A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి విభజనపై సుప్రిం విచారణే చేయలేదే
Share |
October 27 2020, 9:21 am

ఎపి ప్రభుత్వం చేపట్టిన పాలనా వికేంద్రీకరణ చట్టం, రాజదాని సంస్థ రద్దు వంటి అంశాలపై హైకోర్టు విచారణ జరుపుతున్న సందర్భంలో ఒక విషయం గుర్తుకు వస్తుంది. గౌరవ హైకోర్టు వారు శాసనమండలిలో జరిగిన ఈ చట్టాలకు సంబందించి జరిగినప ప్రొసీడింగ్స్ వీడియో తమకు సమర్పించాలని కోరడం ఆసక్తికరంగా ఉంది. అందులో జరిగిన విషయాలపై ఆదారపడి కూడా విచారణ జరుగుతుందేమో తెలియదు. ఈ సందర్భంలో ఒక విషయం ప్రస్తావనకు తేవడం తప్పు కాకపోవచ్చు. లోక్ సభలో ఎపి విభజన బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు తీవ్ర గందరగోళం చెలరేగింది. ఎపికి సంబందించిన ఎమ్.పిలు కొందరు , తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు ఎమ్.పిలు తీవ్ర ఘర్షణకు దిగారు. విజయవాడ కు అప్పట్లో ప్రాతినిద్యం వహించిన ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ ఏకంగా పెప్పర్ స్ప్రే నే ప్రయోగించారు. టిడిపి ఎమ్.పిలు కూడా వారిలో వారు ఘర్షణ పడ్డారు. మోదుగుల వేణుగోపాలరెడ్డి తనపై దౌర్జన్యం చేశారని నామా నాగేశ్వరరావు ఆరోపించారు. సమైక్య ఆంద్ర కోరుకునే ఎమ్.పిలు, విభజన కోరుకునే ఎమ్.పిల మద్య తీవ్రమైన పోరుమాదిరి సాగి ,లోక్ సభ ఒక విధంగా రణరంగంగా మారింది.ఈ గందరగోళంలోనే ఆనాటి స్పీకర్ మీరా కుమార్ విభజన బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు. కాని సమైక్య రాష్ట్రం కోరుకుంటున్న ఎమ్.పిలు కొందరు కాని, మరికొంతమంది ఇతరులు కాని ఈ నేపద్యంలో సుప్రింకోర్టును ఆశ్రయించారు. అసలు విభజన బిల్లు ఆమోదం పొందలేదని, లోక్ సభ ప్రోసీడింగ్స్ ఆదారంగా అప్పటి రాజమండ్రి ఎమ్.పి ఉండవల్లి అరుణ కుమార్ పిటిషన్ వేశారు. అంతేకాక ఆయన దీనిపై పుస్తకం కూడా రచించారు. ఇక రాజ్యసభలో సైతం గందరగోళం జరిగింది. అప్పటి ప్రదాని మన్మోహన్ సింగ్ ఎపికి ప్రత్యేక హోదా ను ప్రకటిస్తున్న సందర్బంగా కొందరు సమైక్యవాద ఎమ్.పిలు ఆయనపై కూడా దాడి చేసినంత పనిచేశారు. కొంతమంది ఎమ్.పిలు ప్రదానికి రక్షణ కవచంగా నిలవవలసి వచ్చింది. పార్టీలకు అతీతంగా ప్రాంతాల వారీగా ఎమ్.పిలు చీలిపోయి గొడవలు పడ్డారు. కెవిపి రామచంద్రరావు వంటి కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభలో నిరసన ప్లకార్డుతో వెల్ లో నిలబడి ఉండేవారు. తన పార్టీకే చెందిన ఐదుగురు లోక్ సభ సభ్యులను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఇన్ని పరిణామాలు జరిగినప్పుడు సుప్రింకోర్టులో విభజన చట్టానికి వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్ లు ఏవీ ఇంతవరకు విచారణకే రాలేదు. మరి ఇది న్యాయ వ్యవస్థ లోపమా? లేక పార్లమెంటులో జరిగిన వాటి జోలికి వెళ్లకూడదన్న అబిప్రాయమా? రెండు వ్యవస్థల మద్య అనవసర ఘర్షణ నివారించడానికా?దేనికో తెలియదు కాని ఇదంతా చరిత్ర. ఇక్కడ మనం సమైక్యవాదానికి అనుకూలమా?లేక విభజనకు అనుకూలమా ?అన్నది చర్చ కాదు.