A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కన్నా, సోము ల మద్య పోలిక,తేడాలు
Share |
September 22 2020, 12:09 pm

ఎపి భారతీయ జనతా పార్టీ అద్యక్షుడుగా సీనియర్ నేత సోము వీర్రాజు నియమితులయ్యారు.ఇంతవరకు అద్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను పక్కకు తప్పించారు. ఆయన మరో టరమ్ పదవి ఆశించారని అంటారు.ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే తెలుగుదేశం పార్టీకాని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా కాని కన్నాను మార్చడంపై కాస్త ఎక్కువ బాదపడినట్లు కనిపిస్తుంది. ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణకు , సోము వీర్రాజుకు ఉన్న తేడాను పరిశీలించడం ఆసక్తికరంగా ఉంటుంది. కన్నా ఎక్కువ కాలం కాంగ్రెస్ లో ఉన్న నేత. సోము వీర్రాజు పూర్తిగా భారతీయ జనతా పార్టీ మనిషి. కన్నా సడన్ గా బిజెపిలో చేరారు. అంతేకాక ఆయన వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో కి రావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని ,బిజెపి పెద్దల కోరిక మేరకు అనండి,మరో కారణం అనండి,ఆయన ఆగిపోయారు. వీర్రాజుకు అసలు అలాంటి ఆలోచనలే ఉండవని చెప్పాలి.కన్నా ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యారు.దాదాపు పద్నాలుగేళ్లు మంత్రిగా చేశారు. వీర్రాజు కొన్ని ఎన్నికలలో పోటీచేసినా గెలవలేదు. చివరికి బిజెపి గత టరమ్ లో ఎమ్మెల్సీ గా ఎంపిక చేసింది. కన్నాకు ప్రత్యేకంగా సిద్దాంత బలం లేదు. కాని వీర్రాజుకు ఆర్ఎస్ఎస్ భావజాలం అనండి,పార్టీ సిద్దాంతం అనండి అవన్ని ఉన్న వ్యక్తిగానే గుర్తిస్తారు. ఇద్దరు కాపు సామాజికవర్గం నేతలే. కన్నా 2019 ఎన్నికల ముందు వరకు టిడిపిపై బాగానే విమర్శలు చేసినా, లేఖలు రాసినా , ఎన్నికలు అయిన తర్వాత కొద్దికాలానికి ఆయనలో మార్పు వచ్చింది.మెల్లగా ఆయన తెలుగుదేశం పార్టీ ట్రాప్ లోకి వెళ్లారన్నది ఎక్కువ మంది భావన. చివరికి అవి ఎంతవరకు వెళ్లాయంటే పార్టీ విదానాలతో నిమిత్తం లేకుండా టిడిపి వారి మాదిరే లేఖలు రాయడం ,వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేయడం వంటివి చేశారు. వీర్రాజు అలా కాదు. టిడిపి మిత్ర పక్షంగా ఉన్నప్పుడు కొంత సంయమనంగా ఉన్నా, అవినీతి విషయంలో తీవ్ర విమర్శలు చేయడానికి వెనుకాడలేదు. చంద్రబాబు ప్రభుత్వంలో నీరు-చెట్టు స్కీమ్ లో పదమూడువేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించిన మొదటి నేతగా ఈయన ఉన్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన సుజనా చౌదరి తదితరులతో కన్నా రాసుకు,పూసుకు తిరిగినట్లు కనబడుతుంది. ఒక దశలో అయితే సుజనా ఏమి చెబితే అది కన్నా చేశారని ప్రచారం ఉంది.అంటే పూర్తిగా తెలుగుదేశం వారికి అనుకూలంగా మారారన్నమాట. నిజానికి బిజెపి అధినేతగా ఉన్నప్పుడు అమిషా ను కాని, ప్రధాని నరేంద్ర మోడీని కాని దేశంలో ఎవరూ అవమానించని రీతిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవమానించారు. అది బహిరంగ రహస్యమే.