A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రఘురాజు పచ్చ మీడియా ట్రాప్ తోనే..?
Share |
December 2 2020, 6:25 pm

శకునం చెప్పే బల్లి కుడితెలో పడిందని సామెత.వైఎస్ ఆర్ కాంగ్రెస్ రిబెల్ ఎమ్.పి రఘురామకృష్ణంరాజు రోజూ డిల్లీలో ఏదో చెట్టు కింద కూర్చున్నట్లుగా కూర్చుని ఎపి ప్రభుత్వంపైన, వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలపైన విమర్శలు చేస్తుంటారు. అలాగే తెలుగుదేశం మీడియా వారు ఏది కోరితే ఆ విధంగా ప్రభుత్వంపై కామెంట్లు చేస్తుంటారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏ విమర్శలు చేస్తే,దానికి అనుబందంగా ఈయన కూడా కొనసాగిస్తుంటారు. టిడిపి నేతలు అమరావతి అంటే ఈయన అదే అంటారు. పేదపిల్లలకు ఇంగ్లీష్ మీడియం పెట్టవద్దని ప్రతిపక్షం చెబితే,అవును,అవునని వంతపాడుతుంటారు. ఆయనపై పెద్ద ఎత్తున మోసం కేసులు వస్తే,దానికి కూడా ఆయన వైసిపినే నిందిస్తున్నారు. బ్యాంక్ ల నుంచి వందల కోట్ల రూపాయలు తీసుకుని ఎగవేశారని , బినామీలకు మళ్లించారనో ఆరోపణలు వస్తే మాత్రం దానికి నేరుగా వివరణ ఇవ్వకుండా, వారివల్ల కేసు వచ్చింది..వీరి వల్ల కేసు వచ్చిందని చెబుతున్నారు.ఎవరివల్ల కేసు వచ్చినా ఎదుర్కోవలసిందే. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు ఏకంగా 800 కోట్లకుపైగా ఎగవేశారని, పైగా మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని బ్యాంక్ వారు సిబిఐకి పిర్యాదు చేస్తే , సిబిఐ దానిని పరిశీలించి ఎఫ్ ఐ ఆర్ ను నమోదు చేస్తే ,అదేదో ముఖ్యమంత్రి జగన్ కార్యాలయ అదికారి కేంద్ర ఆర్దిక శాఖ అదికారి ఒకరికి చెప్పి చేయించారని ఆయన అంటున్నారు.ఆయన తాను నాలుగువేల కోట్ల రూపాయల రుణమే వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్నానని, అందులో ఇంకా రెండువేల కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదని అంటున్నారు. అది నిజమే అయితే ఆ మొత్తం బ్యాంకు లోన్ లకు కట్టేయవచ్చు కదా!ఆ పని చేయకపోగా ఎదురు ఆరోపణలు చేస్తుండడం విశేషం. బొగ్గు దిగుమతి చేసుకున్నట్లు చూపించారు.బొగ్గు బదులు బూడిద కనిపించిందట. ఇలా మోసాలు చేసిన పార్లమెంటు సభ్యుడు , అమాయకుడు మాదిరి పోజు పెడితే జనాలు నమ్మాలన్నమాట.నిజమే..ఇలాంటి వ్యక్తి ఆయా రాజకీయ పార్టీలలో ఎలా చేరారు?ఎమ్.పి టిక్కెట్ ఎలా ఇచ్చారు అంటూ మన వ్యవస్థ అలా ఉందని అనుకోవడం తప్ప చేయగలిగింది లేదు. ఆయన మొదట వైసిపి, ఆ తర్వాత బిజెపి, తదుపరి టిడిపిలోకి వెళ్లి,అనంతరం వైసిపిలోకి వచ్చి ఎమ్.పి అయ్యారు. వైసిపిలో రెండోసారి చేరినప్పుడు ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు తనకు రుణాలు ఉన్న మాట నిజమేనని, వాటిని చెల్లిస్తున్నామని, కొన్ని కోర్టులలో వివాదాలు ఉన్నాయని చెప్పేవారు.వైసిపి పక్షాన ఎన్నికైన తర్వాత ఆ పార్టీ నియమావళికి కట్టుబడి ఉండాలి.అలాకాకుండా తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం మొదలు పెట్టారు. తనకు ప్రదాని మోడీ తెలుసు..అమిత్ షా తో పరిచయం ఉంది.తనకు ఎంతో పరపతి ఉందంటూ ఎమ్.