పార్లమెంటు అయినా, శాసనసభ అయినా సభా సంప్రదాయాల ప్రకారం సభ ఆర్డర్ లో లేనప్పుడు ఎలాంటి తీర్మానాలు చేయకూడదని అంటారు.మరి పార్లమెంటులోనే అలా జరిగింది. అంతేకాదు. మరో సంగతి కూడా చెప్పాలి. అప్పటి ఉమ్మడి ఎపి శాసనసభలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ లో రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ తీర్మానం చేశారు. ఇక్కడ కూడా ప్రాంతాల వారీగా చీలిపోయి తీవ్ర ఆందోళనలు జరిగాయి. ఆ తర్వాత కాలంలో రాజకీయంగా యుపిఎ ప్రభుత్వం అనండి..కాంగ్రెస్ నాయకత్వం ఘోరమైన రాజకీయ తప్పిదం చేసిందని రుజువు అయింది. విభజన చేసినప్పటికీ,కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దారుణంగా ఓడిపోతే, విభజిత ఆంద్రప్రదేశ్ లో అయితే అడ్రస్ కోల్పోయింది. మొత్తం పోటీచేసినవారంతా ఓటమి పాలవడమే కాకుండా పది మందిలోపు తప్ప మిగిలినవారు డిపాజిట్లు కూడా కోల్పోయారు. కేంద్రంలో కాంగ్రెస్ అదికారం కోల్పోవడానికి కూడా ఇది ఒక కారణంగా నిలిచింది. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న బిజెపి ప్రధాని అభ్యర్ది నరేంద్ర మోడీ వంటివారు తల్లిని చంపి బిడ్డను కన్న చందంగా విభజన చేశారని తీవ్రమైన వ్యాఖ్యలను ఎపిలో ప్రచారంలో చేశారు. కాని బిజెపి కూడా అప్పట్లో విబజనకు మద్దతు ఇచ్చింది. అది వేరే విషయం. పార్లమెంటు లో జరిగిన పరిణామాలపై ప్రజలు స్పందించారు. సుప్రింకోర్టు దీనిపై ఎలాంటి తీర్పు ఇవ్వకపోయినా ప్రజలు తీర్పు ఇచ్చి కాంగ్రెస్ ను ఓటమిపాలు చేశారు.ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం ప్రజలదేనని ఈ ఘట్టాలన్నీ రుజువు చేశాయి. ఆ తర్వాత ఎపిలో టిడిపి ,బిజెపి సంకీర్ణ ప్రభుత్వం నాలుగేళ్లపాటు పాలన సాగించింది . రాజధాని పై కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని నియమించగా ,దానిని కాదని ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం తన సొంత నిర్ణయాలు చేసింది. మూడు పంటలు పండే పచ్చని పొలాల బూములను రాజదానిగా ఎంపిక చేసింది. పలువురు పర్యావరణ వేత్తలు దీనిపై అభ్యంతరం చెప్పారు. కొందరు గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లారు. ప్రసిద్ద సంపాదకులు ఎబికె ప్రసాద్ ,మరికొందరు అమరావతి నిర్ణయంపై హైకోర్టుకు వెళ్లారు. ఆ పిటిషన్ లు ఇప్పటికీ పెండింగులోనే ఉన్నాయని అంటారు.కొన్నిటిని తోసిపుచ్చి ఉండవచ్చు. అంతేకాక ఆ ప్రాంతానికి అమరావతి పేరు పెట్టి ఆనాటి ప్రభుత్వం దానిని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ఈ వ్యవహారాన్ని మార్చిందన్న విమర్శలు వచ్చాయి. ఇది అందరి రాజధాని కాదు.కొందరిదే అనే అభిప్రాయం కలిగేలా అప్పలి పరిణామాలు సంభవించాయి. ఒకే పార్టీవారో,లేక ఒక వర్గంవారో అదికంగా అక్కడ భూములు ఇన్ సైడ్ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేశారనో ఆరోపణలు వచ్చాయి. సింగపూర్ కు చెందిన కంపెనీల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 350 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తే స్విస్ చాలెంజ్ పద్దతిలో 1600 ఎకరాల భూమిని వారికి కేటాయించడమే కాకుండా, 5500 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి వారికి కావల్సిన సదుపాయాలను కల్పించడానికి సిద్దం అయింది.