అయినా కన్నా వాటిని పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించడం నిజమైన బిజెపి కార్యకర్తలకు అంతగా నచ్చలేదన్నది వాస్తవం. మూడు రాజధానుల అంశంపై పార్టీ జాతీయ అదికార ప్రతినిది జివిఎల్ నరసింహారావు చాలా స్పష్టంగా అది రాష్ట్రాల పరిధిలోనిదని, రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చని చెప్పిన తర్వాత కూడా కన్నా లక్ష్మీనారాయణ అమరావతి అంశాన్ని భుజానవేసుకుని టిడిపికి తగ్టట్లుగానే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాయడం వివాదాస్పదం అయింది. దానిపై కేంద్ర పార్టీ పెద్దలు ఆయనను మందలించారని అంటారు. కన్నాను తొలగించడంలో అది కూడా ఒక కారణమని చెబుతారు.అలాగే ఎన్నికల సమయంలో పార్టీ నిధులు సరిగా వినియోగించలేదన్న విమర్శలు వచ్చాయి. వైసిపి ఎమ్.పి విజయసాయిరెడ్డి కూడా కన్నాపై ముప్పై కోట్ల ఆరోపణలు మోపారు.దానికి కన్నా సరైన సమాదానం ఇవ్వలేకపోయారన్న భావన ఉంది.ఇక్కడ ఒక విశేషం చెప్పాలి. కన్నా లక్ష్మీనారాయణ అప్పట్లో విజయవాడ కాంగ్రెస్ ప్రముఖుడిగా ఉన్న వంగవీటి రంగాకు మిత్రుడుగా ,యువజన కాంగ్రెస్ నేతగా ఉండేవారు. ఆ రోజులలో తనపై టిడిపి వారు హత్యాయత్నం చేశారని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వైఎస్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నప్పుడు కన్నా పై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. కంచర్ల రామారావు అనే క్రిమినల్ కు ఆశ్రయం కల్పించారని చేసిన ఆరోపణపై తీవ్రంగా స్పందించి చంద్రబాబుపై పలు ఆరోపణలు చేశారు. కాని ఇప్పుడు అదే కన్నా టిడిపికి పరోక్షంగా సన్నిహితం అయ్యారన్న ప్రచారం జరగడం రాజకీయ వైచిత్రమే. కావూరి సాంబశివరావు, ఎన్.జ.రంగా లకు సన్నిహితుడిగా కన్నా మొదటిసారి పెదకూరపాడునుంచి అసెంబ్లీ టిక్కెట్ సంపాదించుకున్నారు. తదుపరి నేదురుమల్లి జనార్ధనరెడ్డి వర్గీయుడుగా మంత్రి పదవి కూడా చిన్న వయసులోనే పొందారు. చాలాకాలం ఆయన ఆ వర్గంలోనే ఉండేవారు,వైఎస్ రాజశేఖరరెడ్డిని విమర్శించేవారు. తదుపరి పార్టీ అదికారంలో లేకపోవడం, 2004 నాటికి అందరిని కలుపుకుని వెళ్లే ప్రయత్నంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఈయనను కూడా దగ్గరకు తీసుకోవడం జరిగింది. దాంతో వైఎస్ ఆర్ కు కన్నా దగ్గర అయ్యారు. ఆయన క్యాబినెట్ లో మంత్రి కూడా అయ్యారు. తదుపరి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రివర్గంలో కూడా కొనసాగారు. నాలుగుసార్లు పెదకూరపాడు నుంచి ఒకసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచిన కన్నా, 2014 లో ఓటమి చెందారు. తదుపరి టిడిపి అదికారంలోకి రావడం,అప్పటికే తన రాజకీయ శత్రువు అయిన రాయపాటి సాంబశివరావు టిడిపి ఎమ్.పి అవడంతో తనకు ఇబ్బందులు రాకుండా ఉండడానికి వ్యూహాత్మకంగా బిజెపిలో చేరారు. ఆ క్రమంలో బిజెపి అగ్రనేత రామ్ మాదవ్ ఈయనను పార్టీ అద్యక్షుడిని చేస్తానని హామీ ఇచ్చారని అంటారు.