A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైకోర్టు వ్యాఖ్యలు సీరియస్సే..కెసిఆర్ పట్టించుకుంటే..
Share |
May 27 2020, 7:59 am

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా సీరియస్ గా ఉన్నాయి. హైకోర్టు న్యాయమూర్తులు నేరుగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం సరికాదు కనుక ఐఎఎఎ్ అదికారులను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేయడం ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదే అవుతుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులకు వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రబుత్వానికి ఆర్టిసికి ఇవ్వడానికి 47కోట్లు లేవా అని పేరు ప్రస్తావించకపోయినా, ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఉద్దేశించి హైకోర్టు సూటిగానే ప్రశ్నించింది. గత నెల రోజులుగా హైకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్నా ప్రభుత్వం ఏ మాత్రం రాజీ దోరణి ప్రదర్శించడం లేదన్న అసహనాన్ని హైకోర్టు వ్యక్తం చేసినట్లు అనిపిస్తుంది. ఐఎఎస్ లు వారి బాస్ లు అయిన ముఖ్యమంత్రిని, మంత్రిని తప్పు దారి పట్టించారని హైకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అలాగే ఇంత అబద్దాల నివేదికను తాము చూడలేదని అన్నారంటే అది ఎవరిని అన్నట్లు? హైకోర్టు విచారణకు ముందు రోజల్లా గంటల తరబడి ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ వ్యవహారంపై సమీక్షించినట్లు వార్తలు వచ్చాయి.కెసిఆర్ కు తెలియకుండా నివేదిక సిద్దం అవుతుందా? నిజానికి కెసిఆర్ ఏ వాదన చేయడం ద్వారా హైకోర్టులో తన పంతం నెగ్గించుకోవాలన్న తాపత్రయంతో వ్యవహరించారేకాని,ఈ సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించుకుందామని ఆలోచించినట్లు కనబడదు. హైకోర్టు తమ ఎదురుగా ఉన్న ఐఎఎస్ లను విమర్శించింది. కాని వారు అటు ముఖ్యమంత్రి కెసిఆర్ కు , కార్మిక సంఘాలకు మద్య నలుగుతున్నట్లుగా ఉంది. వారికి అసలు విషయాలు తెలుసు కదా..కాని వారు అవునని చెప్పలేరు..కాదనలేరు. అసెంబ్లీలో ఆర్టిసికి 1400 కోట్ల బకాయి అని మంత్రి ద్వారా చెప్పించినవారు.హైకోర్టులో మాత్రం అసలు బకాయే లేదని లాయర్ ద్వారా చెప్పించారు.దీనిపై హైకోర్టు ఆక్షేపణ తెలిపింది.నిజంగానే అదికారులు అంత అమాయకులా? అంత విషయ పరిజ్ఞానం లేనివారా? కావాలని అబద్దాలు చెబుతారా? అంటే అదేమీ కాదు.కేవలం ముఖ్యమంత్రి కెసిఆర్ మనసెరిగి నివేదికలు తయారు చేయడమో, లేక ఆయన ఏది రాయమంటే అది రాసి హైకోర్టు ముందు చివాట్లు తినవలసి రావడమో జరుగుతోందన్న భావన కలుగుతుంది.తాజాగా కేంద్రం చెబుతున్నదాని ప్రకారం ఇంతవరకు ఆర్టిసి విభజనే జరగలేదు. అందువల్ల కొత్తగా టిఎస్ ఆర్టిసి ఎలా ఏర్పడిందన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఇవన్ని సాంకేతిక సమస్యలు కావచ్చు. అసలు సమస్య ఆర్టిసి కార్మికులు చేస్తున్న సమ్మె. వారు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. ఆర్టిసి ని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ ఉన్నప్పట్టికీ ,దానిపై పట్టుబడతామని చెప్పినప్పటికీ, చర్చలు జరిగితే చాలు..ఏదో రకంగా రాజీ పడి సమ్మె విరమించాలని కార్మిక సంఘాలు ప్రస్తుతం ఆలోచిస్తున్నాయని అంటున్నారు. అదే సమయంలో కెసిఆర్ మాత్రం మొండికేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు చర్చల ప్రహసనం సృష్టించి,అసలు చర్చలు మొదలు కాకుండానే ఎన్ని అంశాలపై చర్చ అన్న వివాదంతోనే ముగించారు. అది ప్రభుత్వ పరంగా జరిగిన తప్పు అనిపిస్తుంది.మొదట సెల్ప్ డిస్మిస్ అయిపోయారని కార్మికులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన కెసిఆర్ ,ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ విదులకు డెడె లైన్ పెట్టారు. కాని కెసిఆర్ పిలుపు ను ఖాతరు చేయకపోవడం ఒకరకంగా కెసిఆర్ కు అది అప్రతిష్టే. కార్మికులు నా మాట వినరా అన్న ఈగోకి కెసిఆర్ వెళుతున్నట్లుగా ఉంది.ప్రభుత్వంలో ఉన్నవారు ఈగోకి పోతే తాత్కాలికంగా ఎదుటివారికి నష్టం జరగవచ్చు కాని, దీర్ఘకాలికంగా అదికారంలో ఉన్నవారే నష్టపోతారు. ఇది అనేక సార్లు నమోదు అయిన చరిత్ర. ఎన్.టి.ఆర్.విషయంలోకాని, చంద్రబాబు విషయంలో కాని ఈ అనుభవాలు ఎదురయ్యాయి.ఆ విషయాలన్ని కెసిఆర్ కు కూడా తెలుసు.అయినా ఆయన ఎందుకో మొడిగా వెళుతున్నారు. ఆర్టిసి కార్మికులు పనిచేసిన కాలానికి జీతాలు ఇవ్వకపోవడం కాని, చివరికి సమ్మెలో ఉన్నవారికి ఆస్పత్రి సదుపాయం లేకుండా చేయడం కాని ..ఇవన్ని అమానవీయ కోణాన్ని ప్రభుత్వం తెలంగాణలో ఆవిష్కరించిందన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అన్న ప్రశ్నను సహజంగానే ఆయా పక్షాలు వేస్తాయి. ఒకప్పుడు ఉద్యమ రద సారదిగా, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు మదిని గెలుచుకున్న నేతగా , కెసిఆర్ నాయకత్వానికి ధీటే లేదన్న పరిస్థితి నుంచి ఇప్పుడు ఎవరైనా కెసిఆర్ ను ఎదిరించవచ్చన్న పరిస్థితిని ఆయన స్వయంగా తెచ్చుకున్నారు. ఇప్పటికైనా ఆయన మారితే మంచిది. రాజకీయాలలో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే ఉంటాయి. అవి స్వయంకృతాపరాదంతోనే జరుగుతాయన్న సంగతి ఎన్నో వేల పుస్తకాలు చదివిన కెసిఆర్ కు తెలియనిది కాదు.మరి కెసిఆర్ మారతారా?

tags : hgh court, serious,kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info