A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు నుంచి అలా ఆశించడం అత్యాశేనేమో
Share |
December 2 2020, 6:02 pm

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యలలోను రాజకీయాలు చొప్పించడం ద్వారా ఆయన చెప్పిన లక్ష్యాన్ని ఆయనే దెబ్బతీసుకున్నట్లయింది.స్వార్థ రాజకీయాలను పక్కనబెట్టి.. రేపటి పౌరుల గురించి బాధ్యతగా ఆలోచించినప్పుడే అబ్రహం లింకన్, జవహర్ లాల్ నెహ్రూ వంటి నేతలు కలలుగన్న సమాజం సిద్ధిస్తుందని ఆయన అన్నారు.ఇంతవరకు మంచి మాటే. ఎవరం కాదనం. కాని ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు చూడండి.ఇప్పుడు అటు విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసి, ఇటు పరిశ్రమలను వాటాల కోసం బెదిరించి వెళ్ళగొట్టి యువత ఉపాధికి గండికొట్టడం విషాదకరం. ఇలాగైతే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? అని ఆయన ప్రశ్నించారు. ఏ ఒక్క సందర్భంలోనూ ఆయన రాజకీయం చేయకుండా ఉండరని,ఎపిలో ఉన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఉండరని అర్ధం అవుతుంది.దీనినే ప్రతి విషయంలో రాజకీయం చేయడం అంటారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నట్లు వ్యాఖ్యానించే చంద్రబాబు ఎన్నడైనా స్కూళ్లను బాగు చేయాలన్న ఆలోచన చేశారా అన్నదానికి సమాధానం చెప్పాలి.
వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టిన కార్యక్రమాలు పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాలు కాదని చంద్రబాబు అనడం సాహసం వంటిదే.ఉదాహరణకు జగన్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ స్కూళ్లలో నాడు-నేడు అన్న కొత్త కార్యక్రమం చేపట్టారు. అనేక ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా అక్కడ సదుపాయాలు సమకూర్చడం చంద్రబాబుకు కనిపించడం లేదా? మొదటి దశలో 14500 స్కూళ్లను అత్యంత ఆధునిక స్కూళ్లుగా చేసిన ఘనత జగన్ ది కాదని చంద్రబాబు చెప్పగలరా? అంతేకాదు. పేదలు తమ పిల్లలను కూలీకి పంపిచడం కాకుండా, స్కూళ్లకు పంపితే అమ్మ ఒడి కింద ఏడాదికి 15 వేల రూపాయలు ఇవ్వడాన్ని చంద్రబాబు సమర్దిస్తారా? తప్పు పడతారా?ఎప్పుడైనా చంద్రబాబు తన హయాంలో అలాంటి ఆలోచన చేశారా? స్కూళ్ల గురించి, అక్షరాస్యత గురించి ఆలోచించి ఉంటే ఇప్పటికీ 33 శాతం నిరక్షరాస్యత ఎపిలో ఎందుకు ఉందన్నదానికి ఆయన జవాబు ఇవ్వగలరా? పిల్లలకు మధ్యాహ్న బోజనం విషయంలో కాని ,వారికి పుస్తకాలు, బూట్లు మొదలైన వాటిని జగన్ ప్రభుత్వం ఇచ్చిన తీరు కాని పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడేవి కావని చంద్రబాబు చెప్పగలరా? ఏదో ఒక విమర్శ చేయాలని చేయడం కాదు.ఏదైనా మంచి సలహా ఇస్తే ఆయన వయసుకు తగినట్లు ఉంటుంది.అలాకాకపోతే ఆయనకు, ఆయన పార్టీకే నష్టం అన్న సంగతి చంద్రబాబు ఇప్పట్లో అర్దం చేసుకోలేరేమో అనిపిస్తుంది.చదువు పూర్తిచేసుకుని బయటకు వచ్చిన ప్రతి విద్యార్థికీ ఉజ్వల భవిష్యత్తు ఉండేలా... యూనివర్సిటీలకు, పారిశ్రామిక వేత్తలకు, కంపెనీలకు వారధిగా మన విద్యావ్యవస్థను గత ఐదేళ్ళ తెలుగుదేశం పాలనలో తీర్చిదిద్దాం అని చంద్రబాబు చెబుతున్నారు. అంత గొప్పగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేసి ఉంటే ప్రజలు తెలివి తక్కువగా ఆయనను ఓడించారా?కేవలం కార్పొరేట్ స్కూళ్లకు, కార్పొరేట్ కాలేజీలకు ప్రాధాన్యం ఇచ్చి, ఒక కార్పొరేట్ విద్యా సంస్థల యజమానికి మంత్రి పదవి ఇచ్చిన ఘనత చంద్రబాబుదే.అది ఎందుకు చేశారో ఆయన ఆత్మను అడిగితే తెలుస్తుంది.అంతేకాదు..యూనివర్శిటీలలో సభలు పెట్టి రాజకీయాలు మాట్లాడిన చరిత్రను చంద్రబాబు మర్చిపోతున్నారా? చంద్రబాబు తన గత ఐదేళ్ల పాలనలో ఎపిలో తెచ్చిన పరిశ్రమలు ఎన్ని? వాటిలో వచ్చిన ఉద్యోగాలు ఎన్ని?విద్యా వ్యవస్థలో అసలు ఏమి మార్పులు చేయగలిగారు? ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో స్కిల్ యూనివర్శిటీలను ఏర్పాటు చేస్తున్నారు.చంద్రబాబు కూడా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పెట్టిన మాట నిజమే. కాని దానిని ఎలా ఆయన వాడుకున్నది అప్పటి అధికారులతో మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయి.అయినా తన పార్టీ గురించి గొప్పగా చెప్పుకోవడాన్ని మనం తప్పు పట్టనక్కర్లేదు. కాని ఆ తర్వాత వ్యాఖ్య చూడండి.
