సాక్షి పత్రిక ఆద్వర్యంలో జరిగిన రోడ్ షో ఆసక్తికరంగా ఉంది. తాము ఎవరికి ఓటు వేసేది, ప్రభుత్వపదకాలలోని లోపాలు,కాంగ్రెస్,టిడిపి పొత్తుపైన పలువురు తమ అబిప్రాయాలు చెప్పారు. ఎక్కువ మంది కాంగ్రెస్,టిడిపి పొత్తును వ్యతిరేకించారు. అ కదనంలోని కొన్ని భాగాలు ఇలా ఉన్నాయి.
ముంబయి – విజయవాడ హైవేలో 65వ నెంబర్ జాతీయ రహదారి వెంట ఎన్నికలపై జనం పల్స్ తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. ఇందులో భాగంగా మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో దాదాపు 304 కిలోమీటర్ల మేర సాక్షి ప్రతినిధులు పర్యటించారు. ఈ పర్యటనలో వారు మెదక్ జిల్లాలోని జహీరాబాద్ నుంచి నల్లగొండ జిల్లా కోదాడ వరకు రహదారి పక్కన ఉన్న విభిన్న వర్గాల ప్రజలను...ప్రయాణికులను కలిశారు. రహదారి పొడవునా ‘రోడ్డు షో’ నిర్వహించి ఎవరెలా స్పందించారో? ఎవరేమన్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు.
మొత్తం 10 రూట్లుగా విభజించుకుని ‘సాక్షి’ బృందం దాదాపు 40–50 కిలోమీటర్ల మేర ప్రయాణించింది. ఒక్కో రూట్లో కనీసం 15 నుంచి 20 మందిని..ఎన్నికలపై అభిప్రాయాన్ని కోరింది. ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు, యువత, రైతులు, కూలీలు, దారిలో ఎదురుపడిన ప్రతి ఒక్కరినీ పలకరించి వారి అంతరంగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. మెట్రోనగరం హైదరాబాద్‌తోపాటు జహీరాబాద్, పటాన్చెరు, చౌటుప్పల్, నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ వంటి చిన్నపట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలు ఈ రూట్లో అధికంగా ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి ప్రజలు కూడా భిన్నంగా స్పందించడం ఇక్కడ విశేషం.
తెలంగాణ వ్యతిరేకులతో కాంగ్రెస్ పొత్తా?
సంక్షేమ పథకాలు, వాటి అమలు, లోటుపాట్ల గురించి మాట్లాడుతూనే జనం రాజకీయాలపైనా అభిప్రాయాలు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో పొత్తుపెట్టుకోవడాన్ని వ్యతిరేకించారు. అవసరం కోసమే చంద్రబాబు తెలంగాణలో రాజకీయం చేస్తుండని విమర్శలు గుప్పించారు. తాము కాంగ్రెస్‌ను అభిమానించే వాళ్లమయినా..బాబు పొత్తు కారణంగా ఈసారి టీఆర్ఎస్ వైపు చూస్తున్నామని కొందరు నిర్మొహమాటంగా చెప్పారు. తెలంగాణ వ్యతిరేకులతో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్‌కు ఏమవసరమని ప్రశ్నించారు. ఇక పల్లెల్లో పథకాలు బావున్నాయని, కొందరు అమలు తీరు మెరుగుపడాలని మరికొందరు చెçప్పుకొచ్చారు.
పథకాలకు ప్రశంసలు
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు ఈ షోలో పలుచోట్ల ప్రశంసలు వచ్చాయి. కొందరు పథకాల్లోని లోపాలనూ ఎత్తిచూపారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ బాగా పనిచేస్తున్నారు. ఆయనే మళ్లీ రావాలి’ అని జహీరాబాద్ రూట్లోని హుస్నాబాద్ మండలం రాయికోడ్‌కు చెందిన ఏసయ్య చెప్పారు. పింఛన్లు ఎంతో మేలు చేస్తున్నాయని, ఇంత పద్ధతిగా గతంలో ఎవరూ పింఛన్లు ఇవ్వలేదని ఎల్గోయి గ్రామానికి చెందిన మణయ్య పేర్కొన్నారు. రెండు లక్షల రుణమాఫీ వంటి పథకాలు తమను కాంగ్రెస్ వైపునకు దృష్టి మళ్లిస్తున్నాయని గోపన్‌పల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, మైనార్టీలకు ఎంతో లబ్ధి చేకూరిందని, ఆయనే మళ్లీ సీఎంగా రావాలని పటాన్ చెరు పరిధిలోని బీరంగూడకు చెందిన ఎండీ ఖాన్ చెప్పుకొచ్చారు. పథకాలకు ప్రచారమే మిగిలింది తప్ప ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని ఇదే ప్రాంతంలో ఆటో డ్రైవర్ మల్లేశ్వర్రావు పేర్కొన్నారు. కేసీఆర్ పాలన బాగుందని, ఆయనొచ్చాక రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదని కూకట్‌పల్లికి చెందిన ఉద్యోగి నవీన్ చెప్పారు. ‘సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతున్న ఈ తరుణంలో ప్రభుత్వం మారితే గందరగోళం ఏర్పడుతుంది. పథకాల లక్ష్యం నెరవేరాలంటే మళ్లీ సీఎంగా కేసీఆరే రావాలి’ అని లక్డీకాపూల్‌లోని పండ్ల వ్యాపారి అబ్దుల్ రషీద్ పేర్కొన్నారు. ఎవరికి ఓటేస్తానో చెప్పలేను కానీ సిటీలో రోడ్లు బాగాలేవు. ఏ ప్రభుత్వం వచ్చినా నగర రోడ్లను పట్టించుకోలేదు అని తన ఆవేదన వ్యక్తం చేశారు పంజగుట్టకు చెందిన ఆటోడ్రైవర్ శర్వన్సింగ్. ‘గర్భిణిలకు కేసీఆర్ కిట్లు, పిల్ల పెండ్లికి షాదీ ముబారక్ ఎంతో బాగుంది. అందుకే ఇదే ప్రభుత్వం మళ్లీ రావాలి’ అని ఎర్రగడ్డకు చెందిన బ్యాటరీ మెకానిక్ రఫీక్ వెల్లడించారు. సర్కారు పథకాలు కింది స్థాయి వరకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఎల్బీనగర్లో చెప్పుల బడ్డీ నడుపుకుంటున్న శకుంతల ప్రశ్నించింది. ‘ఎన్నికలు డబ్బుమయంగా మారాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు కొంతమేరకు పర్లేదు. కానీ ఎవరికి ఓటెయ్యాలో నిర్ణయించుకోలేదు’ అని చెప్పారు గుండ్రాంపల్లికి చెందిన చిట్టిప్రోలు రాములు. కేసీఆర్ పాలనలో ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన కాసింత అసంతృప్తి వ్యక్తం చేశారు. tags : sakshi, road show