A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నిమ్మగడ్డ కేసు- హైకోర్టు తీర్పు పొరపాటన్న ఎపి
Share |
July 6 2020, 7:36 am

ఎన్నికల కమిషనర్ విషయంలో ఎపి హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ప్రభుత్వం సుప్రింకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి సోమవారం స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేశారు. ఇందులో నిమ్మగడ్డ రమేశ్, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి, జస్టిస్‌ వి.కనగరాజ్‌ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది.
మీడియాలో ఆ పిటిషన్ లో ఉన్న వివరాలు వచ్చాయి.అవి ఇలా ఉన్నాయి.
► రాజ్యాంగంలోని అధికరణ 243కే, 243జెడ్‌ఏ ప్రకారం ఎన్నికల కమిషనర్‌ నియామకం పూర్తిగా గవర్నర్‌ విచక్షణ మేరకే ఉంటుందంటూ హైకోర్టు పూర్తిగా పొరపాటు పడింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప గవర్నర్‌ సాధారణంగా తన రాజ్యాంగ అధికారాలను మంత్రి మండలి సలహా, సిఫారసు మేరకే ఉపయోగిస్తారు. సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం ఎన్నికల కమిషనర్‌ నియామకం ఆ ప్రత్యేక సందర్భాల పరిధిలోకి రాదు.
► అధికరణ 243కే, 243జెడ్‌ఏ నిర్ధేశించిన దాని ప్రకారం సర్వీసు నిబంధనలకు, పదవీ కాలానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని హైకోర్టు గుర్తించనందున ఆ తీర్పును రద్దు చేయాలి.
► రాజ్యాంగంలోని అధికరణ 324(2) కింద ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను నియమించే విషయంలో రాష్ట్రపతికి ఉన్న అధికారం, అలాగే అధికరణ 243కే కింద రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం మధ్య హైకోర్టు ఓ కృత్రిమ వ్యత్యాసాన్ని చూపింది.
► ఎన్నికల కమిషనర్‌ నియామక అధికారం గవర్నర్‌కే తప్ప, రాష్ట్రానికి లేదని హైకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో పూర్వ ఎన్నికల కమిషనర్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు మేరకే నియమితులైనందున ఆ నియామకం కూడా చెల్లదు. ఇదే సమయంలో ఆశ్చర్యకరంగా పూర్వపు ఎన్నికల కమిషనర్‌ (నిమ్మగడ్డ రమేశ్‌) పునరుద్ధరణకు ఆదేశాలు ఇచ్చింది. ఈ లెక్కన హైకోర్టు తన తీర్పునకు తానే విరుద్ధంగా తీర్పునిచ్చింది కాబట్టి, దానిని రద్దు చేయాలి.

వయసును కారణంగా చూపరాదు
► జస్టిస్‌ వి.కనగరాజ్‌ నియామక నోటిఫికేషన్‌లో ఓ నిబంధనను ప్రస్తావించకపోయినంత మాత్రాన, ఆ నోటిఫికేషన్‌ జారీ చేసే అధికారం ప్రభుత్వానికి లేకుండా పోదు. జస్టిస్‌ కనగరాజ్‌ వయస్సును కారణంగా చూపుతూ హైకోర్టు ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను కొట్టేయడం పొరపాటే.
► ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఆర్డినెన్స్‌ తేవడం వల్ల నిమ్మగడ్డ రమేశ్‌ పదవీ కాలం ముగిసింది. అందువల్ల అతనే సర్వీసు వివాదంతో నేరుగా హైకోర్టును ఆశ్రయించినప్పుడు, అదే అంశంపై సంబంధం లేని వ్యక్తులు దాఖలు చేసిన వ్యాజ్యాలను కూడా విచారించడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే.
► ఈ వ్యవహారంలో కోర్టును ఆశ్రయించే అర్హత ఇతర పిటిషనర్లకు ఏ మాత్రం లేదు. ఈ కారణాలన్నింటి వల్ల హైకోర్టు తీర్పు అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి.

తీర్పు అమలు నిలుపుదల పిటిషన్‌పై నేడు విచారణ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలం, సర్వీసు నిబంధనలను సవరిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్, జస్టిస్‌ కనగరాజ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలును నిలిపి వేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనుంది. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు వీలుగా, తీర్పు అమలును నిలిపేయాలంటూ ప్రభుత్వం హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి తన స్వరాష్ట్రానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అనుబంధ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

ప్రభుత్వ అధికారాన్ని తప్పు పట్టడం సరికాదు
► ముఖ్యమంత్రి, మంత్రుల వ్యాఖ్యల ఆధారంగా పిటిషనర్లు వాదనలు వినిపించారు. అలాంటప్పుడు వారికి నోటీసులివ్వకుండానే అనవసర విషయాల ఆధారంగా తీర్పు ఇచ్చింది. కుటిల ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిందని చెప్పడానికి హైకోర్టు ముందు ఎటువంటి ఆధారాలు లేవు.
► అన్ని సందర్భాల్లో ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలం ఐదేళ్లు ఉంటుందంటూ 2011 అక్టోబర్‌ 14న టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై ఆధారపడి హైకోర్టు తీర్పునిచ్చింది. వాస్తవానికి ఆ కమిటీ నివేదిక కేవలం ఓ సిఫారసులో భాగమే. అదేమీ తప్పనిసరిగా అమలు చేయాల్సిన నివేదిక ఏమీ కాదు. ప్రభుత్వ అధికారాన్ని తప్పు పట్టడం సరికాదు. పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 200(5)ను ఓ వివరణగా మాత్రమే చూడాలి. ఈ సందర్భంగా హైకోర్టు ఉపయోగించిన భాష రాజ్యాంగాన్ని, పంచాయతీరాజ్‌ చట్టాన్ని తక్కువ చేసేదిగా ఉంది.

tags : supremecourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info