దీనిపై కూడా కోర్టులో వ్యాజ్యాలు పడడం, అప్పట్లో హైకోర్టులో ప్రభుత్వ వ్యతిరేక తీర్పు రావడం, దానిపై రాష్ట్ర ప్రభుత్వం మరో చట్టం తేవడం వంటివి జరిగాయి.ఈ నేపధ్యంలో అమరావతి రాజధాని అంశంగా టిడిపి ప్రదానంగా ఎన్నికలకు వెళ్లింది.రాజధానిగా ప్రకటించిన గుంటూరు, కృష్ణా జిల్లాలతో సహా అన్ని ప్రాంతాల వారు టిడిపిని ఓడించారు. అది అమరావతిపై కూడా వచ్చిన తీర్పుగా ప్రజలు భావించారు. ఆ తర్వాత ప్రస్తుత వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన చేసింది . అసెంబ్లీలో
చట్టం ఆమోదించింది. అయితే శాసనమండలిలో టిడిపి వ్యతిరేకించి ఆ చట్టం ఆమోదం పొందకుండా ప్రయత్నించింది. అయనా వైసిపి ప్రభుత్వం మరోసారి అసెంబ్లీలో బిల్లును ఆమోదించి , మళ్లీ మండలికి పంపడం, అక్కడ గొడవల మద్య సభ వాయిదాపడడం జరిగింది. తదుపరి నిర్దిష్ట కాలపరిమితి వరకు ప్రభుత్వం వేచి ఉండి ,తదుపరి గవర్నర్ కు బిల్లును పంపించగా ఆయన సుమారు పదిరోజుల పాటు పరిశీలన చేసి ఆమోదం తెలిపారు. ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ ద్వారా అబివృద్ది అని బావిస్తోంది .ఉత్తరాఖండ్ లో కొత్త రాజదాని విషయంలో తాము జోక్యం చేసుకోమని సుప్రింకోర్టు స్పష్టంగా చెబితే, ఎపిలో మూడు రాజధానుల అంశం రాష్ట్రం పరిధిలోనిదని కేంద్రం ఒకటికి రెండుసార్లు పేర్కొంది.ఈ నేపద్యంలో హైకోర్టులో అనేక పిల్స్ పై విచారణ జరుగుతుండడం ఆసక్తికరంగా ఉంది. రాజధాని సంస్థ రద్దు చట్టం, వికేంద్రీకరణ చట్టం పై పెద్ద సంఖ్యలో హైకోర్టులో పిటిషన్ లు పడ్డాయి.వాటిపై విచారణ జరుగుతోంది. అయితే గౌరవ హౌకోర్టు గతంలో అమరావతి ఏర్పాటు సమయంలో పిల్ వేశారా అని ప్రస్తుతం ఈ కేసులలో ఇంప్లీడ్ అయిన రాయలసీమ, ఉత్తరాంద్రలకు చెందిన కొందరు న్యాయవాదులను ప్రశ్నించింది. వారు తాము అప్పట్లో పిల్ వేయలేదని చెప్పారు.అయితే ఎబికె ప్రసాద్ వంటివారు గతంలోనే తాము పిటిషన్ లు వేశామని చెబుతున్నారు. వాటిని అప్పట్లో కోర్టు సీరియస్ గా తీసుకోలేదని అనుకోవాలి. గతంలో పిటిషన్ లు వేసినా, ఇప్పుడు వేయరాదని ఏమీ లేదు. అది వేరే విషయం . ఇప్పుడు మండలిలో జరిగిన ప్రొసీడింగ్స్ పై వీడియా ను కూడా గౌరవ న్యాయస్థానం వారు కోరడం తో ఈ విచారణ ఎటు వెళుతుందన్నది చర్చనీయాంశం అయింది. మళ్లీ శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు ఈ అంశంలో కూడా భిన్న దృవాలు అవుతాయా?అన్నది చూడాల్సి ఉంది. ఇక విశాఖపట్నంలో ఒక అతిధి గృహం నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిపై కూడా పిల్స్ పడ్డాయి. విశేషం ఏమిటంటే గత ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామం నారావారి పల్లెలో కూడా క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారట. అంతేకాదు. హైదరాబాద్ లో ముందు సొంత ఇల్లు , ఆ తర్వాత అక్కడ నుంచి మరో ఇంటిని అద్దెకు తీసుకున్నారు.