A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గాలి వానలో, నాన నీటిలో పడవ..హైదరాబాద్
Share |
November 25 2020, 8:06 am

గాలి వానలో, వాన నీటిలో పడవ ప్రయాణం మాదిరి హైదరాబాద్ వాసుల జీవితం అల్లకల్లోలం అయిందంటే ఆశ్చర్యం కాదు.వందల కాలనీలు రోజుల తరబడి నీటి లో నానిన తీరు చూస్తే తీవ్రమైన ఆవేదన కలుగుతుంది. ఇదంతా ప్రకృతి వైపరీత్యమా? లేక మానవ తప్పిదమా? అంటే ఏమి చెబుతాం. రెండు కలగలసి ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టాయి. మూడు,నాలుగు దశాబ్దాల క్రితం హైదరాబాద్ లో వర్షం కురిస్తే, ఐదు,పది నిమిషాలలో ఎక్కడ నీరు అక్కడ కనబడకుండా వెళ్లిపోయేది. ఈ వరదలు, కాలనీల మునక వంటివి అప్పట్లో లేవనే చెప్పాలి. ఆ తర్వాత కొంత కాలం వర్షాలు అంతంతమాత్రంగా ఉండడం , ఉమ్మడి ఎపిలోని వివిద ప్రాంతాల నుంచి ఉపాది అవకాశాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలిరావడం, ఆ క్రమంలో కొత్త కాలనీలు ఏర్పడడం వంటివి జరుగుతూ వచ్చాయి. దీనిని కొందరు కబ్జాదారులు, రియల్టర్ లు అడ్వాంటేజ్ గా మార్చుకుని ఆ స్థలం, ఈ స్థలం అని చూడకుండా, చెరువులు, పార్కులు ఏది వీలైతే దానిని కబ్జా చేసేశారు. అధికారిక వ్యవస్థ కూడా చూసి చూడకుండా వదిలేసింది.నాలాలు ఆక్రమణ అన్నది సర్వ సాదారణం అయింది. ఒక క్రమబద్దంగా పెరగవలసిన హైదరాబాద్ నగరం అనేక చోట్ల గందరగోళంగా మారుతూ వచ్చింది. అప్పుడప్పుడూ భారీ వర్షాలు కురిసినా వాటివల్ల ఏవో కొన్ని ఓట్ల మాత్రమే ప్రజలకు ఇబ్బంది రావడం , ఆ రెండు,మూడు రోజులు సర్దుకుపోవడం జరిగిపోతూ వచ్చింది. కాని ఈ సారి పరిస్థితి అంత సింపుల్ గా లేదు. కార్లు , మోటార్ బైక్ లు వంటివి వరదలలో కొట్టుకుపోతుంటాయని వేరే దేశాలు, వేరే రాష్ట్రాలకు సంబందించి వచ్చిన వార్తలు ,వీడియోలు చూసి ఆశ్చర్యం చెందే హైదరాబాద్ వాసులు, సడన్ గా తమకు ఆ సంక్షోభం వస్తుందని ఊహించలేదు. వందలాది చెరువులు ఒక్కసారి పొంగి కాలనీలన్నటిని ముంచెత్తాయి. ప్రజల బతకును చిద్రం చేశాయంటే ఆశ్చర్యం కాదు.ఆయా కాలనీలలో కార్లు కొట్టుకుపోయి ,ఆరేడు అడుగుల మట్టిలో కూరుకుపోవడం హైదరాబాద్ చరిత్రలో బహ/శా మొదటి సారి కావచ్చు.ఎప్పుడో 1908లో ఇలాంటి వరద వచ్చిందట. కాని ఈ నాలుగైదు దశాబ్దాలలో మాత్రం రాలేదు. ఒక మీడియా అంచనా ప్రకారం ఒక్క హైదరాబాద్ నగరానికి పదిహేను వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది . వేలాది ఇళ్లు నీట మునగడంతో ,ఆ ఇళ్లలోని టీవీలు, ప్రిజ్ లు, వాషింగ్ మిషన్ వంటి విలువైన వస్తువులు సైతం పాడయ్యాయి.గతంలో పేదల ఇళ్లకే వరద బెడద ఉండేది. అలాంటిది ఈసారి పేదలతో పాటు , మధ్య తరగతి,ఎగువ మద్య తరగతి ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో సఫర్ అయ్యారు.ఈ వరద నీరు కారణంగా ఎక్కడ ట్రాఫిక్ అక్కడ ఆగిపోయే గంటల తరబడి తమ కార్లలోనే ఉండిపోవలసిన దయనీయ పరిస్థితిని హైదరాబాద్ వాసులు చవిచూశారు.