A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సినీ పరిశ్రమ-డబ్బు-పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు
Share |
November 25 2020, 8:14 am

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా తో మాట్లాడిన విషయాలను ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఎన్నికల కోసం రూ.వందల కోట్లు ఖర్చు చేసే నాయకులు
వరద బాధితుల కోసం ఆ సొమ్ము బయటకు తీయాలి
• రాజకీయాల కోసం పెట్టుబడి అను కొని ఆదుకోండి
• రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇన్ఫ్రా సంస్థల వాళ్ళకు రూ. వేల కోట్లు సామర్థ్యం ఉంది
• నేతలు, వ్యాపారులతో పోలిస్తే సినిమావాళ్ళ దగ్గర ఉన్న సంపద ఎంత?
• విపత్తుల సమయంలో ఆదుకోవడంలో ప్రథమ బాధ్యత ప్రభుత్వానిదే
• జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు
“గత కొన్ని దశాబ్దాలుగా చూడనంత వర్షం, వరదల మూలంగా హైదరాబాద్ నగరం అతలాకుతలం
అయిపోయింది. ఇంతటినష్టం జరగడానికి ముఖ్య కారణాలు పట్టణ ప్రణాళిక లోపం
ఒకటైతే... చట్టాలను తుంగలో తొక్కి నాలాలను ఆక్రమించడం మరొకటి. ఓటు బ్యాంకు
రాజకీయాల కోసం నిబంధనలకు తూట్లు పొడవడం వల్ల జరిగిన నష్టం ఇది” అని జనసేన
అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వరద బాధితులను ఆదుకొనే
విషయంలో రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ముందుండాల్సిన అవసరం ఉందని
తెలిపారు. ఎన్నికల్లో గెలిచేందుకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసే నాయకులు
ఇలాంటి ప్రకృతి విపత్తుల మూలంగా కష్టాల పాలవుతున్నవారిని గట్టెక్కించేందుకు
సిద్ధపడాలని సూచించారు. జనసేన పార్టీ సోషల్ మీడియాతో మాట్లాడుతూ వరదల
పరిస్థితి, బాధితులను ఆదుకోవడంలో పాలకుల బాధ్యత, నేతలు పోషించాల్సిన పాత్ర
తదితర అంశాలపై శ్రీ పవన్ కల్యాణ్ వెల్లడించిన అభిప్రాయాలివి...
• అక్రమ కట్టడాలపై దృష్టిపెట్టాలి
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ముంచెత్తిన వరదల మూలంగా హైదరాబాద్ నగరంలో దాదాపు
50 మంది వరకు చనిపోయారు. ఈ దుస్థితికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమా? ప్రజల
అలసత్వమా?
హైదరాబాద్ నగరానికి గతంలో వరదలు రావడం, ప్రాణనష్టం జరగడం చూశాం. కానీ ఈ
స్థాయిలో ప్రాణనష్టం జరగడం ఎప్పుడు చూడలేదు. ఆరు దశాబ్దాల్లో ఎప్పుడు కూడా
ఇంత వర్షపాతం నమోదు కాలేదు. ఇంతటి ప్రాణనష్టం జరగడానికి ముఖ్య కారణాలు
పట్టణ ప్రణాళిక (అర్బన్ ప్లానింగ్) లోపం ఒకటైతే... చట్టాలను తుంగలో తొక్కి
నాలాలను ఆక్రమించడం మరొకటి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నిబంధనలకు తూట్లు
పొడవడం వల్ల జరిగిన నష్టం ఇది. టీఆర్ఎస్ ప్రభుత్వం నాలాలపై అక్రమ కట్టడాలను
తొలగిస్తామని చెప్పారు. కానీ ఎందుకు ముందుకు వెళ్లలేకపోయారో తెలియదు.
ఇప్పటికైనా అక్రమ కట్టడాలపై దృష్టి సారించి సాధ్యమైనంత వేగంగా తొలగించాలి.
ఇళ్లు కోల్పోయిన వారికి వేరే చోట ప్రత్యమ్నాయ నివాస స్థలం ఏర్పాటు చేస్తే
భవిష్యత్తులో ఇలాంటి నష్టం జరగకుండా ఆపగలం. వరదలు వల్ల ప్రాణాలు కోల్పోయిన
వారి కుటుంబ సభ్యులకు నా తరపున, జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని
తెలియజేస్తున్నాను.

