A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెటిఆర్ కు సవాల్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు
Share |
January 20 2021, 12:20 pm

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు డిసెంబర్ ఒకటిన జరిగే ఎన్నికలు అదికార టిఆర్ఎస్ కు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. 2023లో జరిగే అసెంబ్లీ సాదారణ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న ఈ ఎన్నికలలో ఘన విజయం సాధించాలని టిఆర్ఎస్ అన్ని వ్యూహాలు అమలు చేస్తోంది. దానికి తోడు దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఎదురైన షాక్ నుంచి కోలుకోవడానికి కూడా ఈ అవకాశాన్ని ఆ పార్టీ వినియోగించుకుంటోంది. అయితే గత కార్పొరేషన్ ఎన్నికలలో మాదిరి టిఆర్ఎస్ కు ఈసారి అంత సానుకూల వాతావరణం ఉంటుందా అన్నది పెద్ద చర్చగా ఉంది.మేయర్ పీఠం వరకు టిఆర్ఎస్ ఏదో విధంగా కైవసం చేసుకోవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాని అసలు సవాలు వారు చెబుతున్నట్లు ఈసారి వంద డివిజన్ లలో గెలవగలగాలి. లేకుంటే అధికార పార్టీ ప్రజలలో వ్యతిరేకత ఎదుర్కుంటోందన్న సంకేతం వెళుతుంది.ఈ ఎన్నికలు ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి, పార్టీ వర్కింగ్ అద్యక్షుడు కె.తారక రామారావుకు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. కాబోయే ముఖ్యమంత్రి కెటిఆర్ అని ప్రచారం జరుగుతున్న నేపద్యంలో ఈ ఎన్నికలలో ఆయన పార్టీని విజయతీరాలకు నడిపించలసి ఉంటుంది.అది కూడా గతసారి వచ్చిన ఫలితాలకు తక్కువ కాకుండా చూసుకోవల్సి ఉంటుంది. 2016లో ఉన్న రాజకీయ పరిస్థితికి , ఇప్పటికీ కొంత తేడా ఉన్నమాట వాస్తవం. అప్పట్లో టిఆర్ఎస్ కు పూర్తి అనుకూల వాతావరణ ఉంది. ఇప్పుడు ఆ స్థాయిలో ప్రజలలో పట్టు ఉందా అన్నది చర్చనీయాంశఃంగా ఉంది. దానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ కాని, మంత్రి కెటిఆర్ కాని గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు పలు వరాలు ప్రకటించారు. ప్రత్యర్ది రాజకీయ పార్టీలు పూర్తిగా తయారు అవడానికి అవకాశం లేకుండా ఎన్నికలను కాస్త ముందే పెట్టేస్తున్నారు. టిఆర్ఎస్ మంత్రులు,ఎమ్.పిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలందరిని డివిజన్ లలో పనిచేయడానికి కేటాయించారు. మరో వైపు ఇటీవలి వరదల వల్ల ఇబ్బంది పడ్డ ప్రజలకు పదివేల రూపాయల చొప్పున సాయం చేస్తున్నట్లు కెసిఆర్ ప్రకటించి, చకచకా పంపిణీ ఆరంబించారు. అయితే ఈ సాయం అందలేదంటూ వస్తున్న నిరసనలు కాస్త చికాకు పెడుతున్నాయి. టిఆర్ఎస్ కార్యకర్తలు ఈ విషయంలో పెత్తనం చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు వరదబాదితులు పెద్ద సంఖ్యలో మీ సేవ సెంటర్లలో ఈ సాయం కోసం క్యూలలో ఉంటున్నారు.ఇదేదో తలనొప్పిగా మారుతోందని గమనించిన ప్రభుత్వం వెంటనే ఎన్నికల కోడ్ పేరుతో సాయం పంపిణీ నిలిపివేసింది. ఎన్నికల తర్వాత ఆ డబ్బు పంపిణీ జరుగుతుందని ప్రకటించింది. బిజెపి వారే ఈ సాయం పంపిణీ కాకుండా అడ్డుకున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోపించడం, దానికి బిజెపి అద్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇవ్వడం జరిగాయి. ఇక ఆశ్చర్యం కలిగించేలా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని మున్సిపాల్టీలలో ఇంటి పన్నును ఏభై శాతం తగ్గించారు. ఏడాది పదిహేను వేల రూపాయల లోపు వారికి ఇది వర్తిస్తుందని చెప్పారు.