A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
Share |
September 19 2020, 4:45 am

*పంగోలిన్ (అలుగు) జంతువు చర్మాలను స్మగ్లింగ్ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను
చేధించిన అటవీ శాఖ* *భద్రాచలం అటవీ ప్రాంతంలో జంతువుల చర్మాలను
సేకరించి మార్కెట్ చేస్తున్న ఐదు రాష్ట్రాలకు చెందిన ముఠా* *విశ్వసనీయ
సమాచారం అందటంతో నిఘా ఆపరేషన్ తో పట్టుకున్న అటవీశాఖ అధికారులు*
పంగోలిన్ చర్మానికి (అలుగు పొలుసులు) జాతీయ, అంతర్జాతీయ బ్లాక్
మార్కెట్లలో అత్యంత డిమాండ్ ఉందనే కారణంతో వాటిని అక్రమంగా సేకరించి
అమ్మకానికి పెట్టిన అంతరాష్ట్ర ముఠాను తెలంగాణ అటవీ శాఖ చేధించింది.
సుమారు వారం రోజుల పాటు అండర్ కవర్ ఆపరేషన్ చేసిన అటవీ శాఖ అధికారులు, తామే
కొనుగోలుదారుల అవతారం ఎత్తి మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ తో సహా కొత్తగూడెం, భద్రాచలం, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ లలో
అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. భద్రాచలం అటవీ ప్రాంతంలో గిరిజనులకు
కొద్ది మొత్తం ఆశ చూపి, ఈ ముఠా చర్మాలను సేకరిస్తోంది. ముందుగా సమాచారం
అందుకున్న కొత్తగూడెం అటవీ అధికారులు బాదావత్ రవి అనే వ్యక్తిని అదుపులోకి
తీసుకుని విచారించారు. అతను ఇచ్చిన సమాచారంతో మూడు రోజుల పాటు హైదరాబాద్ తో
సహ వివిధ ప్రాంతాల్లో అటవీ అధికారులు నిఘా పెట్టి సునీల్, నాగరాజులతో పాటు
మరో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని అటవీ, వన్యప్రాణుల సెక్షన్ల
ప్రకారం కేసులు పెట్టారు. ఈ ముఠాలో ఇంకా ముగ్గురు ఉన్నారని, వారు పరారీలో
ఉన్నారని అధికారులు తెలిపారు. అంతరాష్ట్ర ముఠాలో తెలంగాణతో పాటు
ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఒరిస్సా, బెంగాల్ వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు
అధికారులు గుర్తించారు. పంగోలిన్ స్కేల్స్ (అలుగు పొలుసులను) వల్ల వివిధ రకాల
ప్రయోజనాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. దీంతో వాటి పొలుసులకు బ్లాక్
మార్కెట్ లో విపరీత డిమాండ్ ఉంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో వీటిని
ఒక్కో కేజీకి లక్షల్లో ధర పలుకుతున్నట్లు సమచారం. చైనా సాంప్రదాయ ఔషధాల
తయారీలో అలుగు పొలుసులను వాడతారనే సమాచారం ఉంది. తాజాగా కరోనా నేపథ్యంలో
అలుగు మాంసం, చర్మం క్రయవిక్రయాలను చైనా నిషేధించింది. కొన్ని రకాల
మెడిసిన్ తయారీతో పాటు, ఉంగరాలను ధరించటం ద్వారా దుష్ట శక్తులు దరిచేరవని
మూఢ నమ్మకాలతో వీటికి డిమాండ్ ఏర్పడింది. భారతదేశం నుంచి రోడ్డు మార్గం
ద్వారా బీహార్, నేపాల్, మణిపూర్, బర్మా రూట్లలో చైనాకు ఇవి ఎగుమతి అయ్యే
అవకాశముందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుత ముఠా నుంచి సుమారు నాలుగు కేజీల పొలుసులను అటవీ శాఖ స్వాధీనం
చేసుకుంది. ఇందుకోసం మూడు నుంచి ఐదు జంతువులను దమ్మపేట అటవీ ప్రాంతంలో
(కొత్తగూడెం) చంపిఉంటారని అధికారులు భావిస్తున్నారు. పోలీసుల సహకారంతో
కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు నిందితులను ప్రవేశ పెట్టి, రిమాండ్ కు
తరలించారు. ప్రస్తుతం నిందితులందరూ ఖమ్మం సబ్ జైల్ లో ఉన్నారు. తదుపరి
విచారణ కొనసాగుతోందని కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారి రంజీత్ నాయక్
తెలిపారు.
అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్ నుంచి ఉన్నతాధికారుల
పర్యవేక్షణలో కిన్నెరసాని వైల్డ్ లైఫ్ ఎఫ్ డీ ఓ దామోదర్ రెడ్డి,

హైదరాబాద్ విజిలెన్స్ డీఎఫ్ఓ రాజారమణారెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది ఈ
ఆపరేషన్ లో పాల్గొన్నారు. అటవీ జంతువులు, అవయవాల అక్రమ తరలింపుపై అత్యంత
కఠినంగా ఉంటామన్న పీసీసీఎఫ్ ఆర్. శోభ, పంగోలిన్ ముఠాను చేధించిన అధికారులు,
సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసించారు.

tags : pangolin

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info