A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో చంద్రబాబు ప్రమాదకర ప్రయోగం
Share |
April 23 2019, 3:42 am

తెలంగాణ నాయకత్వానికి,ప్రజలకు సవాల్ విసురుతున్న చంద్రబాబు

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ప్రమాదకరమైన ప్రయోగం చేస్తున్నారు. ఆయన చేస్తున్న ప్రయత్నాలు కాని, ప్రచారం కాని ఆంద్రులకు నష్టం చేసేలా కనిపిస్తున్నాయి,.అంతేకాదు.తెలంగాణలో ప్రశాంతంగా నివసిస్తున్న ఆంద్రులకు కూడా ఆయన చేటు తెచ్చేలా ఉన్నారు. మళ్లీ ఆంద్ర,తెలంగాణ వివాదాలను ఆయన తెరపైకి తెచ్చారు.తెలంగాణలో కాంగ్రెస్ ను తన కంట్రోల్ కి తెచ్చుకున్నందున కెసిఆర్ ను ఓడించగలిగితే ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయ నాయకత్వం అనండి, ప్రభుత్వ పాలన అనండి తన అధీనంలోనే ఉంటుందన్న లక్ష్యంతో ఆయన వ్యూహం పన్నారన్న అబిప్రాయం ఏర్పడుతుంది.అంతేకాక తెలంగాణకు కూడా తన నాయకత్వమే అవసరమైందని రుజువు చేసుకునే ప్రయత్నం కొత్త వివాదాలకు, తెలంగాణ నాయకత్వ ఆత్మగౌరవానికి సమస్య అయ్యే పక్షంలో భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది.కాంగ్రెస్ ్రచార ప్రకటనలలో రాహుల్ గాందీ పక్కన ఉండవలసిన ఉత్తం కుమార్ రెడ్డి బొమ్మ కిందకు వెళ్ళిపోయి, చంద్రబాబు బొమ్మ ఉండడమే ఇందుకు ఒక నిదర్శనం.టిడిపి సొంతంగా పోటీలో ఉండి ఉంటే అది వేరే విషయం. కాని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణ కాంగ్రెస్ నేతలను తన చుట్టూ తిప్పుకోవడమే కీలకంగా ఉంది. చంద్రబాబు నాయుడు గతంలో ఉమ్మడి ఎపి రాస్ట్రాన్ని విడగొట్టాలని ఆంద్రుల అబిమతానికి వ్యతిరేకంగా లేఖ ఇచ్చారు. ఎవరైనా ఆంద్ర,రాయలసీమ వాసులు అదేమిటి అని అడిగితే రాష్ట్రం విబజన జరగదులే,ఎన్నికల కోసం,తెలంగాణ ఓట్ల కోసం లేఖ ఇస్తున్నాములే అని చెప్పేవారు. ఆ తర్వాత అసెంబ్లీలో సైతం మీరు తీర్మానం పెడతారా.లేక మేం పెట్టాలా?అని రోశయ్య ప్రభుత్వాన్ని నిలదీశారు. అప్పుడే ఎపి టిడిపి ఎమ్మెల్యేలు ఎవరైనా అడిగితే మళ్లీ అదే సమాదానం.తెలంగాన రాదులే అని. ఆ తర్వాత నిజంగానే చంద్రబాబు లేఖ కూడా వచ్చిన తర్వాత ఆపడం ఎందుకు అని కాంగ్రసె్ పార్టీ తెలంగాణను ప్రకటించింది.అంతే చంద్రబాబు మళ్లీ తన స్వరం మార్చి అర్దరాత్రి తెలంగాణ ఇస్తారా అని వ్యాఖ్యానించి మాట మార్చడంలో సిద్దహస్తుడనని రుజువు చేసుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల రాజీనామాల ప్రహసనం నడిపిందారు.కారణం ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రకటనను కేంద్రం వాయాదా వేసుకుంది. తదుపరి వచ్చిన పరిణామాలలో ఎపిలో జగన్ సొంత పార్టీ పెట్టుకుని ఎపిలో ఉప ఎన్నికలకు విళితే టిడిపికి డిపాజిట్లు దక్కలేదు. దాంతో ఆయన మళ్లీ వ్యూహం మార్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడిపోకుండా జాగ్రత్తగా కాపాడారు.