A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
Share |
August 15 2020, 1:21 am

విదేశాల్లో మాదిరిగా రాష్ట్రంలో మొదటిసారి ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ భావనను కలగచేయడం, అలాగే ప్రతి పౌరుడి ఆరోగ్యానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ తెలిపారు. ప్రతి మండలానికి రెండు పిహెచ్‌సి సెంటర్లను నిర్వహిస్తున్నామని, ప్రతి సెంటర్ లోనూ కనీసం ఇద్దరు డాక్టర్లు, ప్రతి మండలానికి కేటాయించిన ఒక 104 వాహనంలో మరో డాక్టర్ వుంటారని అన్నారు. ప్రతి పిహెచ్‌సికి కనీసం ముప్పై ఊర్లు వుంటాయని అనుకుంటే.. దానిని ఈ రెండు పిహెచ్‌సిలు సమానంగా పంచుకుంటాయని అన్నారు. ఒక డాక్టర్ 104 లో కూర్చుని కనీసంగా 5 నుంచి 7 గ్రామాల బాధ్యత తీసుకుంటారని తెలిపారు. సదరు డాక్టర్ ప్రతినెలా ఖచ్చితంగా ఒకరోజు తన పరిధిలోని గ్రామానికి వెళ్ళి వైద్య సేవలు అందించాల్సి వుంటుందని అన్నారు. దీనితో ఆ గ్రామాల్లోని రోగుల వైద్యసంబంధ వివరాలను, పరీక్షలను, ఇచ్చిన మందులను ఎలక్ట్రానిక్ డేటా రికార్డ్‌లో నమోదు చేస్తారని తెలిపారు. విదేశాలలో మాదిరిగా ఫ్యామిలీ డాక్టర్ అనే భావనను ఆయా కుటుంబాలకు కలిగిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో మొట్టమొదటి సారి పౌరుల ఎలక్ట్రానిక్ హెల్త్ డేటాను ప్రభుత్వం నమోదు చేస్తోందని, ఇది ఒక విప్లవాత్మక నిర్ణయమని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ అన్నారు. ఇప్పటికే క్యూఆర్ కోడ్ తో కూడిన 1.42 లక్షల ఆరోగ్యశ్రీ కార్డులను ప్రజలకు ఇచ్చామని అన్నారు. ఈ క్యూఆర్ కోడ్ ఆధారంగా హెల్త్ రికార్డులను చెక్ చేయవచ్చని తెలిపారు. ప్రతి పేషంట్ కు సంబంధించిన డిజిటల్ ఎలక్ట్రికల్ డేటా తక్షణం అందుబాటులో వుంటుందని అన్నారు. మొదటిసారిగా ఈ రికార్డ్స్ ను 104 , రాబోయే రోజుల్లో వచ్చే విలేజ్ క్లీనిక్, పిహెచ్‌సి లకు అనుసంధానం చేస్తున్నాం.

*'గతంకు... నేటికి... మధ్య తేడాను గమనించాలి'*
''వైద్యరంగంలో ప్రభుత్వం అందిస్తున్న సేవలకు సంబంధించి ఇంతకు ముందుకు, ఇప్పటికీ తేడా ఏమిటీ అనేది అందరూ గమనించాలి. గతంలో పరిస్థితులు ఎలా వుండేవో ఆలోచించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితి చూస్తే... ఎలుకలు కొరికి పిల్లలు చనిపోతున్నారనే కథనాలు పత్రికల్లో వచ్చాయి. సెల్‌ ఫోన్ వెలుగుల్లో ఆపరేషన్లు చేస్తున్నారనే కథనాలు చూశాం. ఇక గతంలో 108, 104 ఎలా వుండేవి అంటే...
పేరుకే 104 వుండేది. ఇక 108 అయితే అరకొరగా ఆంబులెన్స్ లు నడిచే పరిస్థితి. 108 అంబులెన్స్‌ల్లో నడిచే కండిషన్ లో వున్నవి 336 మాత్రమే. అంత దారుణంగా అంబులెన్స్‌లు, ప్రభుత్వ ఆసుపత్రులు వుండేవి. కొద్దోగొప్పో డబ్బు ఖర్చు చేసుకునే స్థితిలో వున్న వారెవ్వరూ ప్రభుత్వ ఆసుపత్రులకు బదులు ప్రైవేటు ఆసుపత్రులకు పోతే బాగుంటుందనే పరిస్థితిని చూశాం."అని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ అన్నారు .

*సకాలంలో 108 అంబులెన్స్ వస్తుందనే నమ్మకం కలిగించాం*
రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవలను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ తెలిపారు. ఈ రోజు 1088 కొత్త వాహనాలతో ఈ మేరకు శ్రీకారం చుట్టామని అన్నారు. 432 వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్‌లు, 656 కొత్త 104 వాహనాలను సమకూర్చుకున్నామని అన్నారు.
ఈ అంబులెన్స్ లు సకాలంలో సంఘటనా స్థలంకు చేరకపోతే మనుషుల ప్రాణాలు పోతాయని అన్నారు. అసలు అంబులెన్స్ లు సకాలంలో వస్తాయో రావో అనే భయం ఉంటే.. మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోతుందని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఫోన్ చేస్తే సకాలంలో 108 అంబులెన్స్‌ వస్తుందనే నమ్మకాన్ని కలిగించామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో 15 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 20, ఏజెన్సీలో 25 నిమిషాల్లో 108 వాహనం వస్తుందని ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నామని అన్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో లైఫ్ సపోర్ట్ వున్న వాహనాలు కేవలం 86 వుంటే... ఇప్పుడు పూర్తిగా ఆ పరిస్థితిని మార్చామని అన్నారు. 432 ఆంబులెన్స్ లో 300 పై చిలుకు బేసిక్ లైఫ్ సపోర్ట్ ఆంబులెన్స్ లు, 104 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లు, 26 నియోనేటల్ ఆంబులెన్స్ లను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అంబులెన్స్‌ల్లో అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేశామని అన్నారు. మల్టీప్యార మానిటర్, అత్యాధునిక వెంటిలేటర్లు, నియోనేటల్ లో మొట్టమొదటిసారిగా ఇంక్యుబేటర్ లతో కూడిన వేంటిలేటర్ల వంటి పరికరాలను అమర్చామని తెలిపారు. మొదటిసారిగా అంబులెన్స్ ల్లో కెమేరాలు కనిపిస్తున్నాయని, పేషంట్ కు 108 వాహనంలో ఎక్కిన వెంటనే రోగి పరిస్థితిని ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ లో వున్న వైద్యులు ఈ కెమేరా ద్వారా చూసి, అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారని అన్నారు. అడ్వాన్స్డ్ వెహికిల్ లొకేషన్ సిస్టమ్, టువే కనెస్టివిటీ, జిపిఎస్ వంటి సదుపాయాలు కూడా కల్పించామని అన్నారు. ఇవ్వన్నీ చూస్తుంటే, ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ చిత్తశుద్దికి, వ్యవస్థ మీద ప్రజలకు ఒక నమ్మకం కలిగించే పరిస్థితి తీసుకువచ్చామని అన్నారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info