్రం అభివృద్ది చెందుతున్నట్లుగా భావిస్తారు. ఏ ప్రాంత వికాసం అయినా, ప్రజల అభివృద్ది అయినా ఈ రెండిటి మీద ఆధారపడి ఉంటుందన్నది మానవ వనరుల సూచిక తెలియచేస్తుంది. ఇప్పుడు ఎపిలో ఈ రెండు రంగాలలో విశేష ప్రాధాన్యత ఇస్తున్న తీరు ఆసక్తి మాత్రమే కాదు..ఆశ్చర్యం కూడా కలిగిస్తుంది.గతంలో ప్రవైటు ఆస్పత్రులు విస్తరించని రోజుల్లో, అలాగే ప్రైవేటు రంగంలో వైద్య కశాశాలలు రాకముందు ప్రభుత్వాలు అప్పటికి ఉన్న వనరులతో ఆస్పత్రులు, వైద్య కాలేజీలు ఏర్పాటు చేసేవి. కాని ప్రభుత్వాలు అచ్చంగా వీటికే ప్రాదాన్యం ఇచ్చేఏవి కావు. ఉమ్మడి ఎపిలో విద్య, వైద్య రంగాలలో పెట్టే బడ్జెట్ లు కూడా అంతంతమాత్రంగానే ఉండేవి. దివంగత నేత, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి టైమ్ లో ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ కార్యక్రమం మొత్తం ఆరోగ్య రంగ స్వరూపాన్నే మార్చేసింది. అలాగే విద్యార్దులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ స్కీమ్ ను ప్రవేశ పెట్టడంతో ఆ రంగంలో కూడా విశేషమైన మార్పు వచ్చింది. వైఎస్ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఏదో రూపంలో ఆరోగ్యశ్రీని కొనసాగించక తప్పలేదు. దానిని బట్టి అది ఎంత కీలకం తయారైందో అర్దం చేసుకోవచ్చు. ఉమ్మడి ఎపి విభజన తర్వాత ఎపిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రంగాలను అంతగా పట్టించుకోలేదని చెప్పాలి.కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ప్రైవేటు రంగంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రులకు అప్పగించడం ఆరంబించారు. కార్పొరేట్ వైద్యానికి ఇచ్చిన ప్రాదాన్యత ప్రభుత్వ ఆస్పత్రులకు ఇవ్వలేదన్న విమర్శ ఉంది.ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆస్పత్రులలో కూడా నాడు-నేడు కార్యక్రమం తీసుకు రావడం, అలాగే ఒకేసారి పదహారు వైద్య కాలేజీలను ఏర్పాటు చేయడానికి పూనుకోవడం గొప్ప విషయం. మొత్తం 17 వేల కోట్ల రూపాయల విలువైన పనులను ఈ కార్యక్రమాలలో చేపడుతున్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వనరులను ఎలా సమకూర్చుకుంటుందో తెలియదు కాని లక్ష్యాలు మాత్రం బాగున్నాయని చెప్పక తప్పదు. ప్రత్యేకించి కరోనా సంక్షోభం మొదలై, తీవ్ర రూపం దాల్చిన సమయంలో ఎపి ప్రభుత్వం అనుసరించిన విదానం సర్వత్రా ప్రశంసలు అందుకుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏదో ఒక విమర్శ చేయాలి కనుక ప్రభుత్వం చేతులెత్తేసిందనో, మరొకటనో విమర్శలు చేస్తుంటారు. అది వేరే విషయం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యదిక కోవిడ్ కేర్ సెంటర్ లలో బాదితులకు అందించిన చికి్స, వారికి సరఫరా చేసిన ఆహారం, ఇతరత్రా గైడెన్స్ అన్నీ కూడా మంచి పేరు తెచ్చాయంటే అతిశయోక్తి కాదు.ఎక్కడైనా కొన్ని చోట్ల స్థానికంగా కొన్ని ఇబ్బందులు వచ్చి ఉండవచ్చు. సిబ్బంది సరిగా పనిచేయకపోవడం వల్ల సమస్యలు వచ్చి ఉండవచ్చు. లోపాలనేవి ఏ వ్యవస్థలో అయినా ఉంటాయి. ప్రభుత్వం ఆలోచన విధానం,అనుసరించిన పద్దతులను బట్టి అక్కడ ఏమి జరుగుతుందన్నదానిపై అంచనాకు వస్తాం. వలంటీర్ల వ్యవస్థ,ఎ. ఎన్.ఎమ్. లు ఎవరు ఏ గ్రామం, లేదా పట్టణంలోకి కొత్తగా వచ్చారని తెలిసినా, మందుల షాపులో ఏవైనా దగ్గు మందులు కొన్నారని తెలిసినా, వెంటనే వారి ఇళ్లకు వెళ్లి వివరాలు తెలుసుకుని పరీక్షలు చేయించడానికి కృషి చేశారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రులలో పారిశుద్ద్యం మెరుగుదలకు ప్రాదాన్యం ఇచ్చారు. ఆరోగ్యశ్రీ కింద రెండువేల వ్యాదులను చేర్చి ప్రజలకు వైద్యం భారం కారాదన్న ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారు. ఇటీవలి కాలంలో పిల్లల