A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డాలస్ లో అన్నదాత సుఖీభవ !
Share |
July 17 2019, 12:32 am

డాలస్, టెక్సాస్: - “అన్నదాత చారిటీస్” సంస్థ నెల వారీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలలో ప్రముఖ ప్రవాస భారతీయ నాయకుడు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర ముఖ్య అతిధిగా పాల్గొని తన ప్రసంగంలో ప్రముఖ సంఘ సేవకుడు భాస్కర్ రెడ్డి నేతృత్వంలో 2011 లో స్థాపించబడిన అన్నదాత అనే సేవా సంస్థ అటు భారత్ లోను ఇటు అమెరికాలోను అన్నార్తులకు ఆపన్న హస్తం అందించే ఒక పెద్ద సంస్థగా ఎదగడం ఎంతైనా సంతోషదాయకమని అన్నారు.
ప్రతి నెల మూడో శనివారం క్రమం తప్పకుండా డాలస్, ఫోర్టువర్త్ నగరాలలో జాతి, మతం వివక్షత లేకుండా నేపాల్, భూటాన్, బర్మా లాంటి దేశాల నుండి అమెరికాకు ఖాందిశీకులగా వచ్చి కనీస అవసరాలు కూడా లేకుండా జీవనం సాగిస్తున్న దాదాపు 200 మంది శరణార్థులకు అవసరమయ్యే బియ్యం, గోధుమపిండి, పప్పు ధాన్యాలు, చింతపండు, తేనె, పండ్లు లాంటి నిత్యావసర వస్తువులను అందజేస్తూ సాటి మనిషికి సాయం చేయాలనే మానవతావాద దృక్పధం ఎంతైనా అభినందనీయమని ప్రసాద్ తోటకూర ప్రశంసించారు.
ప్రముఖ స్వచ్చంద సేవకురాలు పూర్ణా నెహ్రు మాట్లాడుతూ కేవలం నిత్యావసర వస్తువులే గాక దుస్తులు, కుట్టు మెషిన్లు, కంప్యూటర్లు ఉచితంగా పంపిణీ చేస్తూ అర్హులైన వారికి తగు తర్ఫీదు ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

అన్నదాత చారిటీస్ వ్యవస్థాపకుడు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కేవలం నెల వారి మూడు వందల డాలర్లు ఖర్చు చేసే విధంగా స్థాపించబడిన చిన్న సంస్థ ఇప్పుడు నెలకు 5,000 డాలర్ల వ్యయంతో 200 మందికి పైగా సహాయపడే విధంగా ఎదగడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం లో మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న “కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ (ఫ్రిస్కో నగరం)”, “షిరిడీ సాయిబాబా టెంపుల్ (ప్లానో నగరం)” మరియు “షిరిడీ సాయిబాబా మందిర్ (ఇర్వింగ్ నగరం)” యాజమాన్యాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనేక మంది స్వచ్చంద సేవకులు శ్రద్ధాశక్తులతో తమ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమ నిర్వహణలో తోడ్పడుతున్న రాజా రెడ్డి, పూర్ణా నెహ్రు, ప్రసాద్ గుజ్జు, రజని, సురేష్, అర్జున్, పులిగండ్ల విశ్వనాధం, మురళి తుమ్మల, శంకరన్, వివేక్ దత్త, శివాజీ, మీనా శర్మ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

tags : dallas, totakura

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info