A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
Share |
August 15 2020, 2:11 am

ఎపిలో కొత్తగా ప్రారంభించిన అంబులెన్స్ లపై ఆసక్తికరమైన కధనం ఇది...

‘డీజిల్‌ లేదు.. డ్రైవర్‌ లేడు.. వ్యాన్‌ టైర్లు చెడిపోయాయి.. కాబట్టి రాదు..’ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, ఎవరికైనా హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం సంభవించినప్పుడు ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే ‘108’ నంబరుకు ఫోన్‌ చేస్తే ఇప్పటి వరకు వినిపించిన సమాధానాలు ఇవి. ఒకనాడు ఆపదలో ఉన్న వారిలో ఎందరివో ప్రాణాలు కాపాడిన 108 సర్వీసులు గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. ఆ అంబులెన్సుల డ్రైవర్లకు వేతనాలు చెల్లించకపోవడం, ఆ సర్వీసుల నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడంతో, అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలందించే 108 అంబులెన్సులు షెడ్లకే పరిమితం అయ్యాయి. ప్రజలు వాటిని మర్చిపోయే స్థితికి చేరుకున్నాయి.
అలాంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఈ రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. మళ్లీ రాష్ట్రమంతటా కుయ్.. కుయ్‌.. అన్న కూతలు వినిపించేలా చర్యలు తీసుకున్నారు. గతంలో కంటే అత్యంత ఆధునాతనంగా, అత్యంత మెరుగైన వైద్య సేవలందించడమే కాకుండా, రాష్ట్రమంతా ప్రతి చోటా సేవలందించేలా ఆ సర్వీసులను తీర్చిదిద్దారు. అంతే కాకుండా వాటి సంఖ్యను కూడా గణనీయంగా పెంచారు.
ఆ విధంగా ఒకేసారి 1088 వాహనాలను (108, 104 సర్వీస్‌ అంబులెన్సులు) సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ బుధవారం ప్రారంభించారు. విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద పచ్చ జెండా ఊపిన సీఎం, అత్యంత అధునాతనంగా తీర్చిదిద్దిన అంబులెన్సులను ప్రారంభించగా, అవి కుయ్ కుయ్ అంటూ రాష్ట్రంలోని నలు దిశలకు పరుగులు తీశాయి.
దీంతో ‘నభూతో నభవిష్యత్‌.. అన్నట్లుగా బెంజి సర్కిల్‌ వద్ద వాతావరణం కనిపించింది. ఒకేసారి 1088 వాహనాలు కుయ్ కుయ్ మంటూ పరుగులు పెట్టాయి. వందలాది వాహనాలు ఒకేసారి కనకదుర్గమ్మ వారధి, మచిలీపట్నం, ఏలూరు హైవే మీదుగా ఆయా జిల్లాల వైపు పరుగులు పెట్టాయి.

*108 సర్వీసులు–మార్పులు:*

కొత్తగా 412 అంబులెన్సులను ఈ సర్వీసు కోసం సిద్ధం చేయగా, ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్సులను కూడా వినియోగించనున్నారు. కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్సులలో 282 బేసిక్‌ లైఫ్‌ సపోర్టు (బీఎల్‌ఎస్‌)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్టు (ఏఎల్‌ఎస్‌)తో తీర్చి దిద్దారు. మరో 26 అంబులెన్సులను చిన్నారులకు (నియో నేటల్‌) వైద్య సేవలందించేలా తయారు చేశారు.

*ఏయే సదుపాయాలు?:*
బీఎల్‌ఎస్‌ అంబులెన్సులలో స్పైన్‌ బోర్డు, స్కూప్‌ స్ట్రెచర్, వీల్‌ ఛైర్, బ్యాగ్‌ మస్క్, మల్టీ పారా మానిటర్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయగా, ఏఎల్‌ఎస్‌ అంబులెన్సులలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. ఇక నియో నేటల్‌ అంబులెన్సులలో ఇన్‌క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను కూడా అమర్చారు.

*ఎంత వేగంగా సేవలు?:*

పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్‌ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాల్లో అయితే 25 నిమిషాల్లో అంబులెన్సులు చేరే విధంగా ఆ స్థాయిలో సర్వీసులు ప్రారంభిస్తున్నారు.

*ఎలా సాధ్యం?:*
ప్రతి అంబులెన్సును ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ (ఈఆర్‌సీ)తో అనుసంధానం చేయడం ద్వారా, ఫోన్‌ చేసిన వారిని వేగంగా ట్రాక్‌ చేసే వీలు కలుగుతుంది. అదే విధంగా ప్రతి అంబులెన్సులో ఒక కెమెరా, ఒక మొబైల్‌ డేటా టెర్మినల్‌ (ఎండీటీ), మొబైల్‌ ఫోన్‌తో పాటు, రెండు వైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమేటిక్‌ వెహికిల్‌ లొకేషన్‌ టాండ్‌ (ఏవీఎల్‌టీ) బాక్స్‌ను కూడా ఏర్పాటు చేశారు.

*104 సర్వీసులు –మార్పులు.*

*కొత్తగా 656 ఎంఎంయూలు: *
ఈ సర్వీసుల్లో సమూల మార్పులు చేసిన ప్రభుత్వం, హెల్త్‌ కేర్‌ డెలివరీ విధానంలో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఆ స్థాయిలో ‘మొబైల్‌ మెడికల్‌ యూనిట్ల’ (ఎంఎంయూ)ను తీర్చిదిద్దింది.
మారుమూల ప్రాంతాల్లో కూడా అత్యాధునిక వైద్య సేవలందించే విధంగా, అన్ని వసతులతో ఎంఎంయూలను సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒక సర్వీసు అందుబాటులో ఉండే విధంగా ఒకేసారి 656 సర్వీసులను సిద్ధం చేశారు.