చదువు, పెద్దల వైద్యం ఖర్చులకే కుటుంబాలు నలిగిపోవడం చూస్తుంటాం. కాని ఈ రెండిటి విషయంలో ప్రజల తరపున పని చేయాలని ప్రభుత్వం చేస్తున్న కృషి ఈ విధానంలో కనిపిస్తుంది. అలాగే గ్రామాలలో క్లినిక్స్ ఏర్పాటు చేసి, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు సజావుగా పనిచేసే పరిస్థితి వస్తే ఎపిలో ప్రజలు ముందుగా అక్కడికే వెళ్ల గలుగుతారు. డబ్బులు ఉన్నవాళ్లు ఎటూ ప్రైఏటు ఆస్పత్రులకు వెళతారు. పేద, మద్య తరగతి ప్రజలు అటు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేక, వెళితే ఆ ఖర్చు భరించలేక సతమతం అవుతున్నారు. ప్రస్తుతం అలాంటివారందరికి ఆరోగ్యశ్రీ ఎంతగానో ఉపయోగపడుతోంది.విలేజి క్లినిక్స్, పి.హెచ్ సిలు, ప్రభుత్వ ఆస్పత్రులను నీట్ గా మార్చి వైద్యులతో చిత్తశుద్దితో పనిచేయించగలిగితే అప్పుడు ప్రజలు కూడా ఆకర్షితులవుతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఆ దిశలో వెళుతుండడం ముదావహం అని చెప్పాలి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ అయినా ఉండాలని భావించి ,అందుకు అనువుగా కొత్తగా పదహారు వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం ఒక సాహసం అని చెప్పాలి. అవన్ని సకాలంలో పూర్తి చేయగలిగితే ఎపికి చెందిన కొన్ని వేల మంది విద్యార్దులు వైద్య వృత్తిలోకి వెళ్లగలుగుతారు. ఆ రకంగా ప్రజలకు వైద్య సేవలు పెరుగుతాయి. ముఖ్యమంత్రి జగన్ ఒక సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు ఉండాలన్నారు.ఆస్పత్రిలో పరికరాల దగ్గర నుంచి ఏసీల వరకు ప్రతిదీ సక్రమంగా పని చేసేలా దృష్టి పెట్టాలన్నారు. అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్న తర్వాత వాటి నిర్వహణ బాగోలేదనే మాట రాకూడదని ఆయన స్పష్టం చేశారు. నిజానికి ప్రభుత్వ ఆస్పత్రులలో అన్ని పరికరాలు ఉన్నా, అవి సరిగా పని చేయకపోవడం, ప్రైవేటు ఆస్పత్రులతో కుమ్మక్కై ఆయా పరికరాలను సిబ్బంది పాడుచేస్తుంటారన్న విమర్శలు కూడా వస్తుంటాయి. జగన్ నిర్ణయించిన కొత్త వైద్య కాలేజీలలో గిరిజన ప్రాంతమైన పాడేరు కూడా ఉండడాన్ని బట్టి బాగా వెనుకబడి ఉండే గిరిజనులకు ఎంత ప్రాదాన్యం ఇస్తున్నది అర్ధం చేసుకోవచ్చు.
ఆరోగ్య శ్రీ కింద 2 వేల వ్యాధులకు ఇప్పటికే 7 జిల్లాల్లో చికిత్స అమలవుతోంది. నవంబర్‌ 13 నుంచి మిగిలిన 6 జిల్లాల్లో చికిత్స అందుబాటులోకి వస్తుందని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ఐదు లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారంతా ఆరోగ్యశ్రీ పధకంలో లబ్ది పొందవచ్చు. బహుశా దేశంలో ఎపి ఒక్కటే ఇంత పెద్ద ఎత్తున ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్న రాష్ట్రం కావచ్చు. ఒక్క మాట చెప్పాలి. ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలు బాగున్నాయి. పేదవాడికి విద్య, దైద్యం అందించడం ద్వారా విద్యాంద్రప్రదేశ్ , ఆరోగ్య ఆంద్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చాలని ఆయన తలపెడుతున్నారు. కాని వీటన్నిటికి వనరులు ఎలా తేగలుగుతారు? ఇంత పెద్ద,పెద్ద కార్యక్రమాలు ఒకేసారి తలపెడితే వేల కోట్ల రూపాయలు ఎలా సమకూర్చుకుంటారన్నది అందరికి వచ్చే సందేహమే.ఒకటి మాత్రం చెప్పాలి. జగన్ చిత్తశుద్దితో ఈ స్కీములు తీసుకు వస్తున్నారు.వాటిని ఆయన విజయవంతంగా అమలు చేయలిగితే ప్రజల గుండెల్లో శాశ్వతంగా గొప్ప ముఖ్యమంత్రిగా నిలిచిపోతారు. అదే సమయంలో నేల విడిచి సాము చేయకుండా జాగ్గరత్తగా ఉండాలని చెప్పక తప్పదు. ఏది ఏమైనా ఆయన లక్ష్యం గొప్పది కనుక వైద్య రంగంలో ఆయన చేపట్టిన మార్పులు విజయవంతం అవ్వాలని ఆశిద్దాం.

tags : jagan, medical

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info