నిజానికి ఈ కేటగిరిలోనే అత్యధికంగా ఇళ్లు ఉంటాయి. నిజానికి ఎప్పుడో నిర్ణయించిన ఆస్తి పన్నును నగరంలో ఈసారి సవరిస్తారని కొంతకాలం క్రితం ప్రచారం జరిగింది. తద్వారా హైదరాబాద్ లో ఆర్దిక వనరులు పెంపొందించుకుంటారని భావించారు. అలా చేయకపోగా ఆస్తి పన్నులో సగమే ఈ ఏడాది చెల్లించవచ్చని ప్రకటించడం ద్వారా పెద్ద తాయిలాన్ని టిఆర్ఎస్ ఇస్తోందని చెప్పవచ్చు. అలాగే డెబ్బైఐదు గజాల స్థలం ఉన్నవారు భవన నిర్మాణ అనుమతి తీసుకోనవసరం లేదని, 600 గజాల స్థలం లోపు వారు స్వీయ దృవీకరణ చేసి నిర్మాణ అనుమతి తీసుకోవచ్చని కూడా కెటిఆర్ ప్రకటించారు. ఇవన్ని ఆచరణలో ఎలాంటి రూపం తీసుకుంటాయో చెప్పలేం.తాయిలాలు ఇస్తున్న తీరు చూస్తే టిఆర్ఎస్ పార్టీలో ఈ ఎన్నికలపై కొంత గుబులు కూడా ఉందన్న విశ్లేషణలకు ఆస్కారం ఇచ్చినట్లయింది. ఇటీవలి వరదల వల్ల వందలాది కాలనీలలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అసాధారణ వర్షాలు కురిసిన మాట నిజమే అయినా, కాలనీలలో జనజీవనం ఎప్పటిమాదిరిగా సాగడానికి ప్రభుత్వ పరంగా ఎంత చేసినా సరిపోని పరిస్తితి ఏర్పడింది.దీనివల్ల ప్రజలలో కొంత అసంతృప్తి ఏర్పడిందన్న అబిప్రాయం ఉంది.దానిని పొగొట్టడానికా అన్నట్లు కెసిఆర్ ఒక్కో ఇంటికి పదివేల సాయం ప్రకటించి డబ్బు విడుదల చేశారు. ఈ సొమ్ము అందరికి సజావుగా పంపిణీ అయితే ఫర్వాలేదు.లేకుంటే అది కూడా అదికార పార్టీకి కొంత ఇబ్బంది కలిగించవచ్చు.గత కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కెటిఆర్ అనేక వాగ్దానాలు చేశారు. ఉదాహరణకు కెబిఆర్ పార్కు చుట్టూరా ప్లై ఓవర్లు వస్తాయని, హడావుడిగా శంకుస్థాపనలు కూడా చేశారు.కాని అవి రాలేదు.అయితే దుర్గమ్మ చెరువు పై నిర్మించిన వంతెన వరకు టిఆర్ఎస్ క్రెడిట్ తీసుకోవచ్చు .అలాగే ఎల్బి నగర్ వద్ద నిర్మించిన వంతెనలు కూడా టిఆర్ఎస్ ఖాతాలోకి వస్తాయి. కాని అవి పూర్తి స్థాయి గెలుపునకు సరిపోతాయా అన్నది చెప్పలేం.అప్పట్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లక్ష నిర్మించి పేదలకు ఇస్తామని హామీ ఇచ్చారు. అది కూడా పూర్తిగా సాధ్యపడలేదు. 2018లో శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్ ఘన విజయం సాధించినప్పటికీ ,ఈసారి అంత సానుకూల పరిస్థితి ఉండవకపోవచ్చని దుబ్బాక ఫలితం వెల్లడించింది. దానికి తోడు కాంగ్రెస్ కన్నా దూకుడుగా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో ప్రచారంలోకి దిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో కాంగ్రెస్,బిజెపిలు అభ్యర్ధులను వెతిక్కునే లోపే టిఆర్ఎస్ వేగంగా తన అభ్యర్దులను సిద్దం చేసుకుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే టిఆర్ఎస్ కు ఏభై లోపు వచ్చినా నామినేటెడ్ సభ్యులతో పాటు, మజ్లిస్ తో కలిసి మేయర్ పదవి దక్కించుకోవచ్చు. కాని గత ఎన్నికలలో కన్నా తక్కువ డివిజన్ లలో గెలిస్తే,అది పార్టీకు అప్రతిష్ట గా మారుతుంది.