ఎపి హైకోర్టులో వస్తున్న వ్యాఖ్యలకు ప్రభుత్వ న్యాయవాది ఎస్.ఎస్. ప్రసాద్ గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసినట్లుగా ఉంది.రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో న్యాయస్థానాలు నిర్దేశించజాలవని హైకోర్టులో వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలను కాపాడేందుకు పరిస్థితులను బట్టి పోలీసులు పలు నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుందని, ఇందులో న్యాయస్థానాలు ఏ రకంగానూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తెలిపారు. ఇటీవల న్యాయస్థానాలు తమ పరిమితులను మర్చిపోతున్నాయని, రాజధాని ఎక్కడ ఉండాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పరిపాలనాపరమైన నిర్ణయమని, ఇందులో న్యాయస్థానాల జోక్యానికి ఏమాత్రం ఆస్కారం లేదన్నారు. ప్రజలకు ఏది మంచో, ఏది చెడో నిర్ణయించాల్సింది ప్రభుత్వాలే కానీ న్యాయస్థానాలు ఎంతమాత్రం కాదన్నారు. తమ నిరసన కార్యక్రమాలను అడ్డుకునేందుకు పోలీసులు 144 సెక్షన్‌ను ప్రయోగిస్తున్నారని, తమకు పోటీగా ఎవరూ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా అడ్డుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ, గతంలో విశాఖలో చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 151 కింద నోటీసులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ టీడీపీ నేత తెనాలి శ్రవణ్‌కుమార్ హైకోర్టులో పిల్ వేశారు. వేర్వేరు అంశాలకు సంబంధించి పోలీసులపై ఆరోపణలు చేస్తూ పలు హెబియస్ కార్పస్ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలన్నింటిపై జస్టిస్ రాకేశ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది.
రాజధాని ప్రస్తుతం ఉన్న చోట కడితే రూ.100 కోట్లు నష్టం వాటిల్లవచ్చునని, మరోచోటకు మారిస్తే ఆ నష్టం రూ.10 కోట్లకే పరిమితం కావచ్చునని, అందువల్ల ఇలాంటి విషయాల్లో నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని ఈ సందర్భంగా పోలీసుల తరఫు సీనియర్ స్పెషల్ కౌన్సిల్ సర్వా సత్యనారాయణ ప్రసాద్ నివేదించారు. ఇందులో జోక్యం చేసుకునే పరిధి న్యాయస్థానాలకు లేదన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ జరుగుతోందని, అందువల్ల ఈ అంశంపై మీతో (జస్టిస్ రాకేశ్) పాటు నేను కూడా మాట్లాడటం సమంజసం కాదని సత్యనారాయణప్రసాద్ వివరించారు. ఆ త్రిసభ్య ధర్మాసనంలో మీరు (జస్టిస్ రాకేశ్) సభ్యులు కారని, అలాగే ఆ కేసులో తాను న్యాయవాదినీ కాదని, అందువల్ల రాజధాని విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు, అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా ఉంటే సమంజసంగా ఉంటుందని ఆయన జస్టిస్ రాకేశ్‌కుమార్‌కు స్పష్టం చేశారు.
‘మీరు (జస్టిస్ రాకేశ్ కుమార్) బయట రాష్ట్రం నుంచి వచ్చారు. ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏమిటో మీకు అంతగా తెలియకపోవచ్చు. ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేసిన నాటి నుంచి మేం (న్యాయవాదులు) పలు ఇబ్బందులు పడుతున్నాం. హైకోర్టుకు వస్తుంటే ఎడారి ప్రాంతానికి వెళ్లినట్లు ఉంటోంది. ఎక్కడో అడవిలో తెచ్చి హైకోర్టు కట్టారు. ఇక్కడ తాగటానికి నీళ్లు ఉండవు.. టీ ఉండదు.. తినడానికి తిండి ఉండదు. ప్రతి రోజూ మేం ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. ఏమీ దొరకని చోట హైకోర్టును ఎందుకు కట్టాల్సి వచ్చింది?’ అని సత్యనారాయణ ప్రసాద్ కోర్టుకు నివేదించారు. ఈ న్యాయస్థానంలో దాఖలయ్యేవి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కావని, అన్నీ రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలేనన్నారు. ఓ కానిస్టేబుల్ తప్పు చేస్తే సీఎంను, డీజీపీని తప్పుబడుతూ న్యాయస్థానాలు మాట్లాడటం ఎంతవరకు సమంజసమన్నారు. మానవ సహజంగా ఉద్రేకంలో ఓ కానిస్టేబుల్ తప్పు చేస్తే సీఎంకు, డీజీపీకి ఆపాదించడం సబబు కాదన్నారు. tags : ap, highcourt