A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముఖ్యమంత్రి జగన్ ది సాహసమేనా
Share |
October 27 2020, 9:01 am

నాయకుడు అన్నవాడికి ధైర్యం ఉడాలి. సాహసం ఉండాలి. గుండెబలం ఉండాలి.ఏ పరిణామం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలి. తనపై కుట్రలు జరుగుతున్నదన్న భావన కలిగినప్పుడు ఛేదించడానికి అవసరమైతే వ్యూహం ఉండాలి.తాను ఒక కొండను ఢీకొడుతున్నాను.. ఆ సత్తా తనకు ఉందన్న ఆత్మ విశ్వాసం ఉండాలి. ఇవన్ని కలబోసిన వ్యక్తిగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారంటే అతి శయోక్తి కాదు. అదేదో ఎపిలోనో, తెలంగాణలోనో మాత్రమే కాదు. దేశంలో చాలా మంది దృష్టిలో ఇప్పుడు ఆయన ఒక హీరో. న్యాయ వ్యవస్థలోని కొందరు తన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న సంశయం వచ్చిన వెంటనే ఆయన స్పందిచిన తీరు దేశ చరిత్రలోనే ఒక కొత్త రికార్డు, ఒక పెను సంచలనం.గతంలో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొందరు జడ్జిలపై కేంద్రానికి పిర్యాదు చేశారు. వారి పేర్లను ఉదహరించి మరీ అవినీతి ఆరోపణలు చేస్తూ ఆయన లేఖ రాశారు. ఆ తర్వాత జగన్ ఇప్పుడు ఈ సాహసం చేశారు. తెలుగుదేశం కు మద్దతు ఇచ్చే రెండు పత్రికలు తప్ప మీడియాలో ఎక్కువ భాగం, జాతీయ మీడియా సైతం విశేష ప్రాధాన్యత ఇస్తూ జగన్ పిర్యాదు వార్తను ఇచ్చాయి. అనేక మంది ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ న్యాయ వ్వస్థలోని కొందరిపై చేసిన ఆరోపణల మీద విచారణ జరగాలని ట్వీట్ లు పెట్టారు. సుప్రింకోర్టులో సీనియర్ జడ్జిగా , ఛీఫ్ జస్టిస్ అయ్యే అవకాశం ఉన్న జస్టిస్ రమణ పైన, ఆయన ప్రభావంతో తీర్పులు ఇస్తున్నారన్న అనుమానం వచ్చిన కొంతమంది ఎపి హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సుప్రింకోర్టు ఛీప్ జస్టిస్ బాబ్డేకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాయడం అంటే అది చిన్న విషయం కాదు. తనకు వ్యక్తిగతంగా గతంలో కూడా న్యాయ వ్యవస్థ ద్వారా ఎదురైన ఇబ్బందులు తెలుసు. ఆయన వాటిని ఎలా ఎదుర్కున్నారో ప్రజలంతా చూశారు. ఆయన అటు కేంద్రంలోని సోనియాను, ఎపిలో చంద్రబాబు వంటివారిని తట్టుకున్నానే తస్ప, పదహారు నెలలపాటు జైలులో ఉన్నారు తప్ప ఎక్కడా లొంగలేదు. పైగా జైలు నుంచి బయటకు వచ్చాక ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోకపోవడమే కాకుండా, టిడిపి ఇచ్చిన రుణమాఫీ వంటి హామీలు ఇవ్వకుండా ఓటమికి సిద్దం అయ్యారు. ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిత్యం తెలుగుదేశం పెట్టిన అవమానాలను ఆయన భరించారు. తన పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టిడిపి కొనుగోలు చేసినప్పుడు , వారిపై అనర్హత వేటు వేయాల్సిన స్పీకర్ పట్టించుకోనప్పుడు ఏకంగా అసెంబ్లీని బహిష్కరించి జనంలోకి వెళ్లిపోయారు. సుదీర్ఘమైన పాదయాత్ర చేయడం ద్వారా నిత్యం ప్రజలలో సంచరించారు.ఆ టైమ్ లో కూడా కనీసం కోర్టు మినహాయింపు రాకపోయినా అలాగే ఓర్చుకున్నారు. దేశంలోనే బహుశా ఇన్ని కష్టాలు పడి ప్రజల మద్దతు సాదించి అధికారం సాదించిన నేత ముఖ్యమంత్రి జగన్ మాత్రమే కావచ్చు. అంత కష్టపడి 151 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్ కు మళ్లీ ఇన్ని ఇబ్బందులు వస్తాయని మొదట ఎవరూ ఊహించలేదు. ప్రత్యేకించి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయా వ్యవస్తలలో ఉన్న తనవాళ్లతో ఎంత వీలైతే అంతగా జగన్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అనేక స్కీములను అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వానికి పలు ఆటంకాలు సృష్టించారు. దేశంలో బహుశా ఎక్కడా లేని విదంగా 320 ప్రజా ప్రయోజనాల వాజ్యాలు పడ్డాయంటే,వాటిని హైకోర్టు స్కీకరించిందంటే,వాటిలో 30 వరకు ముఖ్యమంత్రి జగన్ పేరును పెట్టినా న్యాయ వ్యవస్థ అనుమతించిందంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. ప్రభుత్వం వైపున కూడా కొన్ని లోపాలు ఉంటే ఉండవచ్చు. కాని ఎక్కువ సందర్భాలలో గౌరవ హైకోర్టువారు. గౌరవ న్యాయమూర్తులు కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానించడం, ప్రభుత్వాన్ని అవమానించేలా వ్యవహరించడం వంటివి జగన్ ప్రభుత్వానికి చాలా చికాకు కలిగించాయి. ఇప్పుడు ఆ కేసులన్నిటిని చర్విత చరణంగా చెప్పజాలం. ఉదాహరణకు ఆంద్రజ్యోతి పత్రిక న్యాయమూర్తుల టెలిపోన్ టాపింగ్ ఆరోపణలతో ఒక కధనాన్ని ఇస్తే,దానిని చెత్త వార్తగా చాలామంది భావించినా, ఎవరో వేసిన పిల్ ఆదారంగా హైకోర్టు స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యపరచింది. ఆ పత్రికకు నోటీసు ఇవ్వకుండా దేశంలోని అనేక సంస్థలకు నోటీసులు ఇవ్వడం విస్మయం కలిగించింది. ఈ మధ్య కాలంలో హైకోర్టు వ్యాఖ్యలు శృతి మించాయన్న అబిప్రాయం ఏర్పడింది. ఒకవైపు రాజకీయ నేతలైన ప్రజాప్రతినిధులపై కేసులు మాత్రం ఏడాదిలోగా తేల్చాలని సుప్రింకర్టు సూచిస్తున్న తరుణంలోనే , న్యాయ వ్యవస్థలోని ప్రముఖుల కుటుంబ సభ్యులపై ఆరోపణలుకాని, కేసుల ఎఫ్ ఐ ఆర్ లను కాని అసలు విచారించవద్దని ,ప్రచారం చేయరాదంటూ ఆదేశాలు ఇవ్వడంలో న్యాయ వ్యవస్థ అత్యంత వివాదాస్పదంగా వ్యవహరించిందన్న ఆరోపణ వచ్చింది. కొందరు న్యాయమూర్తుల పేర్లను ఉదహరించడం, ఏకంగా సుప్రింకోర్జు జడ్జి పై అభియోగాలు మోపుతూ ,ఆయా తీర్పులను ఉటంకిస్తూ లేఖ రాసిన తీరు న్యాయ వ్యవస్థలోని లొసుగులను బట్టబయలు చేసింది.న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు మద్య ఘర్షణ పతాక సన్నివేశంగా మారింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్లు రాజకీయ వ్యవస్థ సరిగా లేని మాట నిజమే. అదే సమయంలో ఇతర వ్యవస్థలు కూడా బాగోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కుంటున్నవారు కాని, సుప్రింకోర్టు జడ్జి ఎలా స్పందిస్తారన్నది ఇంకా తెలియరాలేదు. ఛీప్ జస్టిస్ బాబ్డే రియాక్షన్ తెలియడానికి కూడా టైమ్ పట్టవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం స్కామ్ లను విచారిస్తుంటే,సహకరించవలసిన న్యాయ వ్యవస్థ అందుకు వ్యతిరేకంగా స్టే లు ఇవ్వడం కూడా ప్రజలలో చర్చనీయాంశం అయంది. ఇక ప్రభుత్వం పేదలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలను హైకోర్టు నిలిపివేసిన తీరు కూడా చర్చనీయాంశం అయింది.ఈ నిర్ణయాలలో పూర్తిగా గౌరవ న్యాయమూర్తులదే తప్పు కాకపోయినా, పలు సందర్భాలలో ప్రజలలో సంశయాలు ఏర్పడిన మాట నిజం. ఈ నేపధ్యంలో ఎలాంటి పరిణామాలకు అయినా సిద్దపడి ముఖ్యమంత్రి జగన్ ఈ సాహసం చేశారని భావించాలి. ప్రధాని నరేంద్ర మోడీతో ఈ అంశాలన్నిటిని చర్చించిన తర్వాతే జగన్ ఈ లేఖ రాసి ఉంటారని భావిస్తున్నారు.అంతకుముందు తెలుగుదేశం మీడియా ఒక ప్రచారం చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ సా ముఖ్యమంత్రి జగన్ ను మందలించారని, న్యాయ వ్యవస్థపై విమర్శలు చేయవద్దని చెప్పారని, వారికి తోచిన కధనాలు ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రధాని మోడీని జగన్ కలవడం, ఆ తర్వాత సిజెకి పిర్యాదు పంపించడం జరగడంతో టిడిపి మీడియా అసలు సంబందిత వార్తలను కవర్ చేయకుండా , టిడిపితో, అలాగే న్యాయ వ్యవస్థలోని కొందరితో తమకు ఉన్న బందాన్ని అనుబంధాన్ని నిస్సిగ్గుగా బహిరంగ పరచుకున్నారనుకోవాలి.