A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ మంత్రివర్గ విస్తరణలో వ్యూహం
Share |
September 23 2019, 1:46 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యూహాత్మకంగా మంత్రి వర్గ విస్తరణ చేశారని చె్ప్పాలి. రాజకీయాలలో పట్టువిడుపులు ఎలా అవసరం అవుతాయో కెసిఆర్ మరోసారి రుజువు చేశారు. ఇటీవలికాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వంపై కొంత అసంతృప్తి పెరుగుతోందన్న భావన ఉంది.రెండోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వ్యవహరించిన ఏకపక్ష దోరణి, అనుసరిస్తున్న కొన్ని విదానాలతో అటు పార్టీలో కూడా అంతర్గతంగా అసమ్మతి గూడు కట్టుకుందన్నది వాస్తవం. దాని ఫలితమే మంత్రి ఈటెల రాజేందర్ కాని, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యాఖ్యలు కాని ఉదాహరణ అవుతాయి. ఈటెల ఉద్యమ భాష మాట్లాడినా, టిఆర్ఎస్ యజమానులం అని అన్నా ప్రస్తుతానికి కెసిఆర్ కామ్ గా ఉండదలిచారని అర్దం అవుతుంది. ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా ,ఎంత పెద్ద నాయకుడు అయినా కొన్ని సార్లు కాస్త తగ్గి వ్యవహరించాలి.లేకుంటే రాజకీయంగా ఆయనకే నష్టం జరుగుతంది.టిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు విషయం చూడండి. ఎన్నికల తర్వాత అంతా ఆశ్చర్యం చెందేలా ఆయనకు మంత్రి పదవి అవకాశం ఇవ్వలేదు. అంతేకాదుఅసలు దాదాపు రెండు నెలలపాటు తాను,మరో మంత్రి తప్ప అసలు మంత్రివర్గమే లేకుండా పాలన సాగించారు.దాంతో టిఆర్ఎస్ పైన, కెసిఆర్ పై ప్రజలలో ఇదేమిటి? ఇలా చేస్తున్నారు? ఆయనపై ఎంతో అబిమానంతో రెండోసారి గెలిపిస్తే మంత్రులను కూడా పెట్టలేదేమిటి?అన్న ప్రశ్నలు కూడా వచ్చాయి.తన కుమారుడు కెటిఆర్ వర్కింగ్ అద్యక్ష పదవి ఇచ్చి, ఆయనకు పార్టీపై తిరుగులేని పట్టు కల్పించారు.అయినా ఎవరి ప్రాదాన్యత వారికి ఉంటుంది.హరీష్ కు మంత్రి పదవి ఇవ్వకపోవడం పార్టీలో పెద్ద చర్చ అయింది. పార్టీలో ఉన్న సానుభూతి ఆయనకు ఉపయోగపడింది హరీష్ కు,కసిఆర్ కు అంతరం బాగా పెరిగిందని ప్రచారం జరిగింది.తన జన్మదినం రోజున హరీష్ ముఖ్యమంత్రి ని కలవకపోవడం కూడా చర్చనీయాంశం అయింది.వారిద్దరి మద్య సంబందాలు బాగా దెబ్బతిన్నాయని పార్టీ వర్గాలు భావించాయి. హరీష్ సన్నిహితులు అయితే ఇక మంత్రి పదవి కష్టమే అనుకునే దశకు వెళ్లారు. ఆ తరుణంలో వారికి కూడా ఆశ్చర్యం కలిగేలా మళ్లీ కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. హరీష్ కు మంత్రి పదవి ఇవ్వకుండా కెటిఆర్ కు ఇస్తే నెగిటివ్ సెంటిమెంట్ వెళుతుందని కెసిఆర్ బావించి ఉండాలి. లోక్ సభ ఎన్నికలలో ఎవరి ప్రభావం అన్నా కాని,అనూహ్యంగా బిజెపి పుంజుకుని నాలుగు సీట్లు గెలవడం, గత సారి రెండుసీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్ మూడు స్తానాలలో విజయం సాదించడం , చివరికి తన కుమార్తె కవిత నిజామాబాద్ లో ఓడిపోవడం ముఖ్యమంత్రి కి, టిఆర్ఎస్ కు షాకింగ్ గా మారాయి.