ఆ ప్రకారం వైసిపి లో చేరే టైమ్ కు ఆపి, కొద్ది కాలానికి పార్టీ పగ్గాలు అప్పగించడం జరిగింది.కాని 2019 ఎన్నికలలో నరసరాపుపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి డిపాజిట్ కోల్పోవడం కూడా అప్రతిష్ట అయింది. గుంటూరు జిల్లాలో ఐదు సార్లు గెలిచిన నేతగా స్ట్రాంగ్ మాన్ అని అనుకుంటే ఇలా అయిందేమిటా అని పార్టీ ఆశ్చర్యపోయే పరిస్తితి ఏర్పడింది. కన్నా పెద్ద వక్త కాదు. అలాగే రాష్ట్రం అంతటా ఆయనకు పెద్ద అనుచర గణం లేదు. కాని బిజెపి పెద్దలు ఎక్కువ గా ఊహించుకుని ఈయన కు పదవి ఇచ్చారు.దానిని ఆసరా చేసుకుని ఈయన బాగా ఎదిగి ఉండవచ్చు.కాని అలా చేయలేకపోయారన్న భావన ఉంది. అందరిని కలుపుకోకపోవడం ,ఒరిజినల్ బిజెపి వారిపై శీతకన్ను వేయడమే కాకుండా,లక్ష్మీపతి రాజా వంటివారిని సస్పెండ్ చేయడం వంటివి చేయడం ద్వారా పార్టీని అప్రతిష్టకు గురి చేశారన్న అబిప్రాయం కూడా ఉంది.ఈ నేపధ్యంలో సోము వీర్రాజు నియామకం జరిగింది.వీర్రాజు కూడా ఈ పదవి రాకుండా కొందరు పెద్దలు గగట్టి ప్రయత్నమే చేశారని అంటారు.ఎమ్మెల్సీ మాదవ్ కు ఇవ్వాలన్న ప్రతిపాదన వచ్చింది.కాని ఆయన ఇంకా యువకుడే అన్న భావనతో మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వీర్రాజుకు కిరీటం పెట్టారు. 2014 లో టిడిపి,బిజెపి కూటమివైపు జనసేన అదినేత పవన్ కళ్యాణ్ రావడంలో వీర్రాజు క్రియాశీలక పాత్ర పోషించారు.ఇప్పుడు జనసేనతో కలిసి పనిచేయడానికి సన్నద్దం అవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పరోక్షంగా టిడిపికి మద్దతుదారుగా ప్రచారం ఉంది. వీర్రాజు మాత్రం టిడిపిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యే నేతగా గుర్తింపు పొందారు.ఈ నేపద్యంలో వీర్రాజు పై రెండు బాద్యతలు ఉన్నాయి.ఒకటి పార్టీని ఎపిలో అబివృద్ది చేయడం,రెండు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంతో మరీ తగాదా లేకుండా వ్యవహరించడం. జాతీయ స్తాయిలో బిజెపికి వైసిపి మద్దతు ఇస్తున్నందున ఆ పార్టీని మరీ ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే అది టిడిపికి ఉపయోగం తప్ప ,బిజెపికి కాదు.అలాగని అసలు విమర్శలు చేయకుండా ఉండజాలరు.నిర్మాణాత్మకంగా వ్యవహరించవలసి ఉంటుంది.ఒక మాట చెప్పవచ్చు. కన్నా లక్ష్మీనారాయణ కు పదవి ఇస్తే ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారు. మరి వీర్రాజు ఆ లోటును భర్తీ చేయవలసి ఉంటుంది. పార్టీలోని వివిధ వర్గాలను కలుపుకుంటూ ,మరో వైపు వైసిపి ప్రభుత్వంతో సమతుల్యతతో వ్యవహరిస్తూ సాగిపోవడం కత్తి మీద సాము వంటిదే అయినా, జాగ్రత్తగా వ్యవహరిస్తే కష్టం కాదు.అన్నటికి మించి బిజెపికి అప్రతిష్ట తెచ్చే కార్యక్రమాలు చేయకపోతే చాలా అదే గొప్ప మేలు చేసినవారు అవుతారు.

tags : kanna,somu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info