• కొన్నిసార్లు ప్రభుత్వానికి చేయూత అవసరం
ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత-ప్రభుత్వం,
సమాజం, సంపన్నులపై ఏ స్థాయిలో, ఎంతవరకూ ఉంటుంది?
విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం. సమస్య
వచ్చినప్పుడు సంరక్షిస్తారనే ప్రభుత్వం అనే వ్యవస్థను ప్రజలు ఎన్నుకున్నారు.
ఎంతో శ్రమించి పన్నులు కట్టి ఆర్థిక వ్యవస్థను ముందుకు నడుపుతున్నారు. ప్రతి
పనికి విధివిధానాలు ఉన్నాయి. వాటన్నింటినీ సక్రమంగా అమలు చేయాల్సింది రాజకీయ
వ్యవస్థ, బ్యూరోక్రసీ. ఇలాంటి విపత్కర సమయంలో అధికారం ఎవరి చేతుల్లో ఉందో
వారే ముందుగా బాధ్యత తీసుకోవాలి. కొన్నిసార్లు అధికారంలో ఉన్నవారికి కొంత
చేయూత అవసరం అవుతుంది. అలాంటి సమయంలో కచ్చితంగా పేరున్నవాళ్లు, సంపన్నులు
ప్రభుత్వాలకు అండగా నిలబడాలి. రైట్ గవర్నమెంట్ ఉంటే చాలా బలంగా అందరూ ముందుకు
వస్తారు. అసలు ఎవరు వచ్చినా రాకపోయినా ప్రభుత్వం తమ పని తాము చేసుకుపోవాలి.
అందరి ఉమ్మడి డబ్బు అయిన ప్రభుత్వ ఖజానాలోని నిధులను ఇష్టారాజ్యంగా కాకుండా
ఇలాంటి విపత్తుల సమయంలో నిజమైన బాధితులకు అందేలా చూడాలి. అయితే
దురదృష్టవశాత్తు కొన్ని దశాబ్దాలుగా ఆ విధంగా జరగకపోవడంతోనే సమస్యలు
తలెత్తున్నాయి. దీంతో ప్రభుత్వ పాత్ర ఎంత అనే దృష్టి నుంచి వ్యక్తుల మీదకు
వెళ్తుంది. ఇలాంటి సమయంలో మనందరం దృష్టి పెట్టాల్సింది ప్రభుత్వం ఎంత
సమర్ధవంతంగా పనిచేస్తుంది, గత ప్రభుత్వాలు చేసిన తప్పులు ఏమిటి? లోటుపాట్లు
ఏమిటి? ఆ ప్రభావం కూడా ఈ ప్రభుత్వంపై ఎంత పడిందని నిష్పక్షపాతంగా చూడాలి.
నేనయితే అలానే చూస్తాను.
• సినీ రంగానికి పేరు మాత్రమే ఆకాశమంత
చిత్ర పరిశ్రమలో చాలా సంపద ఉంటుందని అభిప్రాయం సాధారణ ప్రజానీకంలో ఉంది.
విపత్తులు జరిగినప్పుడు సినిమా పరిశ్రమ స్పందిస్తూనే ఉంది. విరాళాలు ఇస్తూనే
ఉన్నారు. కానీ సరిపోయినంత ఇవ్వడం లేదనే విమర్శ కూడా ఉంది. ఈ విషయాన్ని మీరెలా
చూస్తారు?
సరిపోయినంత ఇవ్వడం లేదని నిర్ధారించేది ఎవరు? సరిపోయినంత ఇవ్వడం లేదని
నిర్ధారించే వాళ్లు వారి జేబుల నుంచి పది రూపాయలైన తీసి ఇచ్చారా? కష్టపడి పని
చేసి సంపాదించిన డబ్బు నుంచి కోటి రూపాయలు, పది లక్షలు రూపాయలు విరాళాలుగా
ఇవ్వాలంటే అలాంటివారికి మనసు ఒప్పుతుందా? అలాంటిది నా వరకు నేను తీసుకుంటే
కొన్ని కోట్లు విరాళాలు ఇచ్చాను. అలా చేయాలంటే చాలా పెద్ద మనసు కావాలి. చిత్ర
పరిశ్రమలో పేరున్నంతగా డబ్బు ఉండదు. ఆరెంజ్ సినిమాకు నష్టం వస్తే అప్పులు
తీర్చడానికి ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. అత్తారింటికి దారేది సినిమా
విడుదలకు ముందే పైరసీకి గురయి నెట్ లో రిలీజ్ అయితే కొనటానికి ఎవరూ ముందుకు
రాలేదు. గ్యారంటీ సంతకాలు చేసి రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇన్ని కష్టనష్టాలు
ఉంటాయి. సినిమా రంగంలోనివారికి పేరేమో ఆకాశానికి ఉంటుంది కానీ డబ్బు ఆ
స్థాయిలో ఉండదు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలా ఇక్కడ వేల కోట్ల రూపాయల
టర్నోవర్ ఉండదు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులు వందల కోట్లు
ఖర్చు చేస్తారు. ఆ స్థాయి డబ్బులు ఇక్కడ ఉండవు.

tags : pawankalyan, cene industry

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info