A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
క్షీనించిన అడవుల పునరుద్దరణ యత్నాలు
Share |
July 6 2020, 7:24 am

*క్షీణించిన అడవుల పునరుద్దరణ దిశగా అటవీ శాఖ కీలక ప్రయత్నాలు*
*కందకాలు తవ్వకం, శాశ్వత నీటి కుంటల ఏర్పాటు దిశగా అడవుల్లో పనులు*
*గిరిజనుల ఉపాధికి భరోసాను ఇస్తూ కరోనా సమయంలో పనులు కల్పిస్తున్న అటవీశాఖ*
అడవుల్లో నీటి లభ్యత పెంచటం, భూగర్భ జలవనరులను వృద్ది చేసుకోవటం లక్ష్యంగా తెలంగాణ అటవీ శాఖ పనిచేస్తోంది. కరోనా వైరస్ కష్టకాలంలో గిరిజనులకు ఉపాధి హామీ ద్వారా పని కల్పించటంతో పాటు, అడవుల పునరుద్దరణ కోసం అటవీ శాఖ వినూత్న ప్రయత్నం చేస్తోంది. క్షీణించిన అడవులు, బోడి గుట్టలు,  బంజరు అటవీ భూముల్లో కందకాలు ( స్టాగర్డ్ ట్రెంచ్ లు) తవ్వకాలను అటవీ శాఖ పెద్ద ఎత్తున చేపట్టింది. వర్షాభావ
పరిస్థితులను తట్టుకోవటం, వర్షపు నీటిని నిల్వ చేసుకోవటం ఒక లక్ష్యం కాగా, అటవీ పునరుద్దరణ ద్వారా
వన్యప్రాణులకు తగిన ఆవాసం కల్పించటం, ఏడాదంతా వాటికి నీటి లభ్యత ఉండేలా ఈ ప్రణాళికలు ఉన్నాయి.
ఇప్పటికే అటవీ ప్రాంతాల్లో నీటి చెలిమలు, సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసిన అటవీ శాఖ రానున్నరోజుల్లో
క్షీణించిన అటవీ ప్రాంతాలను స్వయం సమృద్ది నీటి కేంద్రాలుగా మార్చే ప్రయత్నం చేస్తోంది. వివిధ జిల్లాల్లో ఈ
కందకాల తవ్వకం యుద్ద ప్రాతిపదికన జరుగుతోంది. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అటవీ శాఖ పనులకు
అనుసంధానం చేసి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఏటవాలు గుట్టలు, క్షీణించిన అటవీ ప్రాంతాలు, బంజరు అటవీ
ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గుంతల తవ్వకం కొనసాగుతోంది. వానాకాలంలో  ఏ మాత్రం వర్షం కురిసినా ఆ నీటిని
ఒడిపి పట్టేలా, వీలున్నంత నీరు భూమిలోకి ఇంకేలా చేయటమే అటవీ శాఖ ప్రయత్నమని అటవీ సంరక్షణ
ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌) ఆర్. శోభ అన్నారు. మండు వేసవిలో వివిధ జిల్లాల అటవీ ప్రాంతాల్లో
కొనసాగుతున్నకందకాల తవ్వకంపై సమీక్షించారు. ఉపాధి కూలీలకు నీటి వసతి కల్పించటంతో పాటు, భౌతిక
దూరం కొనసాగిస్తూ పనులు జరిగేలా చూడాలని ఆదేశించారు. అలాగే గ్రామీణాభివృద్ది శాఖ సహకారంతో
సాంకేతిక సమస్యలను అధిగమించాలని సూచించారు. ప్రతీ నీటి చుక్కా విలువైనదేనని, వర్షపు నీరు పల్లపు
ప్రాంతాల్లోకి వృధాగా వెళ్లటం ఆపగలిగితే అయా ప్రాంతాల్లో పచ్చదనం వృద్ది చెందటంతో పాటు, భూగర్భ జలాలు
కూడా మెరుగుపడతాయన్నారు. కవ్వాల్ పులుల సంరక్షణ పరిధిలో జన్నారం డివిజన్ లో వర్షాకాలంలో
దాదాపు 80 శాతం అటవీ ప్రాంతపు వర్షం నీరు గోదావరిలో కలుస్తోందని, దీంతో వర్షాకాలం మినహా మిగతా
సమయంలో తీవ్ర నీటి ఎద్దడి ఉందని, దీని నివారణకు అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున నేల మరియు తేమ
పరిరక్షణ పనులు (Soil and moisture Conservation)  చేపట్టామని డీఎఫ్‌ఓ మాధవరావు తెలిపారు. దీని
ద్వారా విలువైన అటవీ భూముల కోతను (Soil Erosion) నివారించ వచ్చన్నారు. నీటిని నిలుపు కోవటం
ద్వారా తొలి దశలో గడ్డి మైదనాల వృద్ది జరుగుతుందని, ఆ తర్వాత అటవీ పునరుద్దరణకు మెరుగైన

అవకాశాలుంటాయని ఆయన తెలిపారు. జన్నారంలో సుమారు 14 గ్రామాల్లో గిరిజనులకు వేసవిలో ఉపాధి
కల్పించామని, దీంతో వారు ఉపాధి కోసం అటవీ ఉత్పత్తులపై ఆధారపడటం కూడా తగ్గుతుందన్నారు. ఇదే
రకమైన విధానాన్ని వర్షాలు తక్కువగా ఉండే దక్షిణ తెలంగాణ జిల్లాల అటవీ ప్రాంతాల్లో కూడా అమలుకు
అటవీ శాఖ నిర్ణయించింది.  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కందకాల తవ్వకం కొనసాగుతోంది.
ఈ రకమైన పనుల వల్ల అటవీ భూములకు ఏవిధంగా ఉపయోగం అనే విషయంపై క్షేత్ర స్థాయి సిబ్బందికి
అవగాహనా కార్యక్రమాలను అటవీ శాఖ డివిజన్ల వారీగా నిర్వహించింది. ఈయేడాది ఫలితాలు చూసి వచ్చే
వేసవిలో మరిన్ని అటవీ ప్రాంతాల్లో నీటి సంరక్షణ చర్యలు చేపడతామని పీసీసీఎఫ్‌ తెలిపారు.

tags : telangana, forest

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info