A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ గెలిస్తే వార్త కాదు...
Share |
June 16 2019, 2:23 am

ఆంద్రప్రదేశ్ లో అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నికలు ముగిశాయి. అదికార తెలుగుదేశం ఎలాగైనా అదికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని విశ్వయత్నం చేస్తే , ప్రజాదరణ పొందడం ద్వారా అదికారంలోకి రావాలని ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ సర్వ శక్తులు ఒడ్డింది. ప్రజాస్వామ్యంలో ఎన్నిక అన్నది ఒక కీలకమైన అంశం. ఐదేళ్ల పాలనపై ప్రజలు తీర్పు ఇచ్చే అవకాశం. ఎపిలో జరిగిన పోలింగ్ తీరుతెన్నులు బట్టి ,ఆయా గ్రూప్ లు చేసిన సర్వేలలో వస్తున్న వివరాలను బట్టి ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పట్టం కట్టవచ్చన్న అబిప్రాయం అదికంగా ఉంది. అందుకు అనేక నిదర్శనాలు కూడా కనిపించాయి.ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎర్రాటిక్ బిహేవియర్ చూశాక, ఆయన అదికారాన్ని కోల్పోతున్నారన్న అనుమానం వస్తుంది.అలాగే స్పీకర్ కోడెల శివప్రసాదరావు పోలింగ్ బూత్ లోకి వెళ్లి తలుపు వేసుకోవడం చిత్రంగా ఉంటుంది.ముప్పై ఐదేళ్లుగా రాజకీయాలలో ఉన్న ఆయన ,అందులోను స్పీకర్ గా ఒక గౌరవప్రదమైన పదవిలో ఉన్న ఆయన వాటన్నిటిని విస్మరించి వ్యవహరించిన తీరు కూడా ఆయన పరాజయ బాటలో ఉన్నారేమోనన్న అబిప్రాయం కలిగిస్తుంది. పోలింగ్ కు ముందు జరిగే ప్రచారం అంతా ఒక ఎత్తు అయితే, పోలింగ్ నాడు జరిగేది ఒక ఎత్తుగా ఉంటుంది. రెండు పక్షాలు ఈసారి పోటాపోటీగానే వ్యవహరించాయని చెప్పాలి.ఢీ అంటే డీ అన్నాయనే అనుకోవాలి.సాదారణంగా పోల్ మేనేజ్ మెంట్ లో చంద్రబాబు ఆరితేరారని, తిమ్మిని బమ్మిని చేస్తారని,ఏదైనా చేసి గెలిచే ప్రయత్నం చేస్తారని చాలా మంది నమ్మకం.కిందటి ఎన్నికలలో అది కొంత పనిచేసిందని భావిస్తారు.అయితే ఈసారి వైఎస్ ఆర్ కాంగ్రెస్ కూడా బూత్ లెవల్ వరకు విస్తరించి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అందువల్లే కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరగడం, రెండువైపులా ఒకరిద్దరు మరణించడం వంటివి జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలింగ్ కు ముందు రోజు సిఇఓ వద్దకు వెళ్లి ఎన్నికల సంఘాన్ని దూషించడం, ఆ తర్వాత ఆ కార్యాలయం ఎదుట నిరసనగా కూర్చోవడం వంటి విన్యాసాలు కూడా ఆయన పార్టీ బలహీనపడిందనడానికి ఆస్కారం కలిగింది. ముఖ్యంగా ఆయన కుమారుడు లోకేష్ పోటీచేస్తున్న మంగళగిరిలో ఇద్దరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ లను ఎన్నికల సంఘం బదిలీ చేయడం ఆయన ఊహించలేకపోయారు.తట్టుకోలేకపోయారు. అదికారంలో ఉన్నవారికి పోలీసులను వాడుకుని మళ్లీ అదికారం నిలబెట్టుకునే యత్నాలు చేస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ.నంద్యాల ఉప ఎన్నికలో అయితే ఆయా పధకాల లబ్దిదారుల ఖతాలలో డబ్బు వేయడం, చివరికి తమకు కావల్సిన పోలీసు అదికారులను నియమించుకుని వారితో ఓట్లు కూడా వేయించుకోవడం వంటి అకృత్యాలు కూడా చేశారు.ఉప ఎన్నిక కనుక అక్కడ సాద్యమైంది.కాని సాదారణ ఎన్నికలలో అంత తేలిక కాదు.అందులోను ఎన్నికల సంఘం కఠినంగా నిబందనలు అమలు చేస్తే ప్రబుత్వంలో ఉన్నవారి పప్పులు ఉడకవు. ఇప్పుడు ఎపిలో అదే జరిగినట్లు కనిపిస్తుంది.పోలింగ్ రోజున కూడా చంద్రబాబు నాయుడు చివరి ప్రయత్నం చేశారు. అందులో బాగంగా ఈవిఎమ్ లు ముప్పై శాతం పని చేయడం లేదని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆరోపించడం తగని పని.అయినా ఆయన అలా చేశారంటే ఎంత ఆందోళన చెందుతున్నది అర్దం అవుతుంది.