పిలకు పెద్ద ఎత్తున డిన్నర్ ఇవ్వడం తదితర చర్యలతో అందరిని ఆశ్చర్యపరిచారు. లోక్ సభలో పార్టీ తరపున మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు కొన్నిసార్లు పార్టీ విదానాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రత్యేకించి ఇంగ్లీష్ మీడియం విషయంలో ఆయన అలా చేయడం పార్టీ నేతలకు తీవ్ర అసంతృఫ్తి కలిగించింది. ఆ తర్వాత రఘురాజును కలుసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్ ఇష్టపడలేదు. అప్పటి నుంచి గ్యాప్ పెరిగింది. కొంతకాలం జగన్ అంటే తనకు ఇష్టమని, గౌరమేనని చెబుతూ ఇతర నేతలను , కొన్ని ప్రభుత్వ విదానాలను విమర్శించేవారు. ఆ తర్వాత తెలుగుదేశం అనండి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా ట్రాప్ లో పడి ,వారి ప్రచారానికి ఈయన ఇంధనంగా మారారు. బిజెపి ఆఫీస్ కు వెళ్లి అక్కడ పార్టీ ప్రముఖులను కలుసుకోవడం వంటి చిత్రమైన చేష్టలకు పాల్పడ్డారు. ఒక దశలో రాజు బిజెపిలో చేరిపోయినట్లేనని భావించారు. ఎందువల్లో బిజెపి వారు కూడా ఆయనను ఎంకరేజ్ చేసినట్లు లేదు.ఆ తర్వాత తన నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలతో గొడవపడ్డారు. తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి భద్రత లేదని డిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. కేంద్రం కూడా ఈయనకు సెక్యూరిటీ పెంచెంది. అయినా ఆయన డిల్లీలోనే ఉంటూ రోజూ లైవ్ టివీలలో కనిపించడానికి అలవాటు పడ్డారు. ప్రచార పిచ్చి అనండి, యావ అనండి పీక్ కు వెళ్లాక, ఆయన ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియని స్థాయికి వెళ్లారు. జగన్ పాపులారిటీకన్నా తనకే ఎక్కువ ఉందన్న బిల్డప్ ఇచ్చారు. మరి అలాగైతే ఎమ్.పి పదవికి రాజీనామా చేయవచ్చు కదా? మళ్లీ పోటీచేసి గెలవవచ్చు కదా అని అంటే మాత్రం ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తే , పార్లమెంటులో ఇబ్బంది లేకుండా కొనసాగవచ్చని ఆయన భావించారు. కాని పార్టీవారు సస్పెండ్ చేయకుండా ఏకంగా అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు పిర్యాదు చేశారు. స్పీకర్ ఏమి చేస్తారో తెలియదు కాని రఘురాజు మాత్రం ఎపి వ్యాప్తంగానే కాకుండా తెలుగువారిలో నవ్వుల పాలు అయ్యారు. అయితే ఆయన ధనవంతుడన్న భావన కావచ్చు..పలు పరిశ్రమల కోసం వేల కోట్ల రుణాలు తీసుకున్న అనుభవం కావచ్చు..బ్యాంకును మాయ చేసినట్లు ప్రజలను కూడా మాయ చేయవచ్చన్న భావన కావచ్చు..ఏమో తెఇయదు కాని, ఇప్పుడు ఏకంగా సిబిఐ ఈయనపై ఆర్దిక నేరాభియోగాలు మోపడంతో మొత్తం కద కొత్త మలుపు తిరిగినట్లయింది.ఈ గొడవలు, ఈ కేసులు తెచ్చుకునే బదులు బ్యాంకుల వారి వద్దకు వెళ్లి, రుణాలను సెటిల్ చేసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా.ఆ పని తప్ప అన్నీ చేశారు. బిజెపి పెద్దలతో తనకు ఉన్న పరిచయాలు, బందాలు,అనుబంధాలతో ఈ కేసులు ఏవీ రాకుండా చూసుకోవచ్చనుకున్నారో ఏమో కాని,. ఆయన తప్పుమీద తప్పు చేశారు.సిబిఐ విచారణ చేస్తే ఏమి జరుగుతుందో తెలియదు.మొత్తం మీద రాజకీయ పార్టీలకు ఇలాంటి వారితో ఒక మంచి అనుభవం అయితే, కేవలం పలుకుబడితోనే అన్నిసార్లు మాయచేయవచ్చనుకునే నేతలకు కూడా ఇది పాఠమే అని చెప్పాలి. రఘురామకృష్ణంరాజు భవిష్యత్తు ఏ రకంగా మారుతుందో చూడాల్సిందే.

tags : raghuraju

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info