ఈ వరదలలో రెండున్నర లక్షల కార్లు, ఐదు లక్షల మోటారు బైక్ లు నీట మునిగాయని ఒక అంచనా. వీటి రిపేర్లకే 1500 కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుందని లెక్క వేస్తున్నారు. మామూలుగా అయితే చెరువులు వర్షాలకు నిండితే, అక్కడ నుంచి తూముల ద్వారా మరో చెరువుకు నీరు వెళ్లాలి. అలా గొలుసుకట్టు చెరువుల వ్యవవ్థ ఒకప్పుడు హైదరాబాద్ లో ఉండేది. కాని ఇప్పుడు అవన్ని ఆక్రమణలకు గురి కావడం, కాంక్రీట్ జంగిల్ గా మారడంతో చెరువులు నిండిపోయి,వరద నీరు పోయే మార్గం లేకపోవడంతో కాలనీలపై పడడం, ప్రజల బతుకులన్నీ ఆగమాగమడం జరిగింది. నిజమే ఈసారి అసాధారణ వర్షం కురిసింది. మామూలుగా ఐదు సెంటిమీటర్ల వర్షం కురిస్తే తట్టుకునే స్ట్రామ్ వాటర్ డ్రైన్ లు ఉన్నాయి. కాని ఈసారి 20 నుంచి ముప్పై సెంటిమీటర్ల మేర వర్షం కురవడంతో ప్రభుత్వం కూడా నిస్సహాయ స్థితిలో పడింది. హైదరాబాద్ లో పడవల ద్వారా సహాయ చర్యలుచేపట్టవలసి వస్తుందన్నది ఊహించని పరిణామమే అని చెప్పాలి.డ్రైనేజీలు ,చెరువులు అన్నీ ఏకం అయిపోయాయి. వారం రోజుల పాటు ఇళ్లు నీటి మడుగులో ఉండడం అసాధారణమే. దాని ఫలితంగా ప్రజలు ఒక్కో కుటుంబం లక్షల రూపాయల నష్టాన్ని చవిచూశాయి.ప్రభుత్వం దీనిపై సకాలంలోనే స్పందించినా, ప్రభుత్వం కూడా ఒక దశలో నిస్సహాయ స్థితిలో పడిపోయిందని చెప్పాలి. తదుపరి ముఖ్యమంత్రి కెసిఆర్ సహాయ చర్యలలో భాగంగా ఇంటికి పదివేల రూపాయలు, ఇల్లు పడిపోతే లక్ష రూపాయలు, దెబ్బతింటే ఏభైవేల రూపాయలు ఇస్తామని , వరదబాదితులను ఆదుకుంటామని ప్రకటించి అందుకు అనుగుణంగా నిదులు మంజూరు చేశారు. మంత్రి కెటిఆర్ ఆయా కాలనీలు సందర్శించి ప్రజలకు భరోసా ఇవ్వడానికి ప్రయత్నించారు. గత ఎన్నికల సమయంలో హైదరాబాద్ ను డల్లాస్ మాదిరి అభివృద్ది చేస్తామని కెసిఆర్ ప్రచారం చేసేవారు. ఈ విషయాన్ని ప్రతిపక్షం వ్యాఖ్యానిస్తే, ఇంత పెద్ద వర్షం వస్తే, డల్లాస్ అయినా, న్యూయార్క్ అయినా, హైదరాబాద్ అయినా ఒకటే అని మంత్రి కెటిఆర్ బదులు ఇచ్చారు. కాకపోతే కొద్ది కాలం క్రితం కెటిఆర్ ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ హైదరాబాద్ విశ్వనగరంగా మారుతోందని సగర్వంగా ప్రకటించారు. కాని ఇప్పుడు ఈ వరదలతో విశ్వ నరకంగా మారిందని మీడియాలో విశ్లేషణలు వచ్చాయి. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు ఈ వరదలకు పూర్తిగా ప్రభుత్వాన్నే తప్పు పట్టలేం. ప్రజలు కూడా ఎక్కడ పడితే అక్కడ ఇళ్లు కట్టడం, చెరువు గర్భాలను సైతం ఆక్రమించడం, వర్షాలు కురిస్తే, ఆ నీరు పోవడానికి సరైన కాల్వల వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం , అదికారులు కూడా పట్టినట్లు వ్యవహరించడం ..ఇలా వివిధ కారణాల వల్ల హైదరాబాద్ కు ఈ దుస్థితి ఏర్పడింది.సుమారు పది లక్షల కుటుంబాలు వరద ప్రభావానికి గురయ్యాయని అంచనా. తరచుగా ముంబై నగరంలో ఈ వరదల బెడద చూస్తుంటాం. ఈ సారి హైదరాబాద్ లో ఆ పరిస్థితి ఏర్పడడం ఆందోళన కలిగించే విషయమే. మరి ఇప్పుడు ప్రభుత్వం ఈ అనుభవంతో అయినా మేలుకుంటుందా అంటే చెప్పలేం. ఎందుకంటే ఎక్కడ ఏ ఆక్రమణలోని ఇళ్లను కదల్చినా అదో పెద్ద సమస్య అవుతుంది. వేలాది మంది నిరాశ్రయులవుతారు. ఎన్ని ఇళ్లనైనా ప్రభుత్వం తొలగించగలుగుతుంది. దానికి ప్రత్యామ్నాయంగా ఏమి చేయాలన్నదానిపై శాస్త్రీయంగా నిపుణులతో ప్రణాళికలు వేయించి అమలు చేయడమే మార్గంగా కనిపిస్తుంది.భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రావన్న గ్యారంటీ లేదు. అందువల్ల చెరువుల, రిజర్వాయిర్లు నిండి ,పొంగే పరిస్థితి వస్తే అది వరదగా మారి ప్రజల ఇళ్లపై పడకుండా నివారణ చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం ద్వారానే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పాలి.

tags : hyderabad

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info