అంతేకాక కొన్ని చోట్ల ఘర్షణలు జరిగితే అదంతా వైసిపివారిపని అని వెంటనే ప్రకటనలు ఇవ్వడం ఇదంతా చూస్తుంటే ఆయన ఎక్కువగా కంగారు పడుతున్నట్లు అనిపిస్తుంది.ప్రదానంగా ప్లాన్ చేసుకుని వేల కోట్ల ప్రభుత్వ దనాన్ని ఖర్చు చేసినా ,ప్రజలలో ఎందుకు మార్పు వచ్చిందన్నది ఆయనకు అంతు పట్టడం లేదు. అందువల్లనే హుందాతనం కోల్పోయి ,స్థాయి మరచి మాట్లాడుతున్నారు. అదే సమయంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ఓటు వేసినప్పుడు విజయంపై వ్యక్తం చేసిన విశ్వాసం తప్ప,మరో మాట మాట్లాడలేదు.తద్వారా ఆయన హుందా నిలబెట్టుకున్నారు. ఏతావాతా చూస్తే తెలుగుదేశం పార్టీ ఈసారి అదికారం కోల్పోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది.రాయలసీమ నాలుగు జిల్లాలలో 35 సీట్లు , నెల్లూరు,ప్రకాశం జిల్లాలలో కనీసం పదిహేను సీట్లను వెఎస్ ఆర్ కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉన్నట్లు అంచనాలు వస్తున్నాయి.అంటే ప్రకాశం జిల్లా వచ్చేసరికి ఏభై సీట్లు వస్తాయన్నమాట. ఆ తర్వాత గుంటూరు,కృష్ణ,పశ్చిమగోదావరి,తూర్పు గోదావరి జిల్లాలలో నలభై సీట్లు వరకు రావచ్చని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అంచనాగా ఉంది.ఈ నాలుగు జిల్లాలలో ముప్పై సీట్లు వచ్చినా, వైసిపికి అదికారం వచ్చినట్లే. ఉన్నంతలో విశాఖపట్నం జిల్లా తప్ప మిగిలిన ఏ జిల్లాలోను వైఎస్ ఆర్ కాంగ్రెస్ బలహీనంగా ఉన్నట్లు ఎవరూ చెప్పలేకపోతున్నారు. విశాఖలో సైతం ఆరేడు స్థానాలు రావచ్చని కొందరి అబిప్రాయం. గతసారి వైఎస్ ఆర్ కాంగ్రెస్ 67 సీట్లు సాదించుకుంది.వాటిని నిలబెట్టుకుని మరో పాతిక సీట్లు తెచ్చుకుంటే అదికారం వచ్చేస్తుంది.టిడిపి కి కూడా అదే ధీరి వర్తించవచ్చు.కాని గతసారి బిజెపి మద్దతు,జనసేన సపోర్టు ,రుణమాఫీ లు, కాపు రిజర్వేషన్ వంటి హామీలు టిడిపికి బాగా ఉపయోగపడ్డాయి.ఈసారి ఇవేవి లేకపోవడం, బిజెపి,జనసేనలు వేర్వేరుగా పోటీచేయడం వల్ల పది శాతం వరకు ఓట్ల శాతం తగ్గిందని జాతీయ సర్వేలు చెబుతున్నాయి.అందువల్లే 20 పైగా లోక్ సభ సీట్లు వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు వస్తాయని ఆ సర్వేలు అంచనా వేశాయి. అంటే దానర్దం అసెంబ్లీలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు 110 నుంచి 120 వరకు సీట్లు వస్తాయన్నమాట.ఇదే విషయాన్ని ఆయా సర్వేలు తేల్చాయి. అయితే ప్రజాబిప్రాయాన్ని జనం డబ్బుతోనే మార్చడానికి చంద్రబాబు తీవ్ర ప్రయత్నం చేశారు.గత మూడు నెలల్లో ముప్పైఐదువేల కోట్ల బిల్లులు పెండింగులో పెట్టి ,సుమారుగా ఏభై వేల కోట్ల రూపాయలను ఓట్ల కొనుగోలు స్కీములకు వెచ్చించారట.అయితే జనం వీటిని సీరియస్ గా తీసుకోలేదన్నది ఎక్కువ మంది నమ్మకం.నిజంగానే ఆ డబ్బు పనిచేస్తే టిడిపి గెలిచే అవకాశం ఉంటుంది.కాని దానిని వైఎస్ ఆర్ కాంగ్రస్ అదినేత జగన్ కాని ,షర్మిల,విజయమ్మలు బాగా ప్రచారం చేసి అదంతా మోసం అని చెప్పగలిగారు. అందువల్ల ప్రజలలో ప్రభుత్వం మార్పుపై మొగ్గు చూపినట్లు అనిపిస్తుంది.ఇది కాకుండా సామాజికవర్గాల సమీకరణ కూడా బాగా మారందన్నది ఒక విశ్లేషణ.కమ్మ సామాజికవర్గానికి వ్యతిరేకంగా మిగిలిన సామాజికవర్గాలలో సమీకరణ జరిగిందని కొందరు చెబుతున్నారు.అది వాస్తవమే అయితే వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు ఇది సునామీ అయి భారీ మెజార్టీతో గెలవవచ్చు.మొత్తం మీద చూస్తే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వార్తగా అనుకోనవసరం లేదు.అందుకు భిన్నంగా జరిగితేనే ఆశ్చర్యపోవాలి. జనాభిప్రాయమా?లేక ధనాభిప్రాయమా అన్నది ఈ ఎన్నికలు తేల్చనున్నాయి.

tags : ap, ysr congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info