తదుపరి అక్కడ నుంచి పార్క్ హయత్ లో కాపురం పెట్టి ప్రభుత్వం డబ్బు కోట్లు వెచ్చించారు.ఇవన్ని క్యాంప్ ఆఫీస్ లుగానే అప్పట్లో ప్రకటించారట. ఇక కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడంలో చంద్రబాబు నివసించినా ఏ వ్యవస్థ ఇంతవరకు ఆయనను ఏమీ చేయలేకపోయింది. అది కూడా ఒక రకంగా క్యాంప్ ఆఫీస్ అనుకోవచ్చేమో! అయినా ఎవరూ పిల్ వేయలేదు.ఏ వ్యవస్థ కూడా తప్పు పట్టలేదు.నది ఒడ్డున ఉన్న అక్రమ కట్టడాలను తొలగించడానికి ప్రభుత్వంప్రయత్నిస్తే గౌరవ హైకోర్టు స్టే ఇచ్చింది. అమరావతి లో జరిగిన స్కామ్ ల కేసులు కొన్నిటిపై హైకోర్టు స్టే ఇవ్వడమే కాకుండా, కొన్ని కేసుల సమాచారం కూడా ప్రచారం చేయడానికి వీలు లేదని ఆదేశించింది.మరో విషయం ఏమిటంటే ఎపిలో అసలు హైకోర్టు భవన నిర్మాణమే జరగకపోయినా, నిర్మాణం జరిగిపోయినట్లు గత ప్రభుత్వం ప్రకటించడం కూడా ఆశ్చర్యం కలిగించింది. అంతేకాదు కొందరు గౌరవ న్యాయమూర్తులు ప్రస్తుత భవనంలో కనీస సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కూడా ఉంది. తొలుత విజయయవాడలోని ఒక అతిది గృహంలో, ఆ తర్వాత తాత్కాలిక భవనంలో హైకోర్టు ఏర్పాటు చేసినా, ఎవరూ పిల్స్ ఎందుకు వేయలేదో?స్వయంగా న్యాయమూర్తులు ఈ అంశాలపై అప్పట్లో ఎందుకు ప్రశ్నించలేదో తెలియదు. ఈ నేపధ్యంలో నిజంగానే ఎపి ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో తప్పు నిర్ణయం తీసుకుంటే వచ్చే ఎన్నికలలో ప్రజలు తమ తీర్పు ఇస్తారు. రాజ్యాంగపరంగా తప్పులు జరిగితే న్యాయ స్థానం జోక్యం చేసుకోవడం తప్పు కాదు. కాని చట్టపరంగా తీర్మానాలు చేసిన తర్వాత, గవర్నర్ ఆమోద ముద్ర వేసిన తర్వాత హైకోర్టులో పెద్ద ఎత్తున విచారణ ,స్టాటస్ కో ఉత్తర్వులు వంటి పరిణామాలు జరిగాయి..రాజధాని రైతుల పేరుతో కొందరు నిరసనలు చేస్తుంటారు., న్యాయమూర్తులు కోర్టుకు వెళుతున్నప్పుడు రోడ్డుమీద నిలబడి వారికి దండాలు ,దస్కాలు పెట్డడం వంటివి ఆశ్చర్యం కలిగిస్తాయి.అంతిమంగా మాబోటి వాళ్లకు వచ్చే సందేహం ఏమిటంటే, గతంలో పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదం పొందిన వైనం, ఆ తర్వాత సుప్రింకోర్టు ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు?ఇప్పుడు మూడు రాజధానుల బిల్లు, రాజధాని సంస్థ రద్దు బిల్లులపై శాసనమండలిలో జరిగిన పరిణామాలపై హైకోర్టు విచారణ జరపడానికి వీడియో రికార్డులు కావాలని కోరిన నేపధ్యంలో ఇవన్ని ప్రస్తావనకు వస్తున్నాయి. ఆనాడు సుప్రింకోర్టు అంత పెద్ద పరిణామాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు ? ఇప్పుడు ఎపి హైకోర్టు ఇంత సీరియస్ గా ఎందుకు తీసుకుంటోంది? ఇది సామాన్యుడిగా వచ్చే సందేహం తప్ప, కోర్టులను ప్రశ్నించడం కాదు. కోర్టులను అగౌరవపరచడం కాదు. వారిని గౌరవిస్తూనే ఈ డౌట్ ల గురించి మాట్లాడుకోవడం తప్పు కాదన్నది విశ్వాసం.

tags : ap, supremecourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info