A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కొత్త పంటల విదానంపై కెసిఆర్ పట్టుదల
Share |
May 27 2020, 1:21 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త వ్యవసాయ విధానంపై పట్టుదలగా ఉన్నారు. ఆయన దీనిపై ఏర్పాటు చేసిన అధికారిక సమావేశంలోమాట్లాడుతూ
నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసి, రాష్ట్రంలోని రైతులంతా వందకు వంద శాతం రైతుబంధు సాయం, పండించిన పంటకు మంచి ధర పొందాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు. ‘రైతులంతా ఒకే పంట వేస్తే డిమాండ్‌ పడిపోయి నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని నివారించడానికే ప్రభుత్వం నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలని సూచిస్తోంది. ఏ సీజన్‌లో ఏ పంట వేయాలి? ఎక్కడ ఏ పంట సాగు చేయాలి? ఏ రకం సాగు చేయాలి? అనే విషయాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఏ పంటకు మార్కెట్లో డిమాండ్‌ ఉందో ఆగ్రో బిజినెస్‌ విభాగం వారు నిర్ధారించారు. దాని ప్రకారం ప్రభుత్వం రైతులకు తగు సూచనలు చేస్తుంది. ప్రభుత్వం చెప్పినట్టు పంటలు వేయడం వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉండదు’అని సీఎం పేర్కొన్నారు.నియంత్రిత పద్ధతిలో పంటల సాగు చేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్రంలో అత్యధిక మంది రైతులు స్వాగతిస్తున్నట్లు సర్వేలో తేలిందని, ఇది మంచి పరిణామమని ఆయన చెప్పారు.


‘రాష్ట్రంలో గతేడాది తరహాలోనే వర్షాకాలంలో40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలి. గతేడాది 53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈసారి70 లక్షల ఎకరాల్లో సాగు చేయాలి. గతేడాది దాదాపు 7 లక్షల ఎకరాల్లోకంది పంట వేశారు. ఈ సారి 15 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలి. సోయాబీన్, పసుపు, మిర్చి, కూరగాయలు తదితర పంటలు గతేడాది మాదిరిగానే వేసుకోవచ్చు. వివిధ రకాల విత్తనోత్పత్తి చేసే రైతులు యథావిధిగా చేసుకోవచ్చు. పచ్చిరొట్టను విరివిగా సాగు చేసుకోవచ్చు. వర్షకాలంలో మక్కల సాగు లాభసాటి కాదు కాబట్టి, అది వద్దు. యాసంగిలో మక్కలు వేసుకోవచ్చు. వర్షాకాలంలో మక్కలు వేసే అలవాటు ఉన్న వారు పత్తి, కంది తదితర పంటలు వేసుకోవాలి. వరి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డిమాండ్‌ ఉన్న తెలంగాణ సోనా రకం వేసుకోవాలి. 6.5 ఎంఎం సైజు కలిగిన బియ్యం రకాలకు అంతర్జాతీయ మార్కెట్‌ ఉంది. దానిని కూడా పండించాలి’అని ముఖ్యమంత్రి సూచించారు.

tags : kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info