తెలంగాణలో చంద్రబాబు వైఖరి వల్ల అప్పట్లో ఈ ప్రాంతంలో నివసించే సీమాంద్రులు ఇబ్బంది పడవలసి వచ్చింది. ఈయన రెండుకళ్ళ సిద్దాంతం, ఇతర మాటలతో తెలంగాణ అంతటా టిడిపి గందరగోళంలో పడింది. తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే అవే ఫలితాలు.టిడిపికి డిపాజిట్లు రాలేదు.తదుపరి పాదయాత్ర చేస్తున్నానని, తెలంగాణకు తను అనుకూలం అని ప్రకటనలు చేశారు.తదుపరి రెండోసారి కూడా తెలంగాణ అనుకూల లేఖ ఇచ్చి ,ఆంద్ర తెలుగుదేశం వారు ఎవరూ మాట్లాడకుండా నోరు మూయించేవారు. నిజంగానే తెలంగాణ వచ్చింది. ఆ సమయంలో ఈయన చేసింది మరీ ఘోరం.సోనియాగాందీ ఆంద్రుల పొట్ట కొట్టిందని, గాందీని చంపిన గాడ్సె అని, ఇటలీ మాఫియా అని ఇలా అనేక విమర్శలు చేస్తూ ఆంద్ర ప్రజలను మోసం చేసే ప్రక్రియలోకి వెళ్లారు. ఒక్కోసారి ప్రజలు కూడా మోసపోతారనడానికి చంద్రబాబును మించిన ఉదాహరణ మరొకటి ఉండదంటే ఆశ్చర్యం కాదు. ఎలాగొలా తంటాలు పడి బిజెపి ప్రధాని అభ్యర్ధి మోడీని ప్రసన్నం చేసుకుని పొత్తు పెట్టుకున్నారు. అప్పట్లో మోడీ హవా ఉండడమే కారణం. అలాగే మరోవైపు పవన్ కళ్యాణ్్ ఇంటికి వెళ్లి అభ్యర్ధన చేసి మద్దతు సంపాదించారు. ఇలా ఎన్నో చేసి ఆంద్రలో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత తన పని తాను చేసుకోకుండా తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టి,నిత్యం ముఖ్యమంత్రి కెసిఆర్ ను విమర్శిస్తుండేవారు. అక్కడితో ఆగకుండా కెసిఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర పన్నారు. రేవంత్ రెడ్డి ద్వారా టిఆర్ఎస్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయిస్తూ పట్టుబడ్డారు.దాంతో చంద్రబాబు పరువే కాకుండా, ఆంద్రుల పరువు కూడా పోయేలా చేశారు. అప్పుడు నిత్యం హైదరాబాద్ లో నివసిస్తున్న ఆంద్రులకు ప్రమాదం జరుగుతున్నట్లు ఇక్కడ ఆంద్ర పోలీస్ స్టేషన్ లు పెడతామని బెదిరించేవారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు కూడా పట్టుబడడంతో కాళ్లవేళ్ల బడి తనపై కేసు నేరుగా రాకుండా చేసుకున్నారు.కాని పదేళ్లు హైదరాబాద్ లోనే ఉంటానని, తెలంగాణలో టిడిపి అదికారంలోకి వచ్చేదాక ఉంటామని బీరాలు పలికిన చంద్రబాబు చెప్పాపెట్టకుండా విజయవాడ వెళ్లి పోయారు. ఆ తర్వాత కెసిఆర్ పేరు ఎత్తడానికే భయపడే చంద్రబాబు ఎన్నికల నాటికి మళ్లీ ఇక్కడ రాజకీయాలలో తలదూర్చి పెత్తనం చేయడం ఆరంభించారు. ఈయన ఇచ్చే వందల కోట్ల డబ్బుకు ఆశపడి కాంగ్రెస్ పార్టీ టిడిపితో పొత్తుకు సన్నద్దమైందని బిజెపి,టిఆర్ఎస్ లు ఆరోపిస్తుంటాయి. కారణం ఏమైనా చంద్రబాబు కాంగ్రెస్ తో అనైతిక పొత్తు అనండి,విలువలు లేని పొత్తు అనండి ..పెట్టుకోవడానికి ఏ మాత్రం సిగ్గుపడలేదు. ఆంద్రలో ఓటమి భయంతోనో, అవినీతి కేసులు వస్తాయన్న భీతితోనో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. పైగా మోడీతో ఏదో ప్రమాదం వచ్చిందని ప్రచారం ఆరంభించారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారం చేస్తూ కెసిఆర్ ను రెచ్చగొడుతున్నారు.టిఆర్ఎస్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు.ఎన్నికల అన్న తర్వాత విమర్శలు వస్తాయి.కాదనం.కాని ఆయన హైదరాబాద్ అంతా తానే అబివృద్ది చేశానని, ఇంకా ఏదేదో ఉన్నవి,లేనివి చెబుతూ తెలంగాణ ప్రజలలో ఒక అసహనానికి కారణం అవుతున్నారు. నాలుగేళ్లుగా ఉన్న తెలంగాణ నాయకత్వం చాతకానిదని ఆయన చెప్పాలని చేస్తున్న ప్రయత్నం చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది.అంతేకాదు.కెసిఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నారని చంద్రబాబు విమర్శిస్తున్నారు. కెసిఆర్ వ్యవసాయం క్షేత్రంలో ఇల్లు కట్టుకుంటే చంద్రబాబు జూబ్లిహిల్స్ లో భారీ ఖర్చుతో పాలస్ నిర్మించుకున్నారు. చంద్రబాబు ఆంద్రలో ఇల్లు కట్టుకోకుండా ఇక్కడ ఉన్న ఇల్లు కూ్ల్చి కొత్త భవంతి ఎందుకు నిర్మించారో తెలియదు.అమరావతిలో ఏమి చేశారన్నదానికి సమాధానం చెప్పకుండా పదిహేను సంవత్సరాల క్రితం తాను చేసిన పాలన వల్లే హైదరాబాద్ ప్రజలు బతుకున్నారన్నట్లుగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనోభావాలను ఆయన గాయపరుస్తున్నారు.అందువల్లే తెలంగాణ మంత్రి కెటిఆర్ ఒక హెచ్చరిక చేశారు.చీమల పుట్టలో వేలు పెట్టినట్లు చంద్రబాబు తెలంగాణ రాజకీయాలో వేలు పెట్టి,డబ్బు,మీడియాను అడ్డం పెట్టుకుఉని రాజకీయం చేస్తున్నారని,తాముకూడా దానికి బదులు తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు ఇక్కడ వారికి బెదరింపులు వస్తున్నాయని అనడం ఆరంభించారు. హైదరాబాద్ లో ప్రశాంతంగా బతుకుతున్న సీమాంధ్రులకు చంద్రబాబు కొత్త టెన్షన్ పెడుతున్నారు. ఇక్కడ కులాల మద్య చిచ్చు పెడుతున్నారు. ఇది ఎటు దారి తీస్తుందోనన్న భయం కలుగుతోంది. పైగా గతంలో వైఎస్ వంటి ముఖ్యమంత్రులు చేసిన పనులు కూడా తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేస్తున్న తీరు జుగుప్ప కలిగిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ కూటమి గెలిస్తే ఎపిలో తన పరపతి పెంచుకోవడం, రాహుల్ ను బుట్టలో వేసుకున్నందున ,తెలంగాణలో కూడా తనే పెత్తనం చేయవచ్చన్న తాపత్రయంతో చంద్రబాబు దారుణమైన వికృతమైన ప్రయోగం చేస్తున్నారు. భవిష్యత్తులో తెలంగాణలో ఎవరు గెలిచినా అది ఆంద్ర,తెలంగాణ ప్రజల మధ్య ఉద్రిక్తతలకు దారితీసేలా చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయం ప్రజలు అర్ధం చేసుకోవలసిన అవసరం ఉంది. లేకుంటే మళ్లీ ఇరు ప్రాంతాల మద్య అనేక సమస్యలు వస్తాయి.ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ నాయకత్వానికి ,తెలంగాణ ప్రజలకు చంద్రబాబు ఒక సవాల్ విసురుతున్నారనుకోవాలి. రాజకీయం ప్రజల కోసం కాని,రాజకీయనేతల పదవుల కోసం కాదు. నిత్యం నీతులు చెబుతూ ,అదే సమయంలో విలువలు లేని ,నీతి లేని రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేయాలనుకునే వారి ఆటకట్టించకపోతే ఆంద్ర,తెలంగాణ అని కాదు..తెలుగు సమాజానికే చేటు అని చెప్పక తప్పదు.

tags : telagangana, babu, experiment

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info