అయినా మరికొన్నాళ్లు పరిస్థితిని కెసిఆర్ అబ్జర్వు చేశారు. రాజకీయంగా ఎదురవుతున్న పరిణామాలు, బిజెపి ఎలా ఆయా పార్టీ ల నేతలను ఆకర్షిస్తోంది.ఇతర రాష్ట్రాలలో ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నది గమనిస్తున్న కెసిఆర్ అప్రమత్తం అయ్యారు. ఇంతకాలం పెండింగులో పెట్టిన చీప్ విప్, విప్ వంటి పదవులు బర్తీచేశారు.మరికొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులను కూడా ఎమ్మెల్యేలకు ఇస్తామని ప్రకటించారు. కడియం,మదుసూదనాచారి, నాయిని వంటివారికి కూడా పదవులు ఇవ్వబోతున్నట్లు లీక్ ఇచ్చారు. హరీష్ రావు,కెటిఆర్ పువ్వాడ అజయ్్ కుమార్ ,గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి,సత్యవతిరాదోడ్ లకు మంత్రి పదవులు ప్రకటించారు. కెటిఆర్ కు గతంలో ఐటి,మున్సిపల్ శాఖలు ఇచ్చినప్పుడు ఆయన పట్ల సానుకూల దోరణి వచ్చింది.అలాగే హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా బాగా కష్టపడ్డారన్న పేరు ఉంది.సామాజికవర్గాల కోటాలో బాగంగా పువ్వాడ అజయ్ కు మంత్రి పదవి లభించింది.రంగారెడ్డి జిల్లాలో టిఆర్ఎస్ గెలవడానికి సబితా ఇంద్రారెడ్డి సేవలు బాగా అవసరం అవుతాయని గుర్తించారు. ఇక గిరిజనులలో సత్యవతి రాదోడ్ కు బిసిలలో కమలాకర్ కు అవకాశం కల్పించారు.కరీంనగర్ లోక్ సభ సీటును కూడా టిఆర్ఎస్ కోల్పోయిన నేపద్యంలో కమలాకర్ కు ప్రాదాన్యత ఇచ్చారని అనుకోవచ్చు. మొదటిసారి ఇద్దరు మహిళలకు కెసిఆర్ మంత్రి పదవులు ఇచ్చారు. రాజకీయంగా కెసిఆర్ ఇప్పుడు చకచకా నిర్ణయాలు తీసుకోవడంలో కచ్చితంగా వ్యూహం ఉంది. సెక్రటేరియట్ కూల్చివేత అంశంపై ప్రజలలో వ్యతిరేకత ఉంది. అదే సమయంలో యాదాద్రిలో బొమ్మల వివాదం తాజాగా బయటకు వచ్చింది.మరో వైపు డెంగీ జ్వరాల సమస్య తీవ్రంగా ఉంది. ఎన్నికలలో ఇచ్చిన రుణమాఫీ తదితర హామీలు పెండింగులో ఉన్నాయి.వీటన్నిటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెలళ్లేలోగా రాజకీయంగా చర్యలు తీసుకోకపోతే నష్టపోతామని కెసిఆర్ అనుకుని ఉండాలి.అందుకే హరీష్ తో సహా ఆయా నేతలకు పదవులు దక్కాయని అనుకోవచ్చు.గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా కెసిఆర్ అవసరమైనప్పుడు కాక పెంచడం,పరిస్థితి అనుకూలంగా లేదనుకుంటే తగ్గి ఉండడం వంటి వ్యూహాలను అమలు చేసేవారు. అదికారం లో లేనప్పుడే కాక, అదికారం వచ్చిన తర్వాత కూడా పట్టువిడుపులు లేకపోతే దెబ్బతింటామన్న సంగతి కెసిఆర్ కు బాగా తెలుసు.అందుకే ఇప్పుడు ఆయన పదవుల పందారం చేపట్టారని అనుకోవచ్చు.
కొడుమూరు

tags : kcr, cabinet

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info