మన రాష్ట్రంలో పిల్లలు ప్రతిరోజూ వైసీపీ నేతల బూతులు వినాల్సి రావడం బాధాకరం. తల్లిదండ్రులతో కలిసి బిడ్డల సామూహిక ఆత్మహత్యలను చూడాల్సి వస్తోంది. బాల్యంలోనే భయంకర అఘాయిత్యాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇవన్నీ ఇలాగే కొనసాగితే రేపటి సమాజాన్ని ఊహించుకుంటేనే భయమేస్తోంది అని చంద్రబాబు ఎంత దారుణంగా మాట్లాడారో గమనించండి .చంద్రబాబు ఏ ఉద్దేశంతో ఈ మాటలు అంటున్నారు. స్వయంగా చంద్రబాబు దళితులలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అన్న సంగతి ఆయన మర్చి పోయి ఉండవచ్చు.నాయి బ్రాహ్మణులు సచివాలయానికి వస్తే దేవాలయం వంటి ఆఫీస్ కు మీరు వస్తారా? మీ సంగతి చూస్తాననడం బూతు కాదని ఆయన అనుకుంటున్నట్లున్నారు. మత్సకారులను ఉద్దేశించి తోక కట్ చేస్తానని అనడాన్ని ఏమంటారు.దళితులు పరిశుబ్రంగా ఉండరని ఆయన మంత్రి ఆదినారాయణ రెడ్డి అనడం బూతు కాదు. అసెంబ్లీలో అచ్చెన్నాయుడు,బొండా ఉమా వంటి వారు నువ్వు మగాడివైతే అని,,..నీ అంతు చూస్తాం అని ఆనాటి ప్రతిపక్ష నేత జగన్ ను ఉద్దేశించి బూతులు మాట్లాడితే అవన్ని సూక్తి ముక్తావళిగా చంద్రబాబు భావించారా?మరో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులను ఉద్దేశించి మీకు ఎందుకురా! రాజకీయాలు ..అంటూ చేసిన వ్యాఖ్యలను ఏమని అనుకోవాలి? నిజమే టిడిపి, అయినా, వైసిపి అయినా ఎవరైనా సభ్య భాషలోనే మాట్లాడాలి. కాని అదేదో వైసిపి నేతలు అచ్చంగా బూతులు మాట్లాడుతున్నట్లు టిడిపి నేతలు పరమ సాధు పుంగవులని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అన్నిటిని మించి పిల్లలకు నేర్పవలసింది అసత్యాలు చెప్పవద్దని.. నిజాయితీగా ఉండాలని, రుజువర్తన కలిగి ఉండాలని.తాను అబద్దాలు ఆడ లేదని తన గుండెమీద చేయి వేసుకుని చంద్రబాబు చెప్పగలరా? ఎన్నికల ప్రచారంలో ఎన్ని మాటలు చెప్పారు? అదికారంలోకి వచ్చాక ఎన్ని మాటలు మార్చారు? అవన్ని చర్విత చరణంగా చెప్పలేం.కాని పిల్లలకు ఆదర్శంగా ఉండవలసిన ముఖ్యమంత్రి స్థాయిలోని వారు,మంత్రి పదవులలో ఉన్నవారు ఎన్ని అబద్దాలు ఆడారో లెక్కవేయడం కష్టం కావచ్చు. అమెరికా అద్యక్షుడు తన నాలుగేళ్లలో ఇరవై వేల అబద్దాలు ఆడారని ఒక పత్రిక లెక్క గట్టింది. మరి మన దేశంలో నేతల గురించి ఏమి చెప్పగలం. అందులోను చంద్రబాబు వంటి వారు ఎన్ని వేల అబద్దాలు అనండి,అసత్యాలు అనండి..మాట మార్చడాలు అనండి ఎన్నిసార్లు చేశారో ఎవరైనా లెక్కించగలరా? ట్రంప్ రికార్డును బహుశా ఈయన దాటి పోవచ్చని ఎవరైనా అంటే కాదనగలమా?