నిజానికి ఏ పత్రిక అయినా ఇలాంటి సెన్షేషనల్ వార్తలకు అత్యంత ప్రాదాన్యం ఇచ్చి కవర్ చేయాలి. కాని తమ కోడి కూయకపోతే తెల్లవారదనుకునే టిడిపి మీడియా మాత్రం ఆ వార్తలను కవర్ చేయలేదు. కాని జాతీయ స్థాయి మీడియా సుప్రింకోర్టు సీనియర్ జడ్జిపై జగన్ పిర్యాదు చేశారన్న వార్తకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రయోజనాలను కాపాడడానికి న్యాయ వ్యవస్థలోని కొందరు ప్రయత్నిస్తున్నారని నేరుగానే ఆరోపించారు. చంద్రబాబుకు ఆయా కేసులలో వచ్చిన స్టేలు,కేసులు అసలు విచారణకు రాకపోవడం వంటి పరిణామాలతో ప్రజలలో కూడా పలు అనుమానాలు వచ్చాయి.ఈ నేపధ్యంలో జగన్ లేఖ రాయడం, అందులో న్యాయ వ్యవస్థను గౌరవిస్తూనే, కొందరు జడ్జిల వ్యవహార శైలిని వివరించడం, వాటిని ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం ద్వారా చెప్పించడం అన్నీ కూడా పక్కాగా జరిగినట్లు కనిపిస్తుంది.సహజంగానే టిడిపి వారు దీనికి ప్రతి వ్యూహం పన్నుతారు. ఎపి ప్రభుత్వం మీదే దిక్కారం కేసులు పెట్టాలని మెస్సేజ్ లు పంపుతున్నారట.ఊహించినట్లుగానే జగన్ పై దిక్కార పిటిషన్ ను కొందరు సుప్రింకోర్టులో వేశారు.టిడిపి మీడియా అసలు వార్తను వేయలేదు కాని, ప్రభుత్వంపై కొందరు చేసిన విమర్శలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ ప్రచారం చేస్తోంది. ఏది ఏమైనా ఈ పరిణామాలతో న్యాయ వ్యవస్థ కొంత ఆత్మరక్షణలో పడిందని చెప్పాలి. అయితే అంతమాత్రాన ఆరోపణలకు గురైన వారు చూస్తూ ఊరుకుంటారా అన్న సంశయం కూడా ఉంది. మరో విశేషం ఏమిటంటే, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ మొత్తం ఎపిసోడ్ పై కొంత ఆలస్యంగా స్పందించారు. బహుశా ఆయన రహస్యంగా వ్యూహం తయారు చేసుకుంటుండవచ్చు. అక్కడే జగన్ కు, చంద్రబాబు కు తేడా ఉంది. చంద్రబాబు గుట్టుగా తనకు కావల్సిన విధంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తుంటారని ఎక్కువ మంది నమ్మకం. కాని జగన్ మాత్రం ఇంత పెద్ద విషయాన్ని కూడా ఫెయిర్ గా డీల్ చేసి, దానిని ప్రజలకు తెలియచెప్పడం ద్వారా తనకు ఎదురవుతున్న సమస్యలను వివరించారు. అందువల్లే జగన్ ఇప్పుడు హీరోగా ఎక్కువమంది దృష్టిలో కనబడుతున్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రను దెబ్బతీయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని, తన కేసుల నేపధ్యంలోనే ఈ ఆరోపణలు చేస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. వారు అంతవరకే పరిమితం అవుతున్నారు తప్ప, జగన్ ఆరోపణలలో వాస్తవం ఉందా?లేదా అన్న చర్చలోకి వెళ్లకుండా జాగ్రత్తపడుతున్నారు.దీనివల్ల జగన్ కు మరిన్ని సమస్యలు రావచ్చనే వారు కూడా ఉన్నారు. మరి ఎపి ప్రభుత్వం చేసిన ఆరోపణలపై సుప్రింకోర్టు ఛీప్ జస్టిస్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నదానిపై తదుపరి పరిణామాలు ఉండవచ్చు. న్యాయ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవల్సి ఉంటుంది. న్యాయ వ్యవస్థలో మార్పులు,జడ్జిల నియామకాల తీరుతెన్నులపై ఆలోచించుకోవలసిన టైమ్ మరోసారి వచ్చిందని భావించాలి.దేశ న్యాయ వ్యవస్థను ఒక కుదుపు కు గురి చేయడం ద్వారా జగన్ చరిత్ర సృష్టించారు. ఇక ప్రక్షాళనకు న్యాయ వ్యవస్థ సిద్దం అవుతుందా?లేదా అన్నది తేలాల్సి ఉంది.

tags : jagan, daring

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info