A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కావాలనే తీర్పులు ఇస్తున్నారా అన్న డౌట్ వస్తోంది
Share |
October 27 2020, 9:12 am

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఛీప్ జస్టిస్ బాబ్డేకి రాసిన లేఖపై విచారణ జరగాలని, అందులో పేర్కొన్న అంశాలను నిగ్గుతేల్చాలని రిటైర్డ్ న్యాయమూర్తి కృష్ణమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చట్టం ముందు అందరూ సమానులేనని.. చిరుద్యోగి అయినా, ఉన్నతోద్యోగి అయినా విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఆయన అబిప్రాయపడ్డారు. ఎపి హైకోర్టు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలలో కొన్ని సంశయాలు ఏర్పడ్డాయని, ఆ పరిస్థితి మంచిది కాదని ఆయన అన్నారు.
సీఎం జగన్‌ సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిపై ఆరోపణలు చేశారు. తన ఆరోపణలకు ఆధారాలను సమర్పించారు. వాటిపై సీజేఐ స్పందించి విచారణ జరిపించాలి. ప్రాథమిక ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలి. సీఎంవి ఆరోపణలు అంటున్నాం. కాబట్టి విచారణ జరిపితే అవి ఆరోపణలా? లేక వాస్తవాలా అన్నది తేలిపోతుంది. రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరూ నడుచుకోరాదు. వాటిని ఉల్లంఘించరాదు. దర్యాప్తు చేసే అధికారాన్ని ఓ చట్టం ఇచ్చినప్పుడు, ఆ అధికారాన్ని కోర్టులు ఎలా అడ్డుకుంటాయి? ఈ విషయంలో న్యాయస్థానాలు చాలా జాగరూకతతో, స్వీయ నియంత్రణతో పనిచేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.కొందరికి సంబందించి స్టేలు 15–16 ఏళ్లపాటు కొనసాగుతుండటంతో ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. వీటిని దూరం చేయడానికి కోర్టులు తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చి 16 నెలలవుతోంది. ఈ స్వల్ప కాలంలో హైకోర్టు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ జీఓలపై స్టేలు ఇచ్చింది. చాలా కేసుల్లో హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలనే తీర్పులిస్తోందా? అన్న సందేహాలు, అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఇలాంటి అనుమానాలకు తావిచ్చేలా న్యాయస్థానాలు వ్యవహారశైలి ఉండకూడదు. కేసులు కూడా కొందరు న్యాయమూర్తుల వద్దకే వస్తున్నాయని, వారే కావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిస్తున్నారన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఇక ఇళ్ల స్థలాలపై స్టే గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇన్ని అనుమానాలు ప్రజల్లో ఎందుకు కలిగించాలి?
ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు చాలా బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఓ చిన్న ఉద్యోగి లంచం తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తే వాటిపై విచారణ జరపాల్సిందే కదా. అవి రుజువైనప్పుడు, దాని ప్రభావం వ్యవస్థపై తక్కువగా ఉంటుంది. అదే ఓ ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తిపై ఆరోపణలు రుజువైనప్పుడు దాని ప్రభావం వ్యవస్థపై చాలా తీవ్రంగా ఉంటుంది. వాటిని విచారించకుండా అలా వదిలేస్తే వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదముంది. ఇది అన్నింటికన్నా ప్రమాదం. కాబట్టి ఫిర్యాదు అందినప్పుడు విచారణ జరిపి నిజానిజాలు తేల్చడం వ్యవస్థకే మంచిది. అసలు తప్పు చేయకుంటే భయపడాల్సిన అవసరం ఏముంది? ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు విచారణకు సహకరించి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి అని కృష్ణమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

tags : ap, highcourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info