పిల్లలపై అకృత్యాల గురించి కూడా చంద్రబాబు ప్రస్తావించడం శోచనీయం. అదేదో ప్రభుత్వం దగ్గర ఉండి చేయించిందన్న అబిప్రాయం కలగాలన్న దురుద్దేశంతో ఆయన మాట్లాడారు. నాగార్జున యూనివర్శిటీలో రిషికేశ్వరి అనే యువతి ఆత్మహత్య ఘటనతో సహా అనేక దుర్ఘటనలు అనేకం ఆయన హయాంలో జరిగాయి.అప్పుడు ఆయన ప్రభుత్వం పూర్తి బాద్యతారహితంగా వ్యహరించిందన్న విమర్శలు వచ్చాయి. ఆయన టైమ్ లో 2017లో పదిహేడు వేల నేరాలు జరిగినట్లు నేషనల్ క్రైమ్ బ్యూరో వెల్లడించింది. అవన్ని చంద్రబాబు ప్రభుత్వం వల్లే జరిగాయని ఆయన ఒప్పుకుంటే ఇప్పుడు వైసిపి ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టవచ్చు. అబ్రహం లింకన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ప్రస్తావించడం బాగానే ఉంది. పెద్దలు ప్రారంభించిన పనులను కొనసాగించేది పిల్లలే అని లింకన్ అన్నారని తెలిపారు. మంచిదే. అవి మంచి పనులైతే కొనసాగించాలి కాని, రియల్ ఎస్టేట్ స్కామ్ లు చేయడం, చేసిన వాగ్దానాలను విస్మరించడం, లేక నిర్మాణం కాని రాజధాని,నిర్మాణం పూర్తి కాని పోలవరం వంటి వాటిని చూడాలంటూ వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృదా చేయడం కూడా ఆదర్శవంతమే అవుతుందా ?ఓటుకు నోటు కేసు ద్వారా ఒక ప్రభుత్వాన్ని కూల్చాలని యత్నించడం, సొంత మామ ఎన్.టి.ఆర్.ను పదవి నుంచి దించడానికి కుట్ర పన్నడం వంటివి పిల్లలకు చెప్పవలసిన ఆదర్శాలు అవుతాయా అన్న ప్రశ్నలు వేస్తే వాటికి ఏమైనా జవాబు ఉంటుందా?తన కుమారుడు,మనుమడు , తన పార్టీ నేతల పిల్లలు మాత్రం ఆంగ్ల మీడియంలో చదువుకోవచ్చు..పేదల పిల్లలు మాత్రం తెలుగులోనే చదువుకోవాలన్నట్లుగా తెలుగుదేశం వారు వ్యవహరిస్తున్న తీరు సమర్ధనీయమని ఎవరైనా చెప్పగలరా? చంద్రబాబు నాయుడు పిల్లలకు శుభాకాంక్షలు చెప్పడం తప్పు కాదు. ఆ సందర్భంగా నాలుగు మంచి మాటలు చెప్పడం ఆక్షేపణీయం కాదు. కాని ఉన్నవీ,లేనివి కలిపి ప్రతి సందర్భంలోను వైసిపి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి జగన్ పై బురద చల్లాలని ప్రయత్నించడమే దారుణంగా ఉంటుంది.ఒక్కమాట చెప్పవచ్చు. జగన్ అధిక ప్రాదాన్యం ఇస్తున్నదే విద్య,వైద్య రంగాలకు. ఆ విషయం ప్రజలలోకి వెళుతోంది. అందువల్లే ప్రభుత్వ స్కూళ్లలో చేరే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది. చంద్రబాబు ప్రతక్ష్యంగానో,పరోక్షంగా చేస్తున్న విమర్శలకు అదొక్కటే సమాదానం అవుతుంది. డెబ్బై ఏళ్ల వయసులో చంద్రబాబు హుందగా వ్యాఖ్యలు చేయాలని కోరుకోవడం అత్యాశే అవుతుందా?ఆయన నుంచి పిల్లలైనా ,పెద్దలైనా ఆశించేది అదొక్కటే.

tags : chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info