*ఎంఎంయూల్లో సదుపాయాలు:*

ప్రతి మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ (ఎంఎంయూ)లో ఒక వైద్య అధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఏఎన్‌ఎంతో పాటు, ఆశా వర్కర్‌ ఉంటారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)తో అనుసంధానమై పని చేసే ఎంఎంయూలు, ఇక నుంచి మారుమూల కుగ్రామాలలో సైతం శరవేగంగా వైద్య సేవలందించనున్నాయి. రోగులకు అప్పటికప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు చేసే సదుపాయాలు కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. రోగులకు అవసరమైన ఔషథాలను ఉచితంగా అందజేస్తారు.
ప్రతి ఎంఎంయూలో ఆటోమేటిక్‌ వెహికిల్‌ లొకేషన్‌ టాండ్‌ (ఏవీఎల్‌టీ)తో పాటు, గ్లోబల్‌ పొజిషనింగ్‌ విధానం (జీపీఎస్‌) కూడా ఏర్పాటు చేశారు. ఆధార్‌ కోసం బయోమెట్రిక్‌ ఉపకరణాలు, ఇంకా రోగులకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయడం కోసం ట్యాబ్, పర్సనల్‌ కంప్యూటర్‌ (పీసీ) కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. తద్వారా రోగులకు సంబంధించి ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డు (ఈహెచ్‌ఆర్‌) తయారు చేయడం మరింత సులువు కానుంది.

*ఎంఎంయూలు–20 రకాల సేవలు:*
మాతా శిశు మరణాలు నివారించడంతో పాటు, చిన్నారుల ఆరోగ్యం కాపాడడం, వారిలో పౌష్టికాహార లోపం లేకుండా చూడడం, ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని సీజన్లలో ప్రబలే అంటువ్యాధులు నివారించడం, నాగరిక ప్రపంచానికి దూరంగా ఎక్కడో కుగ్రామాలలో నివసించే వారికి కూడా అత్యాధునిక వైద్య సదుపాయం కల్పిస్తూ, మొత్తం 20 రకాల వైద్య సేవలందించడం కోసం 104 సర్వీసుల్లో సమూల మార్పులు చేస్తూ, ప్రభుత్వం ఎంఎంయూలను తీర్చిదిద్దింది. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, ఈ సేవలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

*ఏయే సర్వీసులు ఎన్నెన్ని?:*

656 ఎంఎంయూలు, 104 ఏఎల్‌ఎస్, 26 నియో నేటల్, 282 బీఎల్‌ఎస్‌ అంబులెన్సులతో పాటు, మరో 20 వాహనాలు.. అన్నీ కలిపి ఒకేసారి మొత్తం 1088 వాహనాలను సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.200.15 కోట్లు ఖర్చు చేసింది.
కొత్త, పాత అంబులెన్సులతో పాటు, మొత్తం ఎంఎంయూల నిర్వహణకు ఏటా రూ. 318.93 కోట్లు ఖర్చు కానుంది.

*గతంలో – ఇప్పుడు:*
రాష్ట్రంలో గతంలో 18 అంబులెన్సులు 440 సెగ్మెంట్ల (ప్రాంతాలు వాహనాలు)లో మాత్రమే సేవలందించగా, ఇప్పుడు మొత్తం 705 సెగ్మెంట్లలో పని చేయనున్నాయి. నిజానికి గతంలో ఉన్న వాటిలో 104 వాహనాలు సేవలందించే సదుపాయాలు లేక షెడ్లకే పరిమితమయ్యాయి.
ఇక ఇప్పుడు ప్రారంభిస్తున్న 108 అంబులెన్సులు ప్రతి మండలం (676 మండలాలు)తో పాటు, పట్టణ ప్రాంతాల్లో కొత్తగా 29 చోట్ల సేవలందించనున్నాయి.
అదే విధంగా గతంలో 104 అంబులెన్సులు (ఎంఎంయూ) 292 మాత్రమే ఉండగా, ఇప్పుడు మండలానికి ఒకటి చొప్పున మొత్తం 676 సర్వీసులు పని చేయనున్నాయి. 20 రకాల వైద్య సేవలందిస్తూ, రోగులకు అవసరమైన మొత్తం 74 రకాల ఔషథాలు కూడా అందజేయనున్నాయి. గతంలో ఈ అంబులెన్సులలో కేవలం 52 రకాల ఔషథాలు మాత్రమే ఉండేవి.
వైద్యులు అతి కష్టం మీద అందుబాటులో ఉండేవారు. కానీ ఇప్పుడు ఎంఎంయూలలో మొత్తం 744 మంది వైద్యులు సేవలందించనున్నారు.
ఇంకా వీటిని (ఎంఎంయూలను) డాక్టర్‌ వైయస్సార్‌ టెలి మెడిసిన్, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానం చేసి నిర్వహించనున్నారు. తద్వారా అన్ని చోట్ల అత్యాధునిక వైద్య సేవలు అందనున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 676 ఎంఎంయూలు ప్రతి రోజూ 40,560 మందికి సేవ చేస్తూ, ఏటా ఏకంగా 1.45 కోట్ల రోగులకు వైద్య సేవలందిస్తాయని భావిస్తున్నారు.

tags : ap,ambulences

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info