దాని ప్రభావం వచ్చే సాధారణ ఎన్నికలపై కూడా పడే అవకాశం ఉంటుంది.అందువల్లే టిఆర్ఎస్ నేతలు కాని, మంత్రి కెటిఆర్ కాని ఈ ఎన్నికలలో వంద సీట్ల టార్గెట్ తో పనిచేయడానికి సమాయత్తం అయ్యారు.దుబ్బాక లో బిజెపి అభ్యర్ధి రఘునందనరావు గెలుపు వల్ల టిఆర్ఎస్ కు కొంత అప్రతిష్ట వచ్చినట్లయింది. గత ఆరేళ్లలో తొలిసారి ఒక ఉప ఎన్నికలో టిఆర్ఎస్ ఓడినట్లయింది. అయితే 2019 లోక్ సభ ఎన్నికలలో బిజెపి నాలుగు ఎమ్.పి సీట్లు, కాంగ్రెస్ మూడు ఎమ్.పి,. సీట్లు గెలుచుకోవడం కూడా టిఆర్ఎస్ కు రాజకీయంగా నష్టం జరిగింది.వీటన్నిటిని కవర్ చేసుకోవాలంటే హైదరాబాద్ లో టిఆర్ఎస్ ఘన విజయం సాధించవలసి ఉంటుంది. గతసారి మాదిరే ఇప్పుడు కూడా టిఆర్ఎస్ అలా విజయం సాధిస్తే, కెటిఆర్ తిరుగులేని నేతగా ప్రజలలోను, పార్టీలోను నిలబడతారు. అలాకాకుండా గణనీయంగా సీట్లు తగ్గితే మాత్రం కెటిఆర్ కు కూడా కాస్త చికాకుగానే ఉంటుంది. తెలంగాణలో మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు ఒక ఎత్తు అయితే, హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఒక ఎత్తు అని చెప్పాలి. ఈ ఎన్నికపై దేశ వ్యాప్తంగా దృష్టి పడే అవకాశం ఉంటుంది. అందులోను బిజెపి చాలా సీరియస్ గా రంగంలో దిగుతుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు అత్యంత సన్నిహితుడైన భూపేంద్ర యాదవ్ ను హైదరాబాద్ ఎన్నికల ఇన్ చార్జీగా పెట్టారని సమాచారం వచ్చింది. అంతేకాక కాంగ్రెస్ కు చెందిన కొందరు ప్రముఖులను బిజెపిలోకి ఆకర్షిస్తున్నారు. టిఆర్ఎస్ కూడా ఆయా చోట్ల కాంగ్రెస్ ,బిజెపిలకు చెందిన కొందరిని ఆకర్షించవచ్చు.బిజెపి హైదరాబాద్ లో గణనీయంగా ముప్పై నుంచి నలభైఐ సీట్లు సాదిస్తే వచ్చే శాసనసభ ఎన్నికలకు తామే చాంపియన్ ల మంటూ సవాలు విసిరే స్థాయిలో మాట్లాడతారు. అలాకాకుండా కేవలం పదిలోపే డివిజన్ లకు బిజెపి పరిమితం అయితే ఆ పార్టీ ఉత్సాహం పై నీళ్లు చల్లినట్లు అవుతుంది. ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే పోటీ టిఆర్ఎస్ ,బిజెపిల మధ్య కేంద్రీకృతం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి నగరంలో గట్టి నేతలు లేని పరిస్థితి. అంతా కలిసి టిఆర్ఎస్ ను ఎదుర్కుంటున్నామన్న అబిప్ఆయం కల్పించడంలో కాంగ్రెస్ నేతలు విఫలం అవుతున్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోవడం కూడా ఆ పార్టీకి తీరని నష్టం చేసింది. ఈ నేపధ్యంలో బిజెపి కన్నా కాంగ్రెస్ ఎక్కువ డివిజన్ లలో గెలవగలిగితే తప్ప ఆ పార్టీకి రాజకీయంగా కష్టాలు తప్పవు.ఏతావాతా చెప్పాలంటే 2023 లో జరిగే శాసనసభ ఎన్నికలకు ముందు ఇది ఒక సెమిఫైనల్ వంటి ఎన్నికలని చెప్పాలి. టిఆర్ఎస్ కు ఉన్న స్థానాలు నిలబెట్టుకోవడం ఒక సవాలు అయితే, బిజెపి, కాంగ్రెస్ లు తెలంగాణలో తామే ప్రత్యామ్నామ్నాయని రుజువు చేసుకోవడానికి ఈ ఎన్నికలలో ఎక్కువ డివిజన్ లలో గలవడం అత్యవసరం. మజ్లిస్ సంబందించినంతవరకు పాత బస్తీలో వారికి ఎదురులేని పరిస్థితి కొనసాగుతుంది. టిఆర్ఎస్ కు వచ్చే సీట్లను బట్టి వారి అవసరం పై ఆధారపడే పరిస్థితి వస్తుంది.

tags : hyderabad

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info