A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కుటుంబమే టిర్ఎస్ బలం-ఈనాడు విశ్లేషణ
Share |
June 16 2019, 2:34 am

తెలంగాణలో కుటుంబ పాలన అంటూ కాంగ్రెస్,తదితర పక్షాలు చేసిన విమర్శలను ప్రజలు తిప్పికొట్టారని మీడియాలో ఒక విశ్లేషణ వచ్చింది. ఈనాడు పత్రిక తెలంగాణలో టిఆర్ఎస్ కుటుంబమే బలంగా మారిందని ఒక విశ్లేషణ ఇచ్చారు. ఇది ఆసక్తికరంగా ఉంది. అందులో కొన్ని భాగాలు ఇలా ఉన్నాయి.

కెసిఆర్ సుడిగాలి ప్రచారం

కొంగరకలాన్‌ సభ తర్వాత పార్టీ వ్యవహారాల్లో తలమునకలైన కేసీఆర్‌ కొంత ఆలస్యంగా ప్రచారపర్వంలోకి అడుగుపెట్టారు. ఆయన రాకతో తెరాస ప్రచారంలోకి హైవోల్టేజి ఉత్సాహం వచ్చినట్లైంది. ప్రజాశీర్వాద సభల పేరుతో తెరాస చేపట్టిన ప్రచారంలో దూకుడు పెరిగింది. రోజుకు ఐదు నుంచి తొమ్మిది ప్రజాశీర్వాద సభల్లో ఆయన పాల్గొన్నారు. మొత్తం 118 మంది అభ్యర్థుల కోసం సుడిగాలి పర్యటనలు చేశారు. చివరగా సొంత నియోజకవర్గమైన గజ్వేలుతో ప్రచారాన్ని ముగించారు.
పదునైన విమర్శలతో ప్రత్యర్థులను ఆత్మరక్షణలోకి నెట్టడం కేసీఆర్‌కు వెన్నుతోపెట్టిన విద్య. ఆత్మీయమైన తెలంగాణ భాషలో సాగిన ఆయన ప్రసంగాలు ప్రజలను కట్టిపడేశాయి. మాటల మాంత్రికుడిగా పేరున్న కేసీఆర్‌ మరోసారి తన వాక్చాతుర్యాన్ని కనబరిచారు. ప్రత్యర్థుల అంచనాలను తారుమారు చేసేలా వ్యూహరచన చేయడం కేసీఆర్‌కు కొత్తేమీ కాదు. ఈసారి 105 మంది అభ్యర్థులను ఒకే విడత ప్రకటించి ప్రత్యర్థులకు ఊపిరిసలపకుండా చేశారు.
నగర నాడి తెలిసిన కేటీఆర్‌..
వాగ్ధాటిలో తండ్రికి తగ్గతనయుడిగా పేరు తెచ్చుకొన్న కేటీఆర్‌ ఈసారి ప్రచారంలో దూసుకెళ్లారు. కేసీఆర్‌ తర్వాత అత్యధికంగా 70 స్థానాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పార్టీ ప్రచార బాధ్యతలను కేటీఆరే స్వయంగా పర్యవేక్షించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్నీ తానై పార్టీని నడిపించిన అనుభవం కేటీఆర్‌కు అక్కరుకొచ్చింది. ఒక దశలో సెటిలర్లపై కేసీఆర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో నష్టనివారణ చర్యలను కేటీఆరే స్వయంగా చేపట్టారు. సెటిలర్లకు తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. నగరంలో, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రెబల్స్‌, అసమ్మతులను కేటీఆర్‌ బుజ్జగించారు.
కేసీఆర్‌ మంత్రి వర్గంలో కీలకమైన ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల బాధ్యతలను కేటీఆర్‌ నిర్వహించారు. తెరాస యువ నాయకుడిగా కేటీఆర్‌ అద్భుతంగా ఇమిడిపోయారు. ఇది కేసీఆర్‌, తెరాసకు అదనపు బలంగా మారింది. హైదరాబాద్‌లో గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సమ్మిట్‌ తర్వాత కొత్త తరం రాజకీయనాయకుడిగా కేటీఆర్‌ ఇమేజ్‌ అమాంతం పెరిగిపోయింది.
మనలో మనిషిగా హరీశ్‌..
సగటు తెలంగాణ వాసి కూడా అభిమానించే నేతగా హరీశ్‌రావుకు మంచి ఇమేజ్‌ ఉంది. కేసీఆర్‌ మాటంటే హరీశ్‌కు వేదవాక్కు. కార్యదక్షుడిగా, ట్రబుల్‌ షూటర్‌గా హరీశ్‌కు మంచి పేరుంది. అందుకే ఉద్యమకాలం నుంచి కేసీఆర్‌ కీలక బాధ్యతలను ఆయనకు‌ అప్పగించేవారు. హరీశ్‌ ప్రతి సందర్భంలో కేసీఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టుకొన్నారు. తెలంగాణ మొత్తానికి సిద్దిపేట నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడంతో హరీశ్‌ ఇమేజ్‌ బాగా పెరిగింది. అటువంటి నేత తమకు కూడా ఉండాలని చాలా నియోజకవర్గాల ప్రజలు భావిస్తారంటే అతిశయోక్తి కాదు. తెరాస ప్రతిష్ఠాత్మకంగా భావించిన మిషన్‌ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులను హరీశ్‌రావు స్వయంగా చూసుకొన్నారు.
ఓ పక్క కేసీఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనల్లో ఉండగా.. హరీశ్‌రావు గజ్వేల్‌ నియోజకవర్గ బాధ్యతలను భుజస్కందాలపై వేసుకొన్నారు. దీంతోపాటు మరో 25 నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. రెబల్స్‌ను బుజ్గగించడం వంటి బాధ్యతలను కూడా పంచుకొన్నారు. వంటేరు ప్రతాపరెడ్డి వంటి నాయకులు హరీశ్‌ విశ్వసనీయతపై చేసిన ఆరోపణలను కేసీఆర్‌ ఏమాత్రం పట్టించుకోలేదు. ఇది హరీశ్‌రావుపై కేసీఆర్‌కు నమ్మకానికి నిదర్శనం.
ఇంటిపోరుకు అవకాశం ఇవ్వని బంధం..
హరీశ్‌, కేటీఆర్‌ మధ్య ఆధిపత్యపోరు జరుగుతోందన్న ప్రచారాన్ని ఇద్దరు నేతలు కొట్టిపారేశారు. తమకు కేసీఆర్‌ నాయకుడని.. ఆయన నాయకత్వంలో పనిచేస్తామని.. మరో ఆలోచనే లేదని వీరు తేల్చిచెప్పారు. తాము కలిసే ఉన్నామని పార్టీ శ్రేణులకు బలమైన సందేశాన్ని పలుమార్లు పంపించారు. ఇది తెరాస శ్రేణులు ఏకతాటిపై పనిచేసేందుకు ఉపయోగపడింది. దీనికి తోడు కేసీఆర్‌ కుటుంబ సభ్యలు ఎవరు అనవసర వివాదాల్లోకి వెళ్లిన సందర్భాలు కనిపించవు. వారిలో ఆ క్రమశిక్షణ ఉండటం కేసీఆర్‌కు అదనపు బలం.
తెలంగాణ ఆడపడుచుగా..
తెలంగాణ ఆడపడుచుగా కవిత ప్రజల్లో సుపరిచితం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే బతుకమ్మ ఉత్సవాలు వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను ఆమె చూసుకొన్నారు. ఈసారి ఎన్నికల్లో దాదాపు 13 నియోజకవర్గాల్లో కవిత ప్రచారం చేశారు. తెరాస నుంచి డీఎస్‌ వంటి సీనియర్‌ నేత వెళ్లిపోవడంతో నిజామాబాద్‌ జిల్లాలో పార్టీ వ్యవహారాలను ఆమె పర్యవేక్షించారు